నాడు పోస్టు చేయడమైనది:
26 OCT 2026 1:37PM by PIB Hyderabad
భారత తొలి ఉప ప్రధాని, సమాచార, ప్రసార శాఖ మంత్రి, దేశ సమగ్రత రూపశిల్పి, ‘ఉక్కు మనిషి’గా పిలుచుకునే సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్మారకార్థం ఆకాశవాణి 1955 నుంచి ప్రతి ఏటా ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆయన అందించిన చిరస్మరణీయమైన సేవలను, వారసత్వాన్ని గుర్తుచేసుకోవడమే ఈ ప్రసంగాల ప్రధానోద్దేశం.

న్యూఢిల్లీలోని సందద్ మార్గ్‌లో ఉన్న ఆకాశవాణి రంగ భవన్ ఆడిటోరియంలో 2026 అక్టోబర్ 27 మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రతిష్ఠాత్మక ఉపన్యాసం 67వ సంచికను నిర్వహిస్తారు. కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఉపన్యాసం ఇస్తారు. సర్దార్ పటేల్ జయంతి నాడు (అక్టోబర్ 31) రాత్రి 9:30 గం.లకు దేశవ్యాప్తంగా ఆకాశవాణి నెట్‌వర్కులో రికార్డు చేసిన ఈ ప్రసంగం ప్రసారమవుతుంది.

ఈ ఉపన్యాసాల పరంపరలో తొలి ఉపన్యాసాన్ని భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ భారతరత్న శ్రీ సి. రాజగోపాలాచారి ఇచ్చారు. అప్పటి నుంచి ఎంతో మంది ప్రముఖ నాయకులు, శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఈ వేదికపై ప్రసంగించారు. వారిలో డాక్టర్ జాకీర్ హుస్సేన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్, శ్రీ మొరార్జీ దేశాయ్, డాక్టర్ కరణ్ సింగ్, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, జస్టిస్ (శ్రీమతి) లీలా సేథ్, శ్రీ రామ్‌నాథ్ కోవింద్, శ్రీ అరుణ్ జైట్లీ, శ్రీ అజిత్ దోవల్, డాక్టర్ ఎస్ జైశంకర్, జనరల్ బిపిన్ రావత్, డాక్టర్ ఎస్ సోమనాథ్ ఉన్నారు. గతేడాది నిర్వహించిన 66వ స్మారకోపన్యాసంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రసంగించారు.
వివిధ అంశాలపై ఆలోచనలకు, అభిప్రాయాలకు, దృష్టి కోణాలకు వేదికగా ఈ వార్షిక కార్యక్రమం నిలుస్తోంది. మన వైవిధ్యమైన సంస్కృతి, అభివృద్ధికి సంబంధించిన అనేక విషయాలను మరింత అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. భారతదేశం గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ ఉపన్యాసాలు విజ్ఞాన భాండాగారాలుగా మారాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మేధోపరమైన తోడ్పాటును అందించి ఈ ప్రసంగాల పరంపరను గొప్ప సంప్రదాయంగా తీర్చిదిద్దారు.
ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అయితే ఆడిటోరియంలో సీట్లు అందుబాటులో ఉండటం ఆధారంగా ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ప్రవేశం కల్పిస్తారు.
సర్దార్ పటేల్ స్మారకోపన్యాసాలు
ప్రముఖ నాయకులు, విశిష్ట వ్యక్తులు వెలువరించిన ప్రతిష్టాత్మక సర్దార్ పటేల్ స్మారక ఉపన్యాసాల గత సంచికలను ప్రసార భారతి అధికారిక యూట్యూబ్ ఆర్కైవ్‌లో వీక్షించవచ్చు.
ఉపన్యాసాలను వీక్షించేందుకు లింక్:
https://youtube.com/playlist?list=PLqtVCj5iilH4WmBlnHhj3XiR_v0E7elJh&si=TxICk_ChZVu5V5Rj
***