గోవాలో భారత 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) నేపథ్యంలో ‘ఆమె దృక్కోణం.. వారసత్వం.. స్వేచ్ఛ: ప్రపంచ సినిమాను తీర్చిదిద్దుతున్న మహిళలు’ ఇతివృత్తంగా బృంద గోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న సాంస్కృతిక నేపథ్యాల మహిళా దర్శకులు తమ అస్తిత్వం, సాంస్కృతిక వారసత్వం, సృజనాత్మక స్వేచ్ఛపై అనుభవాలను, దృక్కోణాలను పంచుకున్నారు. కిర్గిజ్ రచయిత్రి-దర్శకురాలు నర్ఘిజా డోటియేవా, రొమేనియన్-రోమా నటి, దర్శకురాలు అలీనా షెర్బాన్, మెక్సికన్-అమెరికన్ రచయిత్రి-దర్శకురాలు సుజాన్ ఆండ్రూస్ కొరియా ఈ గోష్ఠిలో పాల్గొన్నారు. భారత చిత్ర దర్శకుడు అభిషేక్ జైన్ దీనికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఈ మేరకు ఆయన చర్చను ప్రారంభిస్తూ- చలనచిత్ర రంగంలో వారి వ్యక్తిగత ప్రస్థానాన్ని, భవిష్యత్తును తీర్చిదిద్దిన సాంస్కృతిక ప్రభావాలను అవలోకనం చేసుకోవాల్సిందిగా కోరారు. ముందుగా నర్ఘిజా డోటియేవా మాట్లాడుతూ- కిర్గిజ్‌స్థాన్‌లోని ఓ సరస్సు తీరాన గల చిన్న మత్స్యకారుల గ్రామంలో తన బాల్యం గడిచిందని గుర్తుచేసుకున్నారు. తన తాతగారి సంప్రదాయ కిర్గిజ్ మౌఖిక కవిత్వం, కథలు వినడం ద్వారా రచనా వ్యాసంగంతోపాటు సినిమా రంగంపై ఆసక్తి పొటమరించిందని చెప్పారు. ఈ క్రమంలో ముందుగా ప్రకటనల రంగంలో పనిచేసిన తర్వాత, తొలి చిత్ర దర్శకత్వ ప్రాజెక్టుకు స్వయంగా నిధులు సమకూర్చుకున్నానని తెలిపారు. ‘మానస్’ ఇతిహాసం సహా కిర్గిజ్‌స్థాన్ సాహిత్య-సాంస్కృతిక వారసత్వం నుంచి తానెంతో స్ఫూర్తి పొందానని పేర్కొన్నారు. ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం, ‘స్కైలార్క్’ సరిహద్దు ప్రాంతాల చరిత్రలను, సార్వత్రిక మానవ భావోద్వేగాలను చాటిచెబుతుంది.
రొమేనియా రాజధాని బుకారెస్ట్ నగరంలోని రోమా కుటుంబంలో జన్మించిన అలీనా షెర్బాన్ మాట్లాడుతూ- ‘ఇఫీ’లో భాగస్వామి కావడాన్ని తన పూర్వికుల మాతృభూమికి భావోద్వేగభరిత పునరాగమనంగా అభివర్ణించారు. రోమా భాషలో భారతీయ మూలాలును తలపించే పదాలున్నాయని ఆమె చెప్పారు. భారత్‌లోని రాజస్థాన్‌తో రోమా సమాజానికి గల చారిత్రక సంబంధాలను ఇది సూచిస్తుందని ఆమె తెలిపారు. బుకారెస్ట్‌లో వివక్ష, సామాజిక బహిష్కరణను ఎదుర్కొన్న తాను, మూఢ సంప్రదాయాలను సవాలు చేయడానికే నాటక రంగంలో ప్రవేశించి, అటుపైన సినిమా వైపు మళ్లానని పేర్కొన్నారు. తాను దర్శకత్వం వహించిన ‘ఐ మ్యాటర్’ చిత్రం సహా ఇతర రచనల ద్వారా రోమా కథనాలపై తన వంటి రచయిత్రులు తిరిగి స్వేచ్ఛను పొందాలని సూచించారు. అలాగే, మానసిక స్థైర్యం, ఆత్మగౌరవానికి సంబంధించిన కథలను ప్రముఖంగా ఎంచుకోవాలని ఆకాంక్షించారు.
మెక్సికన్-అమెరికన్ చిత్ర దర్శకురాలు సుజాన్ ఆండ్రూస్ కొరియా స్పందిస్తూ- మెక్సికోలోని సియుడాడ్ జుయారెజ్‌లో చిత్రీకరించిన తన తొలి ఫీచర్ చిత్రం ‘లా కాజడోరా’ (ది హంట్రెస్) వెనుక గల దశాబ్ద కాలపు ప్రస్థానాన్ని ప్రస్తావించారు. మహిళల హత్య, హింస సంబంధిత నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణతో ఈ చిత్రం తీశానని తెలిపారు. పరిస్థితులపై ఆగ్రహం, ఆవేదనల వ్యక్తీకరణ నుంచి నిస్సహాయత, అస్తిత్వం, మహిళా స్వేచ్ఛపై సానుకూల అభిప్రాయంతో కూడిన అన్వేషణగా ఈ చిత్రం రూపుదిద్దుకున్నదని ఆమె తెలిపారు.
నిధుల కొరత, లింగ వివక్ష, మూఢా సామాజిక సంప్రదాయాలు తదితరాల రూపంలో స్వతంత్ర మహిళా దర్శకులు ఎదుర్కొంటున్న స్వాభావిక సవాళ్లపైనా గోష్ఠిలో చర్చించారు. వాణిజ్యపరంగా సురక్షిత కథనాలకు ప్రాధాన్యమిచ్చే నిర్మాతలు తరచూ సంక్లిష్ట, సామాజిక అంశాలపై చిత్రాలకు మద్దతివ్వడంలో వెనుకాడతారని కొరియా వ్యాఖ్యానించారు. మరోవైపు మహిళా దర్శకులు తమకు తగిన గుర్తింపు పొందడం కోసం తరచూ అర్హతలను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. రోమా సమాజం సంబంధిత మూఢ పద్ధతులకు తగినట్లు లేనందున తన స్క్రిప్టు చిత్రీకరణకు నిధుల సమీకరణలో పలుమార్లు విఫలమైనట్లు షెర్బాన్ వివరించారు. నామమాత్రపు స్వేచ్ఛ కోసం కాకుండా కళాత్మక ప్రతిభకు గుర్తింపు పొందడంలోని ప్రాధాన్యాన్ని వారిద్దరూ స్పష్టం చేశారు. తక్కువ స్వేచ్ఛ గల ప్రాంతాల నుంచి వచ్చే విభిన్న, సాంస్కృతికంగా ప్రాచీన కథలకు మద్దతివ్వడంలో ప్రేక్షకులు, చలనచిత్రోత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని డోటియేవా వివరించారు.
స్వీయ సృజనాత్మక ప్రస్థానాల స్ఫూర్తితో వర్ధమాన దర్శకులకు వారు కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా భావోద్వేగ, సాంస్కృతిక మూలాలకు కట్టుబడి ముందడుగు వేయాల్సిందిగా సలహా ఇచ్చారు. స్థానిక కథలు ఎంతో ప్రామాణికమైనవని, ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను అవి ఆకట్టుకోగలవని పేర్కొన్నారు.
***