రాష్ట్రపతి సచివాలయం
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి గౌరవనీయ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము ప్రసంగం
प्रविष्टि तिथि:
14 AUG 2026 7:53PM by PIB Hyderabad
ప్రియమైన దేశ పౌరులారా,
నమస్కారం!
మన జాతీయ పర్వదినమైన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మీకందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వతంత్ర భారతం అవతరించి మరికొన్ని గంటల్లో 80 సంవత్సరాలు పూర్తికానున్నాయి. దేశదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరూ ఈ వేడుకను ఎనలేని ఆనందోత్సాహాలతో నిర్వహించుకుంటారు. మన స్వేచ్ఛకు చిహ్నమైన ప్రతిష్టాత్మక త్రివర్ణ పతాకాన్ని మనమంతా సగర్వంగా ఎగురవేస్తాం.
భరతమాత 1947 ఆగస్టు 15న బానిస సంకెళ్ల నుంచి విముక్తమైంది. ఆనాడు ప్రతి పౌరుడూ స్వతంత్ర భారత భవిష్యత్ రూపశిల్పిగా మారాడు. తమ ఆకాంక్షల సాకారం కోసం అందివచ్చిన అవకాశాలను పౌరులంతా సద్వినియోగం చేసుకోవడంలోనే వాస్తవిక స్వాతంత్ర్యం ఉంటుంది. మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థమంటుంది.
అంకితభావం గల ఉపాధ్యాయులు-విద్యార్థులు, అభివృద్ధికి కృషిచేసే శాస్త్రవేత్తలు-ఇంజినీర్లు, ఆరోగ్య సేవలు అందించే వైద్యులు-ఆరోగ్య కార్యకర్తలు, దేశానికి ఆకలి, అవసరాలు తీర్చే అన్నదాతలు-శ్రమజీవులు.. ఇలా ప్రతి ఒక్కరూ తమ అవిరళ కృషితో దేశ పురోగమనంలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు, చేతివృత్తులవారు, హస్త కళాకారులు, దార్శనికులైన మేధావులు, ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల్లో నిబదద్ధతగల కార్మికులు, ప్రజా సేవకు బద్ధులైన ప్రజాప్రతినిధులు-న్యాయవ్యవస్థలోని అధికారులు, కర్తవ్య దీక్షగల ప్రభుత్వోద్యోగులు, మన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదం చేసే చిన్న-పెద్ద పెట్టుబడిదారులు, నిస్వార్థ సామాజిక కార్యకర్తలు సహా పరిశుభ్రత కార్యక్రమాల్లో ముందు వరుసన నిలిచిన సఫాయి మిత్రులందరూ దేశ ప్రగతిలో కీలక సూత్రధారులయ్యారు. అలాగే, అనేకానేక ఇతర కార్యకలాపాలలో నిమగ్నమైన ఎందరో పౌరులు సహా రాజ్యాంగ నిర్దేశిత ప్రాథమిక విధులను విశ్వాసంతో నిర్వర్తించే ప్రతి పౌరుడు దేశ పురోగమన ప్రక్రియలో చురుకైన భాగస్వాములుగా ఉన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. త్రివిధ సాయుధ దళాల్లోని మన సైనికులు, సాయుధ పోలీసు దళాలు, సాధారణ పోలీసు సిబ్బంది అందరూ తమ విధి నిర్వహణలో కనబరిచిన అకుంఠిత దీక్షను నేను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నాను. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్టను, గౌరవాన్ని ఇనుమడింపజేసే ప్రవాస భారతీయులను, విదేశాల్లోని రాయబార కార్యాలయాలలో సేవలందిస్తున్న అధికారులను అభినందిస్తున్నాను.
ప్రియమైన దేశ పౌరులారా,
దేశం 2047లో స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే నాటికి ‘వికసిత భారత్’ స్వప్న సాకారం దిశగా మనం దూసుకెళ్తున్నాం. అంత్యోదయ స్ఫూర్తితో ప్రగతి ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలన్నది మన సంకల్పం. మన సుసంపన్న వారసత్వాన్ని, స్వాతంత్ర్యోద్యమ ఆదర్శాలను ఆకళింపు చేసుకుని, ఆధునిక అభివృద్ధి పథంలో భారీ అంగలు వేస్తున్నాం. ఈ నేపథ్యంలో దేశ సేవకు సదా సంసిద్ధులమై ఉండాలని వేద వాక్యం ‘వయం రాష్ట్రే జాగృయం’ మనకు ప్రబోధిస్తుంది.
స్వాతంత్ర్య పోరాట సమయాన భిన్న భావజాలాలు గల ప్రజలందరూ భరతమాత విముక్తే ఏకైక లక్ష్యంగా ఏకమయ్యారు. స్వదేశీ ఉద్యమం సాగుతున్న వేళ వందేమాతరం గీతం ఓ ప్రజానాదంగా మారింది. జాతిపిత మహాత్మాగాంధీ నాయకత్వాన అసంఖ్యాక భారతీయులు స్వాతంత్ర్య పోరాటానికి తమనుతాము అర్పించుకున్నారు. సాంఘిక సంస్కరణ, దేశభక్తి వంటి అత్యున్నత ఆదర్శాలకు బాబాసాహెబ్ డాక్టర్ భీమ్‌రావు అంబేడ్కర్ ప్రతిరూపమై నిలిచారు. దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టి, ఆ తర్వాత పురోగతికి కృషి చేసిన ఆదర్శప్రాయులైన భరతమాత మహనీయ పుత్రులు-పుత్రికలకు నా వినయపూర్వక నమస్సులు.
ఈ రోజు అంటే- ఆగస్టు 14న మనం ‘విభజన విషాద స్మృతి దినం’ పాటిస్తున్నాం. దేశ విభజన వల్ల చోటుచేసుకున్న హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన లేదా నిరాశ్రయులై విషాద జీవనం తప్పని లక్షలాది భారతీయులను మనం సగౌరవంగా నేడు స్మరించుకుంటున్నాం. మత హింస ఫలితంగా లక్షలాది మంది శరణార్థులు కాగా, దేశ విభజన నాటి భయానక పర్యవసానాలను భరించాల్సి వచ్చింది. అయినప్పటికీ, వారు తమ గుర్తింపును వదులుకోవడానికి సిద్ధపడ లేదు.
మనకు స్వాతంత్ర్యం సిద్ధించాక విభజన తీవ్ర పరిణామాలను ఎదుర్కొనడంతో పాటు దేశంలోని 550కి పైగా రాజ సంస్థానాలను నవ భారత్‌లో అంతర్భాగం చేసే అసాధారణ సవాలు కూడా ఎదురైంది. ఆ క్రమంలో రాజ్యాల వ్యవస్థకు ముగింపు పలుకుతూ, ఆ సంస్థానాలన్నింటినీ మన స్వతంత్ర ప్రజాస్వామ్యంలో సర్దార్ పటేల్ విలీనం చేశారు. ఈ నేపథ్యంలో కృతజ్ఞతా భావనగల ఈ దేశం తరపున ఆధునిక భారత ఐక్యతా శిల్పి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పవిత్ర స్మృతికి సగౌరవ నివాళి అర్పిస్తున్నాను.
ప్రియమైన దేశ పౌరులారా!
భారత ప్రజలు రూపొందించుకున్న రాజ్యాంగానికి ప్రజల భాగస్వామ్యమే పునాది. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా వర్ధిల్లిన మన దేశంలోని ప్రజానీకంలో భాగస్వామ్య స్ఫూర్తి సదా అంతర్లీనంగా కొనసాగుతూనే ఉంది. ఆ ప్రజా భాగస్వామ్య సంప్రదాయాన్ని మన సహ పౌరులంతా నవ్యోత్సాహంతో కొనసాగిస్తున్నారు. ప్రజల క్రియాశీల భాగస్వామ్యంతో జాతీయ స్థాయి కార్యక్రమాలు అమలవుతున్నాయి. మన ప్రజాస్వామ్యానికి ఇదొక స్ఫూర్తిదాయక విజయం.
సామాజిక హోదా, అవకాశాలలో సమానత్వంతో పాటు వ్యక్తిగత గౌరవం కూడా మన రాజ్యాంగం నిర్దేశించిన అమూల్య ఆశయాలలో భాగం. సాధారణ నేపథ్యంగల వారెందరో అనేక రంగాలలో నేడు అసాధారణ కృషి చేస్తున్నారు. ఈ స్వతంత్ర భారత్‌లో ప్రతి ఒక్కరూ ఉన్నత ఆకాంక్షలను ఏర్పరచుకోవడమే కాకుండా వాటిని సాకారం చేసుకోగలరనే నా విశ్వాసాన్ని ఇది మరింత బలపరుస్తోంది.
శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల బాధ్యతలను మన రాజ్యాంగం విస్పష్టంగా నిర్దేశించింది. ప్రజల ఆకాంక్షకు గొంతుకగా నిలవడం చట్టసభల్లో వారికి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల బాధ్యత. దేశం, ప్రజల ప్రయోజనాలను కాపాడే విధానాల అమలు కార్యనిర్వాహక శాఖ బాధ్యత. వనరుల కొరత వల్ల ఏ ఒక్కరూ అన్యాయానికి గురికాకుండా చూడటం న్యాయవ్యవస్థతో ముడిపడిన ప్రతి ఒక్కరి బాధ్యత. పౌరులందరికీ… ముఖ్యంగా సమాజంలోని అణగారిన వర్గాలకు గౌరవప్రదమైన, సత్వర, సకాల న్యాయం సమానంగా అందాలి.
ప్రియమైన దేశ పౌరులారా!
ఓ దశాబ్దానికి పైగా కాలంలో మన దేశం పురోగమం ఇలా సాగింది:
- సత్వర… సార్వజనీన ప్రగతి,
- వారసత్వం-ప్రగతి మధ్య సమన్వయానికి ప్రాధాన్యం,
- దశాబ్దాలుగా పురోగమనానికి అవరోధంగా నిలిచిన అనేక ఆటంకాల తొలగింపు.
మన దేశం ఇప్పుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలను నిర్వహించుకుంటోంది. మహాత్మా పూలేతోపాటు ఆయన సతీమణి, విప్లవ జ్యోతి సావిత్రిబాయి పూలే కూడా సామాజిక న్యాయం, విద్య, మహిళా సాధికారత, సమానత్వం కోసం చేసిన కృషి చరిత్రాత్మకం. వారి ఆశయాల బాటలో కొన్నేళ్ల నుంచీ సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం లభించింది. మహిళల విద్యారంగంలో కొత్త ప్రమాణాలు అనేకం ఆవిర్భవించాయి. దేశవ్యాప్తంగా 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరిక విముక్తులయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సార్వజనీనత కార్యక్రమం ‘ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన’ కింద దాదాపు 59 కోట్ల మంది ఖాతాదారులు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగమయ్యారు. వీరిలో 32 కోట్ల మందికి పైగా మహిళలే కావడం విశేషం!. ఉచిత రేషన్ పంపిణీ ద్వారా 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఆహార భద్రత లభించింది. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జనారోగ్య యోజన’ కింద 60 కోట్ల మందికి ఏటా రూ.5 లక్షల విలువైన ఉచిత ఆరోగ్య సంరక్షణ సదుపాయం కల్పించబడింది. వ్యవసాయం, పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, మత్స్య రంగం, తేనెటీగల పెంపకం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైన రైతులకు 'కిసాన్ సమ్మాన్ నిధి', ‘కిసాన్ క్రెడిట్ కార్డుల’ చేయూత కూడా లభించింది.
బలమైన సాంస్కృతిక గుర్తింపు పునాదిగా సాగే ప్రగతి ప్రస్థానం వేగవంతమైనది కాకుండా సుస్థిరమైనదిగా ప్రపంచ చరిత్ర రుజువు చేస్తోంది. సాంస్కృతిక ప్రతిష్ట దేశ అంతర్గత శక్తిని బలోపేతం చేస్తుందనే అవగాహన కూడా నేడు దేశంలో పెరుగుతోంది. జ్ఞానం, విజ్ఞానశాస్త్రం, కళలు-సంస్కృతి, ఆధ్యాత్మికత, సదాచార సహిత ఘన వారసత్వాన్ని మన పూర్వికులు మనకు అందించారు. ఈ వారసత్వంతో అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ మనం ముందంజ వేస్తున్నాం.
ప్రపంచంలోనే అత్యంత భారీ, అత్యుత్తమ డిజిటల్ మౌలిక సదుపాయాలను భారత్ రూపొందించింది. ఈ రోజున చిన్న గ్రామీణ దుకాణాల్లోనే కాకుండా వీధి వ్యాపారుల వద్ద కూడా డిజిటల్ చెల్లింపులు సర్వసాధారణంగా మారాయి. ప్రపంచవ్యాప్త ప్రత్యక్ష డిజిటల్ లావాదేవీల్లో సగానికి పైగా భారత్‌లోనే నమోదవుతున్నాయి. ఈ మేరకు డిజిటల్ విప్లవంపై దేశ ప్రజలు, ప్రభుత్వం సంయుక్తంగా అంతర్జాతీయ సమాజానికి ఒక గొప్ప ఆదర్శంగా నిలిచారు. సాంకేతికత సద్వినియోగం ద్వారా ప్రభుత్వం నేడు ప్రజలకు పారదర్శక రీతిలో సంక్షేమ పథకాల ప్రయోజనాలను చేరువ చేసింది.
రహదారులు, జలమార్గాలు, రైల్వేలు, విమానయాన రంగాల్లో అసాధారణ స్థాయి ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనను మన దేశం చూసింది. అనేక కొత్త సంస్థలకు అవకాశాలను సృష్టిస్తూ, ఉపాధికి దోహదం చేయడంతో పాటు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొంటోంది.
ప్రియమైన దేశ పౌరులారా!
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, అనిశ్చితి ప్రతి దేశాన్నీ ప్రభావితం చేస్తున్నాయి. అలాంటి క్లిష్ట పరిస్థితులలోనూ మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే శరవేగంగా పురోగమించేది దూసుకెళ్తోంది. ఆర్థిక అంచనాల ప్రకారం- భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రపంచ సగటు వృద్ధి రేటుకన్నా రెట్టింపుగా నమోదయ్యే అవకాశాలున్నాయి. మన ఆర్థిక ప్రగతిని, జాతీయ భద్రత పునాదిని ‘స్వయంసమృద్ధ భారత్ అభియాన్’ మరింత బలోపేతం చేసింది.
ఆధునిక అభివృద్ధి పథంలో ముందడుగు వేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో అంతర్జాతీయంగా భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో మన దేశం ‘సుస్థిర ప్రగతి లక్ష్యాలు-2030’లో కొన్నింటిని నిర్దేశిత గడువుకన్నా ముందే సాధించింది. ఇందులో భాగంగా కొన్నేళ్ల నుంచీ పునరుత్పాదక ఇంధన రంగ పురోగమనం అనూహ్య వేగం పుంజుకుంది.
