ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో ప్రధానమంత్రి ముఖాముఖి


జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు 82 మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తల ఎంపిక



యువ విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వ్యసన సమస్యపై అప్రమత్తంగా ఉండి, దాన్ని అధిగమించేందుకు వారికి సహకరించాలని ఉపాధ్యాయులకు ప్రధాని పిలుపు



క్రీడలు, శారీరక ఆటలు, సృజనాత్మక కార్యక్రమాలతో పిల్లల్లో స్క్రీన్ సమయాన్ని తగ్గించాలి: ప్రధాని



బాల్యాన్ని కాపాడుతూ పిల్లల్లో సహజమైన ఆసక్తి, జిజ్ఞాసను పెంపొందించాలని ఉపాధ్యాయులకు ప్రధాని శ్రీ మోదీ సూచన



తరగతి గది అభ్యాసాన్ని ఆసక్తికరంగా, ప్రభావవంతంగా మార్చేందుకు తాము అనుసరించిన సృజనాత్మక విధానాలను పంచుకున్న ఉపాధ్యాయులు

నాడు పోస్టు చేయడమైనది: 05 SEP 2026 10:39AM by PIB Hyderabad

 

లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సమావేశమయ్యారు.

 

ఈ ఏడాది మూడు విభాగాలకు చెందిన మొత్తం 82 మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలను జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపిక చేశారు. వీరిలో పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగానికి చెందిన 48 మంది ఉపాధ్యాయులు, ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్‌లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు/ఫ్యాకల్టీ సభ్యులు, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వశాఖకు చెందిన 13 మంది నైపుణ్య శిక్షకులు ఉన్నారు. తమ బోధన ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన అనుభవాలు, ఆవిష్కరణలను పురస్కార గ్రహీతలు వివరించారు. తరగతి గది అభ్యాసాన్ని మరింత ఆసక్తికరంగా, ప్రభావవంతంగా మార్చేందుకు తాము అనుసరించిన పలు సృజనాత్మక విధానాలను వారు పంచుకున్నారు.

 

పిల్లల విద్యా ప్రదర్శనను మాత్రమే కాకుండా, వారి ప్రవర్తన, రోజువారీ జీవితాన్ని కూడా ఉపాధ్యాయులు గమనించాలని ప్రధానమంత్రి చెప్పారు. సంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గిపోతున్న నేపథ్యంలో పిల్లల జీవితాల్లో ఉపాధ్యాయుల పాత్ర మరింత కీలకంగా మారిందని ఆయన అన్నారు. మాదకద్రవ్యాల సమస్యను ప్రస్తావిస్తూ.. పిల్లల్లో వచ్చే మార్పులపై ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని, వాటికి గల కారణాలను గుర్తించి, అలాంటి పిల్లలు ఆ అలవాటును అధిగమించేందుకు సహాయం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. 

 

బాల్యంలోని అమాయకత్వాన్ని కాపాడటం ఉపాధ్యాయులు పోషించగల కీలక పాత్ర అని ప్రధానమంత్రి అన్నారు. పిల్లలందరిలోనూ సహజమైన ఆసక్తి, జిజ్ఞాస ఒకే విధంగా ఉంటాయని, ఉపాధ్యాయులు ఆ ఉత్సుకతను ప్రోత్సహించి, సరైన దిశలో నడిపిస్తే వారి అభివృద్ధికి గణనీయమైన తోడ్పాటు అందించగలరని ఆయన పేర్కొన్నారు.

 

స్క్రీన్ టైమ్‌ సమస్యను ప్రస్తావిస్తూ.. ఇది ప్రస్తుతం ప్రధాన ఆందోళనగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. పిల్లలు ఎంత సమయం స్క్రీన్‌లను చూస్తున్నారు, రాత్రి వేళల్లోనూ మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారా అనే అంశాలపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మాట్లాడాలని ఆయన సూచించారు. క్రీడలు, శారీరక ఆటలు, సృజనాత్మక కార్యక్రమాలపై ఆసక్తిని పెంపొందించడం ద్వారా పిల్లలు క్రమంగా అధిక స్క్రీన్ వినియోగం నుంచి బయటపడేలా చేయవచ్చని ఆయన అన్నారు.

 

జాతీయ విద్యా విధానాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి.. పిల్లలను తరగతి గది నుంచి బయటకి తీసుకెళ్లి, వాస్తవ ప్రపంచ నైపుణ్యాలు, వివిధ రకాల పనులతో వారిని అనుసంధానించడం ప్రాధాన్యమని పేర్కొన్నారు. పాఠ్యాంశంలోని జ్ఞానాన్ని బోధించడానికే పరిమితం కాకుండా, పిల్లల్లో శ్రమకు గౌరవం వంటి విలువలను పెంపొందించేందుకు కూడా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన సూచించారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2307101) సందర్శకుల సూచీ సంఖ్య : : 4