సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సెప్టెంబర్ 22న గుజరాత్ కేవడియాలోని ఏక్తానగర్‌లో
72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రదానం చేయనున్న భారత రాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
08 SEP 2026 1:55PM by PIB Hyderabad
సెప్టెంబర్ 22, 2026న గుజరాత్‌లోని (కేవడియా) ఏక్తానగర్‌లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను భారత రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ రూపకర్తలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర ఆర్టిస్టులు ఈ వేడుకలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో 2024 సంవత్సరానికిగానూ భారతీయ సినిమా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులను గౌరవిస్తారు.
దేశ సినీ రంగంలో జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రతిష్ఠాత్మక గౌరవంగా భావిస్తారు. వీటిని 1954లో ప్రారంభించారు. ఏడు దశాబ్దాలుగా ఈ అవార్డులు… ఫీచర్, నాన్-ఫీచర్ ఫిలిమ్స్, సినీ రచన విభాగాల్లో సాధించిన అత్యుత్తమ సృజనాత్మక, సాంకేతిక విజయాలను గుర్తించాయి. భారతీయ సినీ రంగంలోని భాషా, సాంస్కృతిక, ప్రాంతీయ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
కీలక విధాన నిర్ణయంలో భాగంగా జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని దేశ రాజధానికి పరిమితం చేయకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ ఏడాది ఏక్తానగర్ లో జరగనున్న ఈ వేడుక.. దేశవ్యాప్తంగా సినిమా ప్రతిభను ఒకచోట చేర్చి 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని చాటి చెబుతుంది.
వివిధ భాషలు, శైలి, సినీ ప్రక్రియల్లోని వైవిధ్యాన్ని 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు చాటి చెబుతున్నాయి. ఉత్తమ ఫీచర్ ఫిలింగా 'ఆర్టికల్ 370’ అవార్డును అందుకుంటుంది. ఉత్తమ నాన్-ఫీచర్ ఫిలింగా 'భంగార్’, ఉత్తమ డాక్యుమెంటరీగా 'రామ్-నామీ'ని జ్యూరీ ఎంపిక చేసింది. ప్రధాన పాత్రలో ఉత్తమ నటులుగా 'భ్రమయుగం' చిత్రానికి మమ్ముట్టి, 'చందూ ఛాంపియన్' చిత్రానికి కార్తీక్ ఆర్యన్ ఎంపికయ్యారు. యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఆర్టికల్ 370’ చిత్రంలో నటనకు గానూ ఉత్తమ నటి అవార్డును అందుకోనున్నారు. 'స్వాతంత్ర్య వీర్ సావర్కర్' చిత్రానికి రణ్‌దీప్ హూడా ఉత్తమ తొలి దర్శకుడిగా అవార్డును అందుకుంటారు.
ఈ అవార్డులు మరాఠీ, సంతాలీ, తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, తుళు, గఢ్వాలీ వంటి వివిధ భాషలు, కళారూపాల్లోని ప్రతిభను గుర్తిస్తాయి. 'కల్కి 2898 ఏడీ’, 'అమరన్', 'పుష్ప: ది రూల్ పార్ట్-02', 'భూల్ భులయ్యా 3', 'స్త్రీ 2' వంటి పలు చిత్రాలు వివిధ విభాగాల్లో పురస్కారాలను అందుకుంటాయి. జాతీయ చలనచిత్ర అవార్డుల నాన్-ఫీచర్ ఫిలిం విభాగంలో తొలిసారిగా సంతాలీ చిత్రానికి గౌరవం దక్కనుంది.
సినీ రచన విభాగంలో ఉత్తమ సినీ విమర్శకుడిగా సంజీవ్ శ్రీవాత్సవకు అవార్డు ప్రకటించారు. సినిమాపై డాక్టర్ ప్రదీప్ కంచనూరు రచించి, మిర్రర్ పత్రిక ప్రచురించిన పుస్తకం… 'నానిరువుదే నిమగాగి నాడిరువుదే ననగాగి: కన్నడ సినిమాద తత్వ మత్తు రాజకీయ (ఐ స్టాండ్ ఫర్ యూ, ది స్టేట్ స్టాండ్స్ ఫర్ అజ్: పొలిటికల్ అండ్ ఫిలాసఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ కన్నడ సినిమా)కు ఉత్తమ సినీ పుస్తకం అవార్డు దక్కింది.
***
(రిలీజ్ ఐడి: 2307827)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8