సరిహద్దులు, తరాలు, సంస్కృతులను దాటి ప్రయాణించే కథల ఆధారంగానే సినిమా తెరకెక్కుతుంది. కానీ ప్రతి సినిమా వెనుక చెప్పుకోవడానికి మరో కథ సిద్ధంగా ఉంటుంది. అది దర్శకుడిది, సృజనాత్మక ప్రక్రియది, కష్టాలది, ఆ సినిమాను తీర్చిదిద్దిన వారిది.
ఇలాంటి కథలపై 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) దృష్టి సారించింది. ఈ ఏడాది ఇతివృత్తమైన ‘‘స్టోరీస్ వితవుట్ బోర్డర్స్’’ ఆధారంగా... పూర్తిగా సినిమాపైనే దృష్టి సారించే కొత్త విభాగాన్ని ప్రారంభించింది. దిగ్గజ ఫిలింమేకర్లు, నటులు, తెరకెక్కుండా ఆగిపోయిన చిత్రాల కథల ద్వారా సినిమాను ఈ స్థాయికి తెచ్చిన ఎన్నో ప్రయాణాలను అన్వేషించే అవకాశాన్ని ఈ విభాగం ప్రేక్షకులకు కల్పిస్తోంది.
కెమెరా వెనక ఉంటూ సినిమాకు జీవం పోసే కథలు, కథకులు, సృజనాత్మక ప్రయాణాల గురించి అన్వేషించేందుకు 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) ఒక ప్రత్యేక వేదికను పరిచయం చేస్తోంది. ఇందులో సినిమానే కథకుడిగా, కథగా మారుతుంది. చిత్రోత్సవ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ‘ఫిల్మ్స్ అబౌట్ ఫిల్మ్స్’ పేరుతో ఈ సరికొత్త విభాగాన్ని పరిచయం చేస్తోంది. 2026 నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న 57వ ఇఫీలో చిత్రనిర్మాణ కళను, నైపుణ్యాన్ని నిశితంగా పరిశీలించాలని ప్రేక్షకులను ఆహ్వానిస్తోంది.
చిత్రనిర్మాణ కళను, నైపుణ్యాన్ని ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రముఖ ఫిలింమేకర్ల సూచనల మేరకు చేర్చిన ఈ విభాగం తొలి విడతలో అయిదు అంతర్జాతీయ చిత్రాలు ఉన్నాయి. యూకే, యూఎస్ఏ, రష్యా, జార్జియా, ఎస్టోనియా, టర్కీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ – ఈ పది దేశాల నిర్మాణ, సహ-నిర్మాణ భాగస్వామ్యాలతో ఈ చిత్రాలు తెరకెక్కాయి. ఇవి ప్రపంచ సినిమాను తీర్చిదిద్దిన వారి జీవితాలు, వారసత్వాలను దగ్గరగా చూసే అరుదైన అవకాశాన్ని సినీ ప్రియులకు అందిస్తున్నాయి.
సినిమా భాషపై చెరగని ముద్ర వేసిన చిత్రరూపకర్తతో ఈ విభాగ ప్రయాణం మొదలవుతుంది.
బార్నబీ థాంప్సన్ దర్శకత్వం వహించిన 'మావెరిక్: ది ఎపిక్ అడ్వెంచర్స్ ఆఫ్ డేవిడ్ లీన్' (యూకే, యూఎస్ఏ | 2026 | ఇంగ్లీష్ | 105 నిమిషాలు) అనే డాక్యుమెంటరీ, దిగ్గజ చిత్రరూపకర్త డేవిడ్ లీన్ జీవితాన్ని, కెరీర్‌ను అన్వేషిస్తుంది. ఆయన సృజనాత్మక దృష్టిని, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను, సినిమా సరిహద్దులను అధిగమించాలనే సంకల్పాన్ని పరిశీలిస్తుంది. అదే సమయంలో ఆయన సాధించిన వృత్తిపరమైన విజయాల వెనక దాగున్న వ్యక్తిగత పోరాటాలను, ఆధునిక సినిమాపై ఆయన వేసిన శాశ్వత ముద్రను కూడా వివరిస్తుంది.
ప్రఖ్యాత చిత్రరూపకర్త వారసత్వం నుంచి సినిమా కథలను తీర్చిదిద్దే జీవితాలు, సంబంధాల దిశగా తదుపరి సినిమాకు ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది. అలాగే మానవ అనుభవాలను మరింత లోతుగా, ఆత్మీయంగా అన్వేషిస్తుంది.
రష్యాకు చెందిన రౌల్ గైదరోవ్ దర్శకత్వం వహించిన ‘సిడ్నీ లూమెట్స్ బర్త్‌డే’ (రష్యా | 2025 | రష్యన్ | 92 నిమిషాలు) చిత్ర కథ ఒకప్పుడు పెద్ద కుటుంబంగా ఉన్న ఇంట్లో ప్రస్తుతం మిగిలి ఉన్న కుటుంబ సభ్యుల్లో ఒకరైన తన బామ్మతో కలిసి నివసిస్తున్న 17 ఏళ్ల జార్జియన్ కుర్రాడు దాటో చుట్టూ తిరుగుతుంది. చాలా కాలం తర్వాత అతని తల్లి ఊహించని విధంగా తిరిగి రావడంతో ప్రశాంతంగా సాగే వారి దైనందిన జీవితానికి ఆటంకం కలుగుతుంది. ఈ కథ కుటుంబ సంబంధాలను, ఎదిగే క్రమాన్ని, కష్టమైన పరిస్థితుల్లోనూ మానవత్వాన్ని నిలుపుకోవడానికి చేసే పోరాటాన్ని అన్వేషిస్తుంది.
జీవితం, కళ మధ్య ఉన్న సంబంధమే ప్రధానంగా తదుపరి చిత్రం సాగుతుంది. దీనిలో నటుడికి, అతడు పోషించే పాత్రకు మధ్య ఉన్న సరిహద్దులు క్రమేపీ కరిగిపోవడం ప్రారంభిస్తాయి.
చాలా విరామం తర్వాత తిరిగి నటనలోకి అడుగుపెట్టి, ఓ యువ దర్శకుడి మొదటి సినిమా కోసం ఆడిషన్‌కు హాజరయ్యే ప్రఖ్యాత జార్జియన్ నటుడి చుట్టూ అనా ఉరుషాద్జే తెరకెక్కించిన ‘సపోర్టింగ్ రోల్ (మెయోరెఖారిస్ఖోవాని రోలి)’ (జార్జియా, ఎస్టోనియా, టర్కీ, స్విట్జర్లాండ్, యూఎస్ఏ | 2026 | జార్జియన్, అర్మేనియన్ | 139 నిమిషాలు) సినిమా కథ తిరుగుతుంది. తాను ఎప్పుడూ పోషించే కథానాయక పాత్రలకు భిన్నంగా ఒక అసాధారణమైన సహాయక పాత్ర నటుడికి లభిస్తుంది. క్రమంగా ఆ పాత్రతో అతడు మమేకమవుతాడు. ఆ అనుభవం అతనిలో మార్పునకు నాంది పలుకుతుంది.
ఒక నటుడి వ్యక్తిగత ప్రయాణం నుంచి, అసలు తెరపైకి రాకుండానే ఆగిపోయిన ఒక సినిమా కథ దిశగా ఈ విభాగంలో ప్రయాణం ముందుకు సాగుతుంది. ఒక సినిమాను తెరకెక్కించడం చుట్టూ ఉండే రాజకీయ, చారిత్రక పరిస్థితులు కూడా దాన్ని ఎలా తీర్చిదిద్దుతాయో ఇది వెల్లడిస్తుంది.
‘ది మ్యాడ్ డాగ్ ఆఫ్ యూరప్’ (ఫ్రాన్స్, జర్మనీ | 2026 | ఇంగ్లీష్ | 83 నిమిషాలు) చిత్రంలో హిట్లర్, నాజీయిజం ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఒక జర్మన్-యూదు కుటుంబం గురించి 1932లో హెర్మన్ జె. మాంకీవిజ్ రాసిన, ఇప్పటికీ తెరకెక్కని స్క్రీన్‌ప్లేను దర్శకురాలు రుబికా షా మరోసారి పరిశీలిస్తారు. రాజకీయ ఒత్తిళ్లు, వాణిజ్య ప్రయోజనాల కారణంగా హాలీవుడ్ స్టూడియోలు ఈ కథను తెరకెక్కించకుండా అడ్డుకోవడం వెనుక ఉన్న కారణాలను, ప్రస్తుత పరిస్థితుల్లో దానికి ఉన్న ప్రాముఖ్యాన్ని ఈ డాక్యుమెంటరీ విశ్లేషిస్తుంది.
సినిమాను తీర్చిదిద్దే జీవితాలు, సృజనాత్మక పోరాటాలు, వారసత్వాల మీదుగా సాగే ఈ ప్రయాణం, అత్యంత ప్రభావశీలురైన సినీ దిగ్గజాలలో ఒకరికి నివాళి అర్పించడంతో పూర్తవుతుంది.
ఈ జాబితాలో చివరి చిత్రం ఫ్రాన్సిస్కో జిప్పెల్ దర్శకత్వం వహించిన ‘విట్టోరియో డి సికా - స్టేజింగ్ లైఫ్’ (ఇటలీ | 2026 | ఇటాలియన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, రష్యన్, ఫార్సీ | 100 నిమిషాలు). ఈ సినిమా ప్రపంచ సినీ దిగ్గజాల్లో ఒకరైన విట్టోరియో డి సికా జీవితాన్ని ఆత్మీయంగా ఆవిష్కరిస్తుంది. అరుదైన ఆర్కైవల్ సమాచారం, కుటుంబ సభ్యుల సహకారం, సినీ దర్శకులు, సమకాలీన కళాకారుల అనుభవాల ఆధారంగా ఈ డాక్యుమెంటరీ ఆయన జీవితాన్ని, కృషిని, సినీ వారసత్వాన్ని వివరిస్తుంది.
ఈ అయిదు చిత్రాలు కలిసి సినిమా నిర్మాణ ప్రక్రియను కేవలం పైపైన చూపించడమే కాకుండా అంతకుమించిన అనుభూతిని అందిస్తాయి. ఇవి కెమెరా వెనుక ఉన్న వ్యక్తులను, నటనకు ప్రాణం పోసే జీవితాలను, ఇప్పటికీ బయటకు రాని కథలను, తరతరాల దర్శకులను ప్రభావితం చేస్తున్న వారసత్వాలను అన్వేషిస్తాయి. ఈ వైవిధ్యభరితమైన ప్రయాణాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఈ కొత్త విభాగం ఇఫీ ఇతివృత్తమైన ‘‘స్టోరీస్ వితవుట్ బోర్డర్స్’’కు మరో కొత్త కోణాన్ని జోడిస్తోంది. సినిమా పరిధి కేవలం తెరపై కనిపించే కథలకే పరిమితం కాదని, వాటికి జీవం పోసే సృజనాత్మక ప్రయాణాలు, చారిత్రక నేపథ్యాలు, మానవ అనుభవాల వరకు విస్తరించి ఉంటుందని ఇది ప్రేక్షకులకు గుర్తుచేస్తుంది. తన తొలి అడుగుతోనే, ‘ఫిల్మ్స్ అబౌట్ ఫిల్మ్స్’ విభాగం చిత్రనిర్మాణ కళను, నైపుణ్యాన్ని ఒక సరికొత్త కోణంలో ఆస్వాదించే అవకాశాన్ని కూడా ప్రేక్షకులకు కల్పిస్తోంది.
57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) 2026 నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరుగుతుంది. ‘‘స్టోరీస్ వితవుట్ బోర్డర్స్’’ అనే ఇతివృత్తం ద్వారా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫిలిం మేకర్లు, పరిశ్రమ నిపుణులు, సినిమా ప్రియులను ఒక్కచోట చేరుస్తుంది.
వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన దర్శకులు, నటులు, సినీ వారసత్వాల కథలను ఒకే చోట చేర్చడం ద్వారా కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఫిల్మ్స్ అబౌట్ ఫిల్మ్స్’ విభాగం ఈ ఏడాది ఇతివృత్తాన్ని ప్రతిబింబిస్తోంది. అలాగే చిత్రనిర్మాణ కళ భౌగోళిక సరిహద్దులను ఎలా అధిగమిస్తుందో చాటిచెబుతోంది.
సినిమా వెనుక ఉన్న వ్యక్తులు, ఆలోచనలు, అనుభవాలను అన్వేషించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దర్శకులను, ప్రేక్షకులను కలిపే సార్వత్రిక సృజనాత్మక ప్రయాణాలను ఈ విభాగం వెలుగులోకి తీసుకువస్తుంది. భారతీయ, అంతర్జాతీయ చిత్రాల వైవిధ్యభరితమైన ఎంపికతో పాటు ఎంపిక చేసిన దేశానికి సంబంధించిన సినిమాలు, ప్రీమియర్లు, పోటీలు, పరిశ్రమ కార్యక్రమాలతో అత్యుత్తమ చిత్రాలను ప్రోత్సహించే, సినిమా ద్వారా విభిన్న సంస్కృతులను కలిపే తన సంప్రదాయాన్ని ఇఫీ–2026 కొనసాగిస్తోంది.
***