ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్ర‌ధాన్ మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ ప్యాకేజీః కోవిడ్‌తో పోరాడుతున్న ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు బీమా ర‌క్ష‌ణ‌

Posted On: 29 MAR 2020 5:14PM by PIB Hyderabad

కోవిడ్‌-19 వైరెస్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు విశేషంగా కృషి చేస్తున్న ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌క‌టించిన‌ ప్ర‌ధాన్ మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్‌ ప్యాకేజీ బీమా గొప్ప భ‌రోసాను క‌ల్పించ‌నుంది. ఈ ప్యాకేజీలో భాగంగా కేంద్రం ‘ప్ర‌ధాన్ మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ ప్యాకేజీః కోవిడ్‌-19తో పోరాడుతున్న ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు బీమా సౌక‌ర్యం’ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ వినూత్న బీమా ప‌థ‌కాన్ని కింది ష‌ర‌తుల‌తో అమ‌లు చేయ‌నున్నారు.
- కోవిడ్‌-19 రోగుల సంర‌క్ష‌ణ నిమిత్తం విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా వారితో ప్ర‌త్య‌క్ష సంబంధం క‌లిగి ఉంటూ.. వైరెస్ ప్ర‌మాదానికి గుర‌య్యే అవ‌కాశం ఉన్న‌వారు, క‌మ్యూనిటీ హెల్త్ వ‌ర్క‌ర్ల‌తో స‌హా మొత్తం 22.12 ల‌క్ష‌ల మంది ప్ర‌జారోగ్య సంర‌క్ష‌ణ కార్య‌క‌ర్త‌ల‌కు తొంబై (90) రోజుల కాలావ‌ధితో ఈ రూ.50 ల‌క్ష‌ల బీమా ప‌థ‌కం అమ‌లులో ఉండ‌నుంది. కోవిడ్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసే క్ర‌మంలో ప్ర‌మాదవ‌శాత్తు ప్రాణాలు కోల్పోయిన వారికి కూడా ఈ బీమా ర‌క్ష‌ణను క‌ల్పించ‌నున్నారు.
- దేశంలో నెల‌కొన్న అసాధార‌ణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వ ఆసుపత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లోని హాస్పిట‌ల్స్‌, స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌లిగిన ద‌వాఖానాలు, ఎయిమ్స్ మ‌రియు ఐఎన్ఐతో పాటు వివిధ మంత్రిత్వ శాఖ‌ల ప‌రిధిలో ప‌ని చేస్తున్న ఆసుపత్రుల అభ్య‌ర్థ‌న మేర‌కు కోవిడ్‌-19 నియంత్ర‌ణ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్న ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, ప్ర‌యివేటు ఆసుప‌త్రి సిబ్బంది, రిటైర్డ్, వాలంటీర్‌లు, స్థానిక ప‌ట్ట‌ణ సంస్థ‌ల ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు. కాంట్రాక్ట్‌, రోజువారీ వేత‌న‌స్తులు, తాత్కాలిక‌, అవుట్‌సోర్స్ సిబ్బందికి ఈ బీమా క‌వ‌రేజ్ ల‌భించ‌నుంది. దేశంలోని మ‌రే ఇత‌ర బీమా ప‌థ‌కం కంటే కూడా.. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ‘ప్ర‌ధాన్ మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ ప్యాకేజీః కోవిడ్‌-19తో పోరాడుతున్న ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు బీమా’కింద ల‌భించే ల‌బ్ధి గ‌రిష్టంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. 

 



(Release ID: 1609085) Visitor Counter : 263