కొన్ని స్వరాలు ఇంటినిండా సంగీత మధురిమలను నింపడంతోనే ఆగిపోవు. మన బాల్యంలో విడదీయలేని భాగమై.. జీవితకాలం మన విజయాల్లో తోడు నడుస్తాయి. చిరకాలం మనతోనే ఉండిపోతాయి. ప్రముఖ గాయని కె.ఎస్. చిత్రకు.. ఆశా భోంస్లే, ఎస్. జానకి, లతా మంగేష్కర్ స్వరాలు అలాంటివే. 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)లో “లతా మంగేష్కర్ టాక్: ఆశా భోంస్లే, ఎస్. జానకి స్మృతుల్లో చిరకాలం ప్రతిధ్వనించే స్వరం” శీర్షికన ఏర్పాటు చేసిన మాస్టర్‌క్లాస్‌లో.. సంగీతం, ఈ దిగ్గజ గాయనులతో ఉన్న మధుర జ్ఞాపకాలతో బలమైన, భావోద్వేగభరిత ప్రయాణంలోకి గాయని చిత్ర వీక్షకులను తనతోపాటు తీసుకెళ్లారు. నటి, ఫిల్మ్ మేకర్ సుహాసినీ మణిరత్నం సమన్వయకర్తగా వ్యవహరించారు.
_20261125184045_3bcdae.jpeg)
ఎంతో ఆప్యాయత, సన్నిహిత వాతావరణం నడుమ ఈ సంభాషణ మొదలైంది. తాను కాస్త ఆందోళనగా ఉన్నప్పటికీ.. సుహాసిని తనను త్వరగానే తేలికపరుస్తారన్న నమ్మకం ఉందని చిత్ర పేర్కొన్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఉన్న పాత జ్ఞాపకాలు సంభాషణలో దొర్లాయి. చిత్ర స్వరాన్ని అందించిన చిత్రాల్లోని పాటలు తన సినీ ప్రయాణంలో ఎలా విడదీయరాని భాగమైపోయాయో సుహాసిని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆ వేదిక ఒక అధికారిక చర్చలా కాకుండా.. మధుర స్మృతుల సమ్మేళనంగా మారిపోయింది. ఆసక్తికరమైన కబుర్లు, వాటికి తోడయ్యే మధురమైన పాటలతో కార్యక్రమం ఆకట్టుకునేలా సాగింది.
తన తొలి రోజులను గుర్తు చేసుకుంటూ.. సంగీత వాతావరణం నిండిన కుటుంబంలో పెరగడం, పోటీల్లో పాల్గొనడం, శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం గురించి చిత్ర వివరించారు. పాడడమన్నది తనకు బాగా తెలిసిన ఏకైక కళ అని, అయితే అది తనను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకొస్తుందని ఎప్పుడూ ఊహించలేదని ఆమె పేర్కొన్నారు. సినీ సంగీత రంగంలోకి తన ప్రవేశం దాదాపు యాదృచ్ఛికంగానే జరిగిందని చెప్పారు. వినోద వేదికలపై సినీ గీతాలను పాడేదాన్నని, అందులోనూ ఎక్కువగా పి. సుశీల ఆలపించి ప్రాచుర్యం పొందిన పాటలతోనే తన గానాన్ని ప్రారంభించేదాన్నని ఆమె గుర్తు చేసుకున్నారు.
తాను అత్యంత ఇష్టపడే గాయనుల గురించి అడగగా.. పి. సుశీల, ఎస్. జానకి, లతా మంగేష్కర్ పేర్లను చిత్ర ప్రస్తావించారు. తన బాల్యంలో ఎస్. జానకిని అనుకరించేదాన్నని చెబుతూ.. ఆ దిగ్గజ గాయని విలక్షణ శైలిని తిరిగి పలికించడం అసాధ్యమేనని నవ్వుతూ అంగీకరించారు. లతా మంగేష్కర్ గురించి చెబుతూ... ఆమె గానంలోని భావోద్వేగ తీక్షణతను, ముఖ్యంగా ఆమె ఆలపించిన భక్తి గీతాల విశిష్టతను చిత్ర గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా లతా మంగేష్కర్ పాడిన తనకెంతో ఇష్టమైన మధుర గీతాల్లో ఒకదానిని ప్రేక్షకులకు వినిపించారు.
ఆశా భోంస్లేతో తన జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సమయంలో చిత్రలో మరో రకమైన అభిమానం వ్యక్తమైంది. ఆశా భోంస్లే అసాధారణ బహుముఖ ప్రజ్ఞను, గజల్స్ సహా వివిధ సంగీత ప్రక్రియల్లో ప్రయోగాలు చేయడానికి ఆమె చూపే ఉత్సాహాన్ని చిత్ర కొనియాడారు. ఈ సందర్భంగా ఆశా పాడిన ఒక గజల్‌ను చిత్ర స్వయంగా ఆలపించారు. తన సోదరి లతా మంగేష్కర్‌తో పోల్చడం కాకుండా.. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవాలని ఆశా భోంస్లే ఎప్పుడూ కోరుకునేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆశా భోంస్లేతో తన మొదటి పరిచయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. అంత హై రేంజ్ ఎందుకు పాడుతున్నావని అడిగారంటూ ఆశాభోంస్లేతో తన జ్ఞాపకాలను ప్రేక్షకులకు వివరించారు. ఆ దిగ్గజ గాయని విలక్షణ వ్యక్తిత్వానికి ఈ చిన్న సంభాషణ అద్దం పట్టింది.
