ప్రధాన మంత్రి కార్యాలయం

క్రీడారంగ ప్రముఖులతో ప్రధానమంత్రి చర్చాగోష్ఠి

కోవిడ్‌-19పై పోరులో ‘సంకల్పం, సంయమనం, సానుకూలత, గౌరవం, సహకారం’ అనే పంచమంత్ర సూత్రం ప్రతిపాదించిన శ్రీ నరేంద్ర మోదీ
దేశానికి కీర్తి తెచ్చిన క్రీడా ప్రముఖులు నేడు జాతి ఆత్మస్థైర్యాన్ని ప్రోది చేయడంతోపాటు సానుకూల దృక్పథ వ్యాప్తిలో కీలకపాత్ర పోషించాలి: ప్రధాని
ప్ర‌ధాని నాయకత్వాన్ని ప్రశంసిస్తూ... సానుకూలత‌-సామాజిక దూరం
సందేశ వ్యాప్తికి త‌మ‌వంతు కృషి చేస్తామని క్రీడా దిగ్గజాల ప్రతిన‌

Posted On: 03 APR 2020 12:54PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ‌క్రీడారంగ దిగ్గజాలతో చర్చాగోష్ఠి నిర్వహించారు. కోవిడ్‌-19 నేడు మొత్తం మానవాళికే శత్రువుగా తయారైందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ప్రపంచ క్రీడా సంబరం ‘ఒలింపిక్స్‌’ వాయిదా పడటమే పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని గుర్తుచేశారు. ఈ ప్రపంచ మహమ్మారి సవాలును ఎదుర్కొనే క్రమంలో ‘వింబుల్డన్‌ వంటి అంతర్జాతీయ క్రీడా పోటీలుసహా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) క్రికెట్‌ టోర్నమెంట్‌ వంటి ఇతర దేశీయ క్రీడ సంబరాలను కూడా వాయిదా వేయాల్సి వచ్చిందని వివరించారు.

   క్రీడా క్షేత్రంలో అద్భుత నైపుణ్య ప్రదర్శనతో దేశానికి కీర్తిప్రతిష్టలు ఆర్జించిపెట్టారంటూ క్రీడా దిగ్గజాలను ప్రధానమంత్రి ప్రశంసించారు. ప్రస్తుత సంక్షోభ సమయాన ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని ఉత్తేజితం చేయడంతోపాటు ‘సామాజిక దూరం’ సందేశ వ్యాప్తిలో మరింత కీలక పాత్ర పోషించాల్సి ఉందని వారికి సూచించారు. అంతేకాకుండా జాతీయ దిగ్బంధంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీచేసే సూచనలను తప్పక అనుసరించేలా ప్రజలను ప్రోత్సహించాలని కోరారు. క్రీడా శిక్షణలో దిగ్గజాలు అలవరచుకున్న ‘సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం, స్వీయ క్రమశిక్షణ, సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం’ వంటి లక్షణాలే నేడు వైరస్ వ్యాప్తి నిరోధక పోరాటంలో పదునైన ఆయుధాలని, ప్రజలను అదేబాటలో నడపాలని ఆయన నొక్కి చెప్పారు.

   దిశగా ప్రజలకిచ్చే సందేశంలో పంచమంత్రాలను జోడించాలని ప్రధానమంత్రి వారికి సూచించారు. ప్రపంచ మహమ్మారిపై పోరాటంలో “సంకల్పం”, సామాజిక దూరం పాటింపులో “సంయమనం”, ఆశావాదపూర్వక “సానుకూలత”, వైద్య, పోలీసు సిబ్బందిసహా ముందువరుసన నిలిచి మహమ్మారిపై పోరాడుతున్న వీరులపై “గౌరవం”, జాతీయ-వ్యక్తిగత స్థాయులలో ‘పీఎం కేర్స్‌’ నిధికి విరాళాలద్వారా “సహకారం” అందించేలా ప్రజానీకాన్ని ఉత్తేజపరచాలని క్రీడా ప్రముఖులను కోరారు. అలాగే శారీరక, మానసిక దృఢత్వాలకుగల ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయాలని, ఆయుష్‌ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలకు ప్రాచుర్యం కల్పించాలని సూచించారు.

   దేశం పెనుసవాలును ఎదుర్కొంటున్న వేళ ప్రధానమంత్రి నాయకత్వ పటిమను క్రీడా ప్రముఖులు ప్రశంసించారు. ఈ పోరాట సమయంలో ముందు వరుసన నిలిచి నిస్వార్థ సేవలందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు సిబ్బంది తదితరులకు వాస్తవంగా దక్కాల్సిన గౌరవం లభించేలా చర్యలు తీసుకుంటున్నందుకుగాను కృతజ్ఞతలు తెలిపారు. క్రమశిక్షణ, మానసిక దృఢత్వం, శరీర దారుఢ్య కసరత్తుల ప్రాధాన్యం గురించి మాట్లాడుతూ, ఇవన్నీ మన రోగనిరోధకతను ఇనుమడింపజేస్తాయని స్పష్టం చేశారు. ప్రపంచ మహమ్మారిపై యుద్ధంలో  భారత్‌ ఘన విజయం సాధించడం అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆ మేరకు క్రీడాకారులు ఈ పోరాటంలో చురుకైన భాగస్వాములు కాగలరన్న విశ్వాసం వెలిబుచ్చారు.

   దేశంలోని 40 మందికిపైగా వివిధ రంగాల క్రీడా దిగ్గజాలు ఈ దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశంలో పాల్గొన్నారు. ‘భారతరత్న’ శ్రీ సచిన్‌ టెండూల్కర్‌, బీసీసీ అధ్యక్షుడు శ్రీ సౌరవ్‌ గంగూలీ, జాతీయ మహిళా హాకీ జట్టు కెప్టెన్‌ కుమారి రాణి రాంపాల్‌, అగ్రశ్రేణి షట్లర్‌ పి.వి.సింధు, కబడ్డీ క్రీడాకారుడైన హిమాచల్‌ పోలీసు శాఖ డీఎస్పీ శ్రీ అజయ్‌ ఠాకూర్‌, పరుగు క్రీడాకారిణి కుమారి హిమాదాస్‌, దివ్యాంగ హైజంప్‌ క్రీడాకారుడు శ్రీ శరద్‌కుమార్‌, ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి కుమారి అంకిత రాణా, మెరుపువీరుడైన క్రికెటర్‌ శ్రీ యువరాజ్‌ సింగ్‌, జాతీయ పురుషుల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ శ్రీ విరాట్ కోహ్లీతోపాటు కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడల శాఖ మంత్రి, సీనియర్‌ అధికారులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు.

***


(Release ID: 1610661) Visitor Counter : 239