వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
పండుగల వేళ చక్కెర ధర పెరుగుదల నిరోధం.. తగిన లభ్యత దిశగా ప్రభుత్వ చర్యలు
प्रविष्टि तिथि:
21 AUG 2026 5:28PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇటీవల చక్కెర ధర పెరిగింది. ఈ మేరకు జూలై 20న కిలో ₹48.18గా ఉన్న ధర ఆగస్టు 20 నాటికి ₹55.70కి చేరింది. ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న ప్రభుత్వం ధరను స్థిరీకరించడంతో పాటు ప్రజలకు చక్కెర తగినంత అందుబాటులో ఉంచుతూ అనేక చర్యలు చేపట్టింది.
చక్కెర ధర పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి కారణం కాదు
ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరకు మళ్లింపు వల్లే చక్కెర ధర పెరిగిందని భావించడం సరికాదు.
వాస్తవానికి ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించే చెరకు వాటా 2022-23లో సుమారు 12 శాతం కాగా, 2025-26కల్లా సుమారు 9 శాతానికి దిగివచ్చింది. అంతేగాక దేశంలో ఇథనాల్‌ను దాదాపు మూడు వంతులు ధాన్యాలు.. ముఖ్యంగా మొక్కజొన్న ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు.
చక్కెర ధర పెరుగుదలకు అనేక కారణాలున్నాయి: అంచనాల కన్నా దేశీయ ఉత్పాదనలో తగ్గుదల, పండుగ సీజన్ ముందు పెరిగిన డిమాండ్, వాతావరణ పరిస్థితుల వల్ల చెరకు పంటకు వాటిల్లిన నష్టం, ప్రపంచవ్యాప్తంగా చక్కెర సరఫరాలో తగ్గుదల పరిశ్రమలోని కొన్ని వర్గాలు ధర పెరుగుదలపై అంచనాలతో వ్యాపారం లేదా అక్రమ నిల్వ చేయడం వంటివి ప్రస్తుత పరిస్థితికి దారితీశాయి.
ప్రారంభ అంచనాలకన్నా తగ్గిన చక్కెర ఉత్పత్తి
చెరకు సాగుచేసే రాష్ట్రాల్లో దిగుబడి ఈ ఏడాది సుమారు 343 లక్షల టన్నులుగా ఉంటుందని తొలుత అంచనా వేయగా, తాజా అంచనాల మేరకు 306 లక్షల టన్నులకు పరిమితం కాగలదని భావిస్తున్నారు.
చెరకుపై ఎర్ర కుళ్లు తెగులు, కాండం తొలచు పురుగు దాడి సహా అధిక వర్షాలతో నీరు నిల్వ ఉండిపోవడం వల్ల దిగుబడిపై దుష్ప్రభావం పడింది.
చెరకు దిగుబడి అంచనాలకన్నా తగ్గినా అక్టోబరులో కొత్త క్రషింగ్ సీజన్ మొదలయ్యే దాకా దేశీయ అవసరాలు తీర్చడానికి సరిపడా చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
ప్రపంచమంతటా చక్కెర ధర పెరుగుతోంది
చక్కెర సరఫరా తగ్గుదల అంతర్జాతీయంగా తలెత్తిన సమస్య తప్ప కేవలం మన దేశానికి పరిమితమైనది కాదు.
ప్రపంచవ్యాప్తంగా 2026-27లో చక్కెర కొరత దాదాపు 33 లక్షల టన్నులుగా ఉంటుందని అంచనా. వాతావరణ పరిస్థితులపై ఆందోళన కూడా అంతర్జాతీయ అంచనాలను మరింత ప్రభావితం చేసింది.
ఫలితంగా అంతర్జాతీయ చక్కెర ధర ఈ ఏడాది జూన్ 30న టన్నుకు $474 నుంచి భారీగా పెరిగి, ఆగస్టు 20కల్లా $552కు చేరింది. అంటే- రెండు నెలలకన్నా తక్కువ వ్యవధిలోనే పెరుగుదల 16 శాతానికిపైగా నమోదైంది.
ఇథనాల్ కార్యక్రమం వల్ల రైతులకు మేలు సహా చక్కెర మిల్లులు బలోపేతమయ్యాయి.
దేశంలో సాధారణంగా ఏటా 320-340 లక్షల టన్నుల చెరకు ఉత్పత్తి అవుతుంది. ఇందులో దేశీయ వినియోగం సుమారు 280-290 లక్షల టన్నులుగా ఉంటుంది. మిగులు ఉత్పత్తి గల సంవత్సరాల్లో, అదనపు నిల్వల ఫలితంగా చక్కెర మిల్లులకు నిధులు స్తంభించడం, చెరకు రైతులకు చెల్లింపు ఆలస్యం కావడం వంటి సమస్యలు వస్తుంటాయి.
అదనపు చెరకును ఇథనాల్ తయారీకి మళ్లించడం ద్వారా ఈ ప్రాథమిక సమస్యను పరిష్కరించడమే కాకుండా మిల్లుల ఆర్థిక స్థితిగతులలో మెరుగుదల సాధ్యమైంది.
ఈ చర్యల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఈ నెల 20 నాటికి 2025-26 చక్కెర సీజన్‌కు సంబంధించి చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలలో 97 శాతాన్ని ఇప్పటికే చెల్లించారు.
చక్కెర మిల్లుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో ప్రభుత్వ మద్దతుపై వాటి పరాధీనత తగ్గింది. ఈ మేరకు 2014-2021 మధ్య చక్కెర పరిశ్రమకు సుమారు ₹14,600 కోట్ల సబ్సిడీ ఇచ్చినప్పటికీ 2021-22 నుంచి అలాంటి రాయితీ ఏదీ ప్రకటించలేదు.
అదే సమయంలో వినియోగ మార్కెట్‌లో చక్కెర ధర దీర్ఘకాలం నుంచీ స్థిరంగా కొనసాగుతోంది. ఈ మేరకు 2024 ఆగస్టు-2026 జూలై మధ్య ఏటా కేవలం 3 శాతం మాత్రమే పెరుగుదల నమోదైంది.
చక్కెర అక్రమ నిల్వ నిరోధం.. సరఫరా పెంపు దిశగా ప్రభుత్వ చర్యలు
దేశంలోని కొన్ని చక్కెర మిల్లులు, వ్యాపారులు ధర పెరుగుదలపై అంచనాలతో అక్రమంగా నిల్వ, వ్యాపారం చేస్తున్నారు. ఇటీవలి ధరల పెరుగుదలకు ఇదే కారణమని గుర్తించిన ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది:
1. దేశవ్యాప్తంగా చక్కెర డీలర్లపై ఆగస్టు నుంచి నవంబరు 30 వరకూ 400 టన్నులకు మించి నిల్వ చేయకుండా పరిమితి విధింపు
2. సెప్టెంబరు నుంచి టోకు వినియోగదారులు 15 రోజులకు సరిపడా మాత్రమే నిల్వ చేసుకునేందుకు అనుమతించింది. అంతకుమించితే చర్యలు తప్పవు.
3. అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతను నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందాలు మిల్లుల వద్ద చక్కెర నిల్వలపై ప్రత్యక్షంగా తనిఖీ చేస్తున్నాయి.
4. ముందుజాగ్రత్త చర్యగా దేశీయ లభ్యతను మరింత పెంచేందుకు 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది.
5. ఈ ఏడాది అక్టోబరు 15 నుంచి చెరకు క్రషింగ్ ప్రారంభించాల్సిందిగా రాష్ట్రాలకు, చక్కెర మిల్లులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీనివల్ల అక్టోబరు నెలలో చక్కెర ఉత్పత్తి సాధారణ 3-4 లక్షల టన్నుల స్థాయి నుంచి 10 లక్షల టన్నులకు మించి పెరుగుతుందని, తద్వారా పండుగ సీజన్‌లో లభ్యత మెరుగుపడుతుందని అంచనా.
దేశవ్యాప్తంగా చెరకు రైతులతోపాటు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణపై ప్రభుత్వం నిబద్ధత ప్రకటించింది. ఈ మేరకు చక్కెర నిల్వలు, ధరలు, మార్కెట్ పరిస్థితులపై నిశిత పర్యవేక్షణను కొనసాగిస్తోంది. అలాగే, రైతులకు బకాయిలను సకాలంలో చెల్లించేలా శ్రద్ధ వహిస్తూ అక్రమ నిల్వ, అనవసర ధరల పెరుగుదల నివారణకు తగిన అన్ని చర్యలనూ చేపడుతుంది.
***
(रिलीज़ आईडी: 2302114)
आगंतुक पटल : 9