ప్రధాన మంత్రి కార్యాలయం
దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ చేసిన ప్రసంగ పాఠం తెలుగు అనువాదం
Posted On:
24 MAR 2020 8:57PM by PIB Hyderabad
నమస్కార్ !
ప్రియమైన నా దేశ పౌరులారా,
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి గురించి చర్చించేందుకు ఈరోజు మరోసారి నేను మీ ముందుకు వచ్చాను.
మార్చి 22న మనం జనతా కర్ఫ్యూ పాటించాం. ఒక దేశంగా, ప్రతి భారతీయుడు ఇందులో పూర్తి బాధ్యతతో , ఎంతో సున్నితత్వంతో వ్యవహరించి దానిని విజయవంతం చేసేందుకు పాటుపడ్డాడు.
పిల్లలు- పెద్దలు, చిన్న-పెద్ద, పేద- మధ్యతరగతి- ధనిక, ఇలా ప్రతి ఒక్కరూ ఈ సంక్షోభ సమయంలో కలసికట్టుగా ముందుకు వచ్చారు.
ప్రతి ఒక్క భారతీయుడు జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు.
దేశ సంక్షోభ సమయంలో, మానవాళికి సంక్షోభం ముంచుకు వచ్చిన సమయంలో, ప్రతి భారతీయుడు ఎలా కలిసి కట్టుగా కదలివస్తారో, దానిని ఎదుర్కోవటానికి ఐక్య ప్రయత్నాలను ఎలా ముందుకు తీసుకురాగలరో ఒక రోజు జనతా కర్ఫ్యూ ద్వారా భారతదేశం రుజువు చేసింది..
జనతా కర్ఫ్యూ విజయవంతం చేసినందుకు మీ అందరికీ అభినందనలు.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విషయంలో నెలకొన్న పరిస్థితి గురించి వస్తున్న వార్తలను మీరు చూస్తూ ఉండి ఉంటారు, వింటూ ఉండి ఉంటారు.
ప్రపంచంలో బాగా అభివృద్ది చెందిన దేశాలు కూడా ఈ మహమ్మారి విషయంలో పూర్తి నిస్సహాయతలోకి జారిపోయిన విషయాన్ని మీరు కూడా గమనించే ఉంటారు.
ఈ మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో ఈ దేశాలు తగిన ప్రయత్నాలు చేయడం లేదని కానీ, లేదా వారి వద్ద తగిన వనరులు లేవని కానీ కాదు.
కరోనా వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తున్నదంటే, ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఈ దేశాలకు క్లిష్టతరంగా మారింది.
గడచిన రెండు నెలల్లో ఈ దేశాలలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించినపుడు, నిపుణుల అభిప్రాయాలను గమనించినపుడు తేలుతున్నదేమంటే, కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి గల ఒకే ఒక మార్గం- సామాజిక దూరం పాటించడం మాత్రమే.
అంటే , ఇతరులకు దూరంగా ఉండడం. ఎవరికి వారు ఇళ్లకే పరిమితం కావడం.
కరోనా వైరస్ నుంచి తప్పించుకోవడానికి ఇంతకంటే మరో పద్ధతి లేదు.
మనం కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలంటే, దాని వ్యాప్తి చక్రాన్ని ఛేదించాలి.
జబ్బు పడిన వారి విషయంలో మాత్రమే సామాజిక దూరం అవసరమని కొందరు భ్రమలలో ఉన్నారు.
అటువంటి అభిప్రాయం కలిగి ఉండడం సరికాదు.
ప్రతి ఒక్క పౌరుడూ సామాజిక దూరం పాటించాలి. ఇది ప్రతి పౌరుడికి, ప్రతి కుటుంబానికి, కుటుంబంలోని ప్రతి సభ్యుడికీ అవసరం.
కొద్ది మంది నిర్లక్ష్యం, కొద్ది మంది అనాలోచిత భావనలు మిమ్మల్ని, మీ పిల్లలను, మీ తల్లిదండ్రులను , మీ కుటుంబాన్ని, మీ మిత్రులను, మొత్తం దేశాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతాయి.
ఈ రకమైన నిర్లక్ష్యం కొనసాగితే ఇండియా ఎంత మూల్యం చెల్లించాల్సి ఉంటుందో అంచనా వేయడం అసాధ్యం.
మిత్రులారా,
గత రెండు రోజులలో, దేశంలోని పలు ప్రాంతాలను లాక్‌డౌన్ కిందికి తీసుకురావడం జరిగింది.
రాష్ట్రప్రభుత్వాలు తీసుకున్న ఈ చర్యలను ఎంతో చిత్తశుద్ధితో స్వీకరించాలి.
వైద్య రంగ నిపుణుల అభిప్రాయాలు, ఇతర దేశాల అనుభవాల నేపథ్యంలో ఈరోజు దేశం ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నది.
ఈరోజు అర్థరాత్రి తర్వాత దేశం యావత్తూ, శ్రద్ధగా వినండి, దేశం యావత్తూ పూర్తి లాక్‌డౌన్ లోకి వెళుతుంది.
దేశాన్ని రక్షించడం కోసం, దేశంలోని ప్రతి ఒక్క పౌరుడిని రక్షించడం కోసం ఈ అర్ధరాత్రి నుంచి ప్రజలు తమ ఇళ్ళనుంచి బయటకు రావడంపై పూర్తి నిషేధం విధించడం జరుగుతోంది.
దేశంలోని అన్నిరాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రతి జిల్లా, ప్రతి మునిసిపాలిటీ, ప్రతి గ్రామం, ప్రతి ప్రాంతాన్ని లాక్డౌన్ కిందికి తీసుకురావడం జరుగుతోంది.
ఒక రకంగా ఇది కర్ఫ్యూ లాంటిది మాత్రమే.
జనతా కర్ఫ్యూ కంటే ఇది కొన్ని స్థాయిలు ఎక్కువ , అలాగే మరింత కఠినం కూడా.
కరోనా మహమ్మారిపై నిర్ణయాత్మక పోరుకు ఈ రకమైన చర్య అవసరం.
ఈ లాక్డౌన్ కారణంగా దేశం పై తప్పకుండా ఆర్థిక భారం పడుతుంది.
అయినా, ప్రతి ఒక్క భారతీయుడి జీవితాన్నికాపాడడం ,నాకు భారత ప్రభుత్వానికి, ప్రతి రాష్ట్రప్రభుత్వానికి, ప్రతి స్థానిక విభాగానికి అత్యంత ప్రాధాన్యతా అంశం.
అందువల్ల, మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో అక్కడే కొనసాగమని విజ్ఞప్తి చేస్తున్నాను.
ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోక తీసుకున్నప్పడు, ఈ లాక్డౌన్ మరో 21 రోజులు ఉంటుంది.
రాగల 21 రోజులూ మనకు అత్యంత కీలకమైనవి.
ఆరోగ్యనిపుణుల సూచనల ప్రకారం, కరోనావైరస్ ఇన్ఫెక్షన్ చక్రాన్ని ఛేధించడానికి 21 రోజుల కాలం ఎంతో కీలకమైనది.
ఈ 21 రోజులలో పరిస్థితిని అదుపుచేయనట్టయితే, దేశం, మీ కుటుంబం మరొ 21 ఏళ్లు వెనక్కు వెళ్లాల్సి ఉంటుంది.
పరిస్థితిని 21 రోజుల్లో అదుపు చేయకపోయినట్టయితే , అనేక కుటుంబాలు ఇక ఎప్పటికీ కోలుకోలేని రీతిలో దెబ్బతింటాయి.
అందువల్ల, రాగల 21 రోజులు ఇంటి నుంచి బయటకు వెళ్లడమంటే ఏమిటో ఏమాత్రం మరిచిపోకండి.
మీ ఇంట్లో ఉండండి. మీ ఇంట్లో ఉండండి. ఒకే ఒక పని చేయండి- మీ ఇంట్లోనే ఉండండి.
మిత్రులారా,
దేశవ్యాప్త లాక్‌డౌన్ కు సంబంధించి ఈ రోజు తీసుకున్న నిర్ణయం, మీ ఇంటి గుమ్మం ముందు ఒక లక్ష్మణ రేఖను గీసింది.
మీరు మీ ఇంటినుంచి ఒక్క అడుగు బయట పెడితే, అది కరోనా వంటి మహమ్మారిని అది మీ ఇంట్లోకి తెస్తుంది.
మీరు ఇంకో విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి, కరోనా వైరస్ సోకిన వ్యక్తి మొదట్లో, పైకి పూర్తి గా ఆరోగ్య వంతుడిగా ఉన్నట్టు కనిపించవచ్చు. ఎందుకంటే, కరోనా వైరస్ సోకినట్టు మొదట్లో ఆ లక్షణాలు పైకి కనిపించవు
అందువల్ల, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉండండి.
ఆ రకంగా
ఇంట్లో ఉంటున్న ప్రజలు, సోషల్ మీడియా ద్వారా వినూత్న రీతిలో సమాచారాన్ని పంపుతున్నారు.
అలాంటి ఒక బ్యానర్, నాకు కూడా నచ్చింది. మీరు కూడా దానిని చూడండి.
కరోనా అంటే కోయీ రోడ్ పే న నికలే ( ఎవరూ రోడ్లపైకి రాకూడదు) అని రాశారు
మిత్రులారా,
నిపుణులు కూడా చెబుతున్నదేమంటే, కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తికి ఆ లక్షణాలు బయటపడడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని.
ఈ సమయంలో, అలాంటి వ్యక్తులు తెలియకుండానే తనను కలిసిన ఇతరులకు ఆ వైరస్‌ను అంటించే ప్రమాదం ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ఒక నివేదిక ప్రకారం, కరోనా వైరస్ సోకిన వ్యక్తి దానిని పట్టుమని 7 నుంచి 10 రోజులలోపల వందలాది మందికి అంటించగలరు.
అంటే , అది కార్చిచ్చులా వ్యాపిస్తుందన్నమాట
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన మరో అంచనా ఇంకా ముఖ్యమైనది.
మిత్రులారా!
ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య లక్షకు చేరడానికి 67 రోజులు పట్టింది. ఆ తర్వాత కేవలం 11 రోజుల్లో వైరస్ పీడితుల సంఖ్య మరో లక్షకు పెరిగిపోయింది. తొలి లక్షమంది నమోదుకు 67రోజులు పట్టగా, కేవలం 11రోజుల్లో 2లక్షలకు చేరడాన్ని ఓసారి ఊహించుకోండి. ఇదే దిగ్భ్రాంతి కలిగించే అంశమైతే- 2 లక్షలు కాస్తా కేవలం నాలుగంటే 4 రోజుల్లో 3 లక్షలకు దూసుకెళ్లడం మరింత భయాందోళనలు కలిగించేదే కదా! దీన్నిబట్టి కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి అది విజృంభించడం ప్రారంభిస్తే దాన్ని నియంత్రించడం చాలాచాలా కష్టం.
మిత్రులారా!
అందుకే చైనా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, ఇరాన్‌వంటి దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక పరిస్థితులు నియంత్రించ సాధ్యంకాని స్థాయికి వెళ్లిపోయాయి. అలాగే ఇటలీ లేదా అమెరికా ఏదైనా కావచ్చు... ఆ దేశాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పరిగణించబడతాయి. అయినప్పటికీ, ఈ దేశాలు కరోనా ప్రభావాన్ని నియంత్రించలేకపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆశాకిరణం ఎటువైపు కనిపిస్తుంది... పరిష్కారం ఏమిటి... అనుసరించదగిన మార్గాలేమిటి? అన్నదే ఇప్పుడు మనముందున్న ప్రశ్న.
మిత్రులారా!
ఈ నేపథ్యంలో నేడు ఈ మహమ్మారితో పోరాటానికి కరోనా వైరస్‌ను కొంతవరకైనా నియంత్రించగలిగిన దేశాల అనుభవాలే ఆశాకిరణాలు. ఆయా దేశాల పౌరులు కొన్ని వారాలపాటు గడపదాటి అడుగు బయటపెట్టలేదు. ఆ మేరకు ప్రభుత్వం నిర్దేశించిన విధినిషేధాలకు పూర్తిస్థాయిలో కట్టుబడ్డారు కాబట్టే ఆ దేశాలు ఈ ప్రపంచ మహమ్మారి కోరలనుంచి మెల్లగా బయటపడుతున్నాయి. అందువల్ల నేడు మనముందున్న మార్గం కూడా ఇదొకటేనని అంగీకరించక తప్పదు. తదనుగుణంగా మనమూ ఇళ్లనుంచి కదలకుండా ఉండాలి... ఏం జరిగినా సరే- గడపదాటి అడుగు బయటపెట్టకూడదు. మన ఇంటిముందు గీసుకున్న ఈ ‘లక్ష్మణరేఖ’ను దాటకుండా సంయమనం పాటించగలిగితే మనను మనం రక్షించుకోగలం. ఇలా ఈ ప్రపంచ మహమ్మారి వ్యాప్తి శృంఖలాన్ని ఛేదించడంద్వారా మాత్రమే దాన్ని మనం నిరోధించగలం.
మిత్రులారా!
ఇప్పుడు మనమున్న దశలో ఇకపై తీసుకోబోయే చర్యలే ఈ విపత్తు ప్రభావాన్ని ఎంత కనిష్ఠస్థాయికి పరిమితం చేయగలమన్నది నిర్ణయిస్తాయి. కాబట్టి మన సంకల్పాన్ని స్థిరంగా దృఢం చేసుకోవాల్సిన సమయమిది. ప్రతి అడుగూ ఆచితూచి వేయాల్సిన తరుణమిది... ఆ మేరకు “ప్రాణముంటేనే ప్రపంచంలో మనముంటాం” అన్న వాస్తవాన్ని సదా మననం చేసుకోవాలి. మిత్రులారా... క్రమశిక్షణ, సంయమనం చూపాల్సిన సమయం ఇదే. దేశవ్యాప్త దిగ్బంధం కొనసాగినంత కాలం మన సంకల్పాన్ని... మన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని మరువకండి. మీకిదే నా వినతి... మీరు ఇంట్లో సురక్షితంగా ఉన్నపుడు- నిరంతరం వైరస్ ముప్పును ఎదుర్కొంటూ మన శ్రేయస్సు కోసం మొక్కవోని సాహసంతో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న వారికోసం మనమంతా ప్రార్థిద్దాం.
దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో ప్రతి ప్రాణాన్ని కాపాడేందుకు రేయింబవళ్లు నిర్విరామంగా శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, రోగనిథాన నిపుణులు తదితరుల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆస్పత్రుల నిర్వహక సిబ్బంది, ఆంబులెన్స్ డ్రైవర్లు, వార్డు బాయ్‌లు, పారిశుధ్య కార్మికులు అత్యంత కఠిన పరిస్థితుల నడుమ ఇతరుల సేవలో మునిగి ఉండటాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మన సమాజాన్ని, మన ప్రాంతాన్ని, వీధులను, బహిరంగ ప్రదేశాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుతూ వైరస్ నిర్మూలన కోసం తమవంతు కృషి చేస్తున్న వారందరి గురించీ యోచించండి. అలాగే వైరస్ బారినపడే ప్రమాదాన్ని లెక్కచెయ్యకుండా 24 గంటలూ వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఆస్పత్రులతోపాటు ఆయా ప్రాంతాల నుంచి సమాచారం నివేదిస్తున్న ప్రచురణ, ప్రసార మాధ్యమాల ప్రతినిధులను కూడా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. తమ కుటుంబాల శ్రేయస్సును వారి చేతుల్లోనే పెట్టి, మీ చుట్టూ నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది గురించి ఆలోచించండి. మనందర్నీ రక్షించడానికి వారు రాత్రనకా, పగలనకా విధుల్లోనే ఉంటున్నారు. కర్తవ్య నిర్వహణలో భాగంగా అనేక సందర్భాల్లో వారు ప్రజల ఆగ్రహావేశాలకూ గురవుతున్నారు.
మిత్రులారా!
ప్రపంచ మహమ్మారి కరోనా సృష్టించిన ఈ దుర్భర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా స్పందించాయి. దేశ పౌరులు తమ దైనందిన కార్యకలాపాల్లో ఇబ్బందులు పడకూడదన్న తపనతో నిరంతరం శ్రమిస్తున్నాయి. అన్ని నిత్యావసరాల సరఫరా సజావుగా కొనసాగే విధంగా మేం సకల ఏర్పాట్లూ చేశాం. ముఖ్యంగా ఈ సంక్షోభం పేదలను చాలా కష్టాల్లోకి నెట్టిందనే చెప్పాలి. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పౌర సంఘాలు, వ్యవస్థలు వారి సమస్యలను కనీస స్థాయికి తగ్గించడానికి కృషిచేస్తున్నాయి. పేదలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అనేకమంది ముందుకొచ్చి చేయి కలుపుతున్నారు.
మిత్రులారా!
కనీస అవసరాలకు తోడు ప్రాణరక్షక అవసరాలను తీర్చడానికీ అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ కొత్తరకం ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను మెరుగుపరచేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు దేశంలోని అగ్రశ్రేణి వైద్య, పరిశోధన సంస్థల నిపుణుల సలహాలు-సూచనల మేరకు ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా వైరస్ పీడితులకు చికిత్స కోసమేగాక దేశంలో మౌలిక వైద్య సదుపాయాల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం 15వేల కోట్ల రూపాయలు కేటాయించింది. దీనివల్ల కరోనా నిర్ధారణ పరీక్షల వసతులు, వ్యక్తిగత రక్షణ సామగ్రి, ఏకాంత చికిత్స పడకలు, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు తదితర నిత్యావసర పరికరాలు త్వరగా అందుబాటులోకి వస్తాయి. అదే సమయంలో వైద్య, పారామెడికల్ మానవ వనరుల పెంపు దిశగా పలువురికి వేగంగా శిక్షణ ఇచ్చే ప్రక్రియను కూడా చేపట్టవచ్చు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణకు అగ్ర ప్రాథమ్యం ఇవ్వాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ నేను విజ్ఞప్తి చేశాను. ఈ కీలక సమయంలో ప్రైవేటు రంగం కూడా పౌరులతో భుజం కలిపి పూర్తిస్థాయిలో చేదోడువాదోడుగా నిలవడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఈ సవాలును ఎదుర్కొనడంలో ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి ప్రైవేటు ప్రయోగశాలలు, ఆస్పత్రులు కూడా ముందుకొస్తున్నాయి. అయితే...
మిత్రులారా!
ఇటువంటి సంక్షోభ సమయాల్లో మనం కడు జాగ్రత్తగా ఉండాలి సుమా! తెలిసోతెలియకో కొందరు అనేక వదంతులను ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అటువంటి వదంతులు, మూఢ నమ్మకాల విషయంలో మీరంతా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యరంగ నిపుణులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు, సలహాలను తూచా తప్పకుండా పాటించడం చాలా ముఖ్యం. కాబట్టి మీ శరీరంలో వైరస్ సోకిన లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి తప్ప సొంత చికిత్స చేసుకోరాదు. మీమీద మీరు చేసుకునే మందుల ప్రయోగం వికటించి ప్రాణాపాయానికి దారితీయవచ్చు. మిత్రులారా... ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం, స్థానిక అధికారవర్గాలు ఎప్పటికప్పుడు జారీచేసే ఆదేశాలకు భారత పౌరులలో ప్రతి ఒక్కరూ కట్టుబడతారన్న విశ్వాసం నాకుంది. ఇప్పుడు 21 రోజుల దిగ్బంధం సుదీర్ఘమైనదే... కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో మీతోపాటు మీ కుటుంబ క్షేమం, భద్రతలకు అంతే ప్రాముఖ్యం ఉందన్న వాస్తవం గుర్తించాలని మనవి. ఈ సంక్లిష్ట పరిస్థితిని భారతీయులందరూ విజయవంతంగా అధిగమించగలరన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది.
మీతోపాటు మీ ప్రియమైన వారందరిని జాగ్రత్తగా చూసుకోండి.
జైహింద్!
******
(Release ID: 1608008)
Visitor Counter : 622
Read this release in:
Assamese
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam