ఆర్థిక మంత్రిత్వ శాఖ
యూపీఐ వినియోగదారులకు ఎలాంటి చార్జీలు ఉండవు
వ్యాపారులకూ చాలా వరకు లావాదేవీలు ఉచితమే
చెల్లింపులు-సెటిల్మెంట్ వ్యవస్థల చట్టం (పీఎస్ఎస్ చట్టం) సవరణ... ఆర్థిక సమ్మిళిత మరింత విస్తరణ, యూపీఐ
దీర్ఘకాలిక సుస్థిరత, సాంకేతిక పురోగతి, పెరుగుతున్న వర్ధమాన ప్రమాదాలను తట్టుకునే సామర్థ్యాలను నిర్ధారించే సహాయక నిబంధన మాత్రమే
प्रविष्टि तिथि:
08 AUG 2026 6:40PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం కింది విషయాలను స్పష్టంగా తెలియజేసింది:
వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు: చెల్లింపులు చేసే వినియోగదారులపై ఎలాంటి లావాదేవీ ఛార్జీలు విధించడం లేదు.
పీ2పీ లావాదేవీలు ఉచితం: అన్ని వ్యక్తిగత లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయి.
వ్యాపారుల కోసం నామమాత్రపు ఎమ్‌డీఆర్: ఎమ్‌డీఆర్ ఛార్జీలను ప్రవేశపెట్టినప్పుడు, అవి ఒక నిర్దిష్ట పరిమితిని మించిన పరిమిత వ్యాపార లావాదేవీలకు మాత్రమే... డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఎమ్‌డీఆర్‌ల కంటే చాలా తక్కువగా ఉండే నామమాత్రపు రేటుతో వర్తిస్తాయి.
యూపీఐలో వ్యాపారులకూ చాలా వరకు లావాదేవీలు ఉచితమే. ఒకవేళ ఎమ్‌డీఆర్‌ను ప్రవేశపెడితే, అది కేవలం పరిమితి ఆధారంగా మాత్రమే ఉంటుంది. అంతేగానీ అందరికీ ఒకే విధమైన చార్జీలను విధించడం జరగదు.
చెల్లింపులు-సెటిల్మెంట్ వ్యవస్థల చట్టం-2007లోని సెక్షన్ 10Aను సవరించాలని ప్రతిపాదించే ‘టాక్సేషన్, ఇతర చట్టాల (సవరణ) బిల్లు-2026’ను పార్లమెంటు ఆమోదించిన తర్వాత, ఏదైనా ఎమ్‌డీఆర్ ఉంటే, ఎన్‌పీసీఐ నేతృత్వంలోని “యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ” దాని గురించి నిర్ణయం తీసుకుంటుంది.
చెల్లింపులు, సెటిల్మెంట్ వ్యవస్థల చట్టాన్ని ఎందుకు సవరించాలి?
చెల్లింపులు, సెటిల్మెంట్ వ్యవస్థల చట్టం (పీఎస్ఎస్ చట్టం)లో ఇటీవల చేసిన సవరణ చర్చకు దారితీసింది. కొందరు దీనిని సాధారణ వినియోగదారులపై ఛార్జీలు విధించే చర్యగా తప్పుగా అర్థం చేసుకున్నారు. వాస్తవానికి, ఈ సవరణ యూపీఐ దీర్ఘకాలిక సుస్థిరత, సాంకేతిక పురోగతి, కొత్తగా తలెత్తే ప్రమాదాలను ఎదుర్కోగల దాని సామర్థ్యాన్ని నిర్ధారించడానికి రూపొందించిన ఒక సహాయక నిబంధన మాత్రమే.
యూపీఐ వృద్ధి: గణనీయంగా పెరుగుతున్న లావాదేవీల పరిమాణం కారణంగా, ఈ వ్యవస్థకు సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ, మౌలిక సదుపాయాల్లో గణనీయమైన, నిరంతర నవీకరణలు అవసరం.
మార్కెట్ విస్తరణ: తమ కార్యకలాపాలను విస్తరించుకునేలా మరిన్ని కంపెనీలను ప్రోత్సహించడం ద్వారా పోటీని పెంచడం అవసరం. దీనికి స్వయం-సమృద్ధి గల ఆదాయ నమూనా అవసరం.
స్వయం-సమృద్ధి: తదుపరి వృద్ధి దశకు కేవలం సబ్సిడీలపై ఆధారపడటం ఆచరణ సాధ్యం కాదు. యూపీఐ మరింత పటిష్ఠంగా, సమ్మిళితంగా, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా చూసేందుకు ఒక సమతుల్య విధాన ప్రణాళిక అవసరం.
తప్పుడు కథనాల గురించిన ఆందోళనలను పరిష్కరించడం
బాహ్య ప్రభావాల వల్ల విధానపరమైన మార్పులు జరుగుతున్నాయని కొన్ని మీడియా నివేదికలు సూచించాయి. ఇది నిరాధారమైనది, పూర్తిగా అసత్యం, తప్పుదోవ పట్టించేది. ఒకవేళ బాహ్య ఒత్తిడి కారణమై ఉంటే, ప్రభుత్వం 2016లో యూపీఐని ప్రవేశపెట్టి ఉండేదే కాదు. జనవరి 2020 నుంచి వ్యాపారులు, పౌరుల కోసం దీనిని ఉచితంగా చేసి ఉండేదీ కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైమ్ ఇంటర్‌ఆపరేబుల్ చెల్లింపుల వ్యవస్థగా దీనిని అభివృద్ధి చేసి ఉండేదీ కాదు.
భారత డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలు సుస్థిరంగా, సమర్థంగా, వినూత్నంగా ఉంటూ వేగంగా విస్తరిస్తున్న దేశపు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సేవ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండేలా చూడాలనే ప్రభుత్వ విస్తృత లక్ష్యం నేపథ్యంలో ఈ సవరణను పరిగణించాలి.
వాస్తవం చాలా సులభం: యూపీఐ భారత్ సొంత ఆవిష్కరణ. రాబోయే దశాబ్దాల పాటు దాని సుస్థిరతను నిర్ధారిస్తూనే, పౌరులకు దానిని ఉచితంగా అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
తదుపరి వృద్ధి దశ
భారత్ ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల వృద్ధిలో తదుపరి దశకు చేరువలో ఉంది. గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలకూ యూపీఐని మరింత విస్తరించి, పోటీతత్వాన్ని నిలబెట్టుకోవాలంటే... యూపీఐ వ్యవస్థ స్వయం-సమృద్ధిగా, సరసమైనదిగా ఉండాలి. యూపీఐ ఒక సురక్షితమైన, సరసమైన, సమ్మిళితమైన, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చెల్లింపుల వ్యవస్థగా నిరంతరం అభివృద్ధి చెందేలా చూసేందుకు గానూ ఈ పీఎస్ఎస్ చట్టంలో చేసిన సవరణ ముందుచూపుతో చేపట్టిన చర్య.
ముగింపు:
భారత ప్రభుత్వం ఈ విషయాలను పునరుద్ఘాటిస్తోంది:
పౌరులకు యూపీఐ ఉచితంగానే అందుబాటులో ఉంటుంది.
పౌరుల రోజువారీ లావాదేవీలపై ఎటువంటి రుసుములు ఉండవు.
భవిష్యత్తులో విధించే ఏవైనా ఎమ్‌డీఆర్‌లూ నామమాత్రంగానే ఉంటాయి. కేవలం వర్తకుల పరిమిత లావాదేవీలకు మాత్రమే అవి వర్తిస్తాయి.
యూపీఐ భారత అగ్రగామి డిజిటల్ ఆవిష్కరణగా కొనసాగుతూ, ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంటుంది.
2016-17లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)... భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైన, చైతన్యవంతమైన చెల్లింపుల వ్యవస్థల్లో ఒకటిగా మార్చింది. రియల్-టైమ్, పరస్పర అనుసంధాన చెల్లింపుల్లో ఒక సాహసోపేతమైన ప్రయోగంగా ఇది ప్రారంభమైంది. ఇప్పుడు ప్రతి నెలా బిలియన్ల లావాదేవీలను నిర్వహిస్తూ, పౌరుల నిత్య జీవితంలో అంతర్భాగంగా మారింది. ప్రపంచ ప్రమాణంగా నిలిచింది. ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ చెల్లింపుల వ్యవస్థగా యూపీఐ ఎదిగింది. కేవలం 2026 జూలై నెలలోనే రూ. 29.9 లక్షల కోట్ల విలువైన 2,366 కోట్ల లావాదేవీలను నిర్వహించింది. 11 దేశాల్లోనూ ఇప్పుడు యూపీఐ అందుబాటులో ఉంది. అనేక ఇతర దేశాలూ దీని పట్ల ఆసక్తిని కనబరుస్తున్నాయి.
యూపీఐ అనేది భారతీయుల కోసం, భారతీయులు నిర్మించిన ఒక జాతీయ విజయం. ప్రభుత్వం ఒక దశాబ్ద కాలంగా దీనిని ప్రోత్సహించి, నిధులు సమకూర్చి, అభివృద్ధి చేసింది. ఇకపైనా ఈ పనిని కొనసాగిస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్‌పీసీఐ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే పౌరులు విశ్వసించాలని, ధ్రువీకరించని సందేశాలను ఫార్వార్డ్ చేయవద్దని విజ్ఞప్తి.
***
(रिलीज़ आईडी: 2296679)
आगंतुक पटल : 20