మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 దిగ్బంధంతో డిజిటల్‌ విద్యాభ్యాస ప్రక్రియకు భారీ ఊపు
దాదాపు 5 రెట్లు పెరిగిన హెచ్‌ఆర్‌డి శాఖ ‘ఈ-అభ్యాస’ వేదికల వినియోగం
స్వయంప్రభ, జ్ఞానదర్శన్‌ టీవీ చానళ్లనూ వాడుకోండి: కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి

Posted On: 09 APR 2020 5:18PM by PIB Hyderabad

కోవిడ్‌-19 దిగ్బంధంతో విద్యారంగం ఎదుర్కొంటున్న ప్రతికూలతల ఉపశమనానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (HRD) శాఖ తనవంతు కృషిచేస్తోంది. ఈ మేరకు విద్యార్థులకు నిరంతర అభ్యసన సదుపాయాల కల్పనకు శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు వారాలుగా దేశంలో ఎలక్ట్రానిక్‌ మాధ్యమం ద్వారా విద్యాభ్యాస ప్రక్రియ ఊపందుకుంది. మరోవైపు హెచ్‌ఆర్‌డి మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌ క్రమం తప్పకుండా అత్యున్నత విద్యాసంస్థల అధిపతులతో చర్చిస్తూ వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు. దీంతో పాఠశాలలు, కళాశాలల్లో స్కైప్‌, జూమ్‌, గూగుల్‌ క్లాస్‌రూమ్‌, హ్యాంగవుట్‌ తదితర డిజిటల్‌ మాధ్యమాల వినియోగం పెరిగింది. ఈ క్రమంలో 2020 మార్చి 23 నుంచి హెచ్‌ఆర్‌డి జాతీయ ఆన్‌లైన్‌ విద్యావేదిక ‘స్వయం’ (SWAYAM)ను సుమారు 1.4 కోట్ల మంది వినియోగించుకున్నారు. ఈ విధంగా నిన్నటివరకూ 2.5 లక్షలసార్లు ఉపయోగించారు. దీంతో గతవారం (50,000)తో పోలిస్తే ఈ వేదిక వినియోగం ఐదు రెట్లు పెరిగింది. అంతేకాకుండా ‘స్వయంప్రభ’ డీటీహెచ్‌ టీవీచానళ్లలో నిత్యం 6.8 లక్షల మంది వీడియోలద్వారా విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటు డిజిటల్‌ మాధ్యమాల వినియోగం కూడా నానాటికీ భారీగా పెరుగుతోంది. అయినప్పటికీ కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ అందుబాటులో లేనివారు అనేకమంది ఉన్నారు. అందుకే జ్ఞానదర్శన్‌సహా స్వయంప్రభ గ్రూపులోని 24 గంటల ప్రసారాలు చేసే 32 డీటీహెచ్‌ చానళ్లను గరిష్ఠంగా వాడుకోవాలని శ్రీ పోఖ్రియాల్‌ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

*****(Release ID: 1612644) Visitor Counter : 30