మన విదేశాంగ విధానానికి జాతీయ ప్రయోజనాలే పునాది. శాంతి, సహకారం, చర్చలు సహా ‘వసుధైవ కుటుంబకం’ (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే ఆదర్శం మూలస్తంభాలు. ఆర్థిక సహకార విస్తరణ, పరస్పర సంబంధాల బలోపేతం కోసం మనం అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అలాగే వర్ధమాన దేశాల పురోగమనం దిశగా భారత్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ విధంగా అంతర్జాతీయ వేదికపై మన దేశం స్థాయి ఎంతగానో ఇనుమడించింది. నియమాధారిత అంతర్జాతీయ వ్యవస్థను మనం విశ్వసిస్తాం. ఐక్యరాజ్య సమితి సహా ఇతర బహుపాక్షిక వ్యవస్థలలో ప్రపంచ సమాజానికి తగిన ప్రాతినిధ్యం లభించేలా చూడటానికి మన వంతు కృషి చేస్తున్నాం. ఈ దిశగా మన ప్రయత్నాలకు అనేక దేశాల నుంచి బలమైన మద్దతు లభిస్తోంది.
ప్రియమైన దేశ పౌరులారా!
సహజ వనరులపై మనకెంత హక్కుందో.. భావి తరాలకూ అంతే హక్కు తప్పక ఉంటుంది. ఆ హక్కును వారు సద్వినియోగం చేసుకోవడంలో నేటి మన చర్యల దుష్ప్రభావం పడకుండా చూడటం మన కర్తవ్యం. ప్రకృతి ప్రసాదించిన ఈ సంపదను వారికి మరింత సమృద్ధ స్థాయిలో సంక్రమింపజేయడంలో మనం అన్ని విధాలా కృషి చేయాలి. పర్యావరణ పరిరక్షణపై మన విశ్వాసం ప్రాచీన సంప్రదాయంలో ఒక అంతర్భాగం. దీనిపై సంథాలీ భాషలోని ఒక సాదాసీదా గీతం ఎంతో లోతైన సందేశాన్నిస్తుంది. పండిట్ రఘునాథ్ ముర్ము రచించిన ఆ పాటలోని కొన్ని పంక్తులివే:
దారే గుజుగ్ కన్ నైల్ తే
మిరు చేనెయ్ రాగ్ బయహ దయా హయ గే.
గుజుగ్ కన్ అపోవాగ్ జాతి ధరమ్ దారే
చెడాగ్ బాబోన్ రాగ్ బయాహా అబో అన నైల్ తే.
ఒక చెట్టు పూర్తిగా ఎండిపోవడం చూసి రోదిస్తున్న చిలుక వేదనను ఈ పాటలో కవి వర్ణించారు. ఇంతకూ ఆయనేమంటారంటే- “ఓ నా ప్రియ సోదరులారా! ఎండిపోతున్న చెట్టును చూసి ఆ చిలుక విలపిస్తోంది. ఓ సోదరులారా! మానవ సంస్కృతి అనే వృక్షం నశిస్తుంటే మనం.. అంటే- మానవులమై ఉండీ, ఎందుకు బాధపడటం లేదు?” ప్రకృతిని, మానవీయ విలువలను కాపాడుకోవడంలో సమష్టి బాధ్యతను ఈ గీతం గుర్తుచేస్తుంది. పచ్చని చెట్టు మానవ సమాజ నైతిక ఆదర్శాలకు, శ్రేయస్సుకు చిహ్నం. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరిట ఓ మొక్క), ‘లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్’ (లైఫ్) వంటి కార్యక్రమాల స్ఫూర్తితో, పర్యావరణ పరిరక్షణ కోసం మనం వ్యక్తిగతంగా, సామూహికంగానూ కృషి చేయాలి.
ప్రియమైన దేశ పౌరులారా!
విద్యారంగంలో మన యువతుల అద్భుత ప్రతిభా ప్రదర్శన నాకెంతో సంతోషాన్నిస్తోంది. అలాగే, వ్యవసాయ ఉత్పాదకత పెంపులో తమవంతు పాత్ర పోషించే ‘డ్రోన్ దీదీ’ల నుంచి వాయుసేనలో యుద్ధ విమాన సమూహానికి నేతృత్వం దాకా వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోంది. గ్లాస్గోలో ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడలలో భారత క్రీడాకారులు 13 స్వర్ణ పతకాలు సాధించగా, వాటిలో 8 మహిళలు కైవసం చేసుకున్నవే కావడం విశేషం. మరోవైపు ఆర్థిక స్వయం సమృద్ధి దిశగానూ మహిళలు వేగంగా పురోగమిస్తున్నారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మహిళలు స్వయం సహాయ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. ఇక 3 కోట్ల మందిని ‘లక్షాధికారి సోదరి’ (రూ.లక్ష వార్షికాదాయం)గా మార్చాలని లక్ష్యనిర్దేశం చేసుకున్నాం. ఈ సంకల్పాన్ని ఇప్పటికే సాధించిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరో 3 కోట్ల మందిని ఈ జాబితాలో చేర్చాలని కృతనిశ్చయం పూనాం. ‘ముద్రా యోజన’ కింద ఆర్థిక సహాయం పొందిన పారిశ్రామికవేత్తలలోనూ దాదాపు మూడింట రెండు వంతులు మహిళలే కావడం కూడా ఈ సందర్భంగా గమనార్హం.
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చేపట్టిన కార్యక్రమాలతో పాటు అనేక రంగాల్లో వారు సారథ్యం వహిస్తుండటం కూడా మనం చూస్తున్నాం. ఓటు హక్కు సద్వినియోగంలో మహిళల సంఖ్య పెరుగుతుండటం మన ప్రజాస్వామ్య గణతంత్ర దేశం సాధించిన మహా విజయం. ఈ నేపథ్యంలో లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యంపై 2023లో ‘నారీ శక్తి వందన్ అధినియం’ పేరిట ఒక చట్టం రూపొందించాం. దీని లక్ష్యాల సాధనతో నాయకత్వ పాత్రలో మహిళల ప్రాతినిధ్యం పెరిగి, మన ప్రజాస్వామ్యం మరింత సార్వజనీనం కాగలదు. దేశ జనాభాలో 65 శాతం 35 ఏళ్ల లోపు వారే కావడాన ఈ యువ జనాభాయే మనకు అమూల్య సంపద. మన యువతరం ప్రతిభావంతులు, నిబద్ధత-నైపుణ్యం గలవారు. క్షేత్రస్థాయిలో వివిధ సవాళ్ల పరిష్కారం దిశగా వారు రూపొందిస్తున్న వినూత్న, ఆచరణాత్మక పరిష్కారాలు ఎన్నిటినో నేను చూశాను. ఇది సమాజం పట్ల, దేశం పట్ల మన యువతకున్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. కేవలం 28 ఏళ్ల సగటు వయస్సు గల యువ బృందం ఇటీవల ఒక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేయడంతో అంతరిక్ష పరిశోధనలో నవశకం మొదలైంది.
మన యువతరంలో అధిక శాతం నేడు స్వయం ఉపాధి మార్గాన్వేషణ ద్వారా ఉద్యోగ సృష్టికర్తలుగా మారుతున్నారు. మన దేశంలో బలమైన అంకుర వ్యవస్థ ఏర్పడటంలో ఇలాంటి యువ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం ఎంతగానో దోహదం చేసింది. భారత యువతరం ప్రతిభ, అంకితభావం అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఎంతో ఆకట్టుకోవడంతో వారికి సారథ్య బాధ్యతను కూడా అప్పగిస్తున్నాయి. ఈ యువ విజేతలే ప్రపంచవ్యాప్తంగా భారత యువశక్తి కీర్తి పతకాను ఘనంగా గగనానికి ఎగురవేస్తున్నారు. దేశ ఉజ్వల, సుసంపన్న భవిష్యత్తుపై నా నమ్మకానికి నేటి యువతరం ఎనలేని బలం చేకూరుస్తోంది.
భావి భారత భవిష్యత్ నిర్ణేతలు మన విద్యార్థులే అనడంలో సందేహం లేదు. జాతీయ భద్రత పరిరక్షణతో పాటు ప్రభుత్వాన్ని, సమాజాన్ని ఏకతాటిపై నిలపడం, మన విద్యార్థుల వర్తమాన-భవిష్యత్ ప్రయోజనాల పరిరక్షణకు దేశ ప్రజలందరూ సమష్టి-సమన్వయ సహిత కృషి చేయాలి. ప్రభుత్వ పరీక్షలు మన విద్యార్థులకు అవకాశాల ద్వారాలు. అందుకే, ఈ పరీక్షల నిర్వహణలో సంస్కరణలకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోంది. అవకతవకల సంపూర్ణ నిరోధం సహా మరింత పారదర్శకంగా, సురక్షితంగా, యువతకు విశ్వసనీయంగా ఉండే పరీక్షల విధానానికి రూపమివ్వడమే ఈ సంస్కరణల లక్ష్యం.
ప్రభుత్వ కార్యక్రమాలు, ఆధునిక ఆర్థిక కార్యకలాపాల వల్ల యువత భవితకు అనేక కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి కొత్త అవకాశాల అన్వేషణ ద్వారానే మన యువతరం విజయపథంలో ముందడుగు వేయగలదు.
యువత శారీరక-మానసిక ఆరోగ్యం మన దేశ భవిష్యత్తుకు పునాది వంటిది. కాబట్టి, వారు ఉత్సాహంతో దూసుకుపోయేలా ప్రోత్సహించడంలో కుటుంబాలతో పాటు సమాజం కూడా తన వంతు బాధ్యతను పంచుకోవాలి.
యువతరం వికాసానికే కాకుండా దేశ పురోగమనానికీ క్రీడలను ఒక ఉపకరణంగా మలచుకుంటున్నాం. ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా క్రీడా వ్యవస్థను రూపొందిస్తున్నాం. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మునుపెన్నడూ లేనిరీతిలో పెట్టుబడులు పెడుతోంది. ఈ కృషి అత్యుత్తమ ఫలితాలనిస్తోంది. అంతర్జాతీయ క్రీడా పోటీలలో మన క్రీడాకారుల ప్రతిభ, అసాధారణ విజయాల సంఖ్య నానాటికీ ఇనుమడించడమే ఇందుకు నిదర్శనం.
ప్రపంచంలోనే అత్యంత అధిక, సమర్థ యువశక్తికి భారత్ నేడు నెలవుగా ఉంది. అయితే, మరోవైపు వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. కాబట్టే, వారి జీవన ప్రమాణాల మెరుగు లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా 70 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న దాదాపు 6 కోట్ల మందికి ఏటా 5 లక్షల రూపాయల విలువైన ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలు పొందే అవకాశం కల్పించింది. వృద్ధుల విషయంలో యావత్ సమాజం సున్నితంగా వ్యవహరించడమే కాకుండా వారిపై ఆత్మీయతను పెంచుకుని, ఆత్మగౌరవాన్ని కాపాడాలి.
ప్రియమైన దేశ పౌరులారా!
సత్యం, న్యాయం పరిరక్షణలో భాగంగా మానవాళికి ముప్పుగా పరిణమించిన ప్రగతి నిరోధక శక్తులను అణచివేయడంలో మన సంప్రదాయం మనకెంతో గర్వకారణం. ఈ ఏడాది మే 7న ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తయిన సందర్భంగా మన సైనికుల సాహసాన్ని మనం సర్మించుకున్నాం. అలాగే, జూలై 26న కార్గిల్ విజయ దినోత్సవం నిర్వహించడం ద్వారా మన సాయుధ దళాల అసమాన శౌర్యపరాక్రమాలను, త్యాగాలను గుర్తుచేసుకున్నాం. ముఖ్యంగా ఉగ్రవాదంపై చారిత్రక ఆపరేషన్ మన సాయుధ దళాల అసమాన సామర్థ్యాన్ని ప్రస్ఫుటం చేసింది. ఉగ్రవాదులకు, వారికి మద్దతిచ్చేవారికి ఆపరేషన్ సిందూర్ ఒక విస్పష్ట, పటిష్ఠ సందేశాన్నిచ్చింది. భూనభోంతరాలలో ఎక్కడ దాక్కున్నా, తమ దుశ్చర్యలకు భారీ మూల్యం చెల్లించక తప్పదని వారికి అవగతమైంది. ఉగ్రవాదానికి ఆశ్రయమిచ్చిన దేశంతో సింధు జలాల ఒప్పందాన్ని స్తంభింపజేయడం మన దేశ ప్రయోజనాలు... ప్రత్యేకించి రైతు ప్రయోజనాల దృష్ట్యా ఒక నిర్ణయాత్మక మలుపు.
