గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వీబీ–జీ రామ్ జీ పథకం పరిధిలో పశుగ్రాసం ఉత్పత్తిని పెంచడానికి, పశుసంపద మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, గ్రామీణ జీవనోపాధికి మద్దతు అందించడానికి గ్రామీణాభివృద్ధి శాఖ, డీఏహెచ్‌డీ సంయుక్త కార్యాచరణ


గ్రామీణ ప్రాంతాల్లో పశుగ్రాసాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద వృద్ధిని ప్రోత్సహించడానికి రాష్ట్రాలు/యూటీలకు సంయుక్త అడ్వయిజరీని జారీ చేసిన కేంద్రం

పశుగ్రాసం సాగు, పచ్చిక బయళ్ల అభివృద్ధి, డెయిరీ మౌలికవసతులు, వెటర్నరీ సౌకర్యాల కోసం 22 అనుమతించదగిన పనుల గుర్తింపు

పశుగ్రాస భద్రత, పశుసంపద అభివృద్ధి, సుస్థిర గ్రామీణ జీవనోపాధులను పెంపొందించేందుకు వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు

నాడు పోస్టు చేయడమైనది: 05 NOV 2026 10:22AM by PIB Hyderabad

వికసిత్ భారత్–రోజ్‌గార్, అజీవికా మిషన్ (గ్రామీణ్) హామీ: వీబీ–జీ రామ్ జీ–2025 పరిధిలో సమన్వయ విధానం ద్వారా పశుగ్రాస భద్రత, పచ్చిక బయళ్ల అభివృద్ధి, పశుసంపదకు అవసరమైన మౌలిక వసతులను బలోపేతం చేయడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంయుక్త అడ్వయిజరీ జారీ అయింది. దీనిని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ గ్రామీణ అభివృద్ది విభాగం (డీవోఆర్‌డీ), మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమ మంత్రిత్వశాఖ పరిధిలోని పశుసంవర్థకం, పాడి పరిశ్రమల విభాగం (డీఏహెచ్‌డీ) సంయుక్తంగా జారీ చేశాయి.

పశుగ్రాసం కొరతను పరిష్కరించడానికి, పశుసంపద సంబంధిత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, గ్రామీణ కుటుంబాలకు, ముఖ్యంగా పశుసంపద, పాడి కార్యకలాపాలపై ఆధారపడిన చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని కుటుంబాల జీవనోపాధికి తోడ్పాటు ఇవ్వడానికి ఏకోన్ముఖ ప్రభుత్వ విధానాన్ని ఈ కార్యక్రమం అవలంబిస్తుంది. చట్టంలోని నిబంధనలు, ప్రణాళికాపరమైన విధివిధానాలకు కట్టుబడి ఉంటూనే గ్రామీణ ఉపాధిని, ఆస్తుల కల్పనను పశుసంవర్ధక రంగ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

వీబీ–జీ రామ్ జీ చట్టం 2026 జులై 1న అమల్లోకి వచ్చింది. ఇది ప్రతి గ్రామీణ కుటుంబానికి 125 రోజుల పాటు వేతనంతో కూడిన ఉపాధికి చట్టబద్దమైన హామీ ఇస్తుంది. జీవనోపాధి సంబంధిత మౌలిక వసతులు, అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించడంతో సహా నాలుగు ప్రధానమైన రంగాల్లో పటిష్ఠమైన ఆస్తులను ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తుంది. పశుగ్రాసం ఉత్పత్తిని పెంచడానికి, సామూహిక పచ్చిక బయళ్లను అభివృద్ధి చేయడానికి, పశుసంవర్థక రంగానికి అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి ఈ చట్టాన్ని సంయుక్త అడ్వయిజరీ ఉపయోగించుకుంటుంది.

పశుగ్రాసం, పశుసంవర్ధకానికి సంబంధించిన మౌలికవసతులకు సంబంధించి అనుమతించదగిన 22 పనుల గుర్తింపు

వీబీ–జీ రామ్ జీ చట్టం ద్వారా గుర్తించిన అనుమతించదగిన 375 పనుల జాబితా నుంచి 22 సంబంధిత పనులను అడ్వయిజరీ గుర్తించింది. పశుగ్రాస సాగు, నిల్వ, పచ్చిక బయళ్ల అభివృద్ధి, పశువుల పాకలు, పాడి మౌలిక సదుపాయాలు, పశువైద్య సదుపాయాలకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి.