ఇక ఎస్. జానకితో తన జ్ఞాపకాలను మరింత ఆత్మీయంగా వివరించారు. జానకి సంగీత ప్రయాణంలోని తొలినాళ్లను చిత్ర గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో వేదికపై మిమిక్రీ కళాకారుల ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు మధ్యలో విరామ సమయంలో జానకిని పాటలు పాడేందుకు పిలిచేవారు. ఆ అవకాశాలే ప్రేక్షకులకు ఆమె స్వరాన్ని పరిచయం చేశాయని, క్రమంగా అది ఆమెను నేపథ్య గాయనిగా తీర్చిదిద్దాయని చిత్ర వివరించారు. జానకి విలక్షణమైన స్వరం, భావవ్యక్తీకరణ పరిధి, ప్రతి పాటకూ ప్రాణం పోయగల ఆమె సామర్థ్యాన్ని చిత్ర కొనియాడారు. తమ అనుబంధం సంగీతానికి మాత్రమే పరిమితం కాలేదని, జానకిని తల్లిలా భావిస్తానని ఆమె పేర్కొన్నారు. జానకి ఇంటికి వెళ్లిన సందర్భాలను ఎంతో ప్రేమగా గుర్తు చేసుకుంటూ.. ఆ దిగ్గజ గాయని తనకు ఎంతో ఆప్యాయంగా గోరుముద్దలు తినిపించేవారని చెప్పారు. ఎంతో కారంగా ఉండే వంటలు కూడా ఆమె చేతిలో తీయగా మారిపోయేవంటూ ఆత్మీయంగా పేర్కొన్నారు.
కార్యక్రమం ఆద్యంతం సుహాసిని వివిధ పాటలను సంభాషణలోకి తీసుకొస్తూ వాటి వెనుక ఉన్న జ్ఞాపకాలను, వెండితెరపై అవి పండించిన భావోద్వేగాలను ప్రస్తావించారు. ప్రేమ, పెళ్లిళ్లు, దుఃఖం, సంతోషం... ఇలా జీవితంలోని ప్రతి దశలోనూ సినీ సంగీతం మనుషులతో ఎలా తోడుగా నడుస్తుందో, మాటల్లో చెప్పలేని భావాలనూ అది ఎలా వ్యక్తీకరిస్తుందో ఆమె వివరించారు. మలయాల గీతం ‘స్వర్ణముఖిలే’ ఇప్పటికీ తన కళ్లలో నీళ్లు తెప్పిస్తుందంటూ గాయని చిత్ర భావోద్వేగంతో పేర్కొన్నారు.
సరదాగా సాగిన ఒక సంగీత క్విజ్ ఈ కార్యక్రమంలో మరో ప్రత్యేక ఆకర్షణ. నేపథ్య సంగీతం లేకుండా ప్రదర్శించిన అయిదు సినీ సన్నివేశాలను చూసి, ఆ పాటలన్నింటినీ చిత్ర గుర్తించి ఆలపించారు. అందులో సుహాసిని నటించిన చిత్రాల్లోని పాటలు కూడా ఉన్నాయి. రికార్డింగ్ సమయంలో ఉండే సవాళ్లు, పాడడానికి కష్టతరమైన గీతాలు, వయసు పెరిగే కొద్దీ స్వర పరిమితులను గుర్తించాల్సిన ఆవశ్యకత వంటి అంశాలను కూడా ఈ సెషన్‌లో స్పృశించారు.

‘సింధు భైరవి’ చిత్రంలోని ‘పాడరియేన్’ గీతాలాపన ఈ సంభాషణలో అత్యంత ఆకట్టుకునే అంశం. సుహాసిని కూడా ఆ పాటకు పెదవులు కదుపుతూ చిత్రతో జతకట్టారు. ఆ క్షణం ఈ చర్చకు ఒక పరిపూర్ణతను తీసుకొచ్చింది. సంగీతం, మధుర స్మృతుల మేలు కలయికగా ఈ సెషన్ నిలిచింది. పాటలంటే రాగాలు మాత్రమే కాదని, జీవితాలు, స్నేహాలు, ప్రయాణాల తాలూకు జ్ఞాపకాలను తరతరాల పాటు ప్రతిధ్వనిస్తాయని స్పష్టం చేసింది.
ఇఫిలాయిడ్‌ను ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***