నాడు పోస్టు చేయడమైనది:
15 NOV 2026 12:19PM by PIB Hyderabad
ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇరవై అయిదేళ్ల ప్రస్థానం నుంచి పాఠాలు నేర్చుకునేందుకు నవంబర్ 17, 2026 నుంచి అయిదు జాతీయ కార్యశాలల సిరీస్‌ను నీతి ఆయోగ్ ప్రారంభించనుంది. పాతికేళ్ల ఈ ప్రజా నాయకత్వాన్ని అధ్యయనం చేసి, దాని ద్వారా నేర్చుకున్న పాఠాలను దేశ విజ్ఞానంలో భాగం చేయటమే ఈ సిరీస్ ప్రధాన ఉద్దేశం. ఈ ప్రయాణంలో భాగమైన వారి అనుభవాలను డాక్యుమెంట్ చేసి, అందరికీ ప్రయోజనం చేకూర్చే జ్ఞానంగా మలచటమే దీని లక్ష్యం.
అక్టోబర్ 7, 2001న గుజరాత్ ముఖ్యమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవిలో పన్నెండేళ్లకు పైగా సేవలందించిన అనంతరం 2014లో మే నెలలో భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం వరుసగా మూడోసారి పదవీకాలాన్ని ఆయన నిర్వర్తిస్తున్నారు. అక్టోబర్ 7, 2026 నాటికి ఇరవై అయిదేళ్లు పూర్తవటంతో అత్యంత సుదీర్ఘ కాలం నిరంతరాయంగా పాలన అందించిన ఎన్నికైన ప్రభుత్వాధినేతగా రికార్డు సృష్టించారు. ప్రభుత్వంలోని ప్రతి కార్యాలయం పౌరులకు సేవ చేయటానికే ఉందని స్పష్టం చేసేలా ప్రధాన సేవక్ భావనపైనే ఆధారపడి ఈ సమయంలో పాలన సాగింది. సమాజంలోని ప్రతీ వ్యక్తి ప్రగతినే ప్రామాణికంగా... అంత్యోదయ విధానం నిర్దేశించింది. జన్ భాగీదారీ ద్వారా అభివృద్ధి... జన ఉద్యమంగా రూపాంతరం చెందింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ సూత్రం... దీన్ని ఉమ్మడి జాతీయ బాధ్యతగా బలోపేతం చేసింది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యం ఈ విధానానికి దీర్ఘకాలిక దృక్పథాన్ని అందించింది. స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు సమీపిస్తున్న వేళ భారతదేశం కోసం ప్రణాళికలు రూపొందించి, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రతి సంస్థకూ ఇది దిశానిర్దేశం చేస్తోంది.
ఈ స్థాయిలో భారత్ పాలన గురించి నేర్చుకున్న విషయాల్లో ఎక్కువగా నిర్ణయాలు తీసుకున్న, అమలు చేసిన అధికారులు, సంస్థలు, పౌరుల అనుభవాల్లో నిక్షిప్తమై ఉంది. ఈ సిరీస్ వారి తొలి అనుభవాలని రికార్డు చేసి, విద్యాపరమైన ప్రమాణాలతో విశ్లేషిస్తుంది. సివిల్ సర్వెంట్లు, శిక్షణా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు, ప్రజల కోసం కేస్ స్టడీస్, పరిశోధనా పత్రాలు, బోధనా సామాగ్రి రూపంలో ఇనిస్టిట్యూషనల్ లెర్నింగ్ మెటీరియల్‌గా అభివృద్ధి చేస్తుంది.
ఈ అయిదు జాతీయ కార్యశాలలు పలు పాలనాంశాలపై దృష్టి సారిస్తాయి. నవంబర్ 2026లో "లక్ష్యసాధన నాయకత్వం", జనవరి 2027లో "పరిపాలనా ప్రయోజనాలను ప్రజలకు చేర్చటం", ఏప్రిల్ 2027లో "సమ్మిళిత అభివృద్ధి", జూలై 2027లో "నాగరికతా గుర్తింపు", సెప్టెంబర్ 2027లో "ప్రపంచ శక్తిగా భారత్" ఇతివృత్తంతో కార్యశాలలను నిర్వహిస్తారు.
నవంబర్ 17, 2026న న్యూఢిల్లీలోని భారత మండపంలో తొలి జాతీయ కార్యశాలను "లక్ష్యసాధన నాయకత్వం" ఇతివృత్తంతో నిర్వహిస్తారు. నాయకత్వాన్ని స్పష్టంగా ప్రదర్శించే ప్రత్యేక నిర్ణయాలు, ఆ నిర్ణయాలను పౌరులకు ప్రయోజనాలుగా మలిచే విధానంపై ఈ కార్యశాల అధ్యయనం చేస్తుంది. ఈ సదస్సుకు హాజరైనవారికి నీతి ఆయోగ్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి శ్రీ అనురాగ్ జైన్ స్వాగతం పలుకుతారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ అశోక్ కుమార్ లహిరి ప్రారంభోపన్యాసం ఇస్తారు. ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా ప్రారంభంలో కీలక ఉపన్యాసం ఇస్తారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు శ్రీ ఉదయ్ కోటక్ ప్రత్యేక ప్రసంగం చేస్తారు. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఆర్. బాలసుబ్రమణ్యం ఈ కార్యశాల విధివిధానాలను వివరిస్తారు.
నిర్ణయాల్లో ప్రత్యక్ష భాగస్వాములైన ప్రముఖుల అనుభవాలతో కూడిన నాలుగు ప్రత్యేక ప్రసంగాలు నేటి కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. 2001 భూకంపం తర్వాత కచ్ పునర్నిర్మాణంపై గుజరాత్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ రాజీవ్ టోప్నో ప్రసంగిస్తారు. కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొన్న తీరుపై కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి, యూపీఎస్సీ మాజీ చైర్మన్ శ్రీమతి ప్రీతి సూదాన్ మాట్లాడతారు. లఖ్పతి దీదీ పథకంపై గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి శ్రీ శైలేశ్ కుమార్ సింగ్ ప్రసంగిస్తారు. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగానికి అవకాశం కల్పించటంపై ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్ అనుభవాలను పంచుకుంటారు.
"వికసిత్ భారత్ కోసం నాయకత్వం" అంశంపై జరిగే ప్యానెల్ చర్చకు నీతి ఆయోగ్ మాజీ ప్రధాన కార్యనిర్వహణాధికారి శ్రీ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం మధ్యవర్తిగా వ్యవహరిస్తారు. ఈ ప్యానెల్ చర్చలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పట్టణాభివృద్ధి, ఇంధన శాఖ కేబినెట్ మంత్రి శ్రీ అరవింద్ కుమార్ శర్మ, అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ విశాల్ గుప్తా, నీతి ఆయోగ్ విశిష్ట సభ్యురాలు శ్రీమతి దేబ్జాని ఘోష్, హర్దోయ్ జాయింట్ మేజిస్ట్రేట్ నారాయణి భాటియా ప్యానెల్ సభ్యులుగా పాల్గొంటారు.
కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టి.వి. సోమనాథన్ ఈ కార్యశాలను ముగించి... ఐగాట్ కర్మయోగి వేదికపై కర్మయోగి సంకల్పను ప్రారంభిస్తారు. ఈ సంకల్పం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సివిల్ సర్వెంట్లు సొంత నాయకత్వ పద్ధతుల్లో నిర్దిష్టమైన మార్పు కోసం ప్రతిజ్ఞ చేస్తారు.
ఈ కార్యశాలకు దాదాపు 900 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. వారిలో 250 మంది ప్రత్యక్షంగా చర్చల్లో పాల్గొంటారు. వీరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కార్యదర్శులు, సీనియర్ అధికారులు, ఆకాంక్షాత్మక జిల్లాల కలెక్టర్లతో కలిపి 150 మంది ప్రభుత్వాధికారులు ఉంటారు. ప్రముఖ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల నుంచి 25 మంది విద్యార్థులు, జాతీయ ప్రధాన పథకాలకు చెందిన 50 మంది కమ్యూనిటీ భాగస్వాములు, లబ్ధిదారులు కూడా ఉంటారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అమృత్ జ్ఞాన్ కోష్ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన 25 మంది కేస్ ఫెసిలిటేటర్ల ద్వారా సమూహ చర్చలను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమ వివరాలన్నీ ఐగాట్ కర్మయోగి వేదిక ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
***