ముఖ్యమైన కార్యక్రమాలు:

  • గృహాలు, సమాజాల కోసం పశుగ్రాసం సాగు.

  • సామాజిక పశుగ్రాస వనరులు, పచ్చిక బయళ్లు, మేత భూములు, సిల్వీపాస్చర్ అభివృద్ధి.

  • పశుగ్రాసం నిల్వ సౌకర్యాలు, పశుగ్రాస బ్యాంకులు, సైలేజ్ యూనిట్లు, అర్హత కలిగిన ఇతర దాణా సంబంధిత ఆస్తులు.

  • ఆమోదించిన జాబితా ప్రకారం అర్హులైన లబ్ధిదారులు, సమాజాల కోసం పశువులు, మేకలు, పందులు, కోళ్ల షెడ్లతో సహా ఇతర జంతువుల శాలల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ.

  • సామాజిక పాల సేకరణ కేంద్రాల నిర్మాణం, మరమ్మతులు.

  • సామాజిక పశువైద్య కేంద్రాల నిర్మాణం, మరమ్మతులు.

  • పశువులు, జంతువుల కోసం సామూహిక నీటితొట్టెల నిర్మాణం.

  • ఆమోదిత జాబితాలో చేర్చిన విధంగా వ్యక్తిగత లబ్ధిదారుల కోసం అజొల్లా ట్యాంకుల నిర్మాణం.

పశువుల మేత లభ్యతను పెంచడానికి, పశు సంవర్ధక సంబంధిత మౌలిక వసతులను బలోపేతం చేయడం, సుస్థిరమైన పాడి ఆధారిత జీవనోపాధికి సహకారం అందించడమే ఈ కార్యక్రమాల ముఖ్యోద్దేశం. అనుమతించదగిన పనుల ఆమోదిత జాబితాకు అనుగుణంగా సంబంధిత చట్టం, నిబంధనలు, మార్గదర్శకాలకు లోబడి ఈ పనులన్నింటినీ చేపడతారు. 

స్థానిక ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చేలా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు

వికేంద్రీకృతమైన, క్షేత్రస్థాయి నుంచి అమలు చేసే, పంచాయతీ రాజ్ సంస్థ (పీఆర్ఐ)- నేతృత్వ ప్రణాళికలకు ఈ అడ్వయిజరీ ప్రాధాన్యమిస్తుంది. దీనిలో భాగంగా పశుగ్రాస అభివృద్ధిని, పశుసంవర్ధక రంగానికి అవసరమైన మౌలిక వసతులను వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక (వీజీపీపీ)ల్లో చేర్చడంతో పాటు గ్రామసభ ఆమోదించిన స్థానిక అభివృద్ధి ప్రాధాన్యాలకు అనుగుణంగా సిద్ధం చేస్తారు.

స్థానిక అవసరాలు, ఆమోదించిన ప్రణాళికలు, వర్తించే మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న చోట పశుగ్రాసం, పశుసంవర్ధక పనులపై చేసే వ్యయాన్ని మొత్తం కార్యక్రమ వ్యయంలో కనీసం 5 శాతానికి చేర్చేలా క్రమంగా పెంచడానికి కృషి చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచిస్తుంది.

పశుగ్రాసం, పశుసంవర్ధక సంబంధిత సౌకర్యాలకు అర్హులైన కుటుంబాలు, సమాజాలను గుర్తించడానికి అవసరాల ఆధారంగా సమగ్రంగా లబ్ధి చేకూర్చే విధానాన్ని అనుసరించాలని కూడా సూచించింది. స్థానిక అవసరాలు, ప్రాధాన్యాలను బట్టి 30 శాతానికి పైగా జనాభా పశుసంపదపై ఆధారపడి ఉన్న గ్రామ పంచాయతీలతో సహా, పశుసంవర్ధక రంగంపై ఎక్కువగా ఆధారపడే ప్రాంతాలపై గ్రామ పంచాయతీలు ప్రత్యేక దృష్టి సారించవచ్చు.

