హోం మంత్రిత్వ శాఖ
హిందీ దినోత్సవం - 2026 సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా సందేశం
నాడు పోస్టు చేయడమైనది:
14 SEP 2026 12:54PM by PIB Hyderabad
ప్రియమైన తోటి పౌరులారా,
హిందీ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!
మన దేశం భాషా వైవిధ్యానికి, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి నెలవైన ఒక విశిష్ట భూమి. వేర్వేరు భాషలు ఉండటం మన బలహీనత అని చాలామంది అంటుంటారు, కానీ ఇన్ని భాషలు ఉండటమే మన అత్యంత గొప్ప శక్తి అని నా విశ్వాసం. ప్రతి భాష తనతో పాటు ఒక చరిత్రను, జానపద సంప్రదాయాలను, ఒక విభిన్నమైన జీవన దృక్పథాన్ని కలిగివుంది. ఇవి మన యవతరానికి సాంస్కృతిక విలువల సంపదను అందించడానికి తోడ్పడతాయి. ఈ భాషా వైవిధ్యం భారతదేశాన్ని నిర్వచించే 'భిన్నత్వంలో ఏకత్వం' భావనను మరింత బలోపేతం చేస్తుంది. భాష అనేది కేవలం ఒక సంభాషణ మాధ్యమం మాత్రమే కాదు - అది ఒక సమాజ జ్ఞాపకం, దాని ఆత్మగౌరవ ప్రతీక.
ఈ భిన్నత్వం మధ్య సంభాషణ, సమాచార మార్పిడి, సమన్వయ భాషగా హిందీ కీలక పాత్ర పోషించింది. దేశవ్యాప్తంగా వివిధ వర్గాలు, సముదాయాలకు చెందిన ప్రజలను హిందీ అనుసంధానించింది. అయితే, అన్ని భారతీయ భాషలను గౌరవిస్తూ, పరిరక్షిస్తూ, ప్రోత్సహిస్తూ హిందీ అభివృద్ధి చెందితేనే దానికి నిజమైన సార్థకత చేకూరుతుంది. హిందీ ఏ భాషకూ పోటీ కాదు. భారతీయ భాషల మధ్య అనుబంధం, సంభాషణ భావనను పెంపొందించి, జాతీయ ఐక్యతను బలోపేతం చేసే ముఖ్యమైన అనుసంధాన భాషగా హిందీ నిలుస్తుంది. ఈ సత్యానికి మన చరిత్రే అత్యంత గొప్ప నిదర్శనం. స్వామి దయానంద సరస్వతి గుజరాతీ మాతృభాష కలిగినవారైనప్పటికీ, ‘సత్యార్థ ప్రకాశ్’ గ్రంథాన్ని హిందీలో రచించారు. మహాత్మా గాంధీ 1918లో మద్రాస్‌లో దక్షిణ భారత్ హిందీ ప్రచార సభను స్థాపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బెంగాలీ భాష మాట్లాడేవారైనప్పటికీ, ఆజాద్ హింద్ ఫౌజ్‌లో సమాచార మార్పిడి భాషగా హిందీని స్వీకరించి, దేశానికి స్ఫూర్తిదాయకమైన ‘జై హింద్’ నినాదాన్ని అందించారు. వివిధ భాషా నేపథ్యాలకు చెందిన మహనీయులు హిందీని ప్రజల మధ్య సంభాషణ భాషగా తీర్చిదిద్దడంలో అత్యంత గొప్ప పాత్ర పోషించారు. మాతృభాష హిందీ కానప్పటికీ, హిందీ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఈ మహనీయుల అపార సేవలు మనందరికీ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
నా మాతృభాష కూడా గుజరాతీయే. అయితే, నేను దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి సామాన్య ప్రజలతో నన్ను నేరుగా అనుసంధానించే భాష హిందీ. హిందీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే, అందులో మొత్తం దేశ ప్రస్థానం ప్రతిబిం బించడం మనకు కనిపిస్తుంది. ఆదికాలంలో విద్యాపతి రచించిన పదావళి, పృథ్వీరాజ్ రాసోలోని వీరగాథల నుంచి, భక్తి యుగంలోని అద్భుతమైన సాహిత్య ప్రస్థానం వరకు హిందీ భాష తన ప్రత్యేకతను చాటుకుంది. తులసీదాస్ శ్రీరాముడి కథను ప్రతి ఇంటికీ చేర్చగా, సూరదాస్ తల్లిదండ్రుల ప్రేమలోని సున్నితమైన భావాలకు తన రచనల ద్వారా స్వరం అందించారు.
స్వాతంత్య్రోద్యమ కాలంలో స్వరాజ్యం, స్వదేశీ, స్వభాష అనే ఆదర్శాలు జాతీయ చైతన్యానికి నూతన శక్తిని అందించాయి. మన స్వాతంత్ర్య సమరయోధులు కూడా మన భాష, మన గుర్తింపుపై గర్వం లేకుండా స్వరాజ్య స్వప్నం సంపూర్ణం కాదని గ్రహించారు. స్వాతంత్ర్యం అనంతరం భారతీయ భాషలు దేశ నిర్మాణానికి, పరిపాలనకు, అభివృద్ధి ఫలాలను ప్రతి పౌరుడికి చేరవేయడానికి సాధనాలుగా మారాయి. సామాజిక చైతన్యం, జాతీయ ఐక్యత, స్వాతంత్ర్య భావన సందేశాలను సమాజంలోని ప్రతి వర్గానికీ వ్యాప్తి చేయడంలో ఇతర భారతీయ భాషలతో పాటు హిందీ కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ సమృద్ధమైన వారసత్వాన్ని కొనసాగిస్తూ, భారత రాజ్యాంగ సభ 1949 సెప్టెంబర్ 14న హిందీని భారత అధికార భాషగా ఆమోదించింది. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన వైరుధ్యం తలెత్తింది. మనకు రాజకీయం సాధికారత లభించినప్పటికీ. స్వభాష, స్వసంస్కృతి, స్వయం ఆత్మగౌరవ విలువలు మూలన పడ్డాయి.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి దేశ ప్రజలకు పిలుపునిస్తూ, వలసవాద మనస్తత్వం నుంచి మనం విముక్తి పొందాలని అన్నారు. ఇందులో భాష కీలక పాత్ర పోషిస్తుంది. రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా మార్చడం కేవలం పేరు మార్పు మాత్రమే కాదు. బ్రిటిష్ వారు రూపొందించిన, శిక్షాకేంద్రీకృతమైన వలసవాద చట్టాల స్థానంలో ప్రజాకేంద్రీకృతమైన మూడు చట్టాలు - భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమం - తీసుకురావడం కేవలం పదజాల మార్పు మాత్రమే కాదు. ఇది మన జాతీయ ఆత్మగౌరవ పునరుద్ధరణకు ప్రతీక.
నేడు జాతీయ విద్యా విధానం మాతృభాషను విద్యకు కేంద్రంగా నిలిపింది. ఇంజినీరింగ్, వైద్య విద్యను భారతీయ భాషల్లో అందిస్తున్నారు. పోటీ పరీక్షలను కూడా పలు భారతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి వికసిత్ భారత్ నిర్మాణానికి ‘శక్తి సప్తధార’ - శక్తికి సంబంధించిన ఏడు ప్రవాహాలు - అవసరమని పిలుపునిచ్చారు. అందులో ఏడవది భారత్ సాఫ్ట్ పవర్. ఏ దేశ సాఫ్ట్ పవర్‌కైనా అత్యంత శక్తివంతమైన వాహకం ఆ దేశ భాషే. యోగా, ఆయుర్వేదం, సాహిత్యం, సినిమా, మన సాంస్కృతిక శక్తి - ఇవన్నీ మన భాషల ద్వారానే ప్రపంచానికి చేరుతున్నాయి.
ఆధునిక సాంకేతిక యుగంలో భారతీయ భాషలు వెనుకబడిపోతాయనే ఆందోళన ఒకప్పుడు ఉండేది. అయితే, మోదీ ప్రభుత్వ హయాంలో హిందీతో పాటు అన్ని భారతీయ భాషలు సాంకేతిక పురోగతిలో స్వర్ణయుగాన్ని చూస్తున్నాయి.
అధికార భాషా విభాగం అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ ఆధారిత ‘భారతి’ సాధనం ప్రస్తుతం భారతీయ భాషల మధ్య సమాచార మార్పిడిని మరింత సులభతరం చేస్తోంది. 8.27 లక్షలకు పైగా పదాల నమోదుతో రూపొందించిన డిజిటల్ నిఘంటువు ‘హిందీ శబ్ద సింధు’ విజ్ఞానాన్ని పంచుకునేందుకు సంపన్నమైన వేదికగా నిలిచింది. 2024లో ఏర్పాటు చేసిన ‘ఇండియన్ లాంగ్వేజ్ సెక్షన్’ భారతీయ భాషల్లో పరిపాలనా సమాచార మార్పిడికి దోహదపడుతోంది. కృత్రిమ మేధ, అనువాద సాంకేతికతలు భాషా అవరోధాలను తొలగించాయి. నేడు ప్రతి భారతీయుడు తన సొంత భాషలో ఆలోచిస్తూ, ప్రపంచంతో అనుసంధానం కావచ్చు. ఇదే సమయంలో, మోదీ ప్రభుత్వ హయాంలో అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ తన నివేదికలకు సంబంధించిన మరో నాలుగు కొత్త సంపుటాలను రాష్ట్రపతికి సమర్పించింది.
చివరగా, నేను దేశ యువతకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచంలోని భాషల్లో సాధ్యమైనన్ని నేర్చుకోండి, కానీ మీ స్వంత భాషను ఎన్నటికీ విడిచిపెట్టకండి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో మాతృభాషలో మాట్లాడటాన్ని ఒక నియమంగా చేసుకోవాలని కోరుతున్నాను. “నేను నా స్వంత భాషలో మాట్లాడితే, నన్ను తక్కువగా భావిస్తారు” అనే ఆలోచనకంటే గొప్ప న్యూనతాభావం మరొకటి ఉండదు.
కేవలం భాష మాత్రమే మనల్ని మన తల్లితో, మన నేలతో, మన చరిత్రతో, మన సంస్కృతితో అనుసంధానిస్తుంది. ఈ ఏడాది జాతీయ గీతం ‘వందే మాతరం’ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. భాషను స్వాతంత్ర్య సాధనంగా మార్చిన గీతం ‘వందే మాతరం’.
2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం దిశగా సాగుతున్న మన ప్రస్థానంలో హిందీతో పాటు అన్ని భారతీయ భాషలను శక్తివంతమైన సాధనాలుగా తీర్చిదిద్దేందుకు మనమంతా ఈ సందర్భంగా సంకల్పం తీసుకుందాం.
అధికార భాషా దినోత్సవం సందర్భంగా మరోసారి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. వందే మాతరం!
***
(రిలీజ్ ఐడి: 2310217)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil