PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 11 APR 2020 6:59PM by PIB Hyderabad

 

 

 

 

 

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 

 • దేశంలో నిన్నటి నుంచి పెరిగిన కోవిడ్‌-19 నిర్ధారిత కేసులు 1,035 కాగా, మరణాల సంఖ్య 239కి చేరింది.
 • రాష్ట్రాలవద్ద కీలక వస్తువులకు ఎలాంటి కొరత లేకుండా చూస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
 • కోవిడ్‌-19పై తదుపరి వ్యూహం గురించి ముఖ్యమంత్రులతో చర్చించిన ప్రధానమంత్రి
 • సముద్రంలో చేపలవేట/ఆక్వాకల్చర్‌కు దిగ్బంధం ఆంక్షలు సడలించిన దేశీయాంగ శాఖ
 • ఇబ్బందులు ఉన్నప్పటికీ సంతృప్తికరంగా వేసవి పంటల సాగు ప్రారంభ కార్యకలాపాలు
 • భారత ఆహార సంస్థ ఉద్యోగులకు, ఆహారధాన్యాల సరఫరాలో వారితో కలసి పనిచేస్తున్న కూలీలకు నగదు రూపేణా నష్ట పరిహారం చెల్లింపునకు ఆమోదం.

కోవిడ్‌-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం

దేశంలో నిన్నటినుంచి కొత్తగా నమోదైన కోవిడ్‌-19 నిర్ధారిత కేసులు 1,035 కాగా- ఇందులో యాక్టివ్‌ కేసుల సంఖ్య 855గా ఉంది. మరోవైపు నేటివరకూ సంభవించిన మరణాల సంఖ్య 239కి చేరింది. వైరస్‌ బారినపడి కోలుకున్న/పూర్తిగా నయమైన 642 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లగా, నేటివరకూ నమోదైన నిర్ధారిత కేసుల సంఖ్య 7,447గా ఉంది. కేంద్ర ప్రభుత్వం దశలవారీ ప్రతిస్పందన చర్యలతో తనవంతు కృషిని కొనసాగిస్తోంది. ఆ మేరకు వ్యక్తిగత రక్షణ సామగ్రి, ఎన్‌95 మాస్కులు, టెస్ట్‌ కిట్లు, మందులు, వెంటిలేటర్లు వంటివాటికి అన్ని రాష్ట్రాల్లోనూ కొరతలేకుండా చూస్తోంది.

మరిన్ని వివరాలకు :

కోవిడ్‌-19పై తదుపరి వ్యూహం దిశగా ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి చర్చలు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కోవిడ్‌-19 తదుపరి వ్యూహంపై చర్చించారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషి ఫలితంగా కోవిడ్‌-19 ప్రభావం తగ్గుముఖం పట్టిందనడంలో సందేహం లేదని ఈ సందర్భంగా ప్రధానమంత్రి అన్నారు. అయితే, పరిణామాలు వేగంగా మారుతున్నందున నిరంతర నిఘా అత్యంత అవశ్యమని స్పష్టంచేశారు. దిగ్బంధం నుంచి బయటపడే ప్రణాళికపై మాట్లాడుతూ- మరో రెండు వారాలపాటు యథాతథ స్థితి కొనసాగింపుపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కనిపిస్తున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు :

సముద్రంలో చేపలవేట/ఆక్వాకల్చర్‌ పరిశ్రమ, అందులోని కార్మికులకు దిగ్బంధం ఆంక్షల నుంచి దేశీయాంగ శాఖ మినహాయింపు; 5వ అనుబంధ ఉత్తర్వులు జారీ

కోవిడ్‌-19పై పోరులో భాగంగా విధించిన జాతీయ దిగ్బంధానికి సంబంధించి దేశీయాంగ శాఖ జారీచేసిన సమీకృత మార్గదర్శకాలకు 5వ అనుబంధాన్ని అన్ని ఇతర శాఖలకు/విభాగాలకు విడుదల చేసింది. ఆ మేరకు సముద్రంలో చేపలవేట/ఆక్వా కల్చర్‌ పరిశ్రమ-కార్మికులపై దిగ్బంధం ఆంక్షలను 5వ అనుబంధం ద్వారా సడలించింది. జలచరాలకు ఆహారం, నిర్వహణ, ఉత్పత్తుల సేకరణ, శుద్ధి, రొయ్యలు/చేపల రవాణా తదితరాలుసహా అన్నిటికీ సడలింపు వర్తిస్తుంది.  

మరిన్ని వివరాలకు :

కోవిడ్‌-19పై తీసుకున్న చర్యలపై డాక్టర్‌ హర్షవర్ధన్‌ అధ్యక్షతన రాష్ట్రాలతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశం

కరోనా వైరస్‌ ద్వారా వ్యాధి సంక్రమణ శృంఖలాన్ని ఛేదించడంలో రానున్న కొన్ని వారాలు కీలకం. ఇలాంటి కీలక సమయంలో సామాజిక దూరం నిబంధనను తూచా తప్పకుండా పాటిస్తూ వ్యాధి వ్యాప్తిని నిరోధించాలని డాక్టర్‌ హర్షవర్ధన్‌ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. తదనుగుణంగా వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యమైనదని, కోవిడ్‌-19పై దీక్ష, పట్టుదలతో సాగిస్తున్న కృషికి ఇదే నిదర్శనమని చెప్పారు. కోవిడ్‌-19పై దృఢసంకల్పంతో కూడిన పోరాటం కోసం ఆరోగ్య సేతు యాప్‌ను ప్రజలంతా అనుసరించే విధంగా చైతన్యం కల్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలనూ ఆదేశించారు.

మరిన్ని వివరాలకు :

భారత ఆహార సంస్థ ఉద్యోగులకు, ఆహారధాన్యాల సరఫరాలో వారితో కలసి పనిచేస్తున్న కూలీలకు నగదు రూపేణా నష్ట పరిహారం చెల్లింపునకు ఆమోదం.

కరోనా వైరస్‌ ప్రపంచ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో నిత్యవసరాల సరఫరాలో నిగ్నమైన భారత ఆహార సంస్థ ఉద్యోగులు, అధికారులు, ఆహారధాన్యాల సరఫరాలో వారితో కలసి పనిచేస్తున్న 80,000 మందికిపైగా కార్మికులుసహా మొత్తం 1,08,174 మందికి నగదు రూపేణా నష్టపరిహారం చెల్లించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

మరిన్ని వివరాలకు :

దిగ్బంధం వేళ వ్యవసాయ-సహకార-రైతు సంక్షేమశాఖ చర్యలు

జాతీయ దిగ్బంధం నేపథ్యంలో రైతులకు, వ్యవసాయ కార్యకలాపాలకు వెసులుబాటు కల్పించే దిశగా కేంద్ర వ్యవసాయ-సహకార-రైతు సంక్షేమ శాఖ పలు చర్యలు తీసుకుంటోంది.

మరిన్ని వివరాలకు :

దిగ్బంధం ఆంక్షలను అధిగమిస్తూ నిరాఘాటంగా వేసవి పంటల సాగు ప్రారంభం

కరోనా వైరస్‌ ప్రపంచ మహమ్మారి వ్యాప్తి, 21 రోజుల దిగ్బంధంవల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ వేసవి పంటల సాగు పనులు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయి. వేసవి పంటల (ధాన్యం, పప్పులు, ముతక ధాన్యాలు, నూనెగింజల) మొత్తం సాగు విస్తీర్ణం నిరుటితో పోలిస్తే గణనీయంగా పెరిగి 11.64 శాతం అధికంగా నమోదైంది.

మరిన్ని వివరాలకు :

కరోనా కష్టాలవల్ల ఎగుమతిదారులకు ఎదురైన సమస్యల పరిష్కారం దిశగా అనేక సడలింపులు/పొడిగింపులు, గడువుల నుంచి ఊరట కల్పించిన వాణిజ్య శాఖ

నవ్య కరోనా వైరస్‌ ప్రపంచ మహమ్మారి కారణంగా వ్యాపారాలకు, వ్యక్తులకు ఎదురైన కష్టాలనుంచి ఊరట కల్పించేందుకు వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వశాఖలోని వాణిజ్య విభాగం వివిధ చట్ట నిబంధనల పాటింపునుంచి అనేక సడలింపులు/పొడిగింపులు గడువులను సవరించింది.

మరిన్ని వివరాలకు :

కోవిడ్‌-19పై పోరాటంలో ఇప్పటికే 20,000 మంది ఎన్‌సీసీ కార్యకర్తలు పాలుపంచుకుంటుండగా స్వచ్ఛందంగా ముందుకొచ్చిన మరో 50 వేల మంది

కరోనావైరస్‌ పోరులో ‘ఎన్‌సీసీ సేవలను వినియోగించుకోండి’ అంటూ 2020 ఏప్రిల్‌ 1వ తేదీనుంచి నేషనల్‌ కేడెట్‌ కోర్‌ (ఎన్‌సీసీ) కార్యకర్తలు రక్షణ, పోలీసు, పౌర యంత్రాంగం సిబ్బందితో భుజం కలిపి పనిచేస్తున్నారు.

మరిన్ని వివరాలకు :

నిరుపేదలకు 10 లక్షలకుపైగా వేడివేడి ఆహార పొట్లాలు ఉచితంగా పంపిణీ చేసిన భారత రైల్వేశాఖ

భారత రైల్వేశాఖ పరిధిలోని ఐఆర్‌సీటీసీ, ఆర్పీఎఫ్‌, జోనల్‌ రైల్వే తదితర వివిధ సంస్థల సిబ్బంది తదితరులు సామాజిక సేవలో రైల్వేశాఖ చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తూ నిస్వార్థంగా, నిర్విరామంగా, స్వచ్ఛందంగా శ్రమిస్తున్నారు. ఈ మేరకు కోవిడ్‌-19 ప్రభావిత దిగ్బంధం సమయంలో అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు.

మరిన్ని వివరాలకు :

కోవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో స్వీయ సంరక్షణ దిశగా రోగనిరోధకత పెంచుకునే చర్యలపై ఆయుష్‌ పునరుద్ఘాటన

అనాదిగా అనుసరిస్తున్న ఆయుర్వేద విధానాలతో రోగనిరోధకత పెంచుకునే వివిధ ప్రక్రియలపై ఆయుష్‌ మంత్రిత్వ శాఖ సలహాపత్రం జారీచేసింది. ప్రస్తుత పరీక్షా సమయంలో అవే చర్యలను అనుసరించడం అవసరం కావడంతో ఇదే సలహాలను పునరావృతం చేసింది.


మరిన్ని వివరాలకు :

దిగ్బంధం తర్వాత తొలి 2వారాల్లో (138, 139నంబర్లుసహా), సామాజిక మాధ్యమాలద్వారా వచ్చిన 2.5 లక్షల అభ్యర్థనలపై ప్రతిస్పందించిన రైల్వే సిబ్బంది

జాతీయ దిగ్బంధం నేపథ్యంలో ప్రయాణ, రవాణా కార్యకలాపాలకు సంబంధించి ప్రయాణికులు, ఇతర పౌరుల సందేహాల, సమస్యల నివృత్తికోసం భారత రైల్వేశాఖ సహాయకేంద్ర సదుపాయాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చింది.

మరిన్ని వివరాలకు :

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్‌ యోజనకు అనుగుణంగా ఉద్యోగుల భవిష్యనిధి, పెన్షన్‌ నిధి చందాదారుల ఖాతాలకు ఆన్‌లైన్‌ క్రెడిట్‌ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ

కరోనా మహమ్మారిపై పోరాటంలో పేదలకు చేయూత దిశగా కేంద్ర ప్రభుత్వం 26.03.2020న ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన ప్యాకేజీకి అనుగుణంగా భవిష్యనిధి, ఉద్యోగుల పెన్షన్‌ నిధి చందాదారులకు ఖాతాలకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఆన్‌లైన్‌ క్రెడిట్‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది.

మరిన్ని వివరాలకు :

ప్రత్యేక పార్సిల్‌ రైళ్ల ద్వారా పండ్లు, కూరగాయలు, పాలు, పాడి ఉత్పత్తులు, విత్తనాలుసహా నశ్వర వస్తువుల రవాణా కోసం 67 మార్గాలను గుర్తించిన రైల్వేశాఖ

ఈ ప్రత్యేక పార్శిల్‌ రైళ్ల సేవలను వినియోగించుకునేలా ఆయా రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాల ఉద్యానశాఖల కార్యదర్శులు తమ అధికారులకు ఆదేశాలివ్వాలని కేంద్ర వ్యవసాయ-సహకార-రైతు సంక్షేమ శాఖ కోరింది.

మరిన్ని వివరాలకు :

కరోనా వైరస్‌ నుంచి ప్రాథమిక రక్షణ కోసం ట్రైఫెడ్‌ చేతివృత్తులవారు/స్వయం సహాయ సంఘాలు, వన్‌ధన్‌ యోజన లబ్ధిదారులు, స్వచ్ఛంద సంస్థలు తయారుచేసిన మాస్కులు సరఫరా చేయనున్న ట్రైఫెడ్‌

ఈ సరఫరాదారులు మాస్కులు అందజేయడం ద్వారా తమకు రక్షణతోపాటు జీవనోపాధి కల్పించుకోవడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. 

మరిన్ని వివరాలకు :

కేంద్ర పరిపాలన వ్యవహారాల ధర్మాసనం నుంచి పత్రికా ప్రకటన జారీ

మరిన్ని వివరాలకు :

హోమియో వైద్య చికిత్స చేసే వైద్యులకు ఉద్దేశించిన టెలిమెడిసిన్‌ మార్గదర్శకాలకు ఆమోదం

ప్రపంచ హోమియో దినోత్సవం సందర్భంగా ఆయుష్‌ శాఖ మంత్రి శ్రీపాదనాయక్‌ అంతర్జాతీయ వెబినార్‌ను ప్రారంభించారు. కోవిడ్‌-19 నియంత్రణలో హోమియో వైద్యవిధానం సామర్థ్యం గురించి పలువురు వక్తలు ఈ సందర్భంగా ప్రసంగించారు. ఈ మేరకు కోవిడ్‌ రోగులు ప్రామాణిక ఆరోగ్య సంరక్షణతోపాటు హోమియో విధానాన్ని అనుబంధ చికిత్సగా పొందవచ్చునని వారు సూచించారు.

మరిన్ని వివరాలకు :

‘స్ట్రాండెడ్‌ ఇన్‌ ఇండియా’ పోర్టల్‌ ద్వారా ఏప్రిల్‌ 9వ తేదీదాకా 1,194 మంది పర్యాటకులకు సహాయం

పర్యాటకులకు సహాయపడటం కోసం కేంద్ర పర్యాటకాభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘స్ట్రాండెడ్‌ ఇన్‌ ఇండియా’ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. దీనికింద ఏప్రిల్‌ 9వ తేదీదాకా 1,194 మంది పర్యాటకులకు సహాయం అందించింది. దీంతోపాటు నిరంతర సహాయకేంద్రం నంబరు 1363 ద్వారా మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 9 వరకూ 779 కాల్స్‌ స్వీకరించి, తోడ్పాటునందించింది.

మరిన్ని వివరాలకు :

రోగుల పరీక్ష, ఏకాంత చికిత్స/క్వారంటైన్‌ కోసం రెండు పడకల టెంట్లను అందజేస్తున్న ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)పై పోరులో భాగంగా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ మేరకు రెండు పడకల టెంట్లు, హస్తపరిశుభ్రత ద్రవాలు, ఫేస్‌ మాస్కులు, జల్లుతెర చాంబర్లు, హస్త శుభ్రత వ్యవస్థలు వంటివాటిని రూపొందించింది.

మరిన్ని వివరాలకు :

కోవిడ్‌-19పై పోరాటంలో భాగంగా కవరాల్స్‌ తయారీకోసం వస్త్రాన్ని పరీక్షించేందుకు ఎన్‌ఏబీఎల్‌ నుంచి ఓఎఫ్‌బీకి చెందిన ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు యూనిట్లకు అనుమతి

ఓఎఫ్‌బీ పరిధిలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోగల తేలికపాటి ఆయుధాల తయారీ ఫ్యాక్టరీ, తమిళనాడులోని ఆవడిలోగల భారీ వాహనాల తయారీ ఫ్యాక్టరీలకు నేషనల్‌ అక్రెడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ క్యాలిబరేషన్‌ లేబొరేటరీస్‌ (ఎన్‌ఏబీఎల్‌) నుంచి అరుదైన అనుమతి లభించింది. ఈ మేరకు ఓఎఫ్‌బీ పరిధిలోని ఆ రెండు సంస్థలకూ- కవరాల్స్‌ తయారీ కోసం ‘రక్తం చొచ్చుకుపోకుండా రక్షణ కల్పించే వస్త్రాన్ని’ పరీక్షించేందుకు ఇవాళ ఆమోదం లభించింది. ఈ సంస్థలు రూపొందించే టెస్టింగ్‌ యంత్రపరికరాలకు ‘ఏఎస్‌టీఎం ఎఫ్‌ 1670: 2003తోపాటు ఐఎస్‌వో 16603:2004’ ప్రమాణాల ధ్రువీకరణ లభించడంతో వాటి తోడ్పాటుతో ప్రస్తుత పరీక్షలకు అనుమతి లభ్యమైంది.  

మరిన్ని వివరాలకు :

సంపూర్ణ శరీర పరిశుభ్రత పరికరాన్ని రూపొందించిన ఐఐటీ, బిహెచ్‌యు

ఈ పరికరాన్ని ఏ ప్రదేశంలోనైనా ఏర్పాటు చేయవచ్చు. ఇది ఆటోమేటెడ్‌ పద్ధతిలో పనిచేస్తుంది. ఇది సెన్సర్‌ ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి ఏ ప్రాంగణం వెలుపలనైనా ఏర్పాటు చేయవచ్చు. తన ముందుకు వచ్చే వ్యక్తులను ఇది ముందుగానే గుర్తించి 15 సెకన్లపాటు 10 నుంచి 15 మిల్లీలీటర్ల పరిశుభ్రత ద్రవాన్ని వారిపై వెదజల్లుతుంది. తద్వారా సదరు వ్యక్తి దుస్తులు, పాదరక్షలుసహా శరీరం మొత్తం పరిశుభ్రమవుతుంది. 

మరిన్ని వివరాలకు :

కోవిడ్‌-19 దిగ్బంధం నేపథ్యంలో ఈ అంశంపై ప్రముఖ అధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌తో ఆదాయపు పన్నుశాఖ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ సంభాషించింది.

మరిన్ని వివరాలకు :

