సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
టెలివిజన్ ఛానళ్ల విషయంలో 12 నిమిషాల ప్రకటనల కాలపరిమితిని తొలగించిన ప్రభుత్వం
సమర్థవంతమైన పోటీని ప్రోత్సహించడానికి, వ్యాపార నిర్వహణను సులభతరం చేయడానికి ప్రకటనల కాలపరిమితి ఎత్తివేత
प्रविष्टि तिथि:
14 AUG 2026 8:39PM by PIB Hyderabad
టెలివిజన్ ఛానళ్ల విషయంలో ఉన్న 12 నిమిషాల ప్రకటనల కాలపరిమితిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ నిబంధనలు-1994 కింద టెలివిజన్ ప్రసారాలపై ప్రకటనల కాలపరిమితిని 2006 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి టీవీ ప్రసార రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. 2006లో కేవలం 62 టీవీ ఛానళ్లు మాత్రమే ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 900కి పైగా చేరింది.
ఆ సమయంలో టీవీ ఛానళ్లను ప్రసారం చేసే ప్రధాన మాధ్యమం అయిన కేబుల్ టీవీ అనలాగ్ విధానంలో ఉండేది. దీనికి పరిమితమైన క్యారేజ్ సామర్థ్యం ఉండటం వల్ల వినియోగదారులకు చాలా తక్కువ ఎంపికలు మాత్రమే లభించేవి. కేబుల్ టీవీ రంగం పూర్తిగా డిజిటలీకరణ చెందిన తర్వాత ప్రస్తుతం డీటీహెచ్, కేబుల్ టీవీ, హెచ్ఐటీఎస్, ఐపీటీవీ వంటి అన్ని టీవీ ఛానళ్లను పంపిణీ చేసే మాధ్యమాలు డిజిటల్ రూపంలోకి మారాయి. ఇవి ప్రస్తుతం 300 నుంచి 500 లేదా అంతకంటే ఎక్కువ ఛానళ్లను ప్రసారం చేస్తూ వినియోగదారులకు ఉన్న వివిధ అవసరాలను తీరుస్తూ ఎక్కువ వైవిధ్యాన్ని అందిస్తున్నాయి. ఫలితంగా మార్కెట్ గతిశీలతలో ఇప్పుడు తగినంత పోటీ ఏర్పడింది.
టీవీ ప్రసార రంగంలో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకొని ప్రకటనల కాలపరిమితికి సంబంధించిన నిబంధనలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. భారత్‌లో ఒక ఛానల్ ‘పెయిడ్’ లేదా ‘ఫ్రీ-టు-ఎయిర్’ ఏదైనా సరే.. ఈ రంగం ప్రధానంగా ప్రకటనలపైనే ఆధారపడి ఉంది. ఎటువంటి ప్రకటనల నిబంధనలు లేని డిజిటల్ మీడియాతో పోలిస్తే సంప్రదాయ టీవీ ఛానళ్లకు సమానమైన పోటీ వాతావరణం లేకుండా పోయింది.
టీవీ పరిశ్రమలో అంతర్గతంగా.. అలాగే టీవీ పరిశ్రమకు, డిజిటల్ మీడియాకు మధ్య మార్కెట్‌లో తగినంత పోటీ ఉందని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ భావిస్తోంది. సమర్థ పోటీని ప్రోత్సహించడానికి, వ్యాపార నిర్వహణను సులభతరం చేయడానికి ప్రకటనల కాలపరిమితిని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ నిబంధనలు-1994 సవరణకు సంబంధించి గెజిట్‌లో నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి ఈ నిర్ణయం అమలోకి వస్తుంది.
***
(रिलीज़ आईडी: 2299658)
आगंतुक पटल : 9