మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

మాన‌వ వ‌న‌రుల మంత్రిత్వ శాఖ సలహా మేర‌కు విద్యార్థుల భద్రత, విద్యా సంక్షేమానికి కళాశాలలు/ విద్యా సంస్థలకు ఏఐసీటీఈ సూచనలు

-లాక్‌డౌన్‌ సమయంలో విద్యార్థుల నుండి బ‌ల‌వంతంగా ఫీజులు డిమాండ్ చేయకూడ‌ద‌ని సూచ‌న‌

Posted On: 16 APR 2020 4:29PM by PIB Hyderabad

కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి కారణంగా దేశంలో మే 3 తేదీ వరకు లాక్‌డౌన్ అమ‌లులో ఉండ‌నున్న నేప‌థ్యంలో విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు గాను అవసరమైన త‌గు చర్యలు తీసుకోవాలని మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ ఏఐసీటీఈకి సూచించింది. దీని ప్ర‌కారం ఏఐసీటీఈ కళాశాలలు/విద్యా సంస్థలకు కొన్ని సూచనలు చేసింది.  
కోవిడ్‌-19 వైర‌స్ కార‌ణంగా ముప్పు పొంచి ఉన్న ప్ర‌స్తుత సంక్ష‌భ స‌మ‌యంలో పౌరుల భద్రత జాగ్రత్తలతో పాటు త‌గిన భరోసా ఇవ్వడం దేశంలో పౌరులందరి ప్రాథమిక బాధ్యత అని పేర్కొంది.
అదే విధంగా సంస్థల అధిపతులకు ఆయా కళాశాలలు/ విద్యాసంస్థల భాగ‌స్వామ్య ప‌క్షాల వారి ఆరోగ్యం మరియు అనుబంధ ఆసక్తిని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంద‌ని ఏఐసీటీఈ పేర్కొంది. వీటిని దృష్టిలో ఉంచుకొని కళాశాలలు / విద్యా సంస్థలు త‌ప్ప‌క పాటించడం కోసం ఈ క్రింది మార్గదర్శకాలను జారీ చేసింది:

1) ఫీజుల చెల్లింపు: లాక్‌డౌన్‌ సమయంలో ప్రవేశ రుసుముతో సహా వివిధ ఫీజులను విద్యార్థులు చెల్లించాలని కొన్ని సంస్థలు పట్టుబడుతున్న‌ట్టుగా ఏఐసీటీఈ దృష్టికి వ‌చ్చంది. ప్ర‌స్తుత దేశంలో కొనసాగుతున్న లాక్‌డౌన్ ఎత్తివేసి సాధారణ స్థితికి వచ్చేవరకు కళాశాలలు/ విద్యా సంస్థలు ఫీజు చెల్లించమని పట్టుబట్టవద్దని స్పష్టం చేసింది. ఈ విష‌యమై స‌వ‌రించిన టైమ్‌లైన్స్‌తో కూడిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను నిర్ణీత‌ స‌మ‌యంలో ఏఐసీటీఈ నుంచి జారీ చేయ‌బ‌డ‌తాయి. దీని ప్రకారం, అన్ని కళాశాలలు/ విద్యా సంస్థలు తమత‌మ‌ వెబ్‌సైట్లలో సంబంధిత సమాచారాన్ని ప్రదర్శించాలని, ఈ-మెయిల్ ద్వారా విద్యార్థులకు కూడా దీనిని తెలియజేయాలని నిర్దేశించింది.

2) అధ్యాపక సభ్యులకు జీతం చెల్లింపు: లక్‌డౌన్ అమ‌లులో ఉన్న కాలానికి గాను కొన్ని విద్యా సంస్థల వారు తమ అధ్యాపకులకు మరియు ఇత‌ర సిబ్బందికి జీతాలు చెల్లించలేదన్న విష‌యం ఏఐసీటీఈ దృష్టికి వ‌చ్చంది. లాక్‌డౌన్ను కార‌ణంగా చూపుతూ కొన్ని సంస్థ‌ల వారు అధ్యాప‌కులు ఇత‌ర సిబ్బంది సేవ‌ల‌ను నిలిపివేసిన సంగ‌తి కూడా ఏఐసీటీఈ దృష్టికి వ‌చ్చింది.
లాక్‌డౌన్ వ్యవధికి అధ్యాపకులు / ఇత‌ర సిబ్బందికి జీతం మరియు ఇతర బకాయిలు విడుదల చేయాల‌ని,ఈ సమయంలో కొంద‌రిని స‌ర్వీసుల‌ను నుంచి త‌ప్పిస్తూ తీసుకున్న నిర్ణ‌యాల‌ను కూడా ఉపసంహరించుకొనేలా ఏఐసీటీఈ నుంచి మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ అయ్యాయి. వీటిని క‌చ్చితంగా పాటించాలాని ఏఐసీటీఈ సూచించింది. దీనికి సంబంధించి ఆయా రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు చెందిన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌కు (సీఎస్‌ల‌కు) ఏఐసీటీఈ లేఖ‌ను రాసింది. దీనితో పాటు కళాశాలలు/ విద్యా సంస్థల‌కు జ‌ర‌పాల్సిన వివిధ ఫీజు రీయింబర్స్‌మెంట్లు జ‌రిగేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కూడా ఈ లేఖ‌లో ఏఐసీటీఈ సూచించింది.

3) నకిలీ వార్తల క‌ట్ట‌డికి చ‌ర్య‌లు: వివిధ సంఘాలు / వ్యక్తులు సోషల్ మీడియా వేదిక‌గా  చేసుకొని నకిలీ వార్తలను ప్రసారం చేయ‌డం ద్వారా తప్పుడు సమాచారాన్ని, పుకార్లు సృష్టిస్తున్నారని ఏఐసీటీఈ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇలాంటివి కళాశాలలు/ విద్యా సంస్థల దృష్టికి వ‌స్తే త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని వాటికి సంబంధించిన స‌మాచారాన్ని సంబంధిత నియంత్ర‌ణ వ‌ర్గాల‌కు అందించాల‌ని ఏఐసీటీఈ కోరింది. ఇది భాగ‌స్వామ్య ప‌క్షాలంద‌రి ప్రాథ‌మిక బాధ్య‌త అని కూడా పేర్కొంది. ఎంహెచ్ఆర్‌డీ, యూజీసీ, ఏఐసీటీఈకి చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన సమాచారాన్ని మాత్ర‌మే ప్ర‌మాణికంగా భావించాల‌ని సూచించింది. ఏదైనా తాజా స‌మాచారం కోసం క్రమం తప్పకుండా ఆయా వెబ్‌సైట్ల‌ను విజిట్ చేయాల‌ని సూచించింది. అదేవిధంగా ఇతర ప్రభుత్వ సర్క్యులర్ కోసం, సంబంధిత మంత్రిత్వ శాఖలు / విభాగాల అధికారిక వెబ్‌సైట్‌లను కూడా క్ర‌మం త‌ప్ప‌కుండా విజిట్ చేయాల‌ని సూచించింది.

4) ప్రధానమంత్రి ప్రత్యేక స్కాలర్‌షిప్ పథకం (పీఎంఎస్ఎస్ఎస్‌): కోవిడ్-19 వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా ప‌్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేప‌థ్యంలో దేశంలో ఇంటర్నెట్ ల‌భ్య‌త ప‌రిమితంగా ఉంది. దీంతో 2020-2021 విద్యా సంవత్సరానికి పీఎంఎస్ఎస్ఎస్‌కు సంబంధించిన కార్యకలాపాలు ఆలస్యం అయ్యాయి. అయితే, లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ఈ పథకం గతంలో మాదిరిగానే కొనసాగుతుందని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన క్యాలెండర్, తాజా సమయ పాలనలను (టైమ్‌లైన్స్‌ను)  నిర్ణీత సమయంలో ఏఐసీటీఈ వెబ్‌సైట్‌లో ప్రచురించబడుతాయి.

