హోం మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యవసర వస్తువుల లభ్యత నిర్థారణకు ఎసెన్షియల్ కమోడిటీస్ (ఈసీ) చట్టంలోని నిబంధనల్ని వినియోగించండి
రాష్ర్టాలకు సూచిస్తూ లేఖ రాసిన కేంద్ర హోం మంత్రత్వ శాఖ కార్యదర్శి
Posted On:
08 APR 2020 11:20AM by PIB Hyderabad
కోవిడ్-19 వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో నిత్యవసర వస్తువుల లభ్యతకు ఎలాంటి కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సూచించింది. నిత్యవసర వస్తువుల లభ్యత సజావుగా సాగేందుకు గాను అన్ని చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఇందుకు గాను అవసరమైతే ఎసెన్షియల్ కమోడిటీస్ (ఈసీ) చట్టం-1955 లోని నిబంధనలను కఠినంగా అమలులోకి తేవాలని సూచించారు. ఈ చర్యలలో భాగంగా కృత్రిమ కొరతను నివారించేందుకు స్టాక్ పరిమితులను నిర్ణయించడం, ధరలను నియంత్రించడం, ఉత్పత్తిని పెంచడం, డీలర్ల ఖాతాల తనిఖీ చేయడంతో పాటు ఇతర చర్యలను చేపట్టాలని హోం శాఖ రాష్ట్రాలకు సూచించింది. తగినంత కార్మికుల లభ్యత లేకపోవడంతో పాటు వివిధ కారణాల వల్ల ఉత్పత్తి నష్టం జరుగుతున్నట్టుగా నివేదికలు వస్తున్నాయని ఈ పరిస్థితుల్లో వస్తువుల అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ లాభదాయకత వంటి వివిధ అనూహ్య కార్యకలాపాలకు వ్యాపారులు పాల్పడవచ్చని.. దీని వల్ల భారీగా ధరలు పెరిగే అవకాశం ఉందని హోం శాఖ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సరసమైన ధరలకు ప్రజలకు పెద్ద మొత్తంలో నిత్యవసర వస్తువుల లభ్యత ఉండేలా తగిన చర్యలు చేపట్టాలని హోం శాఖ రాష్ట్రాలను కోరింది. అంతకుముందు, హోం మంత్రిత్వ శాఖ దేశ విపత్తు నిర్వహణ చట్టం క్రింద ఆదేశాలను జారీ చేస్తూ ఆహార పదార్థాలు, మందులు, వైద్య పరికరాలు వంటి అవసరమైన వస్తువులకు సంబంధించిన తయారీ, ఉత్పత్తి, సరఫరాతో పాటు రవాణా కార్యకలాపాలకు లాక్‌డౌన్ కాలంలోనూ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి తోడు, ఈసీ చట్టం - 1955 కింద ఉత్తర్వులు జారీ చేయడానికి రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు జూన్ 30, 2020 వరకు అధికారాన్ని ఇస్తున్నట్టుగా వినియోగదారుల వ్యవహారాలు ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో లాక్‌డౌన్ వేళ తక్షణ ఆదేశాల జారీకి ఇకపై కేంద్ర ప్రభుత్వం సమ్మతి కోసం రాష్ట్రాలు వేచి చేడాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఈసీ చట్టం కింద పేర్కొన్న అక్రమ చర్యలకు పాల్పడిన వారికి ఏడేండ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధించే ఆస్కారం ఉంది. లేదంటే రెండింటినీ విధించేలా కూడా చట్టం వెసులుబాటును కల్పిస్తోంది. బ్లాక్ / మార్కెటింగ్ నివారణ మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ సరఫరా నిర్వహణ చట్టం-1980 కింద నేరస్థులను నిర్బంధించే అంశాన్ని కూడా రాష్ట్ర / కేంద్రపాలిత ప్రభుత్వాలు అవసరమనుకుంటే పరిగణించే వీలుందని తెలిపింది.
(Release ID: 1612185)
Visitor Counter : 265
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam