రాష్ట్రపతి సచివాలయం
ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను ప్రదానం చేసిన భారత రాష్ట్రపతి
విద్యాపరమైన ప్రతిభ, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తల సాధికారత దేశాభివృద్ధిలో ప్రాముఖ‌్యత గల అంశాలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నాడు పోస్టు చేయడమైనది:
05 SEP 2026 3:09PM by PIB Hyderabad
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ రోజు (సెప్టెంబర్ 5, 2026) న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలువురు ఉపాధ్యాయులకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... మన రాజ్యాంగంలో పొందుపరిచిన సమాన అవకాశాల ఆదర్శాన్ని సాకారం చేసుకునేందుకు విద్యే అత్యంత ప్రభావవంతమైన సాధనమని గౌరవ రాష్ట్రపతి అన్నారు. ఉపాధ్యాయుల కృషితోనే ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు, మధ్యలోనే బడి మానేసే రేటు దాదాపు సున్నాకి చేరినట్లు ఆమె తెలిపారు. ఈ జాతీయ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలిపారు.
విద్యా వ్యవస్థకు పునాది పాఠశాల విద్యేనని రాష్ట్రపతి అన్నారు. జ్ఞానాన్ని, నైపుణ్యాలను ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కానీ బాల్యంలోనే సత్ప్రవర్తనను నేర్పించటం మరింత ప్రభావవంతంగా ఉంటుందని చెప్పారు. ప్రాథమిక తరగతుల్లో పిల్లల మేధో, శారీరక, నైతిక వికాసంపై దృష్టి సారించటం ద్వారా ఉపాధ్యాయులు... భవిష్యత్ తరాలను అత్యుత్తమ విద్యార్థులుగా, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దగలరని తెలిపారు.
చాలామంది విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వస్తారని, మరికొందరు మొదటి తరం అభ్యాసకులని, ఇంకొందరు సాధారణ గ్రామీణ పాఠశాలల నుంచి పెద్ద నగరాల పాఠశాలలకు మారుతుంటారని, కొందరు స్వతహాగా బిడియంతో ఉంటారని, మరికొందరికి అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం లోపిస్తుందని, కొందరు ప్రత్యేక అవసరాలు గల పిల్లలుంటారని రాష్ట్రపతి అన్నారు. కారణం ఏదైనా... ఆత్మన్యూనతతో బాధపడే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు.
విద్యాపరమైన ప్రతిభ, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తల సాధికారత దేశాభివృద్ధిలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రపంచ నైపుణ్య రాజధానిగా భారత్‌ను తీర్చిదిద్దటం, విజ్ఞాన కేంద్రంగా మార్చటం మన జాతీయ ప్రాధాన్యతల్లో ఒకటని స్పష్టం చేశారు.
వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశాన్ని నడిపిస్తున్నామని, ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ ద్వారానే ఈ లక్ష్యాన్ని సాధించగలమని రాష్ట్రపతి అన్నారు. మన ఉపాధ్యాయులే విద్యా వ్యవస్థకు ప్రాణం పోస్తున్నారు. దేశంలో ఏ ఒక్క విద్యార్థి కూడా నాణ్యమైన విద్యను పొందే అవకాశాలను కోల్పోకుండా చూసేందుకు కృషి చేయాలని చెప్పారు. ఆప్యాయత, అంకితభావంతో విద్యార్థులందరిలో జ్ఞానాన్ని, స్ఫూర్తిని, నైతికతను, సున్నితత్వాన్ని ఉపాధ్యాయులు పెంపొందించాలని స్పష్టం చేశారు.
రాష్ట్రపతి ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(రిలీజ్ ఐడి: 2307105)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam