రైల్వే మంత్రిత్వ శాఖ

కోవిడ్-19పై పోరాటంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న భారతీయ రైల్వేస్ సంసిద్ధతపై రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్ సమీక్ష

చరిత్రలో మొదటిసారిగా గత 12నెలల్లో ఒక్క వ్యక్తి కూడా రైలు ప్రమాదంలో మరణించలేదు; కోవిడ్-19 భారతదేశంపై తక్కువ ప్రభావాన్ని చూపేలా ఇప్పుడు మా కృషి అంతా..

అవసరమైన బాధితులకు ఆహరం ఇతర సహాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం

Posted On: 01 APR 2020 1:40PM by PIB Hyderabad

భారతీయ  రైల్వే అధికారులు తమ శక్తియుక్తులు, వనరులను పూర్తి స్థాయిలో  ఉపయోగించి ఆహారం, ఇతర సహాయాలను అవసరమైన వారి వద్దకు చేర్చాలని రైల్వే, వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఆదేశించారు. ఐఆర్సీటిసి, ఆర్పిఎఫ్ వంటి రైల్వేస్ కి చెందిన సంస్థలు అవసరమైన వారికి ఉచిత భోజన సదుపాయాన్ని కలిపిస్తున్నాయి. రైల్వే తమ ప్రయత్నాలను విస్తృతం చేసుకోవాలని,  జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో సంప్రదింపులు జరిపి రైల్వే స్టేషన్ల సామీప్యతకు మించి మారుమూల  ప్రాంతాలకు వెళ్లాలని మంత్రి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో జరిగిన సమావేశంలో రైల్వేల సహాయ మంత్రి శ్రీ సురేష్ అంగది, రైల్వే బోర్డు సభ్యులు, జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పాల్గొన్నాయి.

కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఇప్పటివరకు అసాధారణమైన స్థాయిలో స్పందిస్తున్నందుకు రైల్వేను అభినందిస్తూ, ప్రయాణీకుల కోచ్‌లను ఐసోలేషన్ కోచ్‌లుగా మార్చడం వంటి వినూత్న పరిష్కారాల  వైపు అడుగులు వేయడాన్ని ఆయన ప్రశంసించారు. ఈ కోచ్‌లను పూర్తిగా సిద్ధంగా ఉంచడాన్ని  అన్ని జోన్లు ఒక సవాలుగా తీసుకోవాలని ఆయన అన్నారు. మొదటి దశలో 5000 కోచ్ లను ఐసొలేషన్ కోచ్ లుగా మార్చే పని ప్రారంభమైంది.

ప్రధాన మంత్రి పిలుపుతో పీఎం-కేర్ నిధికి రూ.151 కోట్లు విరాళం ఇచ్చామని రైల్వే బోర్డు అధికారులు మంత్రికి తెలియజేసారు. భారతీయ రైల్వేస్ ఉద్యోగులు, రైల్ పిఎస్ యూ ల ఉద్యోగులు పీఎం-కేర్ నిధికి ఒక రోజు జీతాన్ని విరాళంగా  ఇవ్వాలని నిర్ణయించారని రైల్వే బోర్డు చైర్మన్ శ్రీ వినోద్ కుమార్ యాదవ్ వెల్లడించారు.

ముఖ్యమైన వస్తువులను సరఫరా చేయడానికి నడుపుతున్న రైల్వే ప్రత్యేక పార్సెల్ రైళ్లను గురించి శ్రీ పియూష్ గోయల్ సమీక్షిస్తూ, వీలైనంత ఎక్కువ మార్గాలలో  సేవలను అందించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు, తద్వారా మందులు, అవసరమైన పరికరాలు, తినదగ్గ వస్తువులు దేశవ్యాప్తంగా త్వరగా సరఫరా అవుతాయని అన్నారు. ఇ-కామర్స్ కంపెనీలు మరియు తక్కువ పరిమాణంలో అవసరమయ్యే ఇతర ముఖ్యమైన వస్తువుల సరఫరాదారులు పార్శిల్ రైళ్లను వినియోగించుకోబోతున్నారు. పార్సెల్ ప్రత్యేక రైళ్లు ఇప్పటికే 8 రూట్లలో నడుస్తున్నాయి వివిధ  జోన్లలో మరో 20 వేర్వేరు రూట్లలో నడపడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

రాబోయే కొన్ని వారాలు కరోనా పై యుద్ధంలో చాల కీలకమని, దేశం గెలిచేలా మన ప్రయత్నాలు ఉండాలని శ్రీ పియూష్ గోయల్ అన్నారు. చరిత్రలో మొదటిసారిగా గత 12నెలల్లో ఒక్క వ్యక్తి కూడా రైల్వే ప్రమాదంలో మరణించలేదు. అంతే స్ఫూర్తితో కోవిడ్-19 భారతదేశంపై చూపే ప్రభావం తక్కువగా ఉండేలా ఇపుడు మనం కృషి చేస్తున్నాం అని మంత్రి అన్నారు.

                                   ****


(Release ID: 1610015) Visitor Counter : 231