మన దేశానికి అనేక దశాబ్దాల పాటు నక్సలిజం తీవ్ర సమస్యగా పరిణమించింది. అయితే, భారత్‌ను నక్సల్ విముక్తం చేయడం ఒక తిరుగులేని విజయం. దీనివల్ల నక్సలిజం ప్రభావంతో ఒకనాడు ప్రగతికి దూరమై కునారిల్లిన ప్రాంతాల్లో నేడు సమగ్రాభివృద్ధి కార్యకలాపాలతో ఉత్సాహం ఉప్పొంగుతోంది. బస్తర్ ఒలింపిక్స్‌లో క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దీంతోపాటు ‘బస్తర్ పండుమ్’లో అనేకమంది కళాకారులు తమ ప్రతిభా పాటవాలతో ప్రజలందర్నీ అలరించారు.
మరాఠా సైనిక సంప్రదాయంతో దేశ గౌరవ ప్రతిష్టలను పరిరక్షించేలా నిర్మితమైన 12 కోటలు గత ఏడాది యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం సంపాదించాయి. అలాగే, ఈ ఏడాది బుద్ధ భగవానుడు తొలి ప్రసంగం చేసిన ‘సారనాథ్’ కూడా అందులో చేరింది. భరత భూమిలో బుద్ధ భగవానుని ఆధ్యాత్మిక స్మారక చిహ్నాలతోపాటు మన గౌరవాన్ని, సుసంపన్న సంప్రదాయాన్ని కాపాడుకోవడంలో మన పోరాట పటిమను చాటే చిహ్నాలు కూడా ఇక్కడున్నాయి.
ప్రియమైన దేశ పౌరులారా!
ప్రతి భారతీయుడి ప్రగతి, శ్రేయస్సే ‘వికసిత భారత్’ స్వప్న సాకారంలో వాస్తవ లక్ష్యాలు. ప్రసిద్ధ జాతీయవాద తెలుగు కవి, రచయిత శ్రీ గురజాడ అప్పారావు దేశభక్తి సంబంధిత నిత్య చైతన్యశీల సందేశాన్ని తన రచనలో ఇలా ప్రకటించారు:
“దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా...
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్...”
అన్నారు. అంటే- “నీ దేశాన్ని ప్రేమించు, మంచిని పెంపొందించుకో...
దేశమంటే కేవలం మట్టి కాదు.. దేశమంటే అందులోని ప్రజలు…” అని అర్థం.
చివరగా- సమాజ భాగస్వామ్యం, ప్రభుత్వ కృషితో దేశంలోని ప్రతి గ్రామం, పట్టణం, కుటుంబంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యానందనాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లగలరని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
ఈ సార్వజనీన దేశభక్తి స్ఫూర్తితో స్వతంత్ర భారతావనిని ‘వికసిత భారత్’గా రూపుదిద్దే పవిత్ర జాతీయ లక్ష్య సాధన కోసం మనను మనం అంకితం చేసుకుందాం రండి!
ధన్యవాదాలు!
జై హింద్!
జై భారత్!
***
(रिलीज़ आईडी: 2299629)
आगंतुक पटल : 26
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Malayalam
,
Assamese
,
Bengali
,
Odia
,
English
,
Khasi
,
Urdu
,
हिन्दी
,
Nepali
,
Marathi
,
Punjabi
,
Gujarati
,
Kannada