57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

‘పరో: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రైడ్ స్లేవరీ.. వధువుల అక్రమ రవాణా ఉచ్చులో చిక్కుకున్న మహిళల దీనస్థితిపై చిత్రం

దోపిడీ, లింగ అసమానతలు, మహిళల హక్కులపై బలమైన కథతో 57వ ఇఫిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటి, నిర్మాత, స్క్రీన్‌ప్లే రచయిత తృప్తి భోయిర్‌

నాడు పోస్టు చేయడమైనది: 27 NOV 2026 4:15PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2342976Views: 10

 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (ఇఫి) ఇండియన్‌ పనోరమా విభాగంలో ప్రదర్శితమైన ‘పరో: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రైడ్ స్లేవరీ’ చిత్రం.. ముఖ్యంగా హర్యానాలోని మేవాట్‌ ప్రాంతంలో మహిళలను వధువులుగా కొనుగోలు చేసి, విక్రయించే ఆందోళనకరమైన, అంతగా వెలుగులోకి రాని ఆచారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ ప్రాంతంలో వివాహం కోసం కొనుగోలు చేసినా, లేదా విక్రయించినా మహిళలను ‘పరో’ అని పిలుస్తారు.

 

విలేకరుల సమావేశంలో నటి, నిర్మాత తృప్తి భోయిర్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని రూపొందించేందుకు నాలుగున్నరేళ్లపాటు పరిశోధన చేసినట్లు తెలిపారు. ఆస్కార్‌ జాబితాలో చోటు దక్కించుకున్న తన రెండో చిత్రం ఇదని పేర్కొన్నారు. ఈ సినిమా నిర్మాణంలో ఒక ప్రత్యేకమైన సృజనాత్మక ప్రయాణాన్ని చేపట్టిన ఆమె.. నిర్మాత, స్క్రీన్‌ప్లే రచయిత, ప్రధాన నటి.. ఇలా మూడు బాధ్యతలను స్వయంగా నిర్వహించారు.

చిత్ర రూపకల్పనకు దారితీసిన సవాలుతో కూడిన పరిశోధన

భారత్‌లో వధువుల బానిసత్వం ఆచారాన్ని వెలుగులోకి తెచ్చిన డాక్యుమెంటరీలు, మీడియా కథనాల ద్వారా ఈ సినిమా ఆలోచన వచ్చిందని తృప్తి భోయిర్‌ తెలిపారు. మహిళల సమస్యలు, హక్కుల ఇతివృత్తంగా గతంలో సినిమాలు రూపొందించిన ఆమె.. ఈ ఆచారం వెనుక ఉన్న వాస్తవాలు చూసి తీవ్రంగా కలత చెందారు.

 

ఒక స్వచ్ఛంద సంస్థ సహాయంతో తృప్తి భోయిర్‌, ఆమె తల్లి జర్నలిస్టుల వేషంలో గ్రామాలను సందర్శించారు. వధువుల బానిసత్వానికి గురైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఢిల్లీకి చెందిన సుమారు 62, 63 మంది మహిళలను వారు కలుసుకున్నారు.

 

లింగ అసమానతలు, పేదరికం ఈ వధువుల అక్రమ వ్యాపారానికి మూల కారణాలని భోయిర్‌ పేర్కొన్నారు. ఈ సమస్య హర్యానాకే పరిమితం కాలేదని, దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన మహిళలు, బాలికలు ఈ ఆచారానికి బాధితులవుతున్నారని తెలిపారు. ఇది దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశమని అన్నారు.

 

పరిశోధనలో వెలుగుచూసిన అత్యంత కలచివేసే ఘటనల్లో.. సుమారు 11 నుంచి13 ఏళ్ల బాలికను అతి తక్కువ మొత్తానికి విక్రయించినట్లు తెలిసిన ఉదంతం ఒకటి. ఈ బాలిక కథే సినిమాలో ప్రధాన పాత్రకు స్ఫూర్తిగా నిలిచింది. ఆ పాత్రను తృప్తి భోయిర్‌ స్వయంగా పోషించారు. ఈ పాత్ర ద్వారా ఇలాంటి ఎందరో మహిళలు ఎదుర్కొంటున్న బాధ, నిస్సహాయత, క్రూరమైన దోపిడీని తెరపైకి తీసుకురావాలని ఆమె ప్రయత్నించారు. వారి కథలు తరచూ వెలుగులోకి రావడం లేదని పేర్కొన్నారు.

సినిమాకు మించిన పోరాటం

ఈ సినిమా ప్రాధాన్యత కథా చిత్రీకరణకే పరిమితం కాలేదు. వధువుల బానిసత్వానికి గురైన సుమారు 2,000 మంది మహిళల వివరాలను ఎన్జీవో షెల్టర్‌ ఫౌండేషన్‌ సేకరించిందని తృప్తి భోయిర్‌ తెలిపారు. ఈ వివరాలను సుమారు 15 నెలల క్రితం జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌కు సమర్పించినట్లు చెప్పారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఒక వాస్తవ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. “ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన ప్రభుత్వానికి నా అభినందనలు. ఈ సినిమా రూపొందించడానికి ఇదొక కారణం” అని ఆమె అన్నారు.

మహిళల అక్రమ రవాణా: ప్రపంచవ్యాప్త సమస్య

బాలికల అదృశ్యం, మహిళలపై లైంగిక హింస ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశాలని భోయిర్‌ పేర్కొన్నారు. గత 15 నుంచి 20 ఏళ్లలో మానవ అక్రమ రవాణా, వ్యభిచారంపై అవగాహన గణనీయంగా పెరిగినప్పటికీ, వధువులను కొనుగోలు చేయడం, విక్రయించడం, వారిని బానిసలుగా చూసే ఆచారాలకు తగినంత ప్రాధాన్యం లభించడం లేదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చలనచిత్రోత్సవాలు, వివిధ సంస్థల్లో సినిమా ప్రదర్శనల సందర్భంగా ప్రేక్షకులతో జరిపిన సంభాషణలు.. ఈ సమస్యపై అంతర్జాతీయ స్థాయిలో మరింత అవగాహన, చర్చ అవసరమనే తన అభిప్రాయాన్ని బలపరిచాయని తెలిపారు.

పరో: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రైడ్ స్లేవరీ చిత్రం ద్వారా సమాజంలో పాతుకుపోయిన ఒక తీవ్ర సమస్యను ప్రధాన చర్చలోకి తీసుకురావాలని తృప్తి భోయిర్‌ ఆశిస్తున్నారు. లింగ అసమానతలు, వధువుల బానిసత్వం, మహిళల గౌరవం, హక్కులపై చర్చకు ఈ చిత్రం నాంది పలకాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు.

 

ఈ విలేకరుల సమావేశానికి శుభాంకర్‌ వశిష్ఠ్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.

ఇఫిలోయిడ్‌ను ఇక్కడ చదవండి:: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2342976
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026