‘ఎల్లల్లేని కథలు’ అనే ప్రధాన ఇతివృత్తంతో 2026 నవంబరు 20 నుంచి 28 వరకు గోవాలో నిర్వహించతలపెట్టిన 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ).. భారతీయ సినిమానే కాకుండా, విలక్షణంగా రూపుదిద్దిన ‘మిషన్ లైఫ్’ విభాగాన్ని కూడా అంతర్జాతీయ సినీ చర్చల్లో అగ్రభాగాన నిలుపుతోంది. భారతీయ భాషా - ప్రాంతీయ కథన వైవిధ్యాన్ని చాటిచెప్పడం, అలాగే పూర్తిగా మానవుడి చుట్టూ కేంద్రీకృతమయ్యే దృక్పథానికే పరిమితం కాకుండా పర్యావరణ పరిణామాలు, ప్రకృతి శక్తి, సుస్థిర సహజీవనాన్ని అన్వేషించే దిశగా సినిమాను ఉత్ప్రేరకంగా ఉపయోగించడం... ఈ రెండు మౌలిక అంశాలను ఒకే వేదికపైకి తీసుకురావడం వెనుక ముఖ్య ఉద్దేశమిదే.
ఈ రెండింటినీ మేళవించడం ద్వారా.. ‘భారత్ లో సృష్టిద్దాం.. ప్రపంచానికి అందిద్దాం (క్రియేట్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్)’ అన్న దేశ దార్శనిక దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడం, వర్ధమాన సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించడం, ఈ భూమి పట్ల, సాటి మనుషుల పట్ల ఉన్న సమష్టి బాధ్యతపై ఆత్మపరిశీలన చేసుకునేలా ప్రేక్షకుల్లో స్ఫూర్తిని నింపడం ఈ చలనచిత్రోత్సవ ప్రధాన లక్ష్యం.
చలనచిత్రోత్సవ కార్యక్రమాలలో కీలక పాత్ర పోషిస్తూ.. ‘భారతీయ సినిమా’ ఎప్పటిలాగే ఇఫీకి హృదయంగా నిలుస్తోంది. దేశంలోని చిత్రనిర్మాణ అనుకూల విధానాలనూ, శక్తిమంతమైన సృజనాధార ఆర్థిక వ్యవస్థను చాటిచెబుతూ.. 30 ఫీచర్ చిత్రాలు, 20 నాన్-ఫీచర్ చిత్రాలు, అత్యుత్తమ వెబ్ సిరీస్ పురస్కారానికి నామినేట్ అయిన ఐదు వెబ్ సిరీస్‌లతో అద్భుత ప్రదర్శనను ‘ఇండియన్ పనోరమా’ విభాగం ప్రేక్షకులకు అందిస్తోంది.
అయిదు ప్రధాన స్రవంతి చిత్రాలు, ‘భారతీయ ఫీచర్ చిత్ర ఉత్తమ తొలి దర్శకుడు’ పురస్కారం కోసం పోటీపడుతున్న అయిదు చిత్రాలతోపాటు.. ‘న్యూ హారిజన్’ విభాగం కింద ప్రపంచ, అంతర్జాతీయ, ఆసియా లేదా భారతీయ ప్రీమియర్‌లుగా ప్రదర్శిస్తున్న ఎంపిక చేసిన చిత్రాలు ఈ ఫీచర్ చిత్రాల జాబితాలో ఉన్నాయి.
ప్రధాన పోటీ విభాగాల్లోనూ భారతీయ చిత్రాలు బలంగా ఉనికిని చాటుకుంటున్నాయి. అంతర్జాతీయ పోటీ విభాగంలో ‘కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1’ (కన్నడ), ‘పారో – ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రైడ్ స్లేవరీ’ (హిందీ), ‘ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్’ (హిందీ) చిత్రాలు పోటీపడుతున్నాయి. వీటితోపాటు, ‘ఉత్తమ తొలి ఫీచర్ చిత్రం’ విభాగంలో ‘బర్డ్స్ ఆన్ ఐస్’ (లడఖీ), ‘స్లెడ్జ్’ (కాశ్మీరీ) చిత్రాలు ఉండగా.. ఐసీఎఫ్‌టీ–యునెస్కో గాంధీ పతకం కోసం ‘కబీర్ సర్ కా ఆఖరీ లెసన్’ (హిందీ), ‘ప్లేయర్ 5’ (తమిళం), ‘సేవ్ మిచ్చర్’ (హిందీ) చిత్రాలు పోటీపడుతున్నాయి.
అంతేకాకుండా సుసంపన్నమైన భారతీయ సినీ వారసత్వాన్ని స్మరించుకుంటూ... ‘తులాభారం’, ‘సాధి మానసే’, ‘వక్త్’, ‘కాశ్మీర్ కీ కలీ’, ‘చౌరంగీ’ వంటి క్లాసిక్ చిత్రాల వందేళ్ల వేడుకలనూ, ‘భక్త కన్నప్ప’, ‘కభీ కభీ’ చిత్రాల స్వర్ణోత్సవాలనూ ఈ చిత్రోత్సవంలో నిర్వహిస్తున్నారు. సినీ దిగ్గజాలు భారతీరాజా, కె. భాగ్యరాజ్, నానా పటేకర్‌లకు ప్రత్యేక నివాళి అర్పించడంతోపాటు.. ‘క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో’ ఆరో ఎడిషన్ ద్వారా 13 చలనచిత్ర విభాగాలకు చెందిన 100 మంది యువ ప్రతిభావంతులకు ఈ వేదిక ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు.
ఈ జాతీయ కథనోత్సవానికి అనుబంధంగా.. పర్యావరణ మార్పులు, మానవ–మానవేతర జీవుల మధ్య సంబంధాలు, సుస్థిర జీవన విధానంపై పునరాలోచించాల్సిన తక్షణ ఆవశ్యకతను పరిశీలించే అయిదు అంతర్జాతీయ చిత్రాలను ప్రత్యేకంగా రూపుదిద్దిన ‘మిషన్ లైఫ్’ విభాగంలో ప్రదర్శిస్తున్నారు.
మారియా మోలినా పీరో దర్శకత్వంలో నెదర్లాండ్స్ – స్పెయిన్ సంయుక్త నిర్మాణంగా రూపొందిన ‘లైక్ ఎనీ అదర్ మోర్టల్’ (కొమో టొడో మోర్టల్) చిత్రం కూడా ఇందులో ఉంది. ఆసియా ప్రీమియర్‌గా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం.. డాక్యుమెంటరీ, ఫ్లెమెన్కో నృత్యం, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవిస్తూ అండలూసియాలోని పురాతన గనుల తవ్వకపు గుర్తులకూ, అంగారక గ్రహంపై రోబోటిక్ అన్వేషణలకు మధ్య ఉన్న పోలికలను ఆవిష్కరిస్తుంది.
ఈక్వెడార్, చిలీ, జర్మనీల నుంచి ఆసియా ప్రీమియర్‌గా ప్రదర్శితమవుతున్న వెరెనిస్ బెనిటెజ్ చిత్రం ‘నుంకుయ్’. గనుల తవ్వకపు కంపెనీలు తన మాతృభూమిని ఆక్రమించుకుంటున్న తరుణంలో పూర్వీకుల పాటలు, అటవీ శక్తులు, పర్యావరణ వారసత్వాల నుంచి శక్తిని పొందే అమెజాన్ షువార్ తెగకు చెందిన ఒక యువతి కథ ఇది.
నెదర్లాండ్స్, ఇండోనేషియాల నుంచి భారత ప్రీమియర్‌గా ప్రదర్శితమవుతున్న సబైన్ గ్రోనెవెగెన్ చిత్రం ‘ది క్లియరింగ్’. పాత ఆర్కైవల్ దృశ్యాలు, సమకాలీన ఫుటేజీలను మేళవిస్తూ.. సుమత్రా వర్షారణ్యాలను వలసవాద పాలకులు రబ్బరు తోటలుగా మార్చిన తీరునూ, ఆ దోపిడీ, ప్రతిఘటనల తాలూకు శాశ్వత వారసత్వాన్నీ ఈ సినిమా కళ్లకు కడుతుంది.
‘మిషన్ లైఫ్’ జాబితాను మరింత సుసంపన్నం చేస్తూ.. భారత ప్రీమియర్‌గా ప్రదర్శితమవుతున్న లియోనార్డో పిరోండి పోర్చుగల్–బ్రెజిల్ ప్రయోగాత్మక సైన్స్ ఫిక్షన్ ఫీచర్ చిత్రం ‘ట్రాపికల్ ఫ్రాక్టల్స్’. విధ్వంసానికి గురై ఇప్పుడిప్పుడే కోలుకోవడం ప్రారంభిస్తున్న భూగ్రహంపై ఒక ఒంటరి సంచారి ప్రయాణిస్తుండగా.. భూమిపై మిగిలి ఉన్న చివరి ఆనవాళ్లను అధ్యయనం చేసే అంతరిక్ష శాస్త్రవేత్తలు, ఒక కృత్రిమ మేధ వ్యవస్థ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ప్రముఖ కంబోడియన్ - ఫ్రెంచ్ దర్శకుడు రితీ పాన్ రూపొందించిన ‘వి ఆర్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ (నౌస్ సోమెస్ లెస్ ఫ్రూట్స్ డి లా ఫోరెట్) అనే డాక్యుమెంటరీ చిత్రంతో ఈ విభాగం పరిపూర్ణమవుతోంది. భారత ప్రీమియర్‌గా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం.. కార్పొరేట్ ఆక్రమణలు, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే వ్యవసాయ సంక్షోభాల నుంచి తమ పూర్వీకుల సంప్రదాయాలనూ, సారవంతమైన భూమినీ కాపాడుకోవడానికి కంబోడియాలోని మారుమూల పర్వత ప్రాంతాలలో నివసించే స్థానిక ‘బునోంగ్’ తెగ ప్రజల పోరాటాన్ని కళ్లకు కడుతుంది.
భారతదేశపు కాలాతీత కథన సంప్రదాయాలనూ, పర్యావరణ పరిరక్షణపై జరుగుతున్న తక్షణ అంతర్జాతీయ చర్చలతో అనుసంధానిస్తూ... సరిహద్దులకు అతీతంగా విభిన్న సంస్కృతులను ఏకం చేసేదిగా సినిమాకు ఉన్న శక్తిని ఈ 57వ ఇఫీ మరోసారి స్పష్టం చేస్తోంది.