రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

"ఎక్సెర్ సైజ్ ఎన్.సి.సి. యోగ్ దాన్" కింద కోవిడ్-19 పై పోరాటానికి జాతీయ స్థాయిలో విధులు నిర్వర్తించడానికి వీలుగా ఎన్.సి.సి. తన వాలంటీర్ క్యాడెట్ల సేవలను అందిస్తోంది.


కేడెట్లను తాత్కాలిక ప్రాతిపదికపై నియోగించడానికి మార్గదర్శకాలను జారీ చేసింది.

Posted On: 02 APR 2020 10:09AM by PIB Hyderabad

కోవిడ్-19 కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరులో పౌర అధికారులకు చేయూత నందించడానికి, తన "ఎక్సెర్ సైజ్ ఎన్.సి.సి. యోగ్ దాన్" కింద తన క్యాడెట్ల సేవలందించడానికి,  నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్.సి.సి.), ముందుకు వచ్చింది. ఈ మహమ్మారి పై జరుపుతున్న యుద్ధంలో వివిధ సంస్థలు చేస్తున్న సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకోడానికి వీలుగా తన క్యాడెట్లను తాత్కాలిక ప్రాతిపదికన నియోగించుకోడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. 

 

 

హెల్ప్ లైన్ / కాల్ సెంటర్లలో; సహాయ సామాగ్రి / మందులు / ఆహారం / నిత్యావసర వస్తువుల పంపిణీ; సమాజ సహాయం; సమాచార సేకరణ, యాజమాన్యం; క్యూ ల నిర్వహణ; రాకపోకల నియంత్రణ వంటి విధులలో ఎన్.సి.సి. క్యాడెట్లను వినియోగించుకోవచ్చు.  మార్గదర్శకాల ప్రకారం క్యాడెట్లను శాంతి భద్రతల నిర్వహణలో కానీ, లేదా క్రియాశీల సైనిక విధుల్లో కానీ, లేదా ప్రమాదకర అత్యవసర ప్రదేశాల్లో కానీ నియోగించకూడదు.  

 

 

18 సంవత్సరాల వయస్సు దాటిన సీనియర్ డివిజన్ వాలంటీర్ క్యాడెట్లను మాత్రమే నియోగించుకోవాలి.  శాశ్వత శిక్షణా సిబ్బంది మరియు/లేదా సహాయ ఎన్.సి.సి. అధికారి  పర్యవేక్షణలో 8 నుండి 20 మంది లోపు చిన్న చిన్న బృందాలుగా వీరిని నియోగించాలి.  

 

 

వాలంటీర్ క్యాడెట్ల నియామకానికి, రాష్ట్ర ఎన్.సి.సి. డైరెక్టరేట్ల ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు / జిల్లా అధికార యంత్రంగాలు తమ అభ్యర్ధనను పంపాలి. వివరాలను డైరెక్టరేట్ / గ్రూప్ హెడ్ క్వార్టర్స్ / యూనిట్ స్థాయిలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు / స్థానిక పౌర అధికారులతో సమన్వయపరుస్తారు. క్యాడెట్లను విధుల్లో నియోగించే ముందు, క్షేత్రస్థాయి పరిస్థితులను, అక్కడ నెలకొన్న అవసరాలను నిర్ధారించుకోవలసి ఉంటుంది 

 

 

ఎన్.సి.సి., రక్షణ మంత్రిత్వ శాఖ కింద దేశంలో పనిచేస్తున్న అతి పెద్ద యువజన సంస్థ.  వివిధ సామాజిక సేవ, సమాజ అభివృద్ధి కార్యకలాపాల నిర్వహణలో నిమగ్నమయ్యే సంస్థ. వరదలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయాల్లో,  ఎన్.సి.సి. క్యాడెట్లు జాతీయ ప్రయోజనాలకు తోడ్పాటునందిస్తున్నారు. 

 

***



(Release ID: 1610182) Visitor Counter : 167