నాడు పోస్టు చేయడమైనది:
02 NOV 2026 11:16AM by PIB Hyderabad
భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’ (వీబీ-జీ రామ్ జీ) పథకం అమలుకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘ఫిర్యాదుల పరిష్కార నిబంధనలు–2026’ను ప్రకటించింది. ఈ నిబంధనల ద్వారా క్రమబద్ధమైన, బహుళ అంచెల, నిర్దిష్ట గడువుతో కూడిన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత అందుబాటులోకి తీసుకురావడం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం ఈ నిబంధనల లక్ష్యం. అదే సమయంలో పౌరుల సమస్యలను సకాలంలో పరిశీలించి, తగిన చర్యలు తీసుకునేలా ఈ వ్యవస్థను రూపొందించారు.
బహుళ అంచెల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ
ఈ నిబంధనల ప్రకారం.. గ్రామ పంచాయతీ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట గడువుతో కూడిన బహుళ అంచెల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆయా స్థాయిల్లో నియమితులైన ఫిర్యాదుల పరిష్కార అధికారులు ఫిర్యాదులను స్వీకరించడం, నమోదు చేయడం, విచారించడం, పరిష్కరించడం వంటి బాధ్యతలను నిర్వహిస్తారు.
జిల్లా స్థాయిలో ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను జిల్లా కార్యక్రమ సమన్వయకర్త పర్యవేక్షిస్తారు. నియమిత వ్యవస్థతో పాటు ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల ద్వారా ఫిర్యాదులపై చర్యలు తీసుకునేలా చూస్తారు.
ఫిర్యాదుల సమర్పణకు పలు మార్గాలు
ఫిర్యాదుల సమర్పణను సులభతరం చేసేందుకు, పథకం అమలుకు సంబంధించిన లేదా దానితో ముడిపడి ఉన్న ఏ అంశంపైనైనా ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం ఈ నిబంధనల్లో పలు మార్గాలను కల్పించారు.
1. నియమిత ఫిర్యాదుల పరిష్కార అధికారి ఎదుట స్వయంగా హాజరై ఫిర్యాదు సమర్పించవచ్చు.
2. డెలివరీకి సంబంధించిన రుజువుతో స్పీడ్ పోస్టు ద్వారా ఫిర్యాదు పంపవచ్చు.
3. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఫిర్యాదుల పరిష్కార డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
4. టెలిఫోన్, నిర్దేశిత హెల్ప్‌లైన్‌లు లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే ఇతర మార్గాల ద్వారా కూడా ఫిర్యాదులను సమర్పించవచ్చు.
గ్రామ పంచాయతీ, బ్లాక్ లేదా జిల్లా స్థాయిలో భౌతిక రూపంలో అందిన ఫిర్యాదులను స్వీకరించిన రోజే నిర్దేశిత డిజిటల్‌ప్రజా మౌలిక సదుపాయాల్లో నమోదు చేయాలి. ఆ రోజు నమోదు చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో, తదుపరి పని దినంలోగా నమోదు చేయాల్సి ఉంటుంది.
ఫిర్యాదు నమోదైన వెంటనే ఫిర్యాదుదారుడికి రశీదు అందజేస్తారు. అందులో ఫిర్యాదు నమోదు సంఖ్య, స్వీకరించిన తేదీ, ఫిర్యాదును స్వీకరించిన అధికారి హోదా వివరాలు ఉంటాయి. డిజిటల్ విధానంలో ఫిర్యాదు సమర్పించిన వారికి ఎలక్ట్రానిక్ రూపంలో, భౌతికంగా ఫిర్యాదు అందించిన వారికి భౌతిక రూపంలో ఈ రశీదును అందిస్తారు.
ముఖ్యంగా ఫిర్యాదు సమర్పించిన విధానం, భాష, రూపం లేదా ప్రక్రియాపరమైన లోపాలను కారణంగా చూపి ఏ ఫిర్యాదునూ నమోదు చేయకుండా తిరస్కరించకూడదు. ఈ నిబంధన ద్వారా ప్రక్రియాపరమైన నిబంధనలు పౌరులకు అడ్డంకిగా మారకుండా, ప్రతి ఒక్కరికీ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అందుబాటులో ఉండేలా చూస్తారు.
విచారణ, పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితి
ఫిర్యాదులను సత్వరంగా పరిశీలించి పరిష్కరించేందుకు ఈ నిబంధనల్లో స్పష్టమైన గడువులను నిర్దేశించారు. నమోదైన ప్రతి ఫిర్యాదును సంబంధిత ఫిర్యాదుల పరిష్కార అధికారి పరిశీలించి, అవసరమైన విచారణ చేపట్టాలి. ఇందుకోసం సంబంధిత అధికారులు లేదా సిబ్బంది నుంచి అవసరమైన రికార్డులు, రిజిస్టర్లు, పత్రాలు, నివేదికలు, ఎలక్ట్రానిక్ డేటా లేదా ఇతర సమాచారాన్ని ఆ అధికారి కోరవచ్చు.
అవసరమైన సందర్భాల్లో ఫిర్యాదుపై తుది నిర్ణయం తీసుకునే ముందు ఫిర్యాదుదారుడికి తన వాదనను వినిపించుకునే సముచిత అవకాశం కల్పించాలి. ఇందుకోసం ప్రత్యక్షంగా లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా అవకాశం ఇవ్వవచ్చు.
ఫిర్యాదు అందిన తేదీ నుంచి ఏడు పని దినాల్లోగా దానిపై విచారణ పూర్తి చేయాలి. విచారణ పూర్తయిన అనంతరం ఫిర్యాదుల పరిష్కార అధికారి తన నిర్ధారణలను నమోదు చేసి, చట్టం, నిబంధనలకు అనుగుణంగా తగిన దిద్దుబాటు లేదా పరిష్కార చర్యలు చేపట్టాలి లేదా చేపట్టేలా చూడాలి. ఫిర్యాదు అందిన తేదీ నుంచి 15 రోజుల్లోగా దాన్ని పరిష్కరించాలి.
విచారణలో వెల్లడైన అంశాలు, తీసుకున్న చర్యల వివరాలను నిర్దేశిత డిజిటల్ ప్రజా మౌలిక సదపాయాల్లో నమోదు చేసి, వాటిని ఫిర్యాదుదారుడికి తెలియజేస్తారు. భౌతిక రూపంలో అందిన ఫిర్యాదుల విషయంలో, వాటి పరిష్కార వివరాలు, తీసుకున్న చర్యలను కూడా ఫిర్యాదుదారుడికి భౌతిక రూపంలోనే తెలియజేస్తారు.
పరిష్కారం కాని ఫిర్యాదుల డిజిటల్ పర్యవేక్షణ, ఉన్నతాధికారులకు పంపే విధానం
నిర్దేశిత డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు ద్వారా ఫిర్యాదు నమోదు నుంచి తుది పరిష్కారం వరకు ప్రతి దశను పర్యవేక్షించవచ్చు. విచారణ, నిర్ధారణలు, తీసుకున్న చర్యల వివరాలను కూడా ఎలక్ట్రానిక్ రూపంలో నమోదు చేసేందుకు ఈ వేదిక వీలు కల్పిస్తుంది. తద్వారా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత బలోపేతం అవుతాయి.
నిర్దేశించిన 15 రోజుల గడువులోగా పరిష్కారం కాని ఫిర్యాదులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా తదుపరి ఉన్నత స్థాయికి పంపిస్తారు. ఈ విధంగా అందిన ఫిర్యాదును సంబంధిత అధికారి పరిశీలించి, దాని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదు పరిష్కారమయ్యే వరకు దాని పురోగతిని ఎలక్ట్రానిక్ విధానంలో నిరంతరం పర్యవేక్షిస్తారు
అప్పీళ్లకు అవకాశం
ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కింద జారీ చేసిన ఉత్తర్వులపై అప్పీలు చేసుకునేందుకు కూడా ఈ నిబంధనల్లో అవకాశం కల్పించారు. వికసిత్ భారత్–జీ రామ్ జీ చట్టం-2025లోని షెడ్యూల్–I ప్రకారం ఈ అప్పీళ్లను దాఖలు చేసి, పరిష్కరిస్తారు.
ఈ నిబంధనల ద్వారా వీబీ-జీ రామ్ జీ పథకం కింద పౌరులకు అందుబాటులో ఉండేలా, వారి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ, నిర్దిష్ట గడువులో ఫిర్యాదులను పరిష్కరించే వ్యవస్థను సంస్థాగతంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బహుళ అంచెల వ్యవస్థ, ఫిర్యాదుల సమర్పణకు పలు మార్గాలు, తప్పనిసరి నమోదు, నిర్దిష్ట గడువులు, డిజిటల్ పర్యవేక్షణ, పరిష్కారం కాని ఫిర్యాదులను ఉన్నత స్థాయికి పంపే విధానం ద్వారా పాలనా జవాబుదారీతనం బలోపేతం కావడంతో పాటు పథకం అమలులో స్పందన మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
వీబీ-జీ రామ్ జీ పథకం అమలుకు సంబంధించిన ఫిర్యాదులను క్రమబద్ధంగా, పారదర్శకంగా, నిర్దేశిత గడువుల్లో పరిష్కరించేలా చూడటంలో ఈ నోటిఫికేషన్ కీలక ముందడుగు. తద్వారా ఈ పథకం కింద గ్రామీణ కుటుంబాలకు కల్పించిన హక్కులు, ప్రయోజనాలకు మరింత భరోసా లభించనుంది.
***