సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శులతో జాతీయ సదస్సును నిర్వహించిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ 2027తో పాటు ప్రత్యక్షంగా నిర్వహించే కార్యక్రమాల వరకు భారత అవిష్కరణల ఆర్థిక వ్యవస్థ, మీడియా రంగాల బలోపేతానికి మంత్రిత్వ శాఖ కార్యాచరణ ప్రణాళిక
నాడు పోస్టు చేయడమైనది:
25 AUG 2026 6:46PM by PIB Hyderabad
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమాచార, ప్రజా సంబంధ శాఖల కార్యదర్శులతో ఈ రోజు న్యూఢిల్లీలో జాతీయ సదస్సు నిర్వహించారు. సమాచార, ప్రసార, మీడియా, సృజనాత్మక ఆర్థిక రంగాల్లో కీలక కార్యక్రమాలను గురించి చర్చించడంతో పాటు కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సదస్సు ను నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు సదస్సులో పాల్గొన్నారు.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ సదస్సుకు అధ్యక్షత వహించారు. చర్చలలో పాల్గొన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో మాట్లాడారు. దేశ ప్రగతికి దోహదపడే ‘సప్తధార’లో భారత సాఫ్ట్ పవర్, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు స్థానం కల్పించాలన్న ప్రధానమంత్రి దార్శనికతను ప్రస్తావిస్తూ, దేశంలోని అపారమైన సృజనాత్మక సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రజా సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య మరింత పటిష్టమైన, వ్యవస్థీకృత సహకారం అవసరమని స్పష్టం చేశారు. సంస్కృతి, సృజనాత్మకత, వాణిజ్య రంగాలను సమ్మిళితం చేసే సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు ఉపాధి అవకాశాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, ప్రపంచ వేదికపై భారతదేశ ప్రభావాన్ని మరింత పెంపొందించే అపార సామర్థ్యం ఉందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విభిన్న సామర్థ్యాలను ప్రస్తావిస్తూ, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఒకే విధమైన నమూనా ఉండదని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ఉన్న సాంస్కృతిక ప్రత్యేకతలు, సంస్థాగత సామర్థ్యాలు, స్థానిక ప్రతిభను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా వాటి సృజనాత్మక సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వెలికితీయాలని ఆయన స్పష్టం చేశారు.
మౌలిక సదుపాయాలు, వ్యాపార నిర్వహణ సౌలభ్యం, సామర్థ్యాల పెంపు, ప్రాంతీయ ప్రాధాన్య అంశాలు (కంటెంట్), సృజనాత్మక వ్యవస్థల వంటి రంగాల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం అవసరమని ఆయన పేర్కొన్నారు. వేవ్స్ 2027, వేవ్స్ బజార్, వేవ్ఎక్స్, క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్ వంటి జాతీయ వేదికల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆవిష్కర్తలకు, అంకుర పరిశ్రమలకు, మార్కెట్లకు, పెట్టుబడిదారులకు, సాంకేతికత, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు మరింత విస్తృత అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు వివిధ కార్యక్రమాల అమలులో తమ అనుభవాలను, ఎదుర్కొంటున్న సమస్యలను పంచుకున్నారు. మంత్రిత్వ శాఖతో సమన్వయాన్ని, , భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. రాష్ట్ర స్థాయిలో సామర్థ్యాలను పెంపొందించాల్సిన అవసరాన్ని కూడా అధికారులు ప్రస్తావించారు. సమాచార మార్పిడి, పరస్పర భాగస్వామ్యం, క్రమం తప్పకుండా సదస్సుల నిర్వహణ ద్వారా మంత్రిత్వ శాఖ మరింత సహకారం అందించాలని రాష్ట్రాలు కోరాయి. మంత్రిత్వ శాఖతో మరింత సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో చురుకుగా భాగస్వామ్యం వహించేందుకు అధికారులు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.
సదస్సులో పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. వీటిలో రాష్ట్ర ప్రభుత్వాలు కేబుల్ ఆపరేటర్లకు రైట్ ఆఫ్ వే (ఆర్ఓడబ్ల్యూ) విధానాన్ని అమలు చేయడం, వేవ్స్ 2027 కార్యాచరణ ప్రణాళిక, వేవ్స్ బజార్‌ను బలోపేతం చేయడం, మార్కెట్ అవకాశాలను విస్తరించడం, ప్రజా ప్రసార సేవల మౌలిక వసతుల విస్తరణ, వేవ్స్ ఓటీటీ వేదికపై వినియోగదారులు రూపొందించే సృజనాత్మక కంటెంట్‌ను ప్రోత్సహించడం, ఇండియన్ సినీ హబ్ , ఫిల్మ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ పోర్టళ్లను పరస్పరం అనుసంధానం చేయడం, సినిమా షూటింగ్‌లు, ప్రత్యక్ష కార్యక్రమాల నిర్వహణకు అనుమతుల కోసం సింగిల్ విండో పోర్టల్‌ను వినియోగించడం వంటి అంశాలు ఉన్నాయి.
కంటెంట్ ను కలసి తయారు చేయడం, రాష్ట్రాల వారీ కార్యక్రమాల రూపకల్పన, ప్రజల్లోకి వెళ్లడాన్ని మరింత విస్తరించడం ద్వారా ప్రజా ప్రసార సేవలను బలోపేతం చేయడంపై కూడా సదస్సులో చర్చించారు. ప్రత్యక్ష కార్యక్రమాల విభాగాన్ని ప్రోత్సహించడం, ఐఐఎంసీ శిక్షణ సదుపాయాల ద్వారా డీఐపీఆర్ అధికారులకు సామర్థ్య పెంపు. శిక్షణ ను అందించడం, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ (పీఆర్పీ) చట్టం - 2023 కింద ప్రెస్ సేవా పోర్టల్ ద్వారా డిజిటల్ విధానానికి మారడం, సమగ్ర శిక్షా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వాలకు పుస్తకాలను అందించడం ద్వారా గ్రంథాలయాలను బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి.
ప్రజా ప్రసార సేవలు, ప్రత్యక్ష కార్యక్రమాల విభాగం, , డీఐపీఆర్ అధికారుల సామర్థ్య పెంపు, మీడియా, ప్రచురణ రంగంలో డిజిటల్ మార్పు, ప్రజలకు సమాచారాన్ని చేరవేసే కార్యక్రమాలు తదితర అంశాలపై కూడా విస్తృతంగా చర్చించారు.

రాష్ట్రాల అవసరాలకు అనుగుణమైన కంటెంట్ రూపకల్పన, ప్రజలకు సమాచార చేరువను మెరుగుపరిచేందుకు పీఐబీ ప్రాంతీయ కార్యాలయాలు, రాష్ట్ర సమాచార–ప్రజా సంబంధాల శాఖలు, దూరదర్శన్, ఆకాశవాణి ప్రాంతీయ విభాగాల మధ్య మరింత సన్నిహిత సమన్వయం అవసరమని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి పిలుపునిచ్చారు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రజా సమాచార సంబంధాలను మెరుగుపరచడానికి కొత్త ఆలోచనలు, రాష్ట్రాల ఆధ్వర్యంలోని కార్యక్రమాలు, భాగస్వామ్య నమూనాలను స్వీకరించేందుకు మంత్రిత్వ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమాచార–ప్రజా సంబంధాల శాఖల కార్యదర్శులు, ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సన్నిహిత సమన్వయం, ఉమ్మడి నిబద్ధతకు ఈ సదస్సు ప్రతిబింబంగా నిలిచింది.
***
(రిలీజ్ ఐడి: 2303315)
సందర్శకుల సూచీ సంఖ్య : : 24
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Khasi
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada