శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఫరీదాబాద్ ప్రాంతంలో కోవిడ్-19 పరీక్ష‌లు నిర్వ‌హించేందుకు డీబీటీ ఇనిస్టిట్యూట్‌కు ఐసీఎంఆర్ ఆమోదం

ఫరీదాబాద్‌లో మొదటి మరియు ఏకైక కోవిడ్‌-19 పరీక్షా కేంద్రంగా డీబీటీ టీహెచ్ఎస్‌టీఐ బ‌యాస్సే ప్ర‌యోగ‌శాల‌

Posted On: 12 APR 2020 11:52AM by PIB Hyderabad

 ఫ‌రీదాబాద్ ప్రాంతంలో తొలి కోవిడ్‌-19 ప‌రీక్షా కేంద్రం అందుబాటులోకి వ‌చ్చింది. కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన బ‌యోటెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్ (డీబీటీ) ఆధ్వ‌ర్యంలో ప‌ని చేస్తున్న ట్రాన్సేష‌న‌ల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌న‌కు (టీహెచ్ఎస్‌టీఐ) చెందిన బ‌యాస్సే ప్ర‌యోగ‌శాల‌లో కోవిడ్‌-19 ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) స‌మ్మ‌తి ల‌భించింది. ఫరీదాబాద్లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్, ఆసుపత్రికి చెందిన డయాగ్నొస్టిక్ సదుపాయానికి అనుబంధంగా టీహెచ్ఎస్‌టీఐ బ‌యాస్సే ప్ర‌యోగ‌శాల కోవిడ్ క‌ట్ట‌డి విష‌యంలో సేవ‌ల‌ను అందించ‌నుంది. తాజా అనుమ‌తుల‌తో ఫరీదాబాద్ ప్రాంతంలో మొదటి, ఏకైక కోవిడ్‌-19 పరీక్షా కేంద్రం అందుబాటులోకి వ‌చ్చిన‌ట్ట‌యింది. కోవిడ్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఇరు సంస్థ‌లు ఒక అవ‌గాహ‌న‌ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి. ఈ తాజా ఒప్పందం ప్ర‌కారం బ‌యాస్సే ప్ర‌యోగ‌శాలలోని బృందం ఈఎస్ఐ ఆసుపత్రిలో కోవిడ్-19 వైర‌స్ నిర్థార‌ణ ప‌రీక్ష‌ల విష‌య‌మై సామ‌ర్థ్య పెంపు శిక్ష‌ణ‌ అంద‌జేయ‌నుంది. కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన శాస్ర్త సాంకేతిక శాఖ అధ్వ‌ర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బ‌యోటెక్నాల‌జీ ఆర్థిక తోడ్పాటుతో  టీహెచ్ఎస్‌టీఐ ప‌ని చేస్తోంది. మ‌రోవైపు ఫరిదాబాద్ లోని ఈఎస్ఐసీ వైద్య క‌ళాశాల‌, ఆసుప‌త్రి కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కింద ప‌ని చేస్తూ ఈ ప్రాంతంలోనే ఒక ప్రధాన వైద్య సంస్థగా వెలుగొందుతోంది. డీబీటీ-టీహెచ్ఎస్‌టీఐ బ‌యాస్సే ప్ర‌యోగ‌శాల‌కు టీహెచ్ఎస్‌టీఐ ట్రాన్సేష‌న‌ల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద డీబీటీ నిధుల‌తో స్థాపించ‌బ‌డింది. వివిధ టీకాలు మరియు జీవశాస్త్రాల క్లినికల్ అభివృద్ధి కోసం దీనిని ఏర్పాటు చేశారు. టీకా అభివృద్ధి మరియు పరీక్షలు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా జ‌రిపేందుకు వీలుగా గుడ్ క్లిన‌క‌ల్ లాబొరేట‌రీ ప్రాక్టిస్ ను  (జీసీఎల్‌పీ) ఇక్క‌డ అవ‌లంభిస్తున్నారు. దీనికి సంబంధించిన అవ‌స‌ర‌మైన ప‌లు గుర్తింపుల‌ కోసం డీబీటీ- బ‌యాస్సే ప్ర‌యోగ‌శాల నేషనల్ అక్రిడిటేషన్ బోర్డుకు (ఎన్ఏబీఎల్‌) ద‌ర‌ఖాస్తు చేసుకోనుంది. కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప‌రిధిలోకి రాని ఇత‌ర ప్ర‌భుత్వ ప్ర‌యోగశాల‌ల్లో కూడా వైర‌స్ వ్యాప్తి నిర్థార‌క ప‌రీక్షా స‌దుపాయాల‌ను ప్రారంభించాల‌న్న నిర్ణ‌యం మేర‌కు ఈ రెండు సంస్థ‌ల మ‌ధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఐసీఎంఆర్ నిర్ణ‌యం మేర‌కు డీబీటీ ప్ర‌యోగ‌శాల‌లు, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ మరియు ప్రభుత్వ నిధులతో ప‌ని చేస్తున్న వివిధ‌ వైద్య కళాశాలల్లో కూడా కోవిడ్‌-19 నిర్థార‌క ప‌రీక్ష‌లు అందుబాటులోకి వ‌చ్చేందుకు వీలుప‌డ‌నుంది.  


(Release ID: 1613613)