జిల్లా, బ్లాక్ స్థాయుల్లో ప్రణాళికకు అవసరమైన మార్గదర్శక పత్రాలుగా ఐసీఏఆర్–ఇండియన్ గ్రాస్‌ల్యాండ్ అండ్ ఫోడర్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (ఐసీఏఆర్–ఐజీఎఫ్ఆర్ఐ) రాష్ట్రాల వారీగా సిద్ధం చేసిన పశుగ్రాస వనరుల అభివృద్ధి ప్రణాళికలు పనిచేస్తాయి. అలాగే, వాతావరణ మార్పులను తట్టుకోగల చర్యలపై దృష్టి సారించాలని కూడా ఈ అడ్వయిజరీ సూచిస్తోంది. ఇందులో భాగంగా అనువైన పశుగ్రాస రకాలు, బహువార్షిక గడ్డి రకాలు, పంటలు–పశుసంపద సమీకృత విధానాలు తదితర చర్యలను అవసరమైన చోట, అనుమతించిన పనుల పరిధిలో చేపట్టాలని ప్రోత్సహిస్తోంది.

అంతర విభాగాల సమన్వయం, పర్యవేక్షణ

పశుగ్రాస భద్రత, పశుసంపదకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక, వ్యవసాయ శాఖలు, ఇతర సంబంధిత రంగాల మధ్య సమన్వయంతో రాష్ట్రస్థాయి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ సూచనా పత్రం పిలుపునిస్తోంది.

ప్రణాళికల రూపకల్పనను మెరుగుపరచడం, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, స్థానిక అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టడంతో పాటు పశుసంపద ఆధారిత జీవనోపాధులను సుస్థిరంగా కొనసాగేందుకు తోడ్పడటమే ఈ సమన్వయ విధానం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

చట్టబద్దమైన నిబంధనలను కచ్చితంగా పాటించడం

పశుగ్రాస అభివృద్ధి, పశుసంపదకు తోడ్పాటునిచ్చే అన్ని పనులు వీబీ–జీ రామ్ జీ చట్టం–2025లోని సంబంధిత నిబంధనలకు తప్పనిసరిగా పాటించాలని ఈ అడ్వయిజరీ మరోసారి స్పష్టం చేస్తోంది. వీటిలో వికేంద్రీకృత విధానంలో, పీఆర్ఐ నేతృత్వంలో ప్రణాళికల రూపకల్పన, తప్పనిసరి సోషల్ ఆడిట్, జిల్లా స్థాయిలో మెటీరియల్ కాంపోనెంట్‌కు 40 శాతం పరిమితిని విధించడం, షెడ్యూల్–I లోని నిబంధనలకు అనుగుణంగా వ్యక్తిగత లబ్ధిదారుల ఎంపిక, ప్రతి వారం ప్రజలకు సమాచారం వెల్లడించడం, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలు ఉన్నాయి.

గ్రామీణాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో పశుగ్రాస భద్రత, పశుసంపదకు తోడ్పాటును అందించే మౌలిక వసతుల కల్పనకు తగిన ప్రాధాన్యం లభించేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమన్వయ చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను ఈ సలహా స్పష్టం చేస్తోంది.

వికసిత్ భారత్–2047 దిశగా గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం

ఈ ఉమ్మడి అడ్వయిజరీ గ్రామీణ ఉపాధి, సహజ వనరుల నిర్వహణ, పశుసంపద అభివృద్ధిని ఏకీకృతం చేసే దిశగా వేసిన ముఖ్యమైన ముందడుగు. వీబీ–జీ రామ్ జీ పథకం పరిధిలో అనుమతించిన పనులను స్థానిక పశుగ్రాస,  పశుసంపదకు సంబంధించిన మౌలిక సదుపాయాల అవసరాలతో అనుసంధానించడం ద్వారా పశుగ్రాస లభ్యతను పెంచడం, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక కార్యకలాపాలకు తోడ్పాటును అందించడం, గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

వివిధ శాఖల మధ్య సమన్వయం, వికేంద్రీకృత ప్రణాళికల రూపకల్పన, సమన్వయంతో కూడిన అమలు ద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వాలు, పంచాయతీరాజ్ సంస్థలు సృష్టించేలా ఈ కార్యక్రమం కృషి చేస్తుంది. తద్వారా వాతావరణ మార్పులను తట్టుకోగలిగిన,  గ్రామీణాభివృద్ధికి తోడ్పడే, 2047 నాటికి వికసిత భారత్ సాధించాలనే విస్తృత లక్ష్యానికి దోహదపడాలని లక్ష్యంగా చేసుకుంది.

***


(రిలీజ్ ఐడి: 2333209) సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada