57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

శతాబ్ది వేడుకల సందర్భంగా భారతీయ సినిమాకు చెందిన ఏడుగురు దిగ్గజాలకు ఇఫి 2026 సత్కారం

1926లో జన్మించిన భారతీయ సినీ దిగ్గజాలు ఉత్తమ్‌ కుమార్‌, శక్తి సామంత, ఓపీ నయ్యర్‌, సూర్యకాంత్‌ మాంధరే, ప్రేమ్‌ నజీర్‌, రాజ్‌ కుమార్‌, బాంబే రవి సేవలకు ఇఫి ఘన నివాళి

నాడు పోస్టు చేయడమైనది: 21 NOV 2026 2:46PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340163Views: 5

 భారతీయ చలనచిత్ర రంగానికి  1926  అసాధారణమైన ఏడాదిగా నిలిచింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు, విభిన్న కుటుంబాలు, సాంస్కృతిక సంప్రదాయాలకు చెందిన ఏడుగురు ప్రముఖులు ఆ ఏడాదిలో జన్మించారు. వెండితెరపై చెరగని ముద్ర వేసిన వీరే.. బెంగాలీ సినిమాకు చెందిన దిగ్గజ నటుడు ‘మహానాయక్‌’ ఉత్తమ్‌ కుమార్‌, హిందీ చిత్రసీమలో చిరస్మరణీయ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు శక్తి సామంత, తరతరాల ప్రేక్షకులను అలరిస్తున్న మధురమైన గీతాలను అందించిన సంగీత మాంత్రికుడు ఓపీ నయ్యర్‌, గ్రామీణ, చారిత్రక, పౌరాణిక కథాంశాల్లో తనదైన నటనతో మరాఠీ సినిమాను సుసంపన్నం చేసిన పద్మశ్రీ పురస్కార గ్రహీత సూర్యకాంత్‌ మాంధరే, మలయాళ చిత్రసీమలో చిరకాలం గుర్తుండిపోయే రొమాంటిక్‌ హీరో ప్రేమ్‌ నజీర్‌, తన ప్రత్యేకమైన స్వరం, విలక్షణమైన అభినయ శైలితో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు రాజ్‌ కుమార్‌, అలాగే ‘చౌదవీ కా చాంద్‌’, ‘గుమ్రా’, ‘వక్త్‌’, ‘హమ్‌రాజ్‌’ వంటి చిరస్మరణీయ సంగీత సంపదను అందించిన ప్రతిభావంతుడైన స్వరకర్త రవి (బాంబే రవి).

 

వందేళ్ల తర్వాత, 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (ఇఫి) ఈ ఏడుగురి శతజయంతి సందర్భంగా నాలుగు భాషల్లోని అయిదు పునరుద్ధరించిన చిత్రాలను ప్రదర్శిస్తోంది. హిందీ, బెంగాలీ, మలయాళం, మరాఠీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాలు.. శతజయంతి జరుపుకుంటున్న ఈ కళాకారుల అత్యంత ప్రసిద్ధ రచనల్లో కొన్ని. భారతీయ చలనచిత్ర వారసత్వాన్ని పరిరక్షించడం, సంరక్షించడం, డిజిటలైజ్‌ చేయడం, పునరుద్ధరించడం లక్ష్యంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన జాతీయ చలనచిత్ర వారసత్వ మిషన్‌ కింద జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ) ఈ చిత్రాలన్నింటినీ పునరుద్ధరించింది.

 

చౌరింగీ చిత్రంలో ఉత్తమ్‌ కుమార్‌

 

1965లో వచ్చిన బెంగాలీ క్లాసిక్‌ ‘చౌరింగీ’.. బెంగాలీ సినిమా చరిత్రలో అత్యుత్తమ సమష్టి నటనల్లో ఒకదాన్ని ఆవిష్కరించింది. బెంగాలీ చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడైన ఉత్తమ్‌ కుమార్‌.. తన కెరీర్‌లో అత్యున్నత ప్రజాదరణ పొందుతున్న సమయంలో ఈ చిత్రంలో సత్యసుందర్‌ ‘సతా’ బోస్‌ పాత్రను అంగీకరించారు. 1948లో నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన.. మూడు దశాబ్దాల పాటు 200కు పైగా చిత్రాల్లో నటించారు. ‘సప్తపది’, ‘హరానో సుర్‌’, ‘నాయక్‌’, ‘చిరియాఖానా’, ‘అమానుష్‌’ తదితర ఎన్నో క్లాసిక్‌ చిత్రాలను అందించారు. బెంగాలీ సినిమాల్లో నటనను రంగస్థల శైలి నుంచి పట్టణ నేపథ్యంలోని రొమాంటిక్‌ అభినయం వైపు మళ్లించారు.

 

దర్శకుడు శక్తి సామంత, సంగీత దర్శకుడు ఓపీ నయ్యర్‌ల ‘కాశ్మీర్‌ కీ కలి’

 

‘కాశ్మీర్‌ కీ కలి’ చిత్రం దర్శకుడిగా శక్తి సామంత, సంగీత దర్శకుడిగా ఓపీ నయ్యర్‌ ఇద్దరినీ వారి కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేర్చింది. కాశ్మీర్‌ స్వర్గసీమ అందాలను శక్తి సామంత పూర్తి రంగుల్లో చిత్రీకరించి సినీ ప్రేక్షకులకు చూపించగా.. ఓపీ నయ్యర్‌ అందించిన సంగీత బాణీలు నేటికీ శ్రోతలను అలరిస్తున్నాయి.

 

శక్తి సామంత 1948లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1955లో ‘బహు’ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. తన సొంత నిర్మాణ సంస్థ ‘శక్తి ఫిల్మ్స్‌’ బ్యానర్‌పై మొత్తం 43 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిలో 37 హిందీ చిత్రాలు కాగా, ఆరు బెంగాలీ చిత్రాలు. ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘చైనా టౌన్‌’, ‘యాన్‌ ఈవెనింగ్‌ ఇన్‌ పారిస్‌’, ‘ఆరాధన’, ‘కటి పతంగ్‌’, ‘అమర్‌ ప్రేమ్‌’, ‘అనురాగ్‌’ వంటి హిందీ సినీ క్లాసిక్‌ చిత్రాలను ఆయన అందించారు.

 

ఓంకార్‌ ప్రసాద్‌ నయ్యర్‌ 1952లో ‘ఆస్మాన్‌’ చిత్రంతో సినీ రంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ‘ఆర్‌ పార్‌’, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55’, ‘సీఐడీ’, ‘నయా దౌర్‌’, ‘హౌరా బ్రిడ్జ్‌’ వంటి చిత్రాలకు సంగీతం అందించారు. మహమ్మద్‌ రఫీ, ఆశా భోంస్లే, గీతా దత్‌ వంటి గాయనీగాయకులతో ఆయన చేసిన సంగీత ప్రయాణం.. హిందీ సినిమా సంగీత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఎన్నో పాటలకు దారితీసింది. గుర్రపు డెక్కల పరుగును తలపించే లయలు, ఢోలక్‌ తాళాలతో ఆయన ప్రత్యేకమైన సంగీత శైలిని సృష్టించారు. ఈ శైలిని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.

 

‘సాధీ మానసే’ చిత్రంలో సూర్యకాంత్‌ మాంధరే

 

సూర్యకాంత్‌ మాంధరే బాల్యంలోనే తన గురువు భాల్జీ పెంధార్కర్‌ దృష్టిలో పడ్డారు. బాలనటుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అయిదు దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌లో వందకు పైగా చిత్రాల్లో నటించారు. ‘సాంగ్‌త్యే ఐకా’, ‘కన్యాదాన్‌’, ‘మోహిత్యాంచీ మంజుల’, ‘మల్హారీ మార్తాండ’ వంటి చిత్రాలతో గ్రామీణ, చారిత్రక, పౌరాణిక నేపథ్యాలకు చెందిన మరాఠీ సినిమా అత్యంత బలమైన పాత్రలకు ప్రాణం పోశారు.

 

1965లో వచ్చిన క్లాసిక్‌ చిత్రం ‘సాధీ మానసే’లో ఆయన శంకర్‌ అనే కమ్మరి పాత్రను పోషించారు. ఆత్మస్తుతి, ఆడంబరాలకు దూరంగా ఉండే బలమైన వ్యక్తిత్వానికి, శ్రమ గౌరవానికి, తనను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు కలిగే ఆవేదనకు ఈ పాత్ర ప్రతీకగా నిలుస్తుంది. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా జయశ్రీ గడ్కర్‌ నటించారు. వీరిద్దరూ గతంలోనూ అనేక చిత్రాల్లో జంటగా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ ‘ఆనంద్‌ఘన్‌’ అనే కలం పేరుతో దీనికి సంగీతం సమకూర్చారు. మరాఠీ చిత్రాలకు పనిచేసేటప్పుడు ఆమె తరచుగా ఈ పేరును ఉపయోగించేవారు.

 

తులాభారం’ చిత్రంలో ప్రేమ్‌ నజీర్‌

 

పాటలకు, సహజత్వంతో కూడిన కథలకు ప్రసిద్ధి చెందిన మలయాళ చిత్రసీమలో చిరకాలం గుర్తుండిపోయే రొమాంటిక్‌ హీరో ప్రేమ్‌ నజీర్‌.. ‘తులాభారం’ చిత్రంలో ఫ్యాక్టరీ కార్మికుడు, ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్త అయిన రామ పాత్రను పోషించారు. రొమాంటిక్‌ హీరోగా అత్యంత గుర్తింపు పొందిన ఈ దిగ్గజ నటుడు.. తన గ్లామరస్‌ తెర రూపాన్ని పక్కనపెట్టి, ఎంతో సంయమనంతో కూడిన నటనను ప్రదర్శించారు. ఇది ఆయన కెరీర్‌లోనే అత్యుత్తమ నటనల్లో ఒకటిగా చెప్పవచ్చు.

 

‘ఇరుట్టింటే ఆత్మావు’, ‘మురప్పెణ్ణు’, ‘నది’ నుంచి ‘కల్లిచెల్లమ్మ’, ‘విడ పారయుం మున్పే’, ‘పడయొట్టం’ వరకు ప్రేమ్‌ నజీర్‌ తన నటనతో ప్రేమకథల నుంచి పౌరాణిక, సామాజిక సంస్కరణ ఇతివృత్తాల వరకు విభిన్న పాత్రలు పోషించారు. 700కు పైగా చిత్రాల్లో కథానాయకుడిగా నటించినందుకు, షీలా సరసన 130 చిత్రాల్లో నటించినందుకు ఆయన రెండు గిన్నిస్‌ ప్రపంచ రికార్డులు సాధించారు. 1983లో పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు.

 

‘వక్త్‌’ చిత్రంలో నటుడు రాజ్‌ కుమార్‌, సంగీత దర్శకుడు బాంబే రవి

 

తనదైన తెర ఉనికి, గంభీరమైన స్వరం, స్పష్టమైన సంభాషణల ఉచ్చారణ, విలక్షణమైన వ్యక్తిత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దిగ్గజ నటుడు రాజ్‌ కుమార్‌.. ప్రముఖ సంగీత దర్శకుడు రవితో కలిసి యశ్‌ చోప్రా రూపొందించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘వక్త్‌’లో నటించారు. ఈ చిత్రంలో రాజ్‌ కుమార్‌ దొంగ రాజా పాత్రలో చూపిన అద్భుత నటనతో పాటు, రవి స్వరపరిచిన ప్రజాదరణ పొందిన ‘ఏ మేరీ జోహ్రా జబీన్‌’ పాట కూడా ప్రత్యేక గుర్తింపు పొందాయి.

 

రాజ్‌ కుమార్‌ 1952లో ‘రంగీళీ’ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ‘నౌషెర్వాన్‌-ఎ-ఆదిల్‌’, ‘మదర్‌ ఇండియా’ చిత్రాల్లో నటనతో గుర్తింపు పొందారు. ఆ తర్వాత 1963లో వచ్చిన ‘దిల్‌ ఏక్‌ మందిర్‌’తో మరింత పేరు తెచ్చుకున్నారు. అనంతరం ‘వక్త్‌’, ‘హీర్‌ రాంఝా’, ‘పాకీజా’, ‘తిరంగా’ తదితర చిత్రాల్లో చిరస్మరణీయ పాత్రలు పోషించారు.

 

మలయాళ చిత్రసీమలో బాంబే రవిగా ప్రసిద్ధి చెందిన రవిశంకర్‌ శర్మ.. 1955లో ‘వచన్‌’ చిత్రంతో హిందీ సినీ రంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘చౌధ్వీన్ కా చాంద్‌’, ‘గుమ్రా’, ‘వక్త్‌’, ‘హమ్‌రాజ్‌’ చిత్రాలకు అందించిన సంగీతంతో ఆయన గుర్తింపు పొందారు. ‘పరిణయం’, ‘సుకృతం’ చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకత్వంలో జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు.

 

ఈ ప్రత్యేకంగా రూపొందించిన శతజయంతి నివాళుల కార్యక్రమం ద్వారా 57వ ఇఫి.. ఏడుగురు అసాధారణ ప్రతిభావంతులను మాత్రమే కాకుండా, వారు అందించిన సృజనాత్మక వారసత్వాన్ని కూడా వేడుకగా జరుపుకోనుంది. వారి వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూ, భారతీయ సినిమా శాశ్వతమైన వైభవాన్ని చాటుతోంది.

 

వారు జన్మించి వందేళ్లు పూర్తయినప్పటికీ, ఈ ఏడుగురు దిగ్గజాల చిత్రాలు భారతీయ సినిమా అసాధారణ వైవిధ్యానికి, సృజనాత్మక ఆకాంక్షలకు, కళాత్మక నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ పునరుద్ధరించిన క్లాసిక్‌ చిత్రాల ద్వారా 57వ ఇఫి.. ప్రేక్షకులకు చిరస్మరణీయ నటనలు, మధురమైన పాటలు, కథలను మరోసారి ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తోంది. అంతేకాకుండా, వారు రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషించిన సినీ సంప్రదాయాలు, సాంస్కృతిక చరిత్రలను తిరిగి గుర్తుచేసుకునే అవకాశం కల్పిస్తోంది.

 

ఏడుగురు వ్యక్తుల వ్యక్తిగత వారసత్వానికి నివాళి అర్పించడమే కాకుండా, భారతీయ చలనచిత్ర వారసత్వాన్ని పరిరక్షించడం, భవిషత్తు తరాలకు అందుబాటులో ఉంచడం ఎంత ముఖ్యమో ఈ శతజయంతి వేడుక మరోసారి చాటుతోంది.


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340163
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026