గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
వీబీ–జీ రామ్ జీ పరిధిలో 375 పనులకు అనుమతిస్తూ నోటిఫై చేసిన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ
మునుపటి పథకంతో పోలిస్తే.. అనుమతించదగిన పనుల పరిధిని 41 శాతం విస్తరిస్తున్న కొత్త షెడ్యూల్
జలభద్రత పరిధిలో 128, కీలకమైన గ్రామీణ మౌలిక సదుపాయాల పరిధిలో 111, జీవనోపాధి సంబంధిత మౌలిక వసతుల పరిధిలో 98, విపత్తు సన్నద్ధత పరిధిలో 38 పనులకు అనుమతి
నాడు పోస్టు చేయడమైనది:
06 OCT 2026 8:29AM by PIB Hyderabad
వికసిత్ భారత్– గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ–జీ రామ్ జీ) చట్టం–2025 పరిధిలో అనుమతించదగిన పనుల షెడ్యూల్‌ను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. ఫలితంగా కొత్త గ్రామీణ పనుల విధివిధానాల పరిధిలోకి కొత్తగా 375 అనుమతించదగిన పనులు చేరాయి.
పాత విధానం పరిధిలో ఉన్న 266 పనులతో పోలిస్తే 41 శాతం విస్తరణను కొత్త షెడ్యూల్ సూచిస్తుంది. ఈ పనులను నీటి భద్రత, కీలకమైన గ్రామీన మౌలిక వసతులు, జీవనోపాధి సంబంధిత మౌలిక వసతులు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, విపత్తు సన్నద్ధత కోసం ప్రత్యేక పనులు అనే నాలుగు ప్రధాన విభాగాలుగా పునర్వ్యవస్థీకరించారు.
సంప్రదాయ ఆస్తుల కల్పనకు అతీతంగా వేతన ఉపాధిని శాశ్వత గ్రామీణ ఆస్తుల కల్పనతో, కొలవదగిన అభివృద్ధి ఫలితాలతో అనుసంధానించాలని కొత్త విధానం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి పనీ వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక ప్రకారం అట్టడుగు స్థాయి నుంచి వికేంద్రీకృత ప్రణాళికా ప్రక్రియ ద్వారా జరుగుతుంది. గ్రామసభ ఆమోదించిన ఈ పనులను వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ద్వారా పర్యవేక్షిస్తారు.
128 పనులతో జలభద్రతకు అత్యధిక వాటా
నాలుగు ప్రధాన విభాగాల్లోనూ అత్యధికంగా జల భద్రత విభాగంలోనే 128 పనులు ఉన్నాయి. వీటిలో చెక్ డ్యాములు, గల్లీ ప్లగ్‌లు, భూగర్భ డైక్‌లు, రీఛార్జి షాప్టులు, ఇంజెక్షన్ బావులు, నదులు, కాల్వలు, నాలాల పునరుజ్జీవం, నీటితో నిండిన భూముల పునరుద్ధరణ, పంట భూములకు నీటిని సరఫరా చేసే కాలువల పునరుద్ధరణ లాంటివి ఉన్నాయి.
ఈ షెడ్యూల్లో నీటి సంరక్షణ, నీటి పారుదల కోసం బిందు సేద్యం, స్ప్రింక్లర్ వ్యవస్థలు, ఇంటి పై కప్పు నుంచి వర్షపు నీటి సేకరణ, కుంటలతో సహా మంచు స్థూపాలు, కృత్రిమ హిమానీనదాలు లాంటి నూతన చర్యల కేటాయింపులు ఈ షెడ్యూల్లో ఉన్నాయి.
కీలకమైన గ్రామీణ మౌలిక వసతుల కోసం 111 పనులు
గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన పౌర, సామాజిక మౌలిక వసతులను బలోపేతం చేయడమే లక్ష్యంగా 111 పనులు కీలకమైన గ్రామీణ మౌలిక వసతుల్లో భాగంగా ఉన్నాయి.
దీనిలో సోలార్ వీధి దీపాలు, వ్యర్థాల నుంచి సంపదను వెలికి తీసే రీసైక్లింగ్ కేంద్రాలు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, విభజన షెడ్లు, గ్రామీణ గ్రంథాలయాలు, పశు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, కామన్ సర్వీసు సెంటర్లు, మల్టీపర్పస్ యూత్ సెంటర్లు, సామాజిక సౌకర్యాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, ప్రయోగశాలలు ఉన్నాయి.
ఈ విధివిధానాల్లో జల్ జీవన్ మిషన్ నీటి సరఫరా మౌలిక సదుపాయాల మరమ్మతు, నిర్వహణతో పాటు, గ్రామీణ పార్కులు, కాలిబాటలు, గ్రామాల్లో ఇతర సౌకర్యాల కల్పనకు కూడా వీలు కల్పిస్తుంది.
గ్రామీణ జీవనోపాధిని, విలువ వ్యవస్థలను బలోపేతం చేయడానికి 98 పనులు
జీవనోపాధి సంబంధిత మౌలికవసతులకు కొత్త విధానం గణనీయమైన ప్రాధాన్యమిస్తుంది. దీనిలో 98 పనులకు అనుమతి ఉంది.
ఈ విభాగంలో వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి, విలువ జోడింపు మౌలిక వసతులు, క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకేజింగ్ యూనిట్లు, శీతల గిడ్డంగి సౌకర్యాలు, మినీ ఫ్లోర్ మిల్లులు, మార్కెట్ యార్డులు, డెయిరీ మౌలిక వసతులు, పుట్టగొడుగుల సాగు షెడ్లు, సెరీకల్చర్ షెడ్లు, పాలీ–హౌస్‌లు, ఆక్వాకల్చర్ వసతులు ఉన్నాయి.
స్వయం సహాయక బృందాలు, వాటి సమాఖ్యల కోసం ఎస్‌హెచ్‌జీ వర్క్‌షెడ్‌లు, షీ మార్ట్‌లు, సమాఖ్య భవనాలు, శిక్షణ-నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో సహా మౌలిక సదుపాయాలను కూడా అందిస్తుంది. పాత విధానం పరిధిలో నిర్దేశించిన 1.1 శాతంతో పోలిస్తే, కొత్త విధానం పరిధిలో మొత్తం అనుమతించదగిన పనుల్లో జీవనోపాధికి సంబంధించిన పనుల వాటా 26 శాతానికి గణనీయంగా పెరిగింది.
విపత్తు సన్నద్ధత, పర్యావరణ స్థిరత్వం కోసం 38 పనులు
గ్రామీణ పనుల విధానంలో మొదటిసారిగా విపత్తు సన్నద్ధత, తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి 38 పనులతో కూడిన ఒక ప్రత్యేక విభాగాన్ని చేర్చారు.
వీటిలో వరద సహాయక శిబిరాలు, రిటైనింగ్ వాల్స్, కట్టల బలోపేతం, వరద రక్షణ పనులు, విపత్తు అనంతరం గ్రామీణ రహదారులు, సామాజిక ఆస్తుల పునరుద్ధరణ, ఫైర్ లైన్లు, ఫ్యూయల్-బఫర్ జోన్‌ల వంటి అటవీ అగ్నిప్రమాద నిర్వహణ చర్యలు ఉన్నాయి.
వరదలు, తుఫానులు, వడగళ్ల వానలు, కరువులు, కొండచరియలు విరిగిపడటం, అటవీ అగ్నిప్రమాదాలు, ఇతర తీవ్ర వాతావరణ సంఘటనల నుంచి గ్రామీణ సమాజాలను, ఆస్తులను రక్షించడమే ఈ విభాగం లక్ష్యం.
రైతులు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలు, మహిళలు, గ్రామీణ యువతపై దృష్టి
వ్యవసాయం, బలహీనవర్గాలకు చెందిన కుటుంబాలు, మహిళలు, గ్రామీణ యువతపై ఈ షెడ్యూల్ ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
వ్యవసాయం, అనుభంధ రంగాల్లో 181 పనులు ఉండగా వాటిలో వ్యక్తిగత లబ్ధిదారుల పనులు 52 ఉన్నాయి. ఈ పనుల్లో నీరు, భూమి, మొక్కల పెంపకం, పశుసంపద, రైతులకు ప్రత్యక్ష తోడ్పాటును అందించే ఉత్పాదక ఆస్తులున్నాయి.
అంత్యోదయ/బలహీన వర్గాలకు చెందిన కుటుంబాల కోసం 107 పనులను కేటాయించారు. వీటిలో 68 పనులు వ్యక్తిగత లబ్ధిదారులకు సంబంధించినవి. వీటిలో గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, ఇంధనం, నీటిపారుదల, మొక్కల పెంపకం, పశువుల కొట్టాలు, ఇతర గృహస్థాయి ఆస్తులు ఉన్నాయి.
ఈ విధానంలో నారీశక్తికి సంబంధించిన 36 పనులు, యువశక్తికి సంబంధించిన మరో 36 పనులు కూడా ఉన్నాయి. దీని పరిధిలోకి మహిళా సంఘాలు, ఎస్‌హెచ్‌జీలు, సమాఖ్యలు, యువ కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార సంబంధిత మౌలిక వసతులు వస్తాయి.

సమ్మిళితమైన, భవిష్యత్తు అవసరాలకు తగిన గ్రామీణ మౌలిక వసతులు
దివ్యాంగుల కోసం ప్రభుత్వ భవనాల్లో మెట్లు, ర్యాంపుల నిర్మాణంతో సహా వారికి తగిన సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన, స్పష్టమైన నిబంధనలను అందిస్తుంది. దీనిలో సరిహద్దు ప్రాంతాల్లో అత్యవసర తరలింపు, సహాయక శిబిరాలు, పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాలు, వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే రీసైక్లింగ్, మురుగునీటి శుద్ధి లాంటి పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన చర్యలు ఉన్నాయి.
వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా పనుల రూపకల్పన
స్థానిక అవసరాల ఆధారంగా, గ్రామసభ అనుమతితో వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా వీబీ–జీ రామ్ జీ పరిధిలో పనులకు రూపకల్పన చేస్తారు. వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ద్వారా డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ... కేంద్ర, రాష్ట్ర, స్థానిక పథకాల్లో పెట్టుబడుల సమన్వయాన్ని సులభతరం చేస్తుంది. ఫలితంగా పనులు పునరావృతం కాకుండా సహాయపడుతుంది.
నీటి భద్రత, మన్నికైన గ్రామీణ మౌలికవసతులు, జీవనోపాధి కల్పన, వాతావరణ స్థిరత్వం, సమగ్రాభివృద్ధితో ఉపాధిని అనుసంధానించి వికసిత్ భారత్–2047 లక్ష్యానికి తోడ్పాటు అందించాలని కొత్త షెడ్యూల్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
***
(రిలీజ్ ఐడి: 2320086)
సందర్శకుల సూచీ సంఖ్య : : 26