ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా సుమారు 1.6 లక్షల పాఠశాలల్లో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా


2 కోట్ల మందికి పైగా విద్యార్థుల తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ (ఎంబీయూ) పూర్తి చేసిన యూఐడీఏఐ

కార్యక్రమంలో భాగంగా 2026 సెప్టెంబర్ 30 వరకు 5 నుంచి 17 ఏళ్ల వయసున్నవారికి ఎంబీయూ ఉచితం

प्रविष्टि तिथि: 18 AUG 2026 2:36PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ (ఎంబీయూ) డ్రైవ్‌ నిర్వహించిన భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలకమైన విజయాన్ని సాధించింది. యుద్ధప్రాతిపదికన చేపట్టిన ఈ కార్యక్రమంలో 20 మిలియన్ (2 కోట్లకు) మందికి పైగా విద్యార్థులకు ఎంబీయూలను పూర్తి చేసింది.

పాఠశాలల్లోని బాలల ఎంబీయూ స్థితిని తెలియజేసే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ+)తో యూఐడీఏఐ సాంకేతికంగా అనుసంధానం కావడం ద్వారా ఇది సాధ్యమయింది.

ఈ  ప్రత్యేక కార్యక్రమం 2025లో ప్రారంభమైంది. రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత విద్యా శాఖల సమన్వయంతో, పాఠశాల స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం ద్వారా ఇప్పటి వరకు 1.56 లక్షలకు పైగా పాఠశాలలకు చెందిన విద్యార్థులు సులభంగా తమ ఆధార్‌ను అప్డేట్ చేసుకున్నారు. ఇది ఎంబీయూ సేవలను నేరుగా పాఠశాలలకు చేర్చడానికి సాయపడింది. తద్వారా కోట్లాది విద్యార్థులకు ఈ ప్రక్రియ మరింత సులభంగా, సౌకర్యవంతంగా మారింది.

అయిదేళ్ల లోపు బాలల ఆధార్ నమోదు చేసేటప్పడు డెమోగ్రాఫిక్ సమాచారాన్ని, ఫోటోను సేకరిస్తారు. కానీ ఈ వయసులో వేలిముద్రలు, ఐరిస్ బయోమెట్రిక్‌ను సేకరించరు. ఎందుకంటే ఈ బయోమెట్రిక్‌లు ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంటాయి. బాలల ఆధార్‌లో ఎప్పటికప్పుడు తాజా బయోమెట్రిక్ సమాచారం ఉండేలా ఎంబీయూ నిర్దారిస్తుంది.

బాలలకు అయిదేళ్లు వచ్చినప్పుడు ఒకసారి, 15 ఏళ్ల వయసులో మరోసారి ఎంబీయూ అవసరం ఉంటుంది. పాఠశాల, ఉన్నత విద్యలో ముందుకు వెళుతున్ననప్పుడు.. ఆధార్ ధ్రువీకరణ అవసరమయ్యే వివిధ సేవలను, ప్రయోజనాలను వారు అందుకుంటారు. సకాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేయడం వల్ల ఆధార్ ధ్రువీకరణ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతుంది. 

సకాలంలో పూర్తి చేసేలా ప్రోత్సహించడానికి, సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి గాను 7 నుంచి 15 ఏళ్ల లోపు చిన్నారులకు 2025 అక్టోబర్ 1 నుంచి ఏడాది వరకు ఎంబీయూ రుసుమును యూఐడీఏఐ మాఫీ చేసింది. 5 నుంచి 7 ఏళ్లు, 15 నుంచి 17 ఏళ్ల వయసున్న బాలలకు ఎంబీయూ ఉచితంగానే కొనసాగుతుంది. అంటే 5 నుంచి 17 ఏళ్ల వయస్సున్న బాలలకు 2026 సెప్టెంబర్ 30 వరకు ఎంబీయూ ఉచితం.

ఆధార్‌లో ఎంబీయూ పూర్తి చేయకపోవడం వల్ల వివిధ ప్రభుత్వ పథకాల పరిధిలో ప్రయోజనాలను పొందడానికి చేసే ధ్రువీకరణ ప్రక్రియలోనూ, నీట్, జేఈఈ, సీయూఈటీ, తదితర పోటీ, విశ్వవిద్యాలయ పరీక్షలకు నమోదు చేసుకొనేటప్పుడు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆధార్‌లో ఎంబీయూను పూర్తి చేయాలని బాలల తల్లిదండ్రులను, సంరక్షకులను యూఐడీఏఐ కోరుతోంది.

 

***


(रिलीज़ आईडी: 2300911) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Bengali , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada