సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బహుళ-రాష్ట్ర సహకార సంఘాల కోసం కొత్త ఆడిట్ రిపోర్టింగ్ చట్రం


పారదర్శకత.. జవాబుదారీతనం.. సుపరిపాలన బలోపేతం దిశగా తప్పనిసరి చేసిన సహకార మంత్రిత్వశాఖ

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రబోధిత ‘సహకారంతో సమృద్ధి’ ప్రాతిపదికగా కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా నేతృత్వాన కీలక నిర్ణయం

ఏకరూప.. పటిష్ట.. ముప్పు ఆధారిత చట్టబద్ధ ఆడిట్ రిపోర్టింగ్‌ చట్రం కోసం బహుళ-రాష్ట్ర సహకార సంఘాల (ఆడిటర్ నివేదిక) ఉత్తర్వు-2026 జారీ

ఆర్థిక భారం ముందస్తు గుర్తింపు.. సభ్యుల నిధుల పరిరక్షణ సహా చట్టబద్ధ.. పాలన నిబంధనల బలోపేతమే ఈ కొత్త చట్రం లక్ష్యం

సీఆర్‌సీఎస్‌ పోర్టల్ ద్వారా సాంకేతికత ఆధారిత నియంత్రణ-పరిశీలన.. స్వయంచలిత తనిఖీ.. ముప్పు ఆధారిత పర్యవేక్షణ కోసం ప్రామాణీకృత ఆడిట్ రిపోర్టింగ్

బహుళ-రాష్ట్ర సహకార సంఘాల వ్యవస్థలు.. ప్రక్రియలను బలోపేతానికి సమయమిస్తూ దశలవారీగా కొత్త చట్రం అమలుకు వెసులుబాటు

నాడు పోస్టు చేయడమైనది: 14 OCT 2026 4:47PM by PIB Hyderabad

   దేశంలోని బహుళ-రాష్ట్ర సహకార సంఘాల (ఎంఎస్‌సీఎస్‌)లో పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలన బలోపేతం దిశగా కొత్త ఆడిట్ రిపోర్టింగ్ చట్రాన్ని కేంద్ర సహకార మంత్రిత్వశాఖ తప్పనిసరి చేసింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రబోధిత ‘సహకారంతో సమృద్ధి’ సూత్రం ప్రాతిపదికగా కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా నేతృత్వాన ఈ సహకార సంఘాలకు ఇప్పటికే ఇతోధిక ప్రోత్సాహం లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా పటిష్టమై, వృత్తిగత పాలన నిర్వహణగల సహకార రంగం కోసం తీసుకున్న కీలక నిర్ణయమిది. తదనుగుణంగా “బహుళ-రాష్ట్ర సహకార సంఘాల (ఆడిటర్ నివేదిక) ఉత్తర్వు-2026 (ఎంఎస్‌సీఏఆర్ఓ)ను జారీ చేసింది. ఆయా సహకార సంఘాల్లోని సభ్యుల ప్రయోజనాలను పరిరక్షించడమే కాకుండా మరింత పారదర్శక, వృత్తిగత పాలనా నిర్వహణలోగల జవాబుదారీ సహిత సహకార వ్యవస్థకు రూపమివ్వడంలో ఈ ఉత్తర్వును ఓ కీలక ఘట్టంగా పరిగణించవచ్చు.

బహుళ-రాష్ట్ర సహకార సంఘాల (సవరణ) చట్టం-2023లోని సెక్షన్ 73(6) కింద  ‘ఎంఎస్‌సీఎస్‌’లకు ఆడిటింగ్-అకౌంటింగ్ ప్రమాణాలను నిర్దేశించే అధికారం  కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. దీనికి అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సహా ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ), కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సీఏజీ-కాగ్‌), ‘ఎంఎస్‌సీఎస్‌’ల నుంచి అందిన సలహాలు-సూచనల ప్రాతిపదికన సహకార మంత్రిత్వశాఖ ‘ఎంఎస్‌సీఏఆర్ఓ-2026’ను రూపొందించింది.

బహుళ-రాష్ట్ర సహకార సంఘాలలో చట్టబద్ధ ఆడిట్ నివేదన కోసం ప్రస్తుతం కార్పొరేట్ రంగానికి వర్తించే ‘కంపెనీల (ఆడిటర్ నివేదిక) ఉత్తర్వు’ (సీఏఆర్‌ఓ) తరహాలో దీనికి రూపమిచ్చారు. ‘ఎంఎస్‌సీఎస్‌’లకు తగిన ఏకరూప, పటిష్ట, ముప్పు ఆధారిత చట్రాన్ని సమకూర్చడం ఎంఎస్‌సీఏఆర్ఓ లక్ష్యం. దీనికింద ఆయా సంఘాలలో కీలక ఆర్థిక, పరిపాలన, నిర్వహణ, చట్టబద్ధ అనుపాలనాంశాలపై ‘అవును/కాదు’ సమాధానాలతో పాటు సంబంధిత వ్యాఖ్యలను ఆడిటర్లు నిర్దిష్ట ప్రామాణిక నివేదికలో పొందుపరచాల్సి ఉంటుంది. తద్వారా ఆడిట్ నివేదనలో స్థిరత్వం ఇనుమడించి, అక్రమాల గుర్తింపు సులభం కావడమే కాకుండా నియంత్రణ-పర్యవేక్షణ బలోపేతం కాగలవు.

ముప్పు-ఆధారిత నియంత్రణ-పర్యవేక్షణలను ప్రవేశపెట్టడం ఈ  చట్రంలోని ప్రధానాంశాలలో ఒకటి. దీనివల్ల ఆడిటర్ల పరిశీలన ఆధారంగా అధిక ఆర్థిక లేదా పాలనాపరమైన ముప్పు గల సంఘాలను కేంద్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ (సీఆర్‌సీఎస్‌) ముందుగానే గుర్తించే వీలుంటుంది. మరింత కేంద్రీకృత తనిఖీ, విచారణ, నియంత్రణ చర్యల సౌలభ్యం కూడా కలుగుతుంది. తద్వారా పర్యవేక్షణ సామర్థ్యం మెరుగుపడి, సకాలంలో దిద్దుబాటు చర్యలకు భరోసా లభిస్తుంది.

నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ), గడువు మీరిన రుణాలు, ద్రవ్య లభ్యత పరిస్థితులు, డిపాజిట్లు, అడ్వాన్సులు, రుణాల చెల్లింపులో వైఫల్యాలు, సంఘాల అప్పులు తదితరాలపై ఈ చట్రం ద్వారా క్రమపద్ధతిలో నివేదన సాధ్యమవుతుంది. తద్వారా ఆర్థిక భారాన్ని ముందస్తుగా గుర్తించి దిద్దుబాటుకు ఉపక్రమించే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమాచార వెల్లడితో కొత్తగా తలెత్తే ఆర్థిక బలహీనతలను గుర్తించి, అవి మరింత తీవ్ర ఆర్థిక లేదా కార్యాచరణ సమస్యలుగా మారకముందే సకాలంలో నివారించవచ్చు.

సభ్యుల నిధులు, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ బలోపేతం సహా నిర్దేశిత ఆడిట్ నిబంధనల వల్ల పెట్టుబడులు, నిధుల వినియోగం, వాటా మూలధనం, సభ్యత్వ రికార్డులు, చట్టబద్ధ ఆమోదాల స్వతంత్ర ధ్రువీకరణకు వీలుండటం ‘ఎంఎస్‌సీఏఆర్‌ఓ’లో మరో కీలకాంశం. ఆర్థిక లావాదేవీలు, సహకార వనరుల వినియోగంపై నిశిత పరిశీలనను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక సమగ్రత బలోపేతం సహా సహకార సంస్థలపై సభ్యుల విశ్వాసం ఇనుమడించడంలో ఈ చట్రం దోహదపడుతుంది.

డైరెక్టర్ల బోర్డు కూర్పు, అర్హతానర్హతలు, వార్షిక సర్వసభ్య సమావేశాలు, బోర్డు సమావేశాల నిర్వహణ, చట్టబద్ధ కమిటీల ఏర్పాటు-పనితీరు, సంబంధిత పక్షాల లావాదేవీల సంబంధిత నిబంధనల అనుసరణలో క్రమబద్ధ పరిశీలన వగైరాలకు ఈ ఉత్తర్వు తోడ్పడుతుంది. తద్వారా సుపరిపాలన, సంస్థాగత జవాబుదారీతనం మరింత బలోపేతం కాగలవు. ‘ఎంఎస్‌సీఎస్‌’లలో పారదర్శక నిర్ణయాలు, ప్రజాస్వామ్యబద్ధ పనితీరు, చట్టబద్ధ నిబంధనల పట్ల నిబద్ధతలను ప్రోత్సహించడం ఈ నిబంధనల ధ్యేయం.

ప్రామాణిక ఆడిట్ సమాచారాన్ని సీఆర్‌సీఎస్‌ పోర్టల్‌తో అనుసంధానించడం ద్వారా సాంకేతికత ఆధారిత నియంత్రణ-పర్యవేక్షణకూ ఎంఎస్‌సీఏఆర్ఓ వీలు కల్పిస్తుంది. ఇలాంటి అనుసంధానం వల్ల స్వయంచలిత పరిశీలన, నియంత్రణ డాష్‌బోర్డులు, రిస్క్ స్కోరింగ్, కృత్రిమ మేధ ఆధారిత విశ్లేషణల సౌలభ్యం కలుగుతుంది. సమర్థ పర్యవేక్షణ, నిబంధనల పాటింపులో పొరపాట్లు-తప్పుల గుర్తింపు నిదర్శనాధారిత నియంత్రణ చర్యలకు ఈ చట్రం భరోసానిస్తుంది.

ఈ చట్రం వర్తించే ప్రతిచోటా సైబర్‌ భద్రత, మనీలాండరింగ్ నిరోధక నిబంధనల పాటింపు వగైరాలను ఆడిట్ స్థాయిలోనే నిర్వహించవచ్చు. ఇందులో సైబర్‌ భద్రత- రక్షణ చర్యల పరిశీలన, అనుమానాస్పద లావాదేవీల నివేదన, వినియోగదారుల గుర్తింపు నిబంధనలు, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నియమిత డైరెక్టర్లు సహా ప్రధాన అధికారుల నియామక నిబంధనల పాటింపు వంటివి ప్రధానమైనవి. ఆర్థిక అక్రమాలు, సైబర్ ముప్పులు, ఇతర నిబంధనల అనుసరణలోని లోటుపాట్లపై సంస్థాగత రక్షణను ఈ చట్రం బలోపేతం చేస్తుంది.

ఈ చట్రం అమలుకు వీలుగా సహకార సంస్థలకు తమ అంతర్గత వ్యవస్థలు-ప్రక్రియల ఉన్నతీకరణ కోసం తగినంత సమయం ఇవ్వాల్సిన అవసరాన్ని మంత్రిత్వశాఖ గుర్తించింది. తదనుగుణంగా ‘ఎంఎస్‌సీఏఆర్ఓ-2026’ను దశలవారీగా అమలు చేసేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది. సంబంధిత ఆర్థిక పారామితులలో నిర్దేశిత ₹50 కోట్ల పరిమితిని అధిగమించిన బహుళ-రాష్ట్ర సహకార సంఘాలకూ ఈ చట్రాన్ని విస్తరించడం ఒక దీర్ఘకాలిక లక్ష్యం. అయితే, ప్రస్తుత తొలి దశలో ₹1,000 కోట్ల వ్యాపార పరిమాణం దాటిన పెద్ద సొసైటీలకు దీన్ని వర్తింపజేస్తారు. దీనివల్ల నివేదన మెరుగుదలకు సిద్ధం కావడంలో చిన్న సంఘాలకు అదనపు సమయం లభిస్తుంది.

బహుళ-రాష్ట్ర సహకార సంఘాలు మరింత పారదర్శకంగా, వృత్తిగతంగా,  జవాబుదారీతనంతో పనిచేసే సహకార వ్యవస్థలో భాగమయ్యేలా చేయడంలో ‘ఎంఎస్‌సీఏఆర్ఓ-2026’ కీలక మలుపు కాగలదు. ముప్పు ఆధారిత పరిశీలన, సాంకేతికత-ఆధారిత తనిఖీ-పర్యవేక్షణలతో ప్రామాణిక చట్టబద్ధ ఆడిట్ రిపోర్టింగ్‌ను జోడించడం ద్వారా సంస్థాగత విశ్వసనీయతను ఇది బలోపేతం చేస్తుంది. అదే సమయంలో సభ్యుల ప్రయోజనాల పరిరక్షణ, ‘సహకారంతో సమృద్ధి’ దార్శనికత మరింత విస్తరిస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2323587) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Tamil , Malayalam