కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
2026 ఆగస్టు 21న 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల శాఖ మంత్రుల సమావేశం
కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బిక్స్ కమ్యూనికేషన్ల శాఖ మంత్రుల సమావేశం
प्रविष्टि तिथि:
20 AUG 2026 12:43PM by PIB Hyderabad
భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతన 2026 ఆగస్టు 21న 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన కమ్యూనికేషన్ల శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని సమాచార, ప్రసార సాంకేతికతలు (ఐసీటీ), డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు, బలోపేతమైన డిజిటల్ మౌలిక వసతుల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించనున్నారు.
కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా ఈ 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
ఈ సమావేశం భారత్ నేతృత్వంలోని బ్రిక్స్ ప్రధాన ఇతివృత్తం “స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం”, ఐసీటీ విభాగం ఇతివృత్తం “సురక్షితమైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణ, సహకారం, పరివర్తన” ఆధారంగా నిర్వహించనున్నారు. సమ్మిళిత, సురక్షిత, సుస్థిర డిజిటల్ అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు బ్రిక్స్ దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత్‌కున్న నిబద్ధతను ఈ ప్రాధాన్యతలు ప్రతిబింబిస్తాయి.
ఉద్భవిస్తున్న కొత్త సాంకేతికతలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, భవిష్యత్తు నెట్‌వర్క్‌లు, సైబర్ భద్రత, సామర్థ్య పెంపుదల, విస్తృత డిజిటల్ అనుసంధానతపై బ్రిక్స్ సభ్య దేశాలు తమ ఆలోచనలను పంచుకోవడానికి ఈ 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం కీలక వేదికను అందిస్తుంది. బ్రిక్స్ దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో డిజిటల్ పరివర్తనకు మద్దతు ఇచ్చేలా ఆచరణాత్మక సహకారాన్ని పెంపొందించడం, అత్యుత్తమ విధానాలను పరస్పరం పంచుకోవడంపై కూడా ఈ చర్చలు దృష్టి సారిస్తాయి.
బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతల్లో భాగంగా భారత్ ఐసీటీ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా బలోపేతమైన డిజిటల్ మౌలిక వసతులు, భవిష్యత్తు నెట్‌వర్క్‌లు, సైబర్ భద్రత, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, సామర్థ్య నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చింది. టెలికమ్యూనికేషన్ల శాఖ కూడా బ్రిక్స్ ఐసీటీ సహకార వర్కింగ్ గ్రూప్ పరిధిలో చర్చలకు నాయకత్వం వహిస్తోంది. ప్రతిపాదిత బ్రిక్స్ సామర్థ్య నిర్మాణ కేంద్రాల ఏర్పాటు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై సహకారాన్ని మరింత విస్తరించడం వంటి అంశాలపై ఈ చర్చలు కొనసాగుతున్నాయి.
2025లో బ్రెజిల్ బ్రిక్స్ అధ్యక్షతన జరిగిన 11వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో గుర్తించిన ఫలితాలు, సహకార రంగాలను కూడా ప్రస్తుత సమావేశం ముందుకు తీసుకెళ్లనుంది. ఐసీటీలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, ప్రపంచ డిజిటల్ పాలన వంటి అంశాల్లో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య నిరంతర సహకారం అవసరమని గత సమావేశం స్పష్టం చేసింది.
కార్యక్రమంలో భాగంగా కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో జరిగిన చర్చలు, కీలక నిర్ణయాలు, ఫలితాలను ఆయన మీడియాకు వివరించనున్నారు.
అనంతరం డిజిటల్ బ్రిక్స్ ఫోరం ఎక్స్‌పోను కేంద్రమంత్రి సందర్శించనున్నారు. ఈ డిజిటల్ ప్రదర్శనలో బ్రిక్స్ వ్యవస్థకు సంబంధించిన డిజిటల్ సాంకేతికతలు, ఆవిష్కరణలు, వివిధ పరిష్కారాలను ప్రదర్శించనున్నారు. ఇందులో పాల్గొనే దేశాలు, వివిధ వర్గాల మధ్య పరస్పర సంప్రదింపులు, జ్ఞాన మార్పిడిని పెంపొందించడంతో పాటు, భారతీయ సాంకేతిక సామర్థ్యాలను ప్రత్యేకంగా చాటిచెప్పేందుకు మంచి అవకాశాన్ని కల్పించనుంది.
12వ బ్రిక్స్ కమ్యూనికేషన్స్ మంత్రుల సమావేశం భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతల్లో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. డిజిటల్ రంగంలో మరింత బలమైన భాగస్వామ్యాలను నిర్మించాలన్న దేశ నిబద్ధతను ఈ సమావేశం ప్రతిబింబిస్తుంది. ఐసీటీ రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించడం ద్వారా బ్రిక్స్ దేశాలు మరింత పటిష్టమైన, సమ్మిళిత, సురక్షిత, సుస్థిర డిజిటల్ భవిష్యత్తు నిర్మాణానికి దోహదపడగలవు.
మరిన్ని వివరాల కోసం టెలికమ్యూనికేషన్స్ శాఖ అధికారిక సామజిక మాధ్యమ ఖాతాలను అనుసరించండి:
ఎక్స్- https://x.com/DoT_India
ఇన్‌స్టాగ్రామ్- https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==
ఫేస్‌బుక్ - https://www.facebook.com/DoTIndia
యూట్యూబ్- https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa
***
(रिलीज़ आईडी: 2301523)
आगंतुक पटल : 8