ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐడీబీఐలో ప్రభుత్వ వాటాకు సంబంధించి చట్టపరమైన పరిణామాలపై స్పష్టత

నాడు పోస్టు చేయడమైనది: 17 OCT 2026 7:41AM by PIB Hyderabad

ఐడీబీఐలో ప్రభుత్వ వాటాకు సంబంధించి 2003లో జరిగిన చట్టపరమైన పరిణామాలపై వ్యాఖ్యలు, అభిప్రాయాలతో కూడిన కథనాలను కొన్ని పత్రికలు, మీడియా వర్గాలు ప్రచురించాయి. 2003 కేంద్ర బడ్జెట్ చర్చలు, ఐడీబీఐ (రద్దు) చట్టం-2003పై పార్లమెంటరీ చర్చ సందర్భంగా ప్రభుత్వ వాటా తగ్గింపును నియంత్రించే ఉద్దేశంతో సవరణను ప్రతిపాదించినప్పటికీ తిరస్కరణకు గురైందని, ఆమోదించిన చట్టంలో అది భాగం కాలేదని మరోసారి స్పష్టమైంది.

తదనంతరం ఆలిండియా ఐడీబీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇతరులు... కేసులో ఢిల్లీ హైకోర్టు ఈ అంశాన్ని పరిశీలించి 2018 డిసెంబర్ 17న తీర్పు వెలువరించింది. రిట్ పిటిషన్‌ను కొట్టివేస్తూ 41, 42 పేరాల్లో న్యాయస్థానం ఈ కింది విధంగా తీర్పునిచ్చింది:

పేరా 41:

“ఈ న్యాయస్థానం అభిప్రాయం ప్రకారం, దాదాపు 15 ఏళ్ల కిందట పార్లమెంటులో శాసనసభ చర్చ సందర్భంగా చేసిన ప్రకటనలు... ఐడీబీఐ లిమిటెడ్‌లో తన వాటాను తగ్గించుకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిరోధించలేవు. చర్చ ముగిసిన తర్వాత పార్లమెంటు ఆమోదించిన చట్టంలో ప్రతిపాదిత సవరణ లేదు. సభ ఎదుట చేసిన ప్రకటనలు పార్లమెంటు ఆమోదించిన చట్టానికి ప్రత్యామ్నాయం కావు. ఆ చట్టాన్ని అధిగమించలేవు. ప్రతిపాదిత నిబంధనను చేర్చకపోవటం వెనుకున్న ఉద్దేశం, ప్రాధాన్యత గురించి పార్లమెంటుకు కచ్చితంగా అవగాహన ఉంటుంది. పైన పేర్కొన్న సందర్భంలో ప్రామిసరీ ఎస్టోపెల్ సూత్రాలు ఏమాత్రం వర్తించవు. పార్లమెంటులో చేసిన ప్రకటనలు ఉద్యోగులకు ఇచ్చిన హామీ అని, ఆ హామీ ఆధారంగా తమ ప్రయోజనాలకు భంగం కలిగేలా వ్యవహరించారనే వాదనను అంగీకరించటం అసాధ్యం. సభ ఎదుట చేసిన ప్రకటనలు ఒక చట్టాన్ని (ఐడీబీఐ రద్దు చట్టం-2003) రూపొందించే సందర్భంలో చేసినవి కాబట్టి, చట్టబద్ధమైన వివరణకు సంబంధించి స్థిరమైన సూత్రాలకు అనుగుణంగానే ఆ చట్టాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది”

పేరా 42:

“ఐడీబీఐ రద్దు చట్టం-2003లోని పరిభాషలో ఎలాంటి సందిగ్ధత లేదు. ఐడీబీఐ లిమిటెడ్‌లో ప్రభుత్వ వాటాను తగ్గించుకోవటాన్ని, ఉపసంహరించుకోవటాన్ని నిషేధించే ఏ నిబంధన ఆ చట్టంలో ఉండే ఆస్కారం లేదు”

వాటాను తగ్గించుకోవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేయటానికి ఆధారంగా తీసుకున్న ప్రామిసరీ ఎస్టోపెల్ సిద్ధాంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినందున పైన పేర్కొన్న తీర్పు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఐడీబీఐ లిమిటెడ్‌లో ప్రభుత్వ వాటాను తగ్గించుకోవటాన్ని, ఉపసంహరించుకోవటాన్ని అడ్డుకునేందుకు ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించే వీల్లేదు.

ఐడీబీఐ బ్యాంక్ రూపాంతరం, వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ పట్ల ప్రభుత్వ విధానాన్ని పార్లమెంటులో వరుస కేంద్ర బడ్జెట్ ప్రసంగాల్లో స్పష్టం చేశారు.

కేంద్ర బడ్జెట్ 2016-17 - గౌరవ ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ ప్రసంగం (పేరా 93):

“మన ప్రభుత్వ రంగ బ్యాంకులు దృఢంగా, పోటీతత్వంతో ఉండాలి. 2016-17లో బ్యాంక్ బోర్డ్ బ్యూరో కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి సంబంధించిన ప్రణాళికను రూపొందిస్తాం. ఐడీబీఐ బ్యాంక్ రూపాంతర ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్తూ... వాటాను 50 శాతం కంటే తక్కువు తగ్గించుకునే ప్రత్యామ్నాయాన్ని కూడా పరిశీలిస్తుంది”

కేంద్ర బడ్జెట్ 2021-22 - గౌరవ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రసంగం (పేరా 84):

“కోవిడ్-19 సమయంలోనూ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ దిశగా మేం పనిచేస్తూనే ఉన్నాం. బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్ హన్స్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ తదితర సంస్థలకు సంబంధించిన అనేక లావాదేవీలు 2021-22లో పూర్తవుతాయి. ఐడీబీఐ బ్యాంకు కాక, 2021-22 సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీ ప్రైవేటీకరణను చేపట్టాలని మేం ప్రతిపాదిస్తున్నాం. ఇందుకు చట్టపరమైన సవరణలు అవసరం. ఈ సమావేశాల్లోనే ఆ సవరణలను ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నాను”

ఐడీబీఐ (రద్దు) చట్టం-2003 శాసన చరిత్ర, గౌరవ ఢిల్లీ హైకోర్టు న్యాయ తీర్పు, వరుస కేంద్ర బడ్జెట్ ప్రసంగాలు.. ఇవన్నీ ఉమ్మడిగా ఐడీబీఐ బ్యాంకు వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ పట్ల ప్రభుత్వ విధాన పరిణామ క్రమాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్‌లో ప్రభుత్వ వాటాను తగ్గించుకునే అధికారాన్ని నియంత్రించేందుకు.. పార్లమెంటరీ చర్చల సందర్భంగా చేసిన ప్రకటనల ఆధారంగా ప్రామిసరీ ఎస్టోపెల్ సిద్ధాంతాన్ని వర్తింపజేయలేమని 2018 డిసెంబర్ 17 నాటి తీర్పు నిస్సందేహంగా స్పష్టం చేస్తోంది. ఆమోదించిన చట్టంలో ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్‌లో ప్రభుత్వ వాటాను తగ్గించుకోవటంపై ఎలాంటి నిషేధం లేదని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది.

 

***


(రిలీజ్ ఐడి: 2324798) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Malayalam , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Gujarati , Tamil , Kannada