యుద్ధ గాయాలతో తల్లడిల్లుతూ, సిద్ధాంతపరంగా విడిపోయి, గతం తాలూకు భారంతో సతమతమవుతున్న ఒక దేశ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ.. 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) గోవాలో నేడు ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ సినీ రూపకర్త పావెల్ పావ్లికోవ్స్కీ తెరకెక్కించిన ‘ఫాదర్ల్యాండ్ (ఓయ్చిజ్నా)’ చిత్రం.. భారత్‌లో తొలి ప్రదర్శనతో ఈ తొమ్మిది రోజుల వేడుకకు శ్రీకారం చుట్టింది. ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభ దశలో ఉన్న యుద్ధానంతర జర్మనీ పరిస్థితులను ఈ చిత్రం ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపింది.
ఆస్కార్ అవార్డు విజేత దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రం.. నోబెల్ బహుమతి గ్రహీత, జర్మన్ రచయిత థామస్ మాన్, ఆయన కుమార్తె ఎరికా కథ ద్వారా చరిత్ర, కుటుంబ సంబంధాలు, విభజిత మాతృభూమిలోని సంక్లిష్టతలను హృద్యంగా అల్లుకుంది. ఐనాక్స్‌లోని అన్ని స్క్రీనింగ్ హాళ్లలో ఈ చిత్రం హౌస్‌ఫుల్‌గా ప్రదర్శితమై తొమ్మిది రోజుల చిత్రోత్సవ ప్రారంభానికి అద్భుత వాతావరణాన్ని నెలకొల్పింది.
చిత్ర ప్రదర్శనకు ముందు ‘ఫాదర్ల్యాండ్’ నిర్మాత శ్రీమతి ఇవా పుష్చిన్స్కా, న్యూఢిల్లీలోని పోలాండ్ రాయబార కార్యాలయ మిషన్ అధిపతి శ్రీ పియోటర్ ఆంటోని స్విటాల్స్కీ, న్యూఢిల్లీలోని పోలిష్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ శ్రీమతి మల్గోర్జాటా వెయిసిస్-గోలెంబియాక్ రెడ్ కార్పెట్‌పై పనాజీలోని ఐనాక్స్లోకి వచ్చారు.
ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. సినిమా నిర్మాణ ప్రక్రియలోనే ఇఫీ ప్రధాన ఇతివృత్త స్ఫూర్తి ప్రతిబింబిస్తోందని శ్రీమతి ఇవా పుష్చిన్స్కా వ్యాఖ్యానించారు. ‘ఫాదర్ల్యాండ్’ చిత్రం జర్మన్ భాషలో, ఒక జర్మన్ రచయిత, జర్మనీ ప్రజల కథను చెప్పినప్పటికీ.. దీనిని పూర్తిగా పోలిష్ హృదయాలు, కళాకారులతో రూపొందించామని ఆమె తెలిపారు. ఇది చిత్రోత్సవ నినాదమైన ‘విశ్వజనీన కథలు’ భావనకు అద్దం పడుతోందన్నారు.
భారత్, పోలాండ్ దేశాల మధ్య స్నేహం బహుముఖంగా విస్తరిస్తున్నప్పటికీ.. సంస్కృతే ఆ బంధానికి అత్యంత బలమైన పునాదిగా నిలుస్తోందని శ్రీ పియోటర్ ఆంటోని స్విటాల్స్కీ పేర్కొన్నారు. సంప్రదాయ పోలిష్ చిత్రనిర్మాణ శైలికి పావెల్ పావ్లికోవ్స్కీ ఒక కొత్త దృష్టిని, సరికొత్త దృక్పథాన్ని తీసుకొచ్చారన్నారు.
అతిథులను సత్కరిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ మాట్లాడుతూ.. భారత్, పోలాండ్ దేశాల మధ్య సృజనాత్మక సంబంధాలను చాటడానికి ‘ఫాదర్ల్యాండ్’ చిత్రం ఒక మంచి అవకాశాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇఫీ ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ అశుతోష్ గోవారికర్, భారత జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్డీసీ) చైర్మన్ శ్రీ జి. కృష్ణకుమార్, ఇఫీ ఆర్టిస్టిక్ డైరెక్టర్ శ్రీ పంకజ్ సక్సేనా తదితరులు పాల్గొన్నారు.
విభజిత జర్మనీలో తండ్రీకూతుళ్ల ప్రయాణం
1949 వేసవిలో అప్పుడప్పుడే మొదలవుతున్న ప్రచ్ఛన్న యుద్ధ నేపథ్యంలో ‘ఫాదర్ల్యాండ్’ చిత్రం సాగుతుంది. అమెరికాలో పదహారేళ్ల ప్రవాసం తర్వాత తిరిగి జర్మనీకి చేరుకున్న థామస్ మాన్, ఆయన కుమార్తె ఎరికా కథను ఇది కళ్లెదుట నిలుపుతుంది. రెండో ప్రపంచ యుద్ధ వినాశనపు ఆనవాళ్లు ఇంకా చెరిగిపోని దేశంలో ఒక నల్లటి బ్యూయిక్ కారులో ప్రయాణిస్తూ ఈ తండ్రీకూతుళ్లు అమెరికా ఆధీనంలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి సోవియట్ నియంత్రణలోని వీమర్ వరకు ప్రయాణిస్తారు.
మాన్ విషయానికొస్తే, ఇది కేవలం స్వదేశానికి తిరిగి రావడం మాత్రమే కాదు.. యుద్ధంతో రూపురేఖలు మారిపోయి, పరస్పర విరుద్ధమైన రాజకీయ సిద్ధాంతాలతో చీలిపోయిన తన మాతృభూమిని ప్రత్యక్షంగా చూడడం. ఈ ప్రయాణం సాగుతున్న కొద్దీ, దేశంలోని విభజనలు మాన్ కుటుంబంలోని సంక్లిష్టతలలోనూ ప్రతిధ్వనిస్తూ.. తాము ఎక్కడికి చెందుతామనే భావన, అస్తిత్వం, జ్ఞాపకాలు, సయోధ్యకు సంబంధించిన ప్రశ్నలను బలంగా తెరపైకి తెస్తాయి.
సాండ్రా హుల్లర్, హాన్స్ జిష్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ 82 నిమిషాల చిత్రాన్ని పోలాండ్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ ఏడాది కేన్స్, శాన్ సెబాస్టియన్, టెల్లూరైడ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఈ చిత్రానికి గాను పావ్లికోవ్స్కీ కేన్స్ చలనచిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుడిగా పురస్కారాన్ని అందుకున్నారు.
***