సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ 2027 క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 2 కింద పరిశ్రమల నేతృత్వంలోని సవాళ్ల కోసం ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్-2 ప్రతిపాదనల సమర్పణకు ఏకీకృత వేదిక ప్రారంభం.. పారదర్శక, ప్రతిభ ఆధారిత ఎంపిక ప్రక్రియకు అవకాశం
యువతలో సృజనాత్మకత, నైపుణ్యాలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు 50కుపైగా సవాళ్లు.
ఎంపికైన సవాళ్లకు ఒకేసారి రూ. 1 కోటి వరకు ఆర్థిక సాయం లభించే అవకాశం
प्रविष्टि तिथि:
13 JUL 2026 5:52PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) ఆధ్వర్యంలో ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ (సీఐఎస్)-సీజన్ 2 అనే ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా మీడియా, వినోద రంