పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
12వ బ్రిక్స్ పర్యావరణ శాఖ మంత్రుల సమావేశం విజ్ఞాన సంబంధిత ఉత్పత్తుల ప్రారంభం
प्रविष्टि तिथि:
18 AUG 2026 1:05PM by PIB Hyderabad
బ్రిక్స్ పర్యావరణ కార్యాచరణ బృందం రూపొందించిన నాలుగు విజ్ఞాన సంపుటాలను బ్రిక్స్-2026 భారత్ అధ్యక్షతన జరిగిన 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో బ్రిక్స్ దేశాల ప్రతినిధి బృందాల అధిపతులతో కలిసి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఆవిష్కరించారు. ఇవి బ్రిక్స్ సభ్య దేశాల్లోని ప్రముఖ పద్ధతులు, విజ్ఞాన వ్యవస్థలు, ఆవిష్కరణలను ప్రతిబింబిస్తాయి.
బ్రిక్స్ పర్యావరణ కార్యచరణ బృందంలో జరిగిన నిర్మాణాత్మక, అర్థవంతమైన చర్చల ఫలితంగా ఈ సంపుటాలు రూపొందాయి. ఇవి నాలుగు సహకార జ్ఞాన ఉత్పత్తుల అభివృద్ధికి దారితీశాయి. ఇవి ఉమ్మడి సహకార స్ఫూర్తిని, బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ అనుభవాలు, అత్యుత్తమ ఆచరణలు, వినూత్న పరిష్కారాలు, స్థానిక జ్ఞాన వ్యవస్థలను ప్రతిబింబిస్తాయి.

1. బ్రిక్స్-2026 భారత్ అధ్యక్షతన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్‌సీసీ) రూపొందించిన సుస్థిర జీవనశైలి ప్రోత్సాహంపై జాతీయ అనుభవాలు, అగ్రగామి విధానాలు, విజయగాథల సంపుటి ఉమ్మడి విజ్ఞాన నిధిగా నిలుస్తుంది. ఇది బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, యూఏఈలతో సహా బ్రిక్స్ సభ్య దేశాల వ్యాప్తంగా ఆదర్శప్రాయమైన కేస్ స్టడీలను తెలియజేస్తుంది. సుస్థిర జీవనశైలి భావనను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు విధానపరమైన నూతన ఆవిష్కరణలు, ప్రవర్తనా మార్పు కార్యక్రమాలు, పర్యావరణ విద్య, సమాజ భాగస్వామ్యం, సుస్థిర వినియోగం, ఉత్పత్తి, సర్క్యులర్ ఎకానమీ విధానాలు, పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ, స్వచ్ఛ ఇంధన మార్పులు, హరిత అభివృద్ధి కార్యక్రమాల ద్వారా బ్రిక్స్ సభ్య దేశాలు కృషి చేస్తున్న తీరును ఈ సంపుటి వివరిస్తుంది. భారత్ తరఫున మిషన్ లైఫ్, పర్యావరణ విద్య కార్యక్రమం, సంభవ్ అభియాన్ ను ఇందులో చేర్చారు. ఇవి పౌర నేతృత్వంలోని సుస్థిర జీవనశైలికి భారత్ అనుసరిస్తున్న సమగ్ర-ప్రభుత్వ, సమగ్ర-సమాజ దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. వ్యక్తిగత ఎంపికలు, మార్కెట్ సరఫరా మార్పులు, విధానపరమైన వ్యవస్థలు సమష్టిగా వ్యవస్థాపరమైన మార్పునకు బాటలు వేస్తాయని ఇవి తెలియజేస్తాయి. అంతిమంగా పౌరుల యాజమాన్యం, సందర్భోచిత పరిష్కారాలు, డిజిటల్ అనుసంధానానికి ప్రాధాన్యతనివ్వటం ద్వారా పర్యావరణహిత జీవనశైలిని పెంపొందించటానికి పరస్పర అభ్యాసం, ఉమ్మడి పరిశోధన, పలు విధాలుగా సహకారానికి ఆచరణాత్మకమైన ప్రణాళికను ఈ సంపుటి అందిస్తుంది.
2. సమగ్ర కార్చిచ్చు నిర్వహణకు ఉత్తమ విధానాలు, వినూత్న దృక్పథాలపై సంపుటి: ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు, దీర్ఘకాలిక అనావృష్టి, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు... అడవుల్లో కార్చిచ్చు సంభవించటాన్ని, తీవ్రతను పెంచుతున్నాయి. ఇవి పర్యావరణ వ్యవస్థలు, జీవవైవిధ్యం, జీవనోపాధి, సమాజానికి ముప్పును పెంచుతున్నాయి. ఈ ఉమ్మడి సవాలును గుర్తించిన భారత్.. బ్రిక్స్-2026 అధ్యక్షతన అంతర్జాతీయ సహకారంలో సమగ్ర కార్చిచ్చు నిర్వహణను అగ్రస్థానంలో నిలిపింది. కమ్యూనిటీ నేతృత్వంలోని నివారణ, స్థానిక విజ్ఞానం నుంచి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, సాంకేతికత, సంసిద్ధత, సమన్వయ ప్రతిస్పందన వరకు సమగ్ర కార్చిచ్చు నిర్వహణకు వివిధ దేశాల అనుభవాలు, వినూత్న పరిష్కారాలు, ఆచరణాత్మక విధానాలను పంచుకునేందుకు ఈ ప్రయాణం వేదికను కల్పించింది.
“సమగ్ర కార్చిచ్చు నిర్వహణకు ఉత్తమ విధానాలు, వినూత్న దృక్పథాలు” అనే సంపుటి ఈ ఫలితాల్లో ఒకటి. ఇది కేవలం వివిధ దేశాల అనుభవాల సేకరణ మాత్రమే కాదు... నివారణ నుంచి సన్నద్ధత వరకు, ముందస్తు హెచ్చరిక నుంచి తక్షణ చర్య వరకు, సత్వర చర్యల నుంచి పునరుద్ధరణ వరకు కలిసి అగ్నిప్రమాదాలను ఎదుర్కోవాలనే ఉమ్మడి దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. విజ్ఞానం, సాంకేతికత, సంస్థలు, సమాజాలను అనుసంధానించటం ద్వారా బ్రిక్స్ దేశాలు సమష్టి స్థిరత్వాన్ని పెంపొందించుకోవచ్చు. అడవులను, జీవవైవిధ్యాన్ని రక్షించవచ్చు. ఉపాధిని కాపాడుకోవచ్చు. మరింత భద్రతతో కూడిన భవిష్యత్తును నిర్మించవచ్చు.
3. పచ్చని మైదానాలతో కూడిన సమగ్ర హరిత విధానాలపై సంపుటి... బ్రిక్స్ సభ్య దేశాల అనుభవాలు, పద్ధతులు, విధానాల దృక్పథాలను ఒకచోట చేర్చుతూ... భూసార క్షీణత, ఎడారీకరణ, జీవవైవిధ్య నష్టం, వాతావరణ మార్పు వంటి పరస్పరం ముడిపడున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుంది. ఇది సభ్య దేశాల ఉమ్మడి సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. జీవవైవిధ్య పరిరక్షణతో పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణను అనుసంధానించే ప్రకృతి ఆధారిత పరిష్కారాలను తెలియజేస్తుంది.
బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయగల రంగాలను కూడా ఈ సంపుటి గుర్తిస్తుంది. జ్ఞానం, అనుభవాల భాగస్వామ్యం, సామర్థ్య పెంపుదల, సాంకేతిక సహకారం, సంయుక్త పరిశోధన, పర్యవేక్షణ, అంచనా కోసం సాధారణ విధానాల రూపకల్పన వంటివి ఇందులో ఉన్నాయి. ఇది పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించటానికి, వాతావరణ స్థిరత్వాన్ని బలోపేతం చేయటానికి, జీవనోపాధిని మెరుగుపరచటానికి, ప్రపంచ పునరుద్ధరణ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు తోడ్పడే ఆచరణాత్మక ఉదాహరణలను స్పష్టం చేస్తూ సహకారాన్ని బలోపేతం చేయటానికి ముందడుగును సూచిస్తుంది.
4. ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఫ్రేమ్‌వర్క్స్ అండ్ లీడింగ్ సర్క్యులర్ ఎకానమీ ప్రాక్టీసెస్‌పై సంపుటి... సర్క్యూలర్, వనరుల-సమర్థవంతమైన ఆర్థిక వ్యవస్థ వైపు పరివర్తనకు సభ్య దేశాల అనుభవాలు, విధాన దృక్పథాలు, నియంత్రణ సాధనాలు, సంస్థాగత నమూనాలను తెలియజేస్తుంది. ఇది సంఘ నేతృత్వంలోని వ్యర్థాల నిర్వహణ, డిజిటల్ వ్యర్థాల మార్పిడి వేదికల నుంచి జాతీయ వృత్తాకార ఆర్థిక ప్రణాళికలు, డిజిటల్ ట్రేసబిలిటీ వ్యవస్థలు, రీసైక్లింగ్ ధ్రువీకరణ పత్రాలు, సమగ్ర వ్యర్థ రంగ సంస్కరణల వరకు కీలకమైన కార్యక్రమాలను స్పష్టం చేస్తుంది.
కేంద్రీకృత డిజిటల్ వేదికలు, విభిన్న వ్యర్థాల విభాగాలతో కూడిన ఫ్రేమ్‌వర్క్ విస్తరణల మద్దతుతో మార్కెట్ ఆధారిత ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (ఈపీఆర్) నిర్మాణం వైపు భారత్ సాగిస్తున్న పరివర్తనను ఈ సంపుటి తెలియజేస్తుంది. వనరుల సమర్థవంతమైన, పటిష్టమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థలను ముందుకు తీసుకెళ్లేందుకు... జ్ఞానం, అనుభవాల భాగస్వామ్యం, డిజిటల్ ట్రేసబిలిటీ పరిష్కారాలు, సాంకేతిక సామర్థ్య పెంపు, సర్క్యూలర్ వ్యాపార నమూనాల అభివృద్ధి వంటి బ్రిక్స్ సహకారాన్ని బలోపేతం చేయగల కీలక రంగాలనూ ఇది గుర్తిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2300913)
आगंतुक पटल : 7