వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కోవిడ్ అనంతర పరిస్థితులను ఎదుర్కోడానికి భారీ ఆలోచన విధానంతో శక్తిమేర సామర్ధ్యాన్ని పెంచుకోవాలని ఎగుమతిదారులకు శ్రీ పీయూష్ గోయల్ పిలుపు: ప్రపంచంలో మనం బాధ్యతాయుత పౌరులం అన్న కేంద్ర మంత్రి
Posted On:
08 APR 2020 7:46PM by PIB Hyderabad
కొవిడ్-19 వల్ల విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించడానికి ఎగుమతి ప్రోత్సాహక మండళ్ల తో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించింది. లాక్ డౌన్ తర్వాత ఇది మూడో వీడియో కాన్ఫరెన్స్. ఈ సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, రైల్వే శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్, సహాయ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురి, వాణిజ్య కార్యదర్శి డాక్టర్ అనుప్ వాధవన్, డిజిఎఫ్టి, వాణిజ్య శాఖ ఇతర అధికారులు పాల్గొన్నారు.
కోవిడ్ అనంతర కాలంలో ఎగుమతిదారులు పెద్ద ఆలోచనలతో అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన శ్రీ గోయల్, మన నాణ్యతను మెరుగుపరుచుకుంటే, సామర్థ్యాన్ని పెంపొందించుకుంటే, ఆర్థిక వ్యవస్థలను గాడిలోకి తెస్తూ, ధరల పోటీతత్వాన్ని మెరుగుపరుచుకుంటాం. అప్పుడు మనం ఎదగవచ్చు, కోవిడ్ తర్వాతి ప్రపంచంలో శక్తి మేర అవకాశాలను ఉపయోగించుకోండి అని అన్నారు.
"ఒక దేశం పెద్ద ఎత్తున శక్తియుక్తులను కేంద్రీకరించి మార్కెట్ ఆధిపత్యాన్ని చుస్తే, సహజంగానే మీరు నాణ్యతపై దృష్టి పెడతారు, ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది, ఉత్పాదకత మెరుగుపడుతుంది, సామర్థ్యం మెరుగుపడుతుంది." అన్నది తన వ్యక్తిగత నమ్మకం అని శ్రీపియూష్ గోయల్ చెప్పారు. ఎల్‌ఈడీ-బల్బులను వినియోగించడం, దేశవ్యాప్తంగా మరుగుదొడ్లను ఒక ఉద్యమంగా ప్రోత్సహించడం, అందరికీ విద్యుత్తును అందించడం, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ వంటి ఉదాహరణలు ఇస్తూ శ్రీ గోయల్, ప్రభుత్వం పెద్ద ఆలోచనలు చేసి, వాటిని ఆచరణలోకి పెట్టిందని గుర్తు చేశారు.
సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయాల్లో కూడా, ఎగుమతులపై మన ప్రాధాన్యతను ఉంచాలి, ఎగుమతి మార్కెట్ లో మనకు ఎదురయ్యే నష్టం శాశ్వతం కాదని స్పష్టం చేయాలి. అత్యవసరమైన, ముఖ్యమైన ఎగుమతి ఆర్డర్లు, ఏ కారణం చేతనైనా ఇరుక్కుపోయి ఉంటె, త్వరగా ఆ పరిస్థితి నుండి బయట పడడానికి ప్రయత్నాలు జరుగుతాయని శ్రీ గోయల్ హామీ ఇచ్చారు. ఎగుమతులను పునరుద్ధరించడానికి, ఎగుమతి అవకాశాలను విస్తరించడానికి, మంత్రిత్వ శాఖ చురుకుగా పనిచేస్తుందని చెప్పారు.
ఆందోళన కలిగించే కొన్ని ప్రాంతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఎక్కడైతే బలం ఎక్కువ ఉందొ దానిపై ఎగుమతిదారులు దృష్టి పెట్టాలని, ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ వ్యవస్థలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు.
కోవిడ్ అనంతర ప్రపంచంలో, భారతదేశం ప్రకాశించగలదని, శక్తివంతమైన, పారదర్శక ప్రజాస్వామ్యంగా ఉండి, మానవీయ దృక్పథంతో పాటు చట్ట పాలనతో పనిచేయగలదని మంత్రి అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా మనం బాధ్యతాయుతమైన పౌరులం. ప్రపంచ అవసరాల మేరకు ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేయగలం. ప్రపంచమంతా ఒకటే కుటుంబం అన్న భావన మనది. మన దగ్గర అనేక ఫార్మా ఉత్పత్తులు అదనంగా ఉన్నాయి. మనం ప్రపంచానికి సహాయం అందించాలి కదా. ప్రపంచంలో మనకూ ఒక బాధ్యత ఉంది అన్న ప్రధాని మనకు ఉండడం ఎంతో గర్వకారణం.... అని శ్రీ పియూష్ గోయల్ అన్నారు. మళ్లీ మన ఆర్ధిక పరిస్థితిని ఒక గాడి లోకి పెట్టాలి. ఈ ప్రయత్నంలో ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ పడబోమని కేంద్ర మంత్రి అన్నారు. ఎగుమతిదారులు తమ మొబైల్‌లలో ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని, ప్రాచుర్యం చేయాలనీ ఆయన కోరారు. పిఎం కేర్స్ ఫండ్ కోసం మనఃస్ఫూర్తిగా సహకరించాలని మంత్రి వారికి పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎఫ్ఐఈఓ కార్యవర్గ సభ్యులు, రత్నాభరణాలు, లెదర్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్, సింథటిక్స్, రేయాన్, హస్తకళలు, ప్రాజెక్ట్ ఎగుమతులు, టెలికాం, వస్త్రాలు, జీడిపప్పు, ప్లాస్టిక్స్, క్రీడా వస్తువులు, ఉన్ని, నూనెగింజలు, సిల్క్, ఇంజనీరింగ్ ఎగుమతులు, సేవలు, ఫార్మా, కెమికల్స్, రంగులు, అటవీ ఉత్పత్తులు, కార్పెట్, అనుబంధ రసాయనా లకు చెందిన ఈపీసీ లు పాల్గొన్నారు.
****
(Release ID: 1612405)
Visitor Counter : 179