హోం మంత్రిత్వ శాఖ
అహ్మదాబాద్‌లోని సబర్మతి రైల్వే స్టేషన్ వేదికగా రూ. 1,472 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి
దేశంలోని మొట్టమొదటి ఎల్‌ఎన్‌జీ ఆధారిత రైలును ప్రారంభించిన శ్రీ అమిత్ షా
దేశపు మొట్టమొదటి ఎల్‌ఎన్‌జీ ఆధారిత రైలును జాతికి అంకితం చేసిన కేంద్ర హోం మంత్రి.. పర్యావరణ పరిరక్షణ దిశగా ఇది ఎంతో ప్రయోజనకరం
శ్రీ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత రైల్వే రంగంలో వచ్చిన అనేక కొత్త సౌకర్యాలు.. రైల్వే నెట్‌వర్క్‌ను మరింత ఆధునికీకరించడంతో పాటు అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక సరుకు రవాణా కారిడార్, ర్యాపిడ్ రైల్ సిస్టమ్, ప్రీమియం రైల్వే స్టేషన్లు: శ్రీ అమిత్ షా
దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించడం ద్వారా ఈ సాంకేతికతను కలిగి ఉన్న ప్రపంచంలోని నాలుగు దేశాల సరసన భారత్‌ను నిలబెట్టిన శ్రీ నరేంద్ర మోదీ
సత్యాగ్రహం, సాదాసీదా జీవనం, గ్రామీణాభివృద్ధి, ఖాదీ.. ఇవన్నీ క్షేత్రస్థాయిలో ఆచరణలోకి తెచ్చే ప్రయాణం సబర్మతి నుంచే ప్రారంభమైంది: శ్రీ అమిత్ షా
ముంబయి నుంచి వడోదర వరకు ప్రయోగాత్మకంగా నడిచిన మొట్టమొదటి లాంగ్-హాల్ డబుల్-స్టాక్ కంటైనర్ రైలు మన సరుకు రవాణా సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది: శ్రీ అమిత్ షా
శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించిన 'భారత్‌లో తయారీ', 'ఆత్మనిర్భర్ భారత్' భావన ఫలితంగా ఇంజిన్ల వంటి పరికరాలను దేశీయంగానే పెద్ద ఎత్తున తయారు చేసే సామర్థ్యాన్ని దేశం పొందింది: శ్రీ అమిత్ షా
రైల్వే శాఖ డీజిల్ వినియోగం 2015-16లో 293 కోట్ల లీటర్ల నుంచి 2024-25 నాటికి 108 కోట్ల లీటర్లకు తగ్గింది: శ్రీ అమిత్ షా
మోదీ ప్రభుత్వ హయాంలో 98 శాతం రైల్వే కోచ్‌లలో బయో-టాయిలెట్లు ఏర్పాటయ్యాయి. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల ఉత్పత్తి 57 శాతం పెరగగా లోకోమోటివ్ ఉత్పత్తి సామర్థ్యం 66 శాతానికి పెరిగింది. రైల్వే భద్రతా బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం 67 శాతం పెంచింది: శ్రీ అమిత్ షా
2014 కంటే ముందు రైల్వే విద్యుదీకరణ కేవలం 30 శాతంగా మాత్రమే ఉండేది. మోదీ ప్రభుత్వ హయాంలో అది 99.6 శాతానికి పెరిగింది. మిగిలిన 0.4 శాతాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తాం: శ్రీ అమిత్ షా
గత ప్రభుత్వం రూ. 12 లక్షల కోట్ల కుంభకోణాలు, అవినీతి తప్ప ఏమీ చేయలేదు. గత 12 ఏళ్లలో శ్రీ నరేంద్ర మోదీపై కనీసం చిన్న అవినీతి ఆరోపణ కూడా రాలేదు: శ్రీ అమిత్ షా
రైల్వే లోకోమోటివ్ ఇంజిన్ల నిర్వహణ కోసం రూ. 700 కోట్ల వ్యయంతో నిర్మించిన 'డబ్ల్యూఏజీ-12 మెయింటెనెన్స్ షెడ్'ను కూడా ప్రారంభించిన హోం మంత్రి: శ్రీ అమిత్ షా
సబర్మతి
నాడు పోస్టు చేయడమైనది:
27 SEP 2026 3:33PM by PIB Hyderabad
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సబర్మతి రైల్వే స్టేషన్ వేదికగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి ఈ రోజు రూ. 1,472 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. దేశంలోని మొట్టమొదటి ఎల్‌ఎన్‌జీ ఆధారిత రైలును కూడా ఆయన ప్రారంభించారు. రైల్వే లోకోమోటివ్ ఇంజిన్ల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన డబ్ల్యూఏజీ-12 మెయింటెనెన్స్ షెడ్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికుల సౌకర్యాలు, రైలు ప్రయాణికుల భద్రతపై దృష్టి సారిస్తూ సబర్మతి డివిజన్‌లో ఈ రోజు అనేక రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించినట్లు తెలిపారు. సత్యాగ్రహం, సాదాసీదా జీవనం, గ్రామీణాభివృద్ధి, ఖాదీ.. ఈ ప్రయోగాలన్నింటినీ క్షేత్రస్థాయిలో ఆచరణలోకి తెచ్చే ప్రయాణం సబర్మతి నుంచే ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. సబర్మతి రైల్వే స్టేషన్ ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందన్న ఆయన.. 1980లలో ప్రయాణికులు స్టేషన్ నుంచి రిక్షా దొరకాలన్నా దాదాపు రెండు కిలోమీటర్లు నడవాల్సి వచ్చేదని గుర్తుచేశారు. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత, కనెక్టివిటీ పరంగా సబర్మతి రైల్వే స్టేషన్ ఒక పెద్ద పరివర్తనను చూసిందని ఆయన అన్నారు. రూ. 1,472 కోట్ల వ్యయంతో ఈ రోజు ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటాయని ఆయన తెలిపారు. రైల్వే లోకోమోటివ్ ఇంజిన్ల నిర్వహణ కోసం ఇక్కడ రూ. 700 కోట్ల వ్యయంతో డబ్ల్యూఏజీ-12 మెయింటెనెన్స్ షెడ్ నిర్మించినట్లు ఆయన వెల్లడించారు. భద్రతను మరింత మెరుగుపరచడానికి రూ. 48 కోట్ల వ్యయంతో సబర్మతి-కలోల్-సబర్మతి రైలు మార్గంలో 'కవచ్' రక్షణ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అహ్మదాబాద్-పాలన్‌పూర్, అహ్మదాబాద్-సమఖియాలి రైలు మార్గాల్లో 'కవచ్' వ్యవస్థను అమలు చేసే పనులతో పాటు సబర్మతి-సార్ఖేజ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులను కూడా ప్రారంభించారు.
12,000 హార్స్‌పవర్ సామర్థ్యం గల రెండు విభాగాల ఇంజిన్‌ను ఈ రోజు జాతికి అంకితం చేసినట్లు తెలిపిన కేంద్ర హోం మంత్రి.. ఇది దాదాపు 600 ట్రక్కులు మోయగల సరుకును ఏకైక ఇంజిన్‌తో రవాణా చేయగలదని అన్నారు. గతంలో ఈ పని కోసం రెండు లోకోమోటివ్‌లు అవసరమయ్యేవి కానీ ఇప్పుడు ఒకే డబ్ల్యూఏజీ-12 ఇంజిన్ ఆ పనిని పూర్తి చేయగలదు. భారతీయ రైల్వే చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టమని ఆయన పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడే ఎల్‌ఎన్‌జీ ఆధారిత రైలును కూడా ఈ రోజు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.
2014లో శ్రీ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత రైల్వే రంగంలో అనేక కొత్త సౌకర్యాలు వచ్చాయని.. రైల్వే నెట్‌వర్క్ ఆధునికీకరణ జరిగినట్లు కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ముంబయిలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్‌పీటీ) నుంచి వడోదర వరకు దేశపు మొట్టమొదటి డబుల్-స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు విజయవంతమైన ట్రయల్ రన్ పూర్తి చేసుకుందని ఆయన తెలిపారు. దేశంలో సరుకు రవాణాకు పరిమితమైన రైలు మార్గాలు ఉన్నాయని.. అయితే డబుల్-స్టాక్ సరుకు రవాణా రైళ్ల భావన విజయవంతమైతే సరుకు రవాణా సామర్థ్యం దాదాపు రెట్టింపు అవుతుందని ఆయన చెప్పారు. ఇప్పుడు 11,000 కిలోమీటర్ల పొడవైన కారిడార్‌ను నాలుగు ట్రాక్‌లు ఉన్న నెట్‌వర్క్‌గా మారుస్తున్నట్లు తెలిపిన ఆయన. ఇది ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-గౌహతి వైపు రవాణా రాకపోకలను గణనీయంగా సులభతరం చేస్తుందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోనే ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, రాపిడ్ రైల్ సిస్టమ్, ప్రీమియం రైల్వే స్టేషన్లు ప్రవేశపెట్టినట్లు శ్రీ అమిత్ షా అన్నారు. ఇటీవలే ప్రధానమంత్రి మోదీ హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించారని.. ఈ సాంకేతికతను కలిగి ఉన్న ప్రపంచంలోని నాలుగో దేశంగా భారత్ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో 97 శాతం బయో-టాయిలెట్లు ఏర్పాటుకావటంతో పాటు 87 శాతం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు భారత్‌లో తయారయ్యాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు రైల్వే విద్యుదీకరణ కేవలం 30 శాతంగా మాత్రమే ఉండేది.. మిగిలిన 70 శాతం పనులు ఆయన హయాంలోనే పూర్తయ్యాయి. మోదీ ప్రభుత్వ కాలంలో రైల్వే భద్రతా బడ్జెట్ 67 శాతం పెరిగిందన్న కేంద్ర హోం మంత్రి.. లోకోమోటివ్ ఉత్పత్తి సామర్థ్యం 66 శాతం పెరిగిందని తెలిపారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'భారత్‌లో తయారీ', 'ఆత్మనిర్భర్ భారత్' భావనలను ప్రారంభించారని… దాని ఫలితంగా లోకోమోటివ్‌ల వంటి పరికరాలను దేశీయంగానే తయారు చేసే దిశగా దేశం ఇప్పుడు అద్భుతమైన పురోగతి సాధించిందని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. 2015-16లో రైల్వే శాఖ 293 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగించగా 2024-25 నాటికి అది 108 కోట్ల లీటర్లకు తగ్గింది. ఇది పెద్దగా ఎవరి దృష్టికి రాని ఒక గొప్ప విజయమని ఆయన చెప్పారు. 2010-11లో ఏడాది మొత్తంలో కేవలం 75 కిలోమీటర్ల రైల్వే విద్యుదీకరణ మాత్రమే జరిగిందని.. 2023-24లో ఒక్క సంవత్సరంలోనే 7,188 కిలోమీటర్ల విద్యుదీకరణ పూర్తయిందని ఆయన తెలిపారు. ఇప్పుడు 99.6 శాతం రైల్వే నెట్‌వర్క్ విద్యుదీకరణ పూర్తయిందని.. మిగిలిన 0.4 శాతం పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని ఆయన వెల్లడించారు. రైల్వే విద్యుదీకరణ చైనాలో 92 శాతం, స్పెయిన్‌లో 68 శాతం, ఫ్రాన్స్‌లో 60 శాతం, చిన్న దేశమైన బ్రిటన్‌లో 49 శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 100 శాతం విద్యుదీకరణను సాధించడం ద్వారా భారత్ ఈ దేశాలను అధిగమించనుంది. ప్రపంచంలో 100 శాతం రైల్వే విద్యుదీకరణ సాధించిన ఏకైక దేశం స్వీడన్ మాత్రమేనని.. అయితే స్వీడన్‌లో మొత్తం రైల్వే లైన్ల పొడవు భారత్‌తో పోలిస్తే దాదాపు పది రెట్లు తక్కువని ఆయన తెలిపారు.
రైల్వే బడ్జెట్ విషయంలో గుజరాత్‌ను ఒక ఉదాహరణగా తీసుకుంటే 2009 నుంచి 2014 వరకు సగటున కేటాయించిన రైల్వే బడ్జెట్ కేవలం రూ. 589 కోట్లు మాత్రమేనని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. దీనికి విరుద్ధంగా ఒక సంవత్సరానికి అంటే 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ రూ. 17,366 కోట్లకు చేరుకుందని ఆయన తెలిపారు. అభివృద్ధి వేగంలో ఉన్న ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. బాధ్యతారహితమైన ప్రకటనలు చేసే ప్రతిపక్ష పార్టీ నాయకులు కేవలం ఆరోపణలు మాని.. వాస్తవాలు, గణాంకాలతో చర్చించాలని దేశ ప్రజలు కోరాలని ఆయన అన్నారు. తమ హయాంలో ప్రతిపక్ష పార్టీ ఏం చేసిందని శ్రీ అమిత్ షా ప్రశ్నించారు. 10 సంవత్సరాల కాలంలో రూ. 12 లక్షల కోట్ల కుంభకోణాలు, స్కామ్‌లు, అవినీతి మినహా ప్రతిపక్ష పార్టీ చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. గత 12 ఏళ్లలో శ్రీ నరేంద్ర మోదీపై కనీసం చిన్న అవినీతి ఆరోపణ కూడా రాలేదని కేంద్ర హోం మంత్రి స్పష్టం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2315826)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam