ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 పై నమూనా సేకరణ మరియు పరీక్ష వ్యూహం సమీక్షించిన డాక్టర్ హర్షవర్ధన్
కోవిడ్-19 వల్ల సంభవించిన ముప్పు ఎదుర్కోవటానికి మెరుగైన శాస్త్రీయ పరిష్కారాలను కనుగొనే ప్రయత్నాలకు వివిధ శాఖల సమిష్ఠి ప్రేరణ ఉత్ప్రేరకపరుస్తుంది: డాక్టర్ హర్షవర్ధన్
కోవిడ్-19 పరిష్కారాల కోసం పరిశోధన, వ్యాధి నిర్వహణ ప్రయత్నాలు ఏకకాలంలో క్రియాశీలంగా కొనసాగాలి - డాక్టర్ హర్షవర్ధన్
Posted On:
31 MAR 2020 1:09PM by PIB Hyderabad
కోవిడ్ -19 కి సంబంధించి నమూనాలు, పరీక్షా వ్యూహాన్ని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఐసిఎంఆర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, సిఎస్ఐఆర్ సీనియర్ అధికారులతో నిన్న సమావేశం నిర్వహించారు.
కారకాల సేకరణ, వెబ్సైట్ ఏకీకరణ, డేటా నిర్వహణ, విశ్లేషణ, డాష్‌బోర్డ్‌లు, ఇప్పటివరకు జరిగిన అధ్యయనం, పరిశోధన మొదలైన అంశాలపై విస్తృతమైన చర్చ జరిగింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న చర్యల గురించి రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు / కేంద్రపాలిత ప్రాంతాలతో ఉదయం చర్చలు జరిపినట్లు డాక్టర్ హర్ష్ వర్ధన్ తెలిపారు. రాష్ట్రాలు / యుటిలు ఏ మేరకు సంసిద్ధతతో ఉన్నాయో సమీక్షించారు. వారికి అన్ని విధాలా సహకరిస్తారని హామీ ఇచ్చారు. క్రియాశీలమైన నిఘా, వ్యాధి సంక్రయించే వారి జాడ సమర్థవంతంగా కనుగొనడం, కోవిడ్-19 నియంత్రణ-నిర్వహణ కోసం వారి సంసిద్ధతను ఆయన ప్రశంసించారు.
129 ప్రభుత్వ ల్యాబ్ లలో రోజుకు 13000 పరీక్షలు చేయగలిగే సామర్థ్యంతో పాటు 49 ఎన్‌ఎబిఎల్ గుర్తింపు పొందిన ప్రైవేట్ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని ఐసిఎంఆర్ డీజీ ఈ సమావేశంలో వివరించారు. ప్రైవేట్ నెట్వర్క్ లో సుమారు 16000 సేకరణ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి తగినన్ని రోగనిర్ధారణ పరీక్షా వస్తు సామగ్రిని సేకరించి అన్ని రాష్ట్రాలకు వాటిని చేరవేశామని డీజీ తెలిపారు. రాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్లను కూడా ఆర్డర్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 38,442 పరీక్షలు జరగగా వాటిలో ప్రైవేట్ ల్యాబ్‌లలో 1,334 జరిగాయి. కోవిడ్-19ని ఎదుర్కోవడంలో జరుగుతున్న పరిశోధనల తాజా స్థితిగతుల గురించి సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ముగ్గురు కార్యదర్శులతో తదుపరి చర్చలు జరిగాయి.
అంకుర సంస్థలు, విద్యావేత్తలు, ఆర్ అండ్ డి ల్యాబ్స్, పరిశ్రమలలో కోవిడ్-19 సంబంధిత సాంకేతిక సామర్థ్యాలను మ్యాపింగ్ చేయడం, రోగనిర్ధారణ, ఔషధాలు, వెంటిలేటర్లు, ప్రొటెక్షన్ గేర్, క్రిమిసంహారక వ్యవస్థలు, మొదలైనవి గుర్తించినట్టు శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి డాక్టర్ అశుతోష్ శర్మ వెల్లడించారు. డిఎస్టి నిధుల సమకూర్చే అంశంపై గత ఒక వారంలో 200 కి పైగా ప్రతిపాదనలు వచ్చాయి, వీటి నుండి 20 కి పైగా సంస్థలు మొదటి దశలో మద్దతు కోసం చురుకుగా పరిశీలనలో ఉన్నాయి. కోవిడ్-19 ఎదుర్కొనే చర్యలు, ఖర్చు, వేగం మరియు పరిష్కారాల సామర్థ్యాన్నిఈ ఎంపికలో పరిగణలోకి తీసుకుంటారు.
హెల్త్‌కేర్ సవాళ్లను ఎదుర్కోవటానికి వైద్య పరికరాలు, రోగనిర్ధారణ పరీక్షలు, థెరప్యూటిక్స్, ఔషధాలు, వ్యాక్సిన్ల అభివృద్ధికి తోడ్పడటానికి బయోటెక్నాలజీ విభాగం కన్సార్టియంను ఏర్పాటు చేసిందని బయో టెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ తెలిపారు. పుణెలో అంకుర సంస్థ అభివృద్ధి చేసిన మొదటి స్వదేశీ కిట్ వారానికి దాదాపు లక్ష కిట్లను ఉత్పత్తి చేయడానికి సామర్థ్యాన్ని పెంచుతోందని ఆమె పేర్కొన్నారు.
వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లు, ఇమేజింగ్ పరికరాలు, అల్ట్రాసౌండ్ - అత్యున్నత స్థాయి రేడియాలజీ పరికరాలను దేశీయంగా అభివృద్ధి చేసి తయారీ చేసే సదుపాయం విశాఖపట్నంలో ఏర్పాటైంది. ఇక్కడ ఏప్రిల్ మొదటి వారంలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది.
అన్ని పరీక్షలు, ఔషధాలు, వ్యాక్సిన్ల కోసం వేగవంతమైన నియంత్రణ అనుమతులను ఇవ్వడానికి డిబిటితో పాటు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వేగవంతంగా స్పందించే నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసి నోటిఫై చేసారు. మూడు దేశీయ పరిశ్రమలతో టీకా అభివృద్ధి చేయడం జరిగింది. చికిత్స, ఔషధాల అభివృద్ధిపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి.
కోవిడ్-19 ఎదుర్కోడానికి శాస్త్ర, సాంకేతిక పరిష్కారాలను కనుగొనటానికి సిఎస్ఐఆర్ ఐదు అంచెల వ్యూహంపై పనిచేస్తుందని సిఎస్ఐఆర్ డిజి డాక్టర్ శేఖర్ మాండే తెలియజేశారు. వీటిలో దేశవ్యాప్తంగా వైరస్ జాతుల జన్యు శ్రేణిని కలిగి ఉన్న డిజిటల్ మరియు మాలిక్యులర్ పద్ధతులను ఉపయోగించి నిఘా; చౌకైన, వేగవంతమైన మరియు ఖచ్చితమైన రోగ నిర్ధారణ పద్ధతులు; కొత్త ఔషధాలు అభివృద్ధి చేయడం వంటి వ్యూహాలు; హాస్పిటల్ సహాయక పరికరాలలో ఆర్ అండ్ డి; కోవిడ్ -19 ఉపశమనానికి అవసరమైన వస్తువులకు సరఫరా వ్యవస్థల అనుసంధానం, నమూనాల అభివృద్ధి. ఈ అంశాలన్నిటిలో సీఎస్ఐఆర్ ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేస్తోందని ఆయన అన్నారు.
డాక్టర్ హర్షవర్ధన్ ప్రజారోగ్య పర్యవేక్షణ, ప్రతిస్పందన, సాంకేతిక మార్గదర్శకత్వం, ఐసిఎంఆర్ అందిస్తున్న ప్రయోగశాల సహకారాన్ని ప్రశంసించారు. ప్రస్తుత అత్యవసర సమయంలో వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లు, పిపిఇలు మొదలైన వాటి అభివృద్ధికి సైన్స్ & టెక్నాలజీ, బయో టెక్నాలజీ, సిఎస్ఐఆర్ అందిస్తున్న సహకారాన్ని ఆయన ప్రశంసించారు. అవసరమైన పరీక్షా వస్తు సామగ్రిని, కారకాలను అత్యవసరంగా సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రయోగశాలలకు సరఫరా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని ఆయన ఆదేశించారు.
రాష్ట్రాలకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలని, రోగ నిర్ధారణ పరీక్షా వస్తు సామగ్రి, కారకాలు, పరికరాల కొరత తలెత్తకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రయోగశాలలు / పరీక్షా సదుపాయాలు లేని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలు మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి అదనపు సహాయం ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
ప్రభుత్వం లేదా ప్రైవేట్ ల్యాబ్‌లు సేకరించిన పరీక్షా వస్తు సామగ్రి నాణ్యత విషయంలో రాజీ పడకుండా చూసుకోవాలని, వస్తు సామగ్రిని క్రమం తప్పకుండా నాణ్యత పరీక్ష చేయాలని ఆయన ఆదేశించారు. ఇందుకోసం స్పష్టమైన నాణ్యతా నియంత్రణ విధానం మరియు ప్రోటోకాల్‌ను ఐసిఎంఆర్ వెంటనే అభివృద్ధి చేసి అమలు చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా అన్ని ప్రయోగశాలలు ప్రతిరోజూ నాణ్యతపై భరోసా ఇవ్వాల్సి ఉంటుందని ఆయన ఆదేశించారు.
కోవిడ్-19 నియంత్రణ నిర్వహణ ప్రయత్నాలతో పాటు సమాంతరంగా ఏకకాలంలో పరిశోధనలు క్రియాశీలంగా చురుకుగా కొనసాగాలని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ఈ సందర్భంగా మనం భారత దేశానికే కాదు ప్రపంచానికి కూడా పరిష్కారాలను అభివృద్ధి చేయాలని ఆయన శాస్త్రవేత్తలకు సూచించారు.
ఈ సమావేశంలో ఐసిఎంఆర్ డిజి బలరాం భార్గవ, డిబిటి కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్, సిఎస్ఐఆర్ డీజీ డాక్టర్ శేఖర్ మాండే, డిఎస్టి కార్యదర్శి డాక్టర్ అశుతోష్ శర్మ, సిఎస్ఐఆర్ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ పాల్గొన్నారు. సిఎస్ఐఆర్-ఐజిఐబి డైరెక్టర్ డాక్టర్ రామన్ ఆర్. గంగాఖేద్కర్, సీనియర్ ఆఫీసర్లు మరియు ఐసిఎంఆర్ శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు.
****
(Release ID: 1609632)
Visitor Counter : 189
Read this release in:
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam