ప్రధాన మంత్రి కార్యాలయం

రేడియో జాకీలతో ప్రధానమంత్రి సంభాషణ

సానుకూలతతో కలిసి ఉండాలనే వైఖరే కోవిడ్-19 వల్ల ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోడానికి కీలకం : ప్రధానమంత్రి

మిలియన్ల భారతీయ కుటుంబాలలో సభ్యుల వంటి వారు రేడియో జాకీలు - వారు సానుకూల సందేశాలను విస్తరింపజేయాలి : ప్రధానమంత్రి

స్థానిక హీరోల సేవలను జాతీయ స్థాయిలో నిరంతరం ప్రచారం చేసి, వారిలో నైతిక విలువలను పెంపొందించవలసిన అవసరం ఉంది : ప్రధానమంత్రి

2014 నుంచీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రధానమంత్రిని తమ బృందంలో ఒక సభ్యునిగా భావిస్తున్నామని రేడియో జాకీలు పేర్కొన్నారు;

కోవిడ్-19 కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో దేశానికి అండగా ఉంటామని రేడియో జాకీలు ప్రతిజ్ఞ చేశారు.

Posted On: 27 MAR 2020 6:43PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు రేడియో జాకీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. 

కోవిడ్ -19 గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో రేడియో జాకీలు నిర్వహిస్తున్న పాత్రను ప్రధానమంత్రి అభినందించారు.   లాక్ డౌన్ సమయంలో కూడా రేడియో జాకీలు తమ ఇంటి నుండే కార్యక్రమాలను రికార్డు చేసి ప్రసారం చేస్తూ తమ బాధ్యతలను నిర్వర్తించడం నిజంగా ప్రశంసనీయం.   

రేడియో జాకీలు ప్రసారం చేసే కార్యక్రమాల ద్వారా వారు మిలియన్ల భారతీయ కుటుంబాలలో సభ్యుల్లాగా ఉన్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.   ప్రజలు వారి మాటలు కేవలం వినడమే కాదు, వారిని అనుసరిస్తారు కూడా. మూఢ నమ్మకాల వ్యాప్తిని నిరోధించడంతో పాటు, వాటిపై గల భ్రమలను తొలగించి ప్రజలను చైతన్యవంతులను చేయవలసిన పెద్ద బాధ్యత కూడా రేడియో జాకీలపై ఉంది. 

నిపుణుల అభిప్రాయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గురించి సమాచారాన్ని తెలియజేయడంతో పాటు, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, సవాళ్ళ గురించి స్పందన తెలియజేయాలని ప్రధానమంత్రి కోరారు. తద్వారా, ప్రభుత్వం వాటిని ముందుగానే పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. 

సానుకూల కథనాలను,  ప్రత్యేక అధ్యయనాలను, ముఖ్యంగా కరోనా వైరస్ సోకిన అనంతరం  పూర్తిగా కోలుకున్న రోగుల గురించీ ప్రసారం చేయాలని ప్రధానమంత్రి ఉద్భోదించారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో సంభవించిన ఇటువంటి కథనాలను కార్యక్రమాల మధ్యలో పొందుపరిస్తే, తద్వారా, దేశం మొత్తాన్ని ఏకతాటి పైకి తెచ్చినట్లౌతుందని ఆయన వివరించారు.   పోలీసు అధికారులు, వైద్యులు, నర్సులు, వార్డు బాయ్ లు మొదలైన స్థానిక హీరోలు చేసిన సేవలను నిరంతరం జాతీయ స్థాయిలో తెలియజేయాలని కూడా ఆయన కోరారు. 

సానుభూతికి గల ప్రాముఖ్యత గురించి ప్రధానమంత్రి నొక్కి చెబుతూ -  వైరస్ బారిన పడతామనే సామాజిక భయాల కారణంగా వైద్యులకు, ఆరోగ్య పరిరక్షణ కార్యకర్తలకు, విమానయాన సిబ్బందికీ తప్పుడు సమాచారం అందజేసినవారి కథనాలు చెప్పడం చాలా ముఖ్యం. తద్వారా అటువంటి సవాళ్ళను అధిగమించవచ్చు నని ఆయన తెలిపారు.  ప్రజలకు సహాయం అందించేందుకు నిరంతరాయంగా పనిచేస్తున్న పోలీసు సిబ్బంది అంకిత భావం గురించి ప్రజలకు తెలియజేయవలసిన ఆవశ్యకత గురించి కూడా ఆయన నొక్కి చెప్పారు.   ప్రజలు పోలీసులతో సహకరించాలని ఆయన చెప్పారు. అదే విధంగా పోలీసులు కూడా కఠిన వైఖరిని విడనాడాలని విజ్ఞప్తి చేశారు. అయితే, క్రమశిక్షణను అమలుచేయడం కూడా అవసరమని ఆయన పేర్కొన్నారు.  ఈ మహమ్మారితో జరిపే పోరులో 130 కోట్ల భారతీయులు జాతీయ కార్యకర్తలుగా వ్యవహరించాలి. 

ఈ కష్ట కాలంలో పేదవారినీ,  ఇతరత్రా జీవనం సాగించలేకపోతున్నవారినీ ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక చర్యలు ప్రకటించిందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ప్రకటనలకు సంబందించిన సమాచారం ఉద్దేశించిన లబ్దిదారులకు వేగంగా, సకాలంలో అందజేయడం చాలా ముఖ్యం. సామజిక దూరం మరియు స్వీయ నిర్బంధం ప్రాముఖ్యత గురించి తెలియజేయడంతో పాటు, ఈ ప్రకటనల గురించి వివరాలను వారి శ్రోతలకు ప్రసారం చేయడంలో సామూహిక ప్రచార కర్తలుగా రేడియో జాకీ లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. 

ప్రతిస్పందనగా రేడియో జాకీలు మాట్లాడుతూ - 2014 నుండి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రధానమంత్రిని తమ బృందంలో ఒక సభ్యునిగా భావిస్తున్నట్లు  చెప్పారు.   ప్రధానమంత్రి పిలుపు నిచ్చిన "జనతా కర్ఫ్యూ" కి లభించిన అపూర్వ స్పందన గురించీ, ముందు వరసలో నిలిచిన యోధులకు కృతజ్ఞతలు చెప్పాలన్న వినోత్న ఆలోచన గురించీ, రేడియో జాకీ లు ప్రస్తావిస్తూ - ప్రధానమంత్రి నాయకత్వాన్ని ప్రశంసించారు. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో తాము "వాయిస్ అఫ్ ది నేషన్" పాత్రను  పోషిస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.  

పుకార్ల ప్రవాహాన్ని అరికట్టడానికి ప్రజా ప్రసార కర్తగా ఆకాశవాణి ప్రముఖంగా చాలా ముఖ్యమైన పాత్ర పోషించవలసి ఉందని ప్రధానమంత్రి  గమనించారు.  పుకార్లు వ్యాప్తిని అరికట్టే దిశగా కూడా రేడియో జాకీలు పని చేయాలని ఆయన కోరారు.  

సమాజంలో నిర్మాణాత్మక, సానుకూల వైఖరిని పెంపొందించే దిశగా రేడియో జాకీలు పనిచేయాలని ప్రధానమంత్రి కోరారు.  "సానుకూలతతో కలిసి ఉండాలనే వైఖరే, కోవిడ్-19 వల్ల ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోడానికి కీలకం." అని ఆయన చెప్పారు.  

ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి,  కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి కూడా పాల్గొన్నారు. 

*****


(Release ID: 1608699) Visitor Counter : 183