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • మధ్యప్రదేశ్‌: రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 435కు పెరిగింది. మరోవైపు కోవిడ్‌-19పై పోరాటం కోసం స్థానిక నియోజకవర్గ అభివృద్ధి నిధులను వినియోగించేందుకు ప్రభుత్వం ఎమ్మెల్యేలను అనుమతించింది.
 • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో కొత్తగా 8 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18కి చేరింది. కాగా, మొత్తం రోగులలో 9 మంది కోలుకున్నారు.
 • రాజస్థాన్‌: పేదలకు ఆహారం, రేషన్‌ సరకుల పంపిణీ కార్యక్రమాలను ఫొటో తీయడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నిస్సహాయ స్థితిలో ఉన్నవారి గౌరవానికి భంగం కలగరాదన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలకు ప్రాచుర్యం ఇవ్వరాదని నిర్ణయించింది.
 • మహారాష్ట్ర: ఒడిషా, పంజాబ్‌ రాష్ట్రాల తరహాలో దిగ్బంధాన్ని ఏప్రిల్‌ 30 వరకూ పొడిగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అయితే, తక్కువ తీవ్రతగల ప్రాంతాల్లో కొంత మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి సూచించారు. అదే సమయంతో తీవ్రత ఎక్కువగాగల ముంబై, పుణేవంటి చోట్ల కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది. కాగా, బాంబే ఐఐటీలోని ఒక పరిశోధకుల బృందం ‘డిజిటల్‌ స్టెత్‌స్కోప్‌’ను రూపొందించింది. దీని సాయంతో రోగికి దూరంగా ఉండి, హృదయ స్పందనను వినవచ్చు. దీనివల్ల ఆరోగ్య సంరక్షణ సేవల్లో ఉన్న వృత్తి నిపుణులకు కోవిడ్‌-19 సోకే ముప్పు తప్పుతుంది.
 • అరుణాచల్‌ ప్రదేశ్‌: రాష్ట్రంలోని పసీఘాట్‌, ఈస్ట్‌ సియాంగ్‌లలోని వస్త్ర, దుస్తుల తయారీ పరిశ్రమ ‘ఎలామ్‌’ ప్రస్తుతం వ్యక్తిగత రక్షణ సామగ్రి, మాస్కులను తయారుచేస్తోంది.
 • అసోం: ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి అసోంలో ప్రవేశించేవారిని 14 రోజులపాటు దిగ్బంధ కేంద్రాలకు పంపుతామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత విశ్వశర్మ ప్రకటించారు.
 • మణిపూర్‌: దిగ్బంధ సమయంలో మూసివేసిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులనుంచి ఫీజులు డిమాండ్‌ చేయరాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదేశించారు.
 • మిజోరం: రాష్ట్రంలోని పిల్లలు టీవీద్వారా విద్యాభ్యాసం కొనసాగించేలా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వినూత్న ఏర్పాట్లు చేసింది.  
 • మేఘాలయ: దిగ్బంధాన్ని పూర్తిస్థాయిలో ఎత్తివేయబోమని, స్వల్ప సడలింపు మాత్రమే ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశం నిషేధమని తెలిపారు.
 • నాగాలాండ్‌: రాష్ట్రంలో వాస్తవంగా చిక్కుకుపోయిన ఇతర ప్రాంతాల విద్యార్థులు వారి వివరాలను, సమస్యలను సహాయకేంద్రాలకు ఫోన్‌చేసి నివేదించాలని దిమాపూర్‌ జిల్లా యంత్రాంగం ప్రకటించింది.
 • సిక్కిం: దిగ్బంధ సమయంలో సిక్కిం స్వచ్ఛంద రక్తదాతల సంఘం 12 మినీ రక్తదాన శిబిరాలను నిర్వహించింది. ఆ మేరకు రాష్ట్రంలోని రక్తనిధులలో కొరతలేకుండా స్పందించింది.
 • త్రిపుర: ప్రధానమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తాను వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని రాష్ట్రంలో కోవిడ్‌-19 పరిస్థితిని ప్రధానికి వివరించానని త్రిపుర ముఖ్యమంత్రి ట్విట్టర్‌ద్వారా తెలిపారు.   
 • కేరళ: విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశం తీసుకొచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అందుకుగల అవకాశాలను వివరిస్తూ నివేదిక ఇవ్వాలని కేరళ హైకోర్టు ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కాగా, కన్నూర్‌ జిల్లాలోని పరియారంలోగల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇవాళ ఒక 71 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఇతడు పుదుచ్చేరిలోని మాహేకి చెందినవాడని గుర్తించారు. ఇతడికి కోవిడ్‌-19 వ్యాధి ఎలా సోకిందన్నది తెలియరాలేదు. కాసరగోడ్‌లో తీవ్ర ముప్పున్న ఐదు ప్రాంతాల్లో దిగ్బంధాన్ని మూడురెట్లు కఠినం చేశారు. కాగా, నిన్నటివరకూ యాక్టివ్‌ కేసులు 238గా నమోదయ్యాయి.    
 • తమిళనాడు: రాష్ట్రంలో దిగ్బంధాన్ని మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉంది. కాగా, రాష్ట్రంలోని 8 కంపెనీలు వ్యక్తిగత రక్షణ సామగ్రి తయారు చేస్తామని ముందుకొచ్చాయి. రాష్ట్రంలో నిన్న 77 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 911; మరణాలు: 20; యాక్టివ్‌ కేసులు: 858; కోలుకున్నవారు: 44 మంది; ఇప్పటిదాకా పరీక్షించిన నమూనాలు: 8,410; ఫలితాలు రావాల్సినవి: 661.
 • కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ మధ్యాహ్నందాకా 7 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో మైసూర్‌ 5, బెంగళూరు 1, బీదర్‌ 1 వంతున నమోదయ్యాయి. మొత్తం కేసులు: 214; మరణాలు: 6; కోలుకున్నవారు: 34 మంది; ప్రధానమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌ తర్వాత రాష్ట్రంలో దిగ్బంధాన్ని ఏప్రిల్‌ 30వరకూ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.  
 • ఆంధ్రప్రదేశ్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ద్వారా ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించి, ఆ స్థానంలో కొత్త అధికారిని నియమించింది. ఈ చర్యను ప్రతిపక్ష టీడీపీ అధినేత తప్పుబట్టారు. కాగా, రాష్ట్రంలో ఇవాళ మధ్యాహ్నందాకా 21 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 402కు చేరింది. వీటిలో కర్నూలు (82), గుంటూరు (72), నెల్లూరు (48) జిల్లాలు వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 909 నమూనాలను పరీక్షించగా, 37 పాజిటివ్‌గా తేలాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 385 కాగా, కోలుకున్న వారు 11 మంది; మరణాలు 6గా నమోదయ్యాయి.    
 • తెలంగాణ: ఇవాళ మధ్యాహ్నం నాటికి 6 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 493కు చేరింది. కోవిడ్‌-19 రోగులకు చికిత్స చేసేందుకు 5 ప్రభుత్వ ఆస్పత్రులను ఎంపిక చేశారు. కాగా, కరోనా రోగులకు చికిత్స కోసం రాష్ట్రంలో ఏర్పాటైన తొలి రైల్వే ఆస్పత్రి త్వరలో పని ప్రారంభిస్తుంది. కాగా, దిగ్బంధ సమయంలో వైద్య సలహా కోసం వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన టెలిమెడిసిన్‌ సదుపాయంద్వారా ప్రజలు డాక్టర్లను, నిపుణులను సంప్రదిస్తున్నారు.


(Release ID: 1613499) Visitor Counter : 85