రాష్ట్రప‌తి స‌చివాల‌యం

కోవిడ్ -19 నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు, ఇతర సహాయక కార్యక్రమాల గురించి వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు అడ్మినిస్ట్రేటర్లతో చర్చించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి

Posted On: 03 APR 2020 4:55PM by PIB Hyderabad

కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో దేశ ప్రజల ధైర్యం, క్రమశిక్షణ, సంఘీభావాలు ఆదర్శనీయమని భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. ఆనంద్ విహార్ లో వలస కార్మికులను ఒక చోటకు చేర్చడం, ఢిల్లీలోని నిజాముద్దీన్ లోని తబ్లిగి జమాత్ సమావేశాల ద్వారా ఈ ప్రయత్నాలకు విఘాతం కలగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

 

ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడుతో పాటు ఈ రోజు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నలు ఇతర ముఖ్య అధికార బృందంతో రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ -19 విషయంలో భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల్లో విజయవంతమైన వివిధ అంశాల గురించి మాట్లాడిన ఆయన, లాక్ డౌన్ సందర్భంలో దేశ వ్యాప్తంగా ఆకలితో ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

మార్చి 27న ఎంపిక చేసిన 15 రాష్ట్రాల గరవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో జరిపిన సమావేశానికి ఇది కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. ఈ రోజు మిగిలిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఇతర అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవడంలో తీసుకుంటున్న చర్యలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి వారు వివరించారు. కనిపించని శతృవుతో జరిగే ఈ పోరాటంలో చాలా సున్నితంగా వ్యవహరించాలని, అసంతృప్తికి తావు ఇవ్వకూడదని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు సిబ్బంది పై దాడుల ఘటనల పట్ల రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు.

5వ తేదీ రాత్రి 9 గంటలకు లైట్లను ఆపి, కొవ్వొత్తులు, దీపాలు, టాల్చిలైట్లు, సెల్ ఫోన్ లైట్లతో సంఘీభావం తెలపాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోడి ప్రజలకు చేసిన విజ్ఞప్తిని రాష్ట్రపతి హృదయపూర్వకంగా ఆమోదించారు. కరోనా వైరస్ కు వ్యతిరేకంగా సంఘీభావం తెలుపుతూ దీపాలు వెలిగించడమే కాకుండా, రక్షణ విషయంలో రాజీ పడవద్దని, సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని సూచించారు.

మార్చి 27 నాటి సమావేశంలో నిర్మాణాత్మక చర్చలు జరిగినట్లు ఈ సమావేశంలో ప్రారంభంలో తెలిపిన రాష్ట్రపతి రిటైర్డ్ వైద్యులు మరియు వైద్య విద్యార్థులను ఈ పోరాటంలో భాగస్వాములను చేయడం, మనస్తత్వవేత్తల నైపుణ్యాన్ని ఉపయోగించడం, యువతను స్వచ్ఛందంగా ఆహ్వానించడం, రోజు వారి సమీక్ష సమావేశాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షించడం, ప్రజల ఆకలి తీర్చేందుకు సాయం చేయడం లాంటి అనేక ప్రయోజనకరమైన సూచనల గురించి వివరించారు.. ఇవే గాక హోం డెలివరీ ప్రోత్సహించడం, సహాయక చర్యలు, క్వారంటైన్ సౌకర్యాల కోసం క్రీడా మైదానాలు ఉపయోగించడం, అవగాహన కల్పించడంలో విశ్వ విద్యాలయాలను ఉపయోగించడం లాంటి అనేక ప్రయోజనకరమైన ఇతర విషయాలను కూడా వివరించారు.

ఈ సంక్షోభ సమయంలో నిరాశ్రయులు, నిరుద్యోగులు మరియు సమాజంలో ఇతర బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ప్రస్తావించిన రాష్ట్రపతి, వారి అవసరాలను పరిష్కరించే విషయంలో చాలా సున్నితంగా వ్యవహరించాలని, ఎవరూ ఆకలితో ఉండకుండా చూసుకోవడానికి మరింత సులభమైన, సురక్షితమైన మార్గాలను తెలియజేయాలని ఆహ్వానం పలికారు. ఇది దేశం ముందున్న పెద్ద సవాలు అన్న ఆయన, కేంద్ర, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలకు గవర్నర్ల సహకారం సంపూర్ణంగా అందుతుందని, సమాజంలో అన్ని వర్గాలను వారు కలుపుకుని పోతారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

అంతే గాకుండా అవసరమైన వారికి ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చూసుకుంటూనే సామాజిక దూరం అనే అంశం మీద రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మునుపటి సమావేశంలో చర్చించిన విధంగా ప్రభుత్వ చేపడుతున్న కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ సహా ఇతర స్వచ్ఛంద సంస్థల పాత్ర గురించి తెలిపిన ఆయన, స్వచ్చంద సంస్థలతో పాటు ప్రైవేటు రంగం నుంచి పూర్తి స్థాయిలో సేవలను వినియోగించుకునే దిశగా ఆయన సలహాలను ఆహ్వానించారు.

 

కోవిడ్ -19 మహమ్మారి ఎదుర్కోవడం సరైన దిశలో ముందుకు వెళుతున్నామని, కొన్ని చిన్నపాటి సమస్యలు ఎదురౌతున్నా దైర్యంగా దృఢ నిశ్చయంతో ముందుకు వెళుతున్నామని రాష్ట్రపతి తన ముగింపు వ్యాఖ్యల్లో తెలియజేశారు.

దేశ పౌరుల సహనాన్ని, సహకారాన్ని ప్రశంసించిన రాష్ట్రపతి, తమ ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఉన్నప్పటికీ సమాజానికి, దేశానికి, మానవత్వానికి సేవ చేస్తున్న వైద్యులతో పాటు అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా దేశ ప్రజలు పూర్తి అప్రమత్తతో, దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతారని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, పేద ప్రజలకు సహకారం అందించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సామాజిక సంస్థలు మరియు ప్రైవేటు రంగాల వాలంటీర్ల ఒకతాటి మీదకు తీసుకురావడం మీద దృష్టి పెట్టాలని సూచించారు. అనేక రాష్ట్రాల్లో పంటకోత సమయం ఉన్నందున లాక్ డౌన్ నేపథ్యంలో అత్యంత బలహీన వర్గాలకు, ముఖ్యంగా రైతులకు సాయం చేసేలా రాష్ట్రంలోని అధికారులు చర్యలు తీసుకునేలా చూడాలని ఆయన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు ఇతర ముఖ్య అధికారులకు సూచించారు. ప్రజల ఇబ్బందులు తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పేద, బలహీన వర్గాలకు సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహకారం అందించడం ద్వారా మానవతా విలువలకు పెద్ద పీట వేసిన వారం అవుతామని, సేవచేసేందుకు లభించిన అవకాశంగా భావించి సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు చేతనైన సాయం అందించాలని పిలుపునిచ్చారు.

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనంది బెన్ పటేల్ మాట్లాడుతూ, రోగులకు సేవ చేందుకు విశ్వవిద్యాలయాలు, వైద్య కళాశాలలు సహకారం అందిస్తున్నాయని తెలిపారు. విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు, అకాడమీ సెషన్స్ కు వీలు కల్పించాలని సూచించారు. రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, వారికి సహాయపడే చర్యలను ప్రారంభించిందని తెలిపారు. చర్చ మధ్యలో రాష్ట్రపతి కలుగజేసుకుని రెడ్ క్రాస్ సొసైటీ యూనిట్లను పునరుద్ధరించి, వారి సహకారం తీసుకోవాలని గవర్నర్లందరినీ కోరారు.

చర్చలో అనేక మార్లు మధ్యలో సూచనలు చేసిన ఉపరాష్ట్రపతి ముఖ్యంగా రైతులు, భూమి లేని కార్మికులకు సహకారం అందించడం గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ప్రత్యేకంగా రైతు సమస్యల విషయాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించవలసిందిగా సూచించారు.

జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ గిరీష్ చంద్ర ముర్ము మాట్లాడుతూ, కోవిడ్ విషయంలో పూర్తి పర్యవేక్షణను కొనసాగిస్తున్నామని, హాట్ స్పాట్ లను గుర్తించమని సూచించినట్లు తెలిపారు. తబ్లిగి జమా కారణంగా సమస్యలను ఎదుర్కొన్నామని, వలస కార్మికులు, విద్యార్థుల కోసం తగిన నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, సూదూర ప్రాంతాలకు ఆహార సరఫరా కోసం కూడా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించామని తెలిపారు.

లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ రాథా కృష్ణ మాథుర్ మాట్లాడుతూ, ఇరాన్ నుంచి తిరిగి వచ్చిన యాత్రికుల ద్వారా కోవిడ్ కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాలకు చేరుకోవడం కష్టమౌతున్న నేపథ్యంలో సహాయక చర్యలు కష్టతరం అవుతాయని అభిప్రాయపడ్డారు. అవసరమైన వారికి సహాయం అందించడంలో స్వచ్ఛంద, మత, సామాజిక సంస్థల కృషిని ఆయన ప్రశంసించారు.

అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి (రిటైర్డ్) మాట్లాడుతూ, అక్కడి 10 పాజిటివ్ కోవిడ్ కేసులు తబ్లిగి జమాత్ కు సబంధించినవేనని తెలిపారు. వారందరినీ గుర్తించి, నిర్బంధంలో ఉంచినట్లు తెలిపారు.

చత్తీస్ ఘడ్ గవర్నర్ సుశ్రీ అనుసూయ యూకీ మాట్లాడుతూ వ్యాధి వ్యాప్తిని త్వరితగతిన తెలుసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తోందని తెలిపారు. రైతుల సమస్యలను ప్రస్తావించిన త్వరగా పాడయ్యే వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలో విక్రయించడానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.

ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీమతి. బేబీ రాణి మార్య మాట్లాడుతూ, సంక్షోభం నుంచి తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని రాష్ట్రప్రభుత్వ పెంచుకుంటోందని తెలిపారు.

గోవా గవర్నర్ శ్రీ సత్యపాల్ మాలిక్, ఒడిశా గవర్నర్ ప్రొ. గణేషి లాల్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డా.కిరణ బేడి, జార్ఖండ్ గవర్నర్ శ్రీమతి ద్రౌపతి ముర్ము, అస్సాం గవర్నర్ ప్రొ. జగదీష్ ముఖి, మిజోరం గవర్నర్ శ్రీ పి.ఎస్.శ్రీధరన్ పిళ్లై, మణిపూర్ గవర్నర్ డా. నజ్మా హెప్తుల్లా, మేఘాలయ గవర్నర్ శ్రీతథాగత రాయ్, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ డా. బి.డి. మిశ్రా, సిక్కిం గవర్నర్ శ్రీ గంగా ప్రసాద్, త్రిపుర గవర్నర్ శ్రీ రమేష్ బైస్, నాగాలాండ్ గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ దినేశ్వర్ శర్మ, దాద్రానగర్ హవేల్ మరియు డామన్ డయ్యూ అడ్మినిస్ట్రేటర్ శ్రీ ప్రపుల్ పటేల్ తో పాటు ఇప్పటికే మార్చి 27న జరిగిన సమావేశంలో పాల్గొన్న తమిళనాడు గవర్నర్ శ్రీ బన్వరీలాల్ పురోహింత్, మహరాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారి, కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ అనిల్ బైజల్ ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులతో పాటు తాజా పరిస్థితి గురించి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి వివరించారు.

సమావేశం ముగింపులో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు అడ్మినిస్ట్రేటర్లు వ్యక్తం చేసిన అభిప్రాయలను, నూతన ఆలోచనలను రాష్ట్రపతి ప్రశంసించారు. తీవ్రమైన ప్రమాద పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు సేవ చేసే దిశగా ఆదర్శప్రాయమైన ధైర్యం, నమ్మకాన్ని ప్రదర్శించిన వైద్యులు, ఆరోగ్యకార్యకర్తలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఏ విధమైన అవసరం వచ్చినా, ఉపరాష్ట్రపతితో పాటు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని రాష్ట్రపతి పునరుద్ఘాటించారు.

****



(Release ID: 1610789) Visitor Counter : 156