57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈశాన్య చిత్రసీమకు ప్రత్యేక గుర్తింపు

'ఇండియన్ పనోరమా' విభాగానికి నాలుగు సినిమాలు ఎంపిక

ఫీచర్ ఫిల్మ్ విభాగంలో తొలిసారి వరల్డ్ ప్రీమియర్‌గా 'ఉరుమ్', 'సూర్యముఖి' చిత్రాలు

ఈశాన్య భారత సాంస్కృతిక కథలను నాన్-ఫీచర్ ఫిల్మ్ విభాగం వేదికపైకి తీసుకెళ్తున్న… ‘రెడ్ కార్పెట్', 'చలో ఇండియా విత్ ఎరిక్ జీ – మిజోరం' చిత్రాలు

నాడు పోస్టు చేయడమైనది: 17 NOV 2026 2:25PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2337713Views: 7

ఈశాన్య భారత వైవిధ్యభరితమైన సంస్కృతి, హృదయాన్ని హత్తుకునే కథలు, విలక్షణమైన సినీ గళాలు 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) వేదికపై ప్రత్యేక గుర్తింపు పొందనున్నాయి. ప్రతిష్ఠాత్మక 'ఇండియన్ పనోరమా' విభాగానికి ఈ ప్రాంతం నుంచి ఏకంగా నాలుగు చిత్రాలు ఎంపికయ్యాయి. ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న ఈ చిత్రోత్సవంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన రెండు ఫీచర్ ఫిల్మ్‌లు, రెండు నాన్-ఫీచర్ ఫిల్మ్‌లను ప్రదర్శించనున్నారు. ఇవి ఆ ప్రాంతపు దేశీయ వారసత్వం, సామాజిక మార్పులు, ప్రజల రోజువారీ జీవితాలను ప్రేక్షకుల కళ్లకు కట్టనున్నాయి.

ఫీచర్ ఫిల్మ్‌ల ఎంపికలో 'ఉరుమ్' (స్పిరిట్) చిత్రం అగ్రస్థానంలో నిలిచింది. ఐఎఫ్ఎఫ్ఐలో 'ఇండియన్ పనోరమా' విభాగానికి ఎంపికైన తొలి న్యిషి భాషా చిత్రంగా ఇది చరిత్ర సృష్టించింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన దుయు తబ్యో దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్... ఈ చిత్రోత్సవంలో తొలిసారి వరల్డ్ ప్రీమియర్‌గా ప్రదర్శితం కానుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఒక మారుమూల పర్వత గ్రామంలో సాగే ఈ కథ... తన చిన్నారి కుమార్తెను కోల్పోయిన తర్వాత భ్రమలు, అపరాధ భావనతో సతమతమయ్యే ఓ తండ్రి నేపథ్యంలో సాగుతుంది. దీని ద్వారా స్థానిక ప్రజల జ్ఞాపకాలు, మానసిక వేదన, దాగి ఉన్న నిజాలను ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది.

ఫీచర్ ఫిల్మ్ విభాగంలో వరల్డ్ ప్రీమియర్‌గా ప్రదర్శనకు సిద్ధమవుతున్న 'ఉరుమ్' సరసన అస్సామీ డ్రామా చిత్రం 'సూర్యముఖి' (సన్‌ఫ్లవర్) నిలిచింది. నటి, దర్శకురాలు, రంగస్థల కళాకారిణి అంతరా జి.జి. చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నగర నేపథ్యంలో సాగే ఈ కథ... కలిసి పనిచేసే పుష్పల్, ప్రార్థన అనే ఇద్దరు యువ సహోద్యోగుల చుట్టూ తిరుగుతుంది. మొదట్లో వీరి మధ్య ఉండే పోటీతత్వం క్రమంగా స్నేహంగా, ఆపై ప్రేమగా మారుతుంది. అయితే, దారిలో దొరికిన ఒక డబ్బుల సంచీ వారి జీవితాల్లో అనూహ్యమైన నైతిక సందిగ్ధతలకు దారితీస్తుంది. ఆ పరిస్థితి వారి నిర్ణయాలను, అనుబంధాలను ఎలా పరీక్షించిందన్నదే ఈ చిత్ర కథాంశం.

ఇండియన్ పనోరమా నాన్-ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అస్సాం, మిజోరం రాష్ట్రాలకు చెందిన రెండు విలక్షణమైన కథలు చోటు దక్కించుకున్నాయి. పురస్కార గ్రహీత, ప్రముఖ చిత్రనిర్మాత ఐమీ బారువా రచించి, దర్శకత్వం వహించిన 30 నిమిషాల అస్సామీ డాక్యుమెంటరీ 'రెడ్ కార్పెట్'... సంప్రదాయ చేనేత కళా నైపుణ్యాల శాశ్వత వారసత్వాన్ని చాటిచెబుతుంది. అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ కొండల నేపథ్యంలో సాగే ఈ చిత్రం... డోంకామోకం గ్రామానికి చెందిన ఒక కర్బీ చేనేత కళాకారిణి కేన్స్ చిత్రోత్సవ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టిన అసాధారణ ప్రయాణాన్ని చూపిస్తుంది. ఆమె జీవిత కథ ద్వారా స్థానిక కళాకారుల పట్టుదల, కర్బీ నేతపని సంప్రదాయాల గొప్పతనం, పూర్వీకుల హస్తకళలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా ప్రదర్శిస్తుంది.   

నాన్-ఫీచర్ విభాగంలో ఎంపికైన మరో చిత్రం 'చలో ఇండియా విత్ ఎరిక్ జీ - మిజోరం'. రాజ్‌దీప్ చౌదరి దర్శకత్వం వహించిన 48 నిమిషాల ఈ ఆంగ్ల డాక్యుమెంటరీ... బ్రిటిష్ మాజీ పార్లమెంటు సభ్యుడు, చరిత్ర ఉపాధ్యాయుడు అయిన ఎరిక్ ఒల్లెరెన్‌షా ఓబీఈ మిజోరం సామాజిక, సాంస్కృతిక వైభవాన్ని అన్వేషించే క్రమంలో సాగుతుంది. ఈ రాష్ట్రంలోని అత్యధిక అక్షరాస్యత స్థాయిలు, పౌరుల్లో క్రమశిక్షణ, ఉత్సాహభరితమైన ఫుట్‌బాల్ సంస్కృతిని ఇది కళ్లకు కడుతుంది. వ్యాపారం, విద్య, సామాజిక నాయకత్వంలో మిజో మహిళలు అందిస్తున్న విశేష సేవలను ఈ చిత్రం ప్రత్యేకంగా చాటిచెబుతుంది.

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2337713
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026