నాడు పోస్టు చేయడమైనది:
11 NOV 2026 8:52PM by PIB Hyderabad
దిల్లీలో ఈ రోజు (నవంబర్ 11, 2026) 'స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26' పురస్కారాలను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. కేవలం ఒకే సంస్థ ఒంటరిగా స్వచ్ఛతా లక్ష్యాలను సాధించలేదని స్పష్టం చేశారు. దీనికి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఇల్లు, ప్రతి సంఘం, ప్రతి నగర భాగస్వామ్యం అత్యవసరమని ఆమె పేర్కొన్నారు. పరిశుభ్రత కేవలం బహిరంగ ప్రదేశాల సౌందర్యాన్ని కాపాడటానికి మాత్రమే పరిమితమైన అంశం కాదని.. అది మన ఆరోగ్యం, సామాజిక స్పృహ, పరిపాలనా జవాబుదారీతనానికి కూడా ఒక నిదర్శనమని ఆమె ఉద్ఘాటించారు. ఇది మన ఇళ్లలోని అలవాట్లకు కూడా ప్రతిబింబం అని తెలిపారు.
ప్రతి ఒక్క పౌరుడు ముఖ్యంగా యువత, మహిళలు, ఆర్డబ్ల్యూఏలు (రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు), సామాజిక సంఘాలు పరిశుభ్రతకు సంబంధించిన వివిధ అంశాల్లో మమేకం కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. వారు తమ అనుభవాలను పంచుకోవాలని, ఏవైనా లోపాలు ఉంటే వాటిని తెలియజేయాలన్నారు. వాటిపై పని చేయటం ద్వారా మన నగరాలను మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దవచ్చని ఆమె పేర్కొన్నారు. ఇది మున్సిపల్ యంత్రాంగానికి, ప్రజలకు మధ్య నిరంతర చర్చను పెంపొందిస్తుందని.. తద్వారా పరస్పర విశ్వాసం, పారదర్శకత, జవాబుదారీతనం మరింత బలపడతాయని ఆమె ఉద్ఘాటించారు.
తన పరిసరాల పరిశుభ్రతను అంచనా వేసే విషయంలో ప్రజలే అత్యుత్తమ న్యాయనిర్ణేతలని రాష్ట్రపతి పేర్కొన్నారు. అందుకే ప్రజాభిప్రాయాల సేకరణ కేవలం సర్వేలు లేదా ర్యాంకింగ్‌లకు మాత్రమే పరిమితం కాకూడదని ఆమె స్పష్టం చేశారు. దానికి బదులుగా ఈ అభిప్రాయాలు మున్సిపల్ సేవలను మెరుగుపరచడానికి, స్థానిక సవాళ్లను పరిష్కరించడానికి ఒక కీలకమైన సాధనంగా ఉపయోగపడాలని ఉద్ఘాటించారు.
పరిశుభ్రత విషయంలో సానుకూలమైన, ప్రభావవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతికతలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. పలు ఐఐటీలు, ఇతర శాస్త్రీయ పరిశోధనా సంస్థలతో సహా ఇతర సంస్థలు ఈ దిశగా చురుగ్గా పనిచేస్తుండటం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.
స్వచ్ఛతా రంగంలో అనేక రకాల అంకురాలు ఉద్భవించడాన్ని రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటువంటి నూతన పారిశ్రామిక సంస్థలు పరిశుభ్రత విషయంలో ప్రత్యక్ష సవాళ్లను పరిష్కరించడంలో గణనీయమైన సహకారాన్ని అందించడమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కూడా సృష్టించగలవని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
అత్యంత వేగంగా విస్తరిస్తున్న పట్టణ కేంద్రాలైన ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల సామర్థ్యాలను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ నగరాలకు ప్రత్యేకమైన అవసరాలు, సవాళ్లు ఉన్నాయని.. వాటి ప్రత్యేక సమస్యలు, సవాళ్లను పరిష్కరించేలా రూపొందించిన ఒక జాతీయ చట్రం పరిధిలోనే వాటి అభివృద్ధి జరగాలని ఆమె సూచించారు. ప్రథమ శ్రేణి నగరాలు ఎదుర్కొన్న సమస్యల నుంచి ద్వితీయ శ్రేణి నగరాల ప్రణాళికాకర్తలు నేర్చుకోవచ్చని.. ఇందుకోసం వారు ప్రథమ శ్రేణి నగరాల ప్రణాళికాకర్తల అనుభవాలను అధ్యయనం చేయాలని ఆమె తెలిపారు.
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించే 'స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాలు'.. భారత్‌లోని అత్యంత పరిశుభ్రమైన నగరాలను గౌరవిస్తూ 'పట్టణ స్వచ్ఛ భారత్ మిషన్'కు అవి అందించిన అత్యుత్తమ సహకారాన్ని గుర్తించి సత్కరిస్తాయి.
రాష్ట్రపతి హిందీ ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
***