రాష్ట్రపతి సచివాలయం
భారత్–రొమేనియా బిజినెస్ ఫోరంలో రాష్ట్రపతి ప్రసంగం
‘వికసిత్ భారత్--2047’ లక్ష్యం దిశగా సాగుతున్న మా ప్రయాణం... అంతర్జాతీయ భాగస్వామ్యాలకు, పెట్టుబడులకు,
సాంకేతిక సహకారానికి అపారమైన అవకాశాలను అందిస్తోంది: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
భారత వృద్ధి ప్రయాణంలో రొమేనియా సంస్థలు చురుకైన పాత్ర పోషించాలి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
నాడు పోస్టు చేయడమైనది:
24 JUL 2026 2:58PM by PIB Hyderabad
బుకారెస్ట్‌లో భారత్–రొమేనియా వ్యాపార సదస్సును ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ రోజు (2026, జులై 24) ప్రసంగించారు. రొమేనియా అధ్యక్షులు శ్రీ నికోషర్ డాన్, రొమేనియా ప్రభుత్వ సభ్యులు, భారత్, రొమేనియా దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ఐరోపాలో వ్యూహాత్మక స్థానంలో ఉన్న రొమేనియా వద్ద అత్యుత్తమ మానవ వనరులు, అధునాతన పారిశ్రామిక సామర్థ్యాలు ఉన్నాయని అన్నారు. యూరోపియన్ యూనియన్‌తో బలమైన అనుసంధానాన్ని కలిగి ఉన్న ఈ దేశం భారతదేశానికి సహజమైన, విలువైన భాగస్వామిగా నిలుస్తోందని అన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా మాత్రమే కాకుండా.. విస్తృతమైన ఐరోపా మార్కెట్‌కు ముఖద్వారంగా రొమేనియా పనిచేస్తుందని ఆమె తెలియజేశారు. ఈ సదస్సులో పెద్ద సంఖ్యలో భారతీయ వ్యాపార ప్రతినిధులు పాల్గొనడం, రొమేనియా కల్పిస్తున్న అవకాశాలపై భారతీయ పరిశ్రమలకు ఉన్న నమ్మకాన్ని, ఆ దేశంతో శాశ్వత వ్యాపార భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలనే ఆసక్తిని తెలియజేస్తోందన్నారు.
సమకాలీన భాగస్వామ్యానికి వాణిజ్య, ఆర్థిక సహకారమే ప్రధానమని రాష్ట్రపతి అన్నారు. దాదాపు రెండు బిలియన్ల మంది ప్రజల మార్కెట్, దాదాపు 25 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక పరిమాణంతో ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యం ఉన్న ఆర్థిక భాగస్వామ్యాల్లో భారత్–ఈయూ ఎఫ్‌టీఏ ఒకటి. వాణిజ్య సమగ్రతను, పెట్టుబడులను బలోపేతం చేయడం, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేయడం, వైవిధ్యీకరించడమే ఈ ఎఫ్‌టీఏ లక్ష్యం. ఈ ఎఫ్‌టీఏను త్వరితగతిన, సమర్థంగా అమలు చేయడం చాలా ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. ‘ఇది వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది. విలువ ఆధారిత వ్యవస్థను ఏకీకృతం చేస్తుంది. అలాగే ఉభయ పక్షాలకు చెందిన ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు, ఆవిష్కర్తలకు నూతన అవకాశాలను సృష్టిస్తుంది.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి’ అని రాష్ట్రపతి తెలిపారు. ‘స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ‘వికసిత్ భారత్ 2047’’లక్ష్యం. ఈ దిశగా చేపట్టే ప్రయాణం అంతర్జాతీయ భాగస్వామ్యాలు, పెట్టుబడులు, సాంకేతిక సహకారానికి అపారమైన అవకాశాలను అందిస్తుంది‘ అన్నారు.
సరళీకరించిన పన్ను విధానాలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల ద్వారా పారదర్శకమైన, అనుకూలమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు భారత్ వివిధ కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్రపతి చెప్పారు.
భారతదేశం, రొమేనియాల మధ్య ఇంధన భద్రత, హరిత ఇంధన పరివర్తన రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని రాష్ట్రపతి తెలిపారు. రొమేనియాకు రసాయనాలు, ఎరువుల పరిశ్రమలో మంచి సామర్థ్యం ఉన్నందున, ఈ రంగంలో కూడా కలిసి పనిచేసేందుకు కూడా వీలుందన్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన భారతదేశ డిజిటల్ మౌలిక వసతులు, వేగంగా ఎదుగుతున్న స్టార్టప్, ఐటీ రంగాలు... సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, పరిశోధన, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో రొమేనియా సామర్థ్యాన్ని పెంచేందుకు తోడ్పడగలవని అన్నారు. ఓడరేవులు, రైల్వేలు, రహదారులు, లాజిస్టిక్స్ పార్కులు, బహుళ విధ రవాణా లాంటి రవాణా రంగాల్లో కూడా రెండు దేశాల సంస్థలు కలిసి పనిచేసేందకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఫార్మాసూటికల్స్, ఆరోగ్యసేవలు, వ్యవసాయం, ఆహార శుద్ధి రంగాల్లో కూడా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవచ్చని చెప్పారు.
భారత్, రొమేనియా వ్యాపార సంస్థలు ఈ కొత్త అవకాశాలను విజయవంతమైన భాగస్వామ్యాలుగా మారుస్తాయని విశ్వసిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో రొమేనియా కంపెనీలు క్రియాశీలక పాత్ర పోషించాలని ఆమె పిలుపునిచ్చారు. రెండు దేశాల వ్యాపార రంగాలు బలమైన సరఫరా వ్యవస్థలను నిర్మిస్తాయని, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయని, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయని, ఇరు పక్షాల ప్రజల కోసం సుస్థిరమైన అభివృద్ధిని తీసుకు వస్తాయని ఆమె తెలియజేశారు.
రాష్ట్రపతి ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
***
(రిలీజ్ ఐడి: 2289458)
సందర్శకుల సూచీ సంఖ్య : : 26
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam