గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 వైరస్ అవగాహన మరియు ప్రజల భద్రత కోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న స్మార్ట్ నగరాలు.

Posted On: 14 APR 2020 7:28PM by PIB Hyderabad

కోవిడ్-19 :  స్మార్ట్ నగరాలు తీసుకుంటున్న చర్యలు  

వడోదర : 

లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించే వారిపై నిఘా కోసం వడోదరా జిల్లా పాలనా యంత్రాంగం రెండు కెమెరాలతో ఒక హీలియం బెలూన్ ని ఉపయోగిస్తోంది.  ఈ బెలూన్ ను తండాల్ జా ప్రాంతంలో బిగించారు.  దానికి ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టం ని కూడా జత చేశారు. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా  పాలనా యంత్రాంగం నగరాన్ని నాలుగు జోన్లు - ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ ప్రాంతాలుగా  విభజించింది.   

బెంగళూరు :

కర్ణాటక కు చెందిన బెంగళూరు - కోవిడ్-19 డేటా డాష్ బోర్డు వద్ద మోడల్ కోవిడ్-19 వార్ రూమ్ ను రాష్ట్ర వైద్య విద్యా శాఖ సహాయ మంత్రి 2020 ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభించారు.   క్వారంటైన్ లో ఉన్న ప్రజలు, వారి చిరునామాలు, వారికి చికిత్స నందిస్తున్న వైద్య సిబ్బంది, ఆసుపత్రులు, తాలూకా పరంగా మరియు నగరం పరంగా మొదలైన వివరాలతో పూర్తి కోవిడ్ సంబంధమైన సమాచారమంతా ఒక చోట ఈ డాష్ బోర్డు లో లభిస్తుంది. కొన్ని సాఫ్ట్ వేర్ అప్లికేషన్ల సహాయంతో ఈ సమాచారాన్నంతా ఒక చోట పొందుపరుస్తారు. 

కళ్యాణ్ దోంబివలి :

కరోనా గురించి పౌరులకు అవగాహన కల్పించి, కరోనా గురించి వారికి తెలియజేయడం కోసం కే.డి.ఎం.సి. ఫేస్ బుక్ పేజీ లో అవగాహన వీడియోలు ప్రదర్శిస్తున్నారు.  నగర పౌరులను నిరంతరాయంగా పనిలో ఉంచేందుకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఫేస్ బుక్ పేజీ రకరకాల కార్యక్రమాలను రూపకల్పన చేసింది.  యోగ, వంటలు, ఏరోబిక్స్, సంగీతం, పద్యాలు రాయడం, ఘజల్స్, కథక్, భరతనాట్యం, తత్వ శాస్త్రం మొదలైన వివిధ రంగాలలో స్థానిక నిపుణులను గుర్తించి, వారికి నిర్ణీత సమయాలను కేటాయించి, కే.డి.ఎం.సి. ఫేస్ బుక్ పేజీ పైకి వారు ఆయా సమయాలలో ప్రత్యక్షంగా పాల్గొనేటట్లు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి నగర పౌరుల నుండి విశేష స్పందనతో పాటు ప్రశంసలు వచ్చాయి. 

ఆగ్రా : 

     • స్థానిక ప్రజల కోసం ఈ-డాక్టర్ సేవా, టెలి-వీడియో కన్సల్టేషన్ సౌకర్యాన్ని ఆగ్రా స్మార్ట్ సిటీ లిమిటెడ్ ప్రారంభించింది. ఆగ్రా స్మార్ట్ సిటీ లిమిటెడ్ ఈ వెబ్ సైట్  https://tinyurl.com/edoctorapp ను  ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య (పి.పి. పి.) ప్రాజెక్టుగా రూపొందించింది.   సోమవారం నుండి శనివారం వరకు ప్రతీ  రోజూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలవరకు కన్సల్టేషన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.  కన్సల్టేషన్ కోసం, పౌరులు (https://tinyurl.com/edoctorapp ) లింకును ఉపయోగించి డాక్టర్ తో అపాయింట్మెంట్ ఖారారు చేసుకోవచ్చు.  మొబైల్ యాప్ ఉపయోగించి కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.  ఏదైనా ఆండ్రాయిడ్ ఫోనులో ప్లే స్టోర్ నుండి ఈ దిగువ పేర్కొన్న లింక్ ను క్లిక్ చేసి వినియోగదారులు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

 (https://play.google.com/store/apps/details?id=com.needstreet.health.hppatient). 

వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకున్న అనంతరం వారికి కన్సల్టేషన్ కోసం ఒక తేదీ, సమయం కేటాయిస్తారు. నిర్ణీత తేదీ, సమయానికి రోగులు టెలీ లేదా వీడియో కాల్ ద్వారా డాక్టర్ ను సంప్రదించవచ్చు. కన్సల్టేషన్ అనంతరం, సంబంధిత సైట్ / యాప్ నుండి రోగి ఆన్ లైన్ లో ప్రిస్క్రిప్షన్ కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కావాలంటే, అవసరమైన మందులు కూడా స్మార్ట్ హెల్త్ సెంటర్ ఫార్మసీ నుండి ఇంటికి తెప్పించుకోవచ్చు. 

•  ఈ వినూత్న కార్యక్రమాన్ని తన పి.పి. పి. భాగస్వామ్య సంస్థ అజాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఆగ్రా స్మార్ట్ సిటీ చేపట్టింది. ఆగ్రా లో స్థానిక ప్రజలకు అందుబాటు ధరల్లో సంపూర్ణ ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో వారు పది స్మార్ట్ హెల్త్ సెంటర్లను ప్రారంభించాలనే ప్రక్రియలో ఉన్నారు.  అందులో ఒక సెంటర్ ఇప్పటికే స్థానిక ప్రజలకు సేవలందిస్తోంది. 

•  స్మార్ట్ సిటీ పథకం కింద ఏర్పాటైన స్మార్ట్ హెల్త్ సెంటర్లు కరోనా గురించి చేయవలసిన, చేయకూడని పనులను వివరిస్తూ రోగులకు అవగాహన కల్పించడానికి సహాయ పడుతున్నాయి. అది సాధారణ కన్సల్టేషన్ అయినా, దంత సంబంధమైన కన్సల్టేషన్ అయినా ప్రతి రోగికీ 3 నుండి 5 నిముషాల సమయంలో కరోనా గురించి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతోంది. ఈ సెంటర్ల ద్వారా మార్చి నెలలో 325 మంది, ఫిబ్రవరిలో 675 మంది కన్సల్టేషన్ తీసుకున్నారు. స్మార్ట్ హెల్త్ సెంటర్ల వద్ద ఏర్పాటు చేసిన ఫార్మసీలు ప్రజలకు రాయితీ ధరల్లో 1015 సానిటైజర్లు, 935 మాస్కులు సరఫరా చేశారు. 

•    ఆగ్రా నగర్ నిగమ్ వద్ద అగ్ర స్మార్ట్ సిటీ లిమిటెడ్ నెలకొల్పిన ఐ.సి.సి.సి. కంట్రోల్ రూమ్ సేవలను ఆగ్రా పాలక వ్యవస్థ, ఆగ్రా స్మార్ట్ సిటీ, ఆగ్రా పోలీసు పూర్తిగా వినియోగించుకుంటున్నారు.  ఆగ్రా లాక్ డౌన్ పర్యవేక్షక యాప్ కూడా ప్రారంభించారు. కోవిడ్-19 కు వ్యతిరేకంగా జరిగే పోరులో భాగంగా ఆగ్రా నగరం లో వివిధ ప్రాంతాల్లో జన సాంద్రత వివరాలను తెలుసుకోడానికి ఈ వీడియో నిఘా పరిష్కార వ్యవస్థ సమర్ధంగా ఉపయోగపడుతోంది.   ఈ కృషిలో భాగంగా ఇటీవల రూపొందించిన ఏ.ఐ.ఆధారిత అనలిటిక్స్, ఈ రకంలో మొదటి కోవిడ్-19 పరికరం ఆగ్రా లో ఉంది.  ఆగ్రాలో సామాజిక దూరం నిబంధనను సమర్ధంగా అమలుచేయడానికి అధికారులకు ఈ వ్యవస్థ బాగా ఉపయోగపడుతోంది. క్షేత్ర స్థాయిలో ఉన్న పోలీసుల మొబైల్ ఫోనుల్లో ఉండే అప్ ద్వారా దీనికి సంబంధించిన హెచ్చరిక లేదా సూచనలు వారికి అందుతాయి.  ఆగ్రా లాక్ డౌన్ మానిటర్ యాప్  ను థానా లోని సంబంధిత ఇంచార్జ్ లందరికీ, అవసరమైన ఇతర పోలీసు సిబ్బందికి అందుబాటులో ఉంచారు. 

•   జిల్లా పాలనా యంత్రాంగం వండిన ఆహార పదార్ధాల బ్యాంకు ను నిర్వహిస్తోంది.  వివిధ ప్రభుత్వేతర సంస్థలు ఆహార పొట్లాలను ఈ బ్యాంకు కు అందిస్తే, వారు పేదలు, కార్మికులు, నిరాశ్రయులు వంటి అవసరమైన వారికి పంపిణీ చేస్తారు.  ఇంతవరకు ఈ విధంగా 5,000 ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. 

కాకినాడ :

కాకినాడ ఐ.సి.సి.సి. లో కోవిడ్-19 డేటా డాష్ బోర్డు అభివృద్ధిపరచబడింది.  ఐ.సి.సి.సి. లో కాకినాడతో పాటు, జిల్లా, రాష్ట్రం, దేశంలో సమాచారం కూడా చూడవచ్చు. వివరాలు దిగువ పొందుపరిచిన లింక్ ద్వారా తెలుసుకోవచ్చు: 

 https://covid19.kkdeservices.com:2278.

చండీగఢ్ : 

చండీగఢ్ లో ఒక సమగ్ర "ఫైట్ కోవిడ్ స్టేషన్" ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో టెంపరేచర్ తో పాటు థర్మల్ స్క్రీనింగ్ చేసే సౌకర్యం, కాలితో ఉపయోగించి చేతులు శుభ్రం చేసుకునే ఏర్పాటు, సబ్బు ద్రావకం, సోడియం హైపోక్లోరైట్ ద్రావణం తుంపర్ల స్ప్రే, చేతులు ఆరబెట్టుకునే సౌకర్యం మొదలైనవి ఉన్నాయి.  చండీగఢ్ లో సెక్టార్ 25 లోని మెయిన్ మండీ వద్ద చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ దీనిని ఏర్పాటు చేసింది.  మండీ కి వచ్చే వినియోగదారులందరూ ఈ కేంద్రం నుండి తప్పకుండా వెళ్లేలా ప్రధాన ద్వారం వద్ద దీనిని ఏర్పాటు చేశారు. 

********



(Release ID: 1614612) Visitor Counter : 236