వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
చక్కెర నిల్వ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు... పండుగల వేళ చక్కెర నిల్వ, సరఫరాపై ప్రభుత్వ చర్యలు
రిటైల్ చక్కెర ధరలు 15 శాతం తగ్గింపు... ఎక్స్-మిల్ చక్కెర ధరలు 28 శాతం వరకు తగ్గింపు
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2026 12:54PM by PIB Hyderabad
అక్టోబర్ 1 నుంచి కొత్త చక్కెర సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో.. పండుగల సమయంలో వినియోగదారులకు సరసమైన ధరలకు చక్కెర తగినంత అందుబాటులో ఉండేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని పటిష్టమైన చర్యలు చేపట్టింది.
కోల్‌కతా, దాని విస్తరించిన మెట్రోపాలిటన్ ప్రాంతాలు, అస్సాం రాష్టం మినహా, మిగిలిన ప్రాంతాల్లో వ్యాపారులు నిల్వ ఉంచుకునే కాలాన్ని 15 రోజులకు తగ్గించింది. అలాగే చక్కెన నిల్వ పరిమితిని దేశవ్యాప్తంగా 1,000 క్వింటాళ్లుగా నిర్ణయించింది. ఈ నిబంధనలు 2026 అక్టోబర్ 15 నుంచి 2026 నవంబర్ 30 వరకు అమలులో ఉంటాయి.
సవరించిన నిబంధనల ప్రకారం అక్టోబర్ 15 నుంచి చక్కెర డీలర్లు ఈ కింది నియమాలను పాటించాలి
· చక్కెర నిల్వలను సరఫరా అందిన తేదీ నుంచి 15 రోజులకు మించి ఉంచకూడదు.
· దేశంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ సమయంలోనైనా 1,000 క్వింటాళ్లకు మించి చక్కెర నిల్వ ఉంచకూడదు.
· అయితే ఆయా ప్రాంతాల ప్రత్యేక మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోల్‌కతా, దాని విస్తరించిన మెట్రోపాలిటన్ ప్రాంతాలు, అస్సాం రాష్ట్రంలో నిల్వ పరిమితిని 2,000 క్వింటాళ్లుగా నిర్ణయించారు.
కోల్‌కతాకు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి చక్కెర సరఫరా అవుతుంది. అక్కడి నుంచి ఈశాన్య ప్రాంతంతో పాటు దేశంలోని తూర్పు ప్రాంతాలకు చక్కెరను సరఫరా చేస్తారు. ఈశాన్య ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అస్సాంకు ఎక్కువ నిల్వ పరిమితిని నిర్ణయించారు.
చక్కెరను సరఫరా వ్యవస్థలో అవసరానికి మించి నిల్వ చేయకుండా చూడటం. చక్కెర మిల్లుల నుంచి డీలర్లకు, అక్కడి నుంచి చివరకు వినియోగదారులకు చక్కెర సజావుగా చేరేలా సరఫరా వ్యవస్థను క్రమబద్ధీకరించడం కొత్తగా సవరించిన నిబంధనల ఉద్దేశం. ముఖ్యంగా చక్కెరను దాచి నిల్వ ఉంచడాన్ని అరికట్టడం, ధరలు పెరుగుతాయనే అంచనాలతో జరిగే ఊహాజనిత వ్యాపారాన్ని తగ్గించడం, డీలర్లు అధిక మొత్తంలో చక్కెర నిల్వ చేసుకోకుండా చూడటం ఈ చర్యల ప్రధాన లక్ష్యం. డీలర్లు ఎంత మొత్తంలో, ఎంతకాలం చక్కెరను నిల్వ చేసుకోవచ్చనే దానిపై పరిమితులు విధించడం ద్వారా సరఫరా వ్యవస్థలో చక్కెర సజావుగా రవాణా అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తద్వారా వినియోగదారులకు సరసమైన ధరలకు చక్కెర నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.
రిటైల్ చక్కెర ధరలు 15 శాతం తగ్గుదల
రిటైల్ మార్కెట్‌లో చక్కెర సగటు ధరలు ఆగస్టులో నమోదైన గరిష్ఠ స్థాయితో పోలిస్తే 15 శాతం తగ్గాయి. మిల్లుల నుంచి బయటకు వచ్చే సమయంలో ఉండే చక్కెర ధరలు (ఎక్స్-మిల్ ధరలు) కూడా సుమారు 28 శాతం తగ్గాయి. గత మూడు వారాలుగా ఈ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మిల్లుల వద్ద ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనం సరఫరా వ్యవస్థలో వినియోగదారులకు చేరే కొద్దీ రిటైల్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా.
ఈ తగ్గుదల దేశంలో చక్కెర లభ్యత తగినంతగా ఉండేలా చూడటానికి, మార్కెట్‌లో దాని సరఫరా సజావుగా సాగేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల ప్రభావాన్ని ప్రతిబింబిస్తోంది.
చక్కెర మిల్లులు, డీలర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, ఇతర మార్కెట్ వర్గాలు సరఫరా వ్యవస్థలో నిరంతరంగా చక్కెరను రవాణా అయ్యేలా చూడాలని.. కృత్రిమ కొరత సృష్టించేలా నిల్వ చేయడం లేదా ఊహాజనితంగా నిల్వ ఉంచడం వంటివి చేయకూడదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. మిల్లుల వద్ద చక్కెర ధరలు గణనీయంగా తగ్గిన ప్రయోజనాన్ని హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు వెంటనే వినియోగదారులకు అందించాలని ప్రభుత్వం కోరింది.
ప్రాంతీయ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చక్కెర మిల్లులు ఇప్పటికే క్రషింగ్ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రభుత్వం సూచించింది. కొన్ని చక్కెర ఉత్పత్తి ప్రాంతాల్లో ఎల్‌నినో పరిస్థితుల కారణంగా ఏర్పడుతున్న అసమాన, తక్కువ వర్షపాతం చెరకు పంటపై చూపే ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది. దేశీయంగా చక్కెర అందుబాటు, వినియోగదారుల ప్రయోజనాలు, చెరకు రైతుల ప్రయోజనాల మధ్య సమతుల్యత ఉండేలా అవసరమైన అన్ని చర్యలను సకాలంలో తీసుకుంటుంది.
ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను బట్టి చక్కెర మిల్లుల క్రషింగ్ కార్యకలాపాలపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సూచించారు.
భారత్ చక్కెర విధానంలో చెరకు రైతులు, వినియోగదారులే రెండు ప్రధాన అంశాలని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. చెరకు రైతులకు తగిన ప్రతిఫలం లభించేలా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉండటంతో పాటు, చక్కెర ధరలు అనవసరంగా పెరగకుండా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి, దేశవ్యాప్తంగా చక్కెర తగినంతగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.
***
(రిలీజ్ ఐడి: 2317683)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam