నాడు పోస్టు చేయడమైనది:
16 NOV 2026 5:00PM by PIB Hyderabad
కేంద్ర సమాచార, ప్రసార, రైల్వేలు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికశాఖల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ నేడు న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్‌లోని రంగ్‌భవన్ ఆడిటోరియంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన జాతీయ పత్రికా దినోత్సవ వేడుకల్లో పాల్గొని, ప్రసంగించారు.

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న ఆయన.. వేగంగా మారుతున్న మీడియా రంగానికి, సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా మీడియా నిపుణులు తమను తాము మలచుకోవాలని పిలుపునిచ్చారు. బాధ్యతాయుతమైన జర్నలిజం పాటించాల్సిన ఆవశ్యకతను, సమాజం పట్ల మీడియాకు ఉన్న బాధ్యతను ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ జస్టిస్ (రిటైర్డ్) రంజనా ప్రకాశ్ దేశాయ్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్, ప్రముఖ పాత్రికేయుడు రజత్ శర్మ, పీసీఐ సభ్యుడు డాక్టర్ సుధాన్షు త్రివేది పాల్గొన్నారు. ఈ ఏడాది ‘జర్నలిజం: ప్రజాకర్షకమా? బాధ్యతాయుతమైనదా?’ అనే ఇతివృత్తం.. సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతున్న, డిజిటల్ ప్రభావం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో జర్నలిజం మారుతున్న పాత్రను ప్రతిబింబించింది.
పౌరులకు సాధికారత కల్పించి, సమాజాన్ని బలోపేతం చేసేందుకు సమష్టి కృషి అవసరం: శ్రీ అశ్విని వైష్ణవ్
సభికులను ఉద్దేశించి శ్రీ అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానంలో అపూర్వమైన వేగంతో మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాల్లో వచ్చిన మార్పులకంటే ఎక్కువ మార్పులు రాబోయే అయిదేళ్లలో చోటుచేసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మార్పులను స్వాగతిస్తూ, తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచుకోవాలని యువ పాత్రికేయులకు సూచించారు.

డిజిటల్ వేదికల జవాబుదారీతనాన్ని ప్రస్తావిస్తూ.. తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌లు, తప్పుదారి పట్టించే ప్రకటనలు, డిజిటల్ అరెస్టులు, చిన్నారులపై ప్రభావం చూపే హానికరమైన కంటెంట్ పెరుగుతున్న నేపథ్యంలో కేవలం కమ్యూనిటీ మార్గదర్శకాలు సరిపోతాయా? అని ఆయన ప్రశ్నించారు. పౌరులకు సాధికారత కల్పించడంతోపాటు, కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు మారుతున్న మీడియా రంగాన్ని ఏ విధంగా నియంత్రించాలనే అంశంపై చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
సంచలనాత్మకతకు, బాధ్యతాయుత జర్నలిజానికి మధ్య సన్నని గీత ఉంది: శ్రీ రజత్ శర్మ
శ్రీ రజత్ శర్మ మాట్లాడుతూ.. సంచలనాత్మకతకు, బాధ్యతాయుత జర్నలిజానికి మధ్య చాలా సన్నని గీత ఉందని పేర్కొన్నారు. సంపాదకీయ విచక్షణ, బాధ్యతాయుతమైన వార్తా కథనాల ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. అత్యవసర పరిస్థితి, 26/11 ముంబై ఉగ్రదాడులు, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. ముఖ్యంగా జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై వార్తలు అందించేటప్పుడు సంయమనం, సమాచార నిర్ధారణ, సున్నితత్వం పాటించాల్సిన అవసరాన్ని ఆయన తెలిపారు. డిజిటల్ మీడియా వ్యవస్థలో మరింత జవాబుదారీతనం ఉండాలని పిలుపునిస్తూ.. సంచలనాత్మకత కంటే కచ్చితత్వానికి పాత్రికేయులు ప్రాధాన్యమివ్వాలని కోరారు. ‘‘తక్కువ గందరగోలం.. ఎక్కువ వార్తలు.. తక్కువ సంచలనం.. ఎక్కువ బాధ్యత’’ అనే సందేశంతో తన ప్రసంగాన్ని ముగించారు.
పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ, పాత్రికేయ ప్రమాణాల మెరుగుదలకు కట్టుబడి ఉన్నాం: పీసీఐ చైర్‌పర్సన్
పీసీఐ ఛైర్‌పర్సన్ జస్టిస్ (రిటైర్డ్) శ్రీ రంజనా ప్రకాశ్ దేశాయ్ మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడంతోపాటు పాత్రికేయ ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కౌన్సిల్ కట్టుబడి ఉందని తెలిపారు. మీడియా రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులను ప్రస్తావిస్తూ.. సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి కారణంగా కేవలం కొన్ని సెకన్లలోనే లక్షలాది మందికి సమాచారం అందుబాటులోకి వస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఎవరైనా వార్తలను వ్యాప్తి చేయగలుగుతున్నారని, అయితే వార్తలు అందించే వారందరికీ పాత్రికేయ నైతిక విలువలపై శిక్షణ ఉండటం లేదని, వాటికి కట్టుబడి ఉండటం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

కృత్రిమ మేధ యుగంలో వార్తల కచ్చితత్వం, సంపాదకీయ విచక్షణ, మానవ జవాబుదారీతనం కీలకం: శ్రీ చంచల్ కుమార్
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి చంచల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజల ఆసక్తిని ఆకర్షించడంతోపాటు విశ్వసనీయతను కాపాడుకునేలా జర్నలిజం సమతుల్యత పాటించాలని అన్నారు. ప్రజాదరణకు సత్యం కంటే ప్రాధాన్యం ఇవ్వకూడదని, వైరల్ కావడాన్ని సమాచార నిర్ధారణ కంటే ముఖ్యమైనదిగా చూడకూడదని పేర్కొన్నారు. టీఆర్పీలు, క్లిక్‌లు, డిజిటల్ మాధ్యమాల్లో ప్రజల స్పందన ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో సంపాదకీయ విచక్షణ, వాస్తవాల పరిశీలన, వార్తలకు-అభిప్రాయాలకు మధ్య తేడాను గుర్తించడం ఎంతో ముఖ్యమని చెప్పారు. కృత్రిమ మేధ జర్నలిజానికి సహకరించగలదని, కానీ ఒక పాత్రికేయుడి బాధ్యతను మాత్రం అది చేపట్టలేదని స్పష్టం చేశారు.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సుధాన్షు త్రివేది మాట్లాడుతూ.. అంతర్జాతీయ సూచీలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి దిశగా భారత్ నూతన పంథాలో ముందుకు సాగుతున్న తరుణంలో నిజాయతీ, బాధ్యతాయుతంగా సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు.
పాత్రికేయ ప్రవర్తన నియమావళి–2026 సంచికను విడుదల చేసిన పీసీఐ
ఈ వేడుకల్లో భాగంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ‘పాత్రికేయ ప్రవర్తనా నియమావళి–2026’ సంచికను విడుదల చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇందులో పలు అంశాలకు సంబంధించి నవీకరించిన మార్గదర్శకాలను పొందుపరిచారు. అవి..

· ప్రకృతి విపత్తులు, సంఘర్షణ పరిస్థితుల సమయంలో వార్తల సేకరణ, ప్రసారం.
· నిరసనలు, ఆందోళనలపై వార్తల కవరేజీ.
· సెక్స్ వర్కర్లు, దివ్యాంగులపై వార్తల కవరేజీ.
· చిన్నారుల గోప్యతకు రక్షణ.
· ఆన్‌లైన్ మనీ గేమ్‌లకు సంబంధించిన ప్రకటనలు.. ఆన్‌లైన్ గేమింగ్ ప్రోత్సాహం, నియంత్రణ చట్టం–2025కు అనుగుణంగా మార్గదర్శకాలు.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి
స్వేచ్ఛాయుత, బాధ్యతాయుత వార్తా ప్రసారాన్ని నిర్ధారించేందుకు ప్రింట్ మీడియా కోసం అంతర్గత స్వీయ నియంత్రణ వ్యవస్థను అందించాలనే లక్ష్యంతో, పార్లమెంటు చట్టం ద్వారా 1966లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పాక్షిక న్యాయ సంస్థగా ఏర్పాటైంది. 1979లో దీనిని పునరుద్ధరించారు. అప్పటి నుంచి దేశంలోని పత్రికలు, వార్తా సంస్థల ప్రమాణాలను పెంపొందించడంతోపాటు పత్రికా స్వేచ్ఛను పరిరక్షించేందుకు, కాపాడేందుకు కౌన్సిల్ నిరంతరం కృషి చేస్తోంది.
***