ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆసుపత్రుల్లో వైద్య సేవల ధరలను స్పష్టంగా ప్రదర్శించాలి.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచన
వైద్య సేవల ఛార్జీల పారదర్శక ప్రదర్శనకు చర్యలు తీసుకోవాలని కోరుతూ.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు కేంద్ర వైద్యశాఖ కార్యదర్శి లేఖ
రోగులు సమాచారంతో కూడిన ఆరోగ్య నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పించడం, బిల్లుల వివాదాల నివారణ, వైద్య సేవలపై నమ్మకాన్ని పెంపొందించడమే లక్ష్యంగా చర్యలు
వైద్య, ఆయుష్ వీసాలపై భారత్‌కు వచ్చే విదేశీ రోగుల కోసం చికిత్స ప్యాకేజీ ధరలను పారదర్శకంగా వెల్లడించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విజ్ఞప్తి
నాడు పోస్టు చేయడమైనది:
12 OCT 2026 1:05PM by PIB Hyderabad
వైద్య సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం, రోగుల అవసరాలకు ప్రాధాన్యతనిచ్చే విధానాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక చర్యలు చేపట్టింది. వైద్య సంస్థలు (ఆసుపత్రులు) అందించే సేవలు, సదుపాయాలకు వసూలు చేసే ధరలను స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.
ఈ మేరకు కేంద్ర వైద్యశాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలీల శ్రీవాస్తవ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. వర్తించే నియంత్రణ నిబంధనల అమలును సమీక్షించాలని, వైద్య సేవల ఛార్జీలకు సంబంధించిన సమాచారం రోగులకు, వారి సహాయకులకు స్పష్టంగా కనిపించేలా, సులభంగా అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
వైద్య సేవల ధరల్లో పారదర్శకత ప్రాముఖ్యతను వివరిస్తూ.. ధరలను స్పష్టంగా ప్రదర్శించడం వల్ల చికిత్సకు అయ్యే ఖర్చు గురించి రోగులు, వారి కుటుంబ సభ్యులు ముందుగానే అర్థం చేసుకోవడానికి వీలవుతుందని కేంద్ర వైద్యశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. దీనివల్ల సమాచారంతో వైద్య సేవలపై నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, వైద్య ఖర్చులను ముందుగానే ప్రణాళిక చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ధరల విషయంలో అధిక పారదర్శకత ఉంటే అనవసరమైన గందరగోళం, బిల్లులకు సంబంధించిన వివాదాలు తగ్గుతాయని, వైద్య సేవల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు.
ఈ లేఖలో వైద్య సంస్థల (నమోదు, నియంత్రణ) చట్టం 2010, వైద్య సంస్థలు (కేంద్ర ప్రభుత్వ) నిబంధనలు 2012 గురించి ప్రస్తావించారు. వైద్య సంస్థల నిర్వహణ కోసం ఈ చట్టం, నిబంధనలు నియంత్రణ వ్యవస్థను కల్పిస్తున్నాయి. ఈ చట్టం అమలులో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వైద్య సంస్థలు.. తాము అందించే ప్రతి రకమైన వైద్య సేవకు వసూలు చేసే ధరలు, అందుబాటులో ఉన్న సదుపాయాల వివరాలను రోగులు, వారి సహాయకులకు స్పష్టంగా కనిపించే ప్రదేశంలో ప్రదర్శించాలి. ఈ వివరాలు స్థానిక భాషతో పాటు ఆంగ్లంలోనూ ఉండాలని నిబంధనలు పేర్కొంటున్నాయి.
ఈ చట్టం వర్తించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్య సంస్థలు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సొంత చట్టాలు, నిబంధనల ప్రకారం నియంత్రణలో ఉంటాయి. వీటిలో చాలా చోట్ల కూడా వైద్య సేవలు, సదుపాయాలకు సంబంధించిన ధరలను ప్రదర్శించాలనే నిబంధనలు ఉన్నాయి.
వైద్యం రాష్ట్రాల పరిధిలోని అంశమని, సంబంధిత నియంత్రణ నిబంధనల అమలు, పర్యవేక్షణ బాధ్యత ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలదేనని కేంద్ర వైద్యశాఖ కార్యదర్శి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారుల ద్వారా నిబంధనలు సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను కోరారు.
వైద్య సేవల ధరల్లో పారదర్శకతకు సంబంధించి విదేశీ రోగుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఈ లేఖలో సూచించారు. వైద్య వీసాలు లేదా ఆయుష్ వీసాలపై భారత్‌కు వచ్చే విదేశీ రోగులకు అందించే చికిత్స ప్యాకేజీల ధరలను, వర్తించే చోట స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు. దీనివల్ల విదేశీ రోగులు సరైన సమాచారంతో వైద్య సేవలను ఎంచుకోవడానికి వీలవుతుందని, ధరలు, బిల్లులకు సంబంధించిన ఫిర్యాదులు తగ్గుతాయని తెలిపారు. వైద్య, ఆయుష్ చికిత్సలకు విశ్వసనీయ గమ్యస్థానంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ అంశంపై వ్యక్తిగతంగా దృష్టి సారించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను కేంద్ర వైద్యశాఖ కార్యదర్శి కోరారు. వర్తించే నిబంధనలకు అనుగుణంగా వైద్య సేవల ధరలను స్పష్టంగా కనిపించే, సులభంగా చేరుకోగల ప్రదేశాల్లో ప్రదర్శించేలా సంబంధిత అధికారులు, వైద్య సంస్థలకు తగిన సూచనలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
వైద్య సేవలను మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో, రోగుల అవసరాలకు అనుగుణంగా అందించాలనే భారత ప్రభుత్వ నిబద్ధతను ఈ చర్య స్పష్టం చేస్తోంది. వైద్య ఛార్జీలకు సంబంధించిన స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉండటాన్ని రోగులే కేంద్రంగా సాగే వైద్య సేవల్లో అంతర్భాగంగా మార్చడం ఈ కార్యక్రమం లక్ష్యం.
***
(రిలీజ్ ఐడి: 2322606)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam