మహారాష్ట్ర తీరప్రాంత నేపథ్యంలో సాగే మరాఠీ కామెడీ డ్రామా బాప్యా. వ్యక్తిగత అభిరుచులు, మారుతున్న సామాజిక ధోరణుల నేపథ్యంలో సాగే ఓ ఆత్మీయ కథ ద్వారా లింగపరమైన గుర్తింపు, కుటుంబ సంబంధాలు, సామాజిక ఆమోదం లాంటి అంశాలను ఈ చిత్రం అన్వేషిస్తుంది. 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా మెయిన్ స్ట్రీమ్ సినిమా విభాగంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా పీఐబీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాప్యా దర్శకుడు, నిర్మాత సమీర్ తివారీ, నటుడు గిరీష్ కులకర్ణి మాట్లాడారు.
సమాజానికి సూక్తులు చెప్పడం లేదా పాఠాలను బోధించడం ఈ చిత్రం లక్ష్యం కాదని సమీర్ తివారీ చెప్పారు. ఇతరులను అంగీకరించడం, అర్థం చేసుకోవడం, అనుబంధాలకు సంబంధించిన కథను మాత్రమే చెబుతుందని స్పష్టం చేశారు. ‘‘తనకు నచ్చినట్టుగా ఓ వ్యక్తి మారాలనుకోవడం, తనని సమాజం అలాగే అంగీకరించడం చుట్టూ సాగే కథ ఇది’’ అని తెలియజేశారు.
_20261125145008_74c6fa.jpeg)
ఈ చిత్రాన్ని మరాఠీలో తీయాలనే తన నిర్ణయం గురించి వివరించారు. ఒక నటుడి చుట్టూ అల్లిన సినిమాగా కాకుండా, నిజమైన కథాంశంతో, వాస్తవానికి దగ్గరిగా ఉండే చిత్రాన్ని తీయాలనుకున్నానని తివారీ చెప్పారు.
నిర్మాణంలో ఎదురయిన సవాళ్లను తివారీ గుర్తు చేసుకున్నారు. స్క్రిప్ట్‌ను మెచ్చుకున్నప్పటికీ నిర్మాతలు కథాంశాన్ని ప్రమాదకరమైనదిగా భావించారని, దీనివల్ల ఈ ప్రాజెక్ట్‌కు ఆర్థిక సహకారం పొందడం కష్టమైందని అన్నారు. చాలా మంది నటీమణులు తమ లింగపరమైన గుర్తింపుకు భిన్నమైన పాత్రను పోషించడానికి సంకోచించడంతో బాప్యా ప్రధాన పాత్రలో నటించేవారిని ఎంపిక చేయడం మరో పెద్ద సవాలుగా మారిందని తెలిపారు. అయితే, నటి రాజశ్రీ దేశ్‌పాండే ఏమాత్రం భయపడకుండా ఈ పాత్రను స్వీకరించారని, దీనిని ఒక సృజనాత్మక సవాలుగా భావించి పూర్తి చేశారని తివారీ ఆమెను ప్రశంసించారు.
లింగపరమైన గుర్తింపు విషయంలో మారుతున్న అభిప్రాయాల గురించి తివారీ మాట్లాడారు. స్త్రీ, పురుషుల మధ్య ఉన్న సంప్రదాయ వ్యత్యాసాలను క్రమంగా చెరిపేసే దిశగా సమాజం ముందుకెళుతోందన్నారు. దుస్తులు, ప్రవర్తన, గుర్తింపు విషయాల్లో వ్యక్తిగత ఎంపికల ఆధారంగా ఎదుటివారిపై ఒక అభిప్రాయానికి రావడం లేదా వివక్ష చూపడం తగదని అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతి పురుషుడిలో ఒక స్త్రీ ఉంటుంది. ప్రతి స్త్రీలోనూ ఒక పురుషుడు ఉంటాడు. సమాజం ఎంత వేగంగా పురోగమిస్తే, లింగపరమైన సరిహద్దులు అంతగా చెరిగిపోతాయి’’ అని ఆయన అన్నారు. కఠినమైన సామాజిక కట్టుబాట్లను దాటి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తివారీ స్పష్టం చేశారు.
ప్రతి వ్యక్తినీ ఎలాంటి పక్షపాతం లేకుండా గౌరవంగా చూడటం ఎంతో ముఖ్యమని నటుడు గిరీష్ కులకర్ణి తెలిపారు. ఈ అంశంలో ప్రకృతిని ఉదాహరణగా చూపించారు. చెట్లు, మొక్కల్లోని వైవిధ్యాన్ని ప్రజలు ఎలాంటి భేదం లేకుండా ఎలా స్వీకరిస్తారో అదే స్ఫూర్తి మానవ సంబంధాల్లోనూ ఉండాలన్నారు.

సమాజాన్ని తీర్చిదిద్దడంలో కళలు కీలకపాత్ర పోషిస్తాయని కులకర్ణి అన్నారు. సమకాలీన వాస్తవాలకు అద్దం పట్టేవిగా మాత్రమే కాకుండా సామాజిక పురోగతికి సైతం మార్గదర్శకాలుగా సినిమా, ఇతర కళారూపాలు పనిచేస్తాయని తెలిపారు. సాంస్కృతిక మూలాలను వదులుకోకుండానే మారుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయాలకు కొత్త అర్థం చెప్పే ప్రయత్నం బాప్యా చిత్రం చేస్తోందని వివరించారు. ‘‘మా సంప్రదాయాలను మేం మరచిపోవడం లేదు. కొత్త కోణంలో దానికి అర్థం చెబుతూ ముందుకు తీసుకెళుతున్నాం. అదే సమయంలో మా మూలాలను బలోపేతం చేసుకుంటూనే భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. ఈ ప్రక్రియ నుంచే అపరిమితమైన ప్రేమ పుట్టుకొస్తుంది’’ అని తెలియజేశారు.
ఆమోదం, ప్రేమే ఈ సినిమాకు ప్రధాన స్ఫూర్తి అని కులకర్ణి తెలియజేశారు. భాష, దుస్తులు, గుర్తింపులో ఉన్న వైవిధ్యాలను స్వీకరించడం... భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశ ప్రత్యేక సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. భారత తాత్విక సంప్రదాయాల గురించి వివరించారు. ఇతరులను అంగీకరించడం, ఎలాంటి పక్షపాతం లేకుండా వర్తమానాన్ని చూడగలగడం భారతీయ ఆలోచన విధానంలో బలంగా వేళ్లూనుకుందన్నారు. ‘‘ఈ ప్రయాణాన్ని నాలో నేను అనుభూతి చెందానని అనిపించింది. అందుకే మేం దాన్ని తెరపై ఆవిష్కరించగలిగాం’’ అని చెప్పారు.
సాంస్కృతిక, మేధోపరమైన వినిమయ వేదికగా ఇఫీకి ఉన్న ప్రాధాన్యం గురించి వివరించారు. ఈ ఉత్సవం దేశ విదేశాలకు చెందిన చిత్రనిర్మాతలను, ప్రేక్షకులను ఒకచోట చేర్చి, విభిన్న సినిమా దృక్కోణాలను తెలుసుకునేందుకు, అర్థవంతమైన చర్చలలో పాల్గొనేందుకు అవకాశాలను కల్పిస్తుందని కులకర్ణి అన్నారు.

ఈ విలేకరుల సమావేశానికి శ్రీమతి సుప్రియా ఘాయ్‌తడక్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
పూర్తి ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఇక్కడ వీక్షించండి:
Read IFFILOID here:
https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***