5) ఆన్‌లైన్ తరగతులు మరియు సెమిస్టర్ పరీక్ష: ప్రస్తుత సెమిస్టర్ కోసం ఆన్‌లైన్ తరగతులు పొడ‌గించిన లాక్‌డౌన్ సమయంలోనూ కొనసాగుతాయని ఏఐసీటీఈ త‌న మార్గ‌ద‌ర్శ‌కాల‌లో స్పష్టం చేసింది. దీనికి సంబంధించి సవరించిన అకాడెమిక్ క్యాలెండర్ను యూజీసీ, ఏఐసీటీఈ నుంచి  తరువాత జారీ చేయబడుతుంది. సెమిస్టర్ పరీక్షల నిర్వ‌హ‌ణ విధివిధానాలు, మార్కుల‌ను ఎలా నిర్ణ‌యించాలి అనే అంశంతో పాటు ఉత్తీర్ణత ప్రమాణాలను సిఫారసు చేయడానికి యుజీసీ ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. స‌మ‌యానుకూలంగా దీనికి సంబంధించి న ఆదేశాలు విడిగా జారీ చేయబడతాయ‌ని వివ‌రించింది. వీటి గురించి తాజా స‌మాచారం కోసం  క్ర‌మం త‌ప్ప‌కుండా యూజీసీ, ఏఐసీటీటీ సైట్ల‌ను ప‌రిశీలించాల‌ని సూచించింది.

6) ఇంట‌ర్న్‌షిప్‌లుః  ప్ర‌స్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ కారణంగా కొంతమంది విద్యార్థులు తమ వేస‌వి కాల‌పు ఇంటర్న్‌షిప్‌ను కొనసాగించలేక‌పోవ‌చ్చ‌ని పేర్కొంది. అందువల్ల, వీలైతే ఇంటి నుండి ఇంటర్న్‌షిప్‌ల‌ను చేయమని సలహా ఇచ్చింది. ఇది వీలుప‌డ‌ని నేప‌థ్యంలో దీనిని ఈ ఏడాది డిసెంబర్‌లో నెరవేరవ‌చ్చ‌ని పేర్కొంది.

7) ఇతర కళాశాలలు/ విద్యా సంస్థలతో ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ పంచుకోవ‌డం: లాక్‌డౌన్ వ‌ల్ల ఏర్ప‌డిన ప‌రిస్థితులలో కొంతమంది విద్యార్థులు ఇంటర్నెట్ సేవలను పొందలేకపోతున్నార‌ని ఈ నేప‌థ్యంలో అలాంటి విద్యార్థుల నిమిత్తం సమీపంలోని ఇతర కళాశాలలు / విద్యా సంస్థలు ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందేలా అనుమతించాలని సూచించింది. ఇతర కళాశాలలు / విద్యా
సంస్థల విద్యార్థులను అనుమతిస్తూ క్యాంపస్ ఇంటర్నెట్ సదుపాయాన్ని పంచుకోవాల‌ని కూడా సూచించింది. లాక్‌డౌన్‌తో పాటు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ఇంట‌ర్‌నెట్ బ్యాండ్‌విడ్త్ లభ్యత లేకపోవడంతో హ‌జ‌రు ప‌ట్టి నిబంధ‌న‌ను స‌డ‌లించ‌వ‌చ్చ‌ని పేర్కొంది.

అన్ని కళాశాలలు / విద్యా సంస్థలు ఈ సూచనలను క‌చ్చితంగా పాటించాల‌ని సూచించింది. వీటిని పాటించ‌ని నేప‌థ్యంలో నిబంధనల ప్రకారం త‌గిన చ‌ర్య‌లు తీసుకోబ‌డుతాయాని తెలిపింది.



(Release ID: 1615155) Visitor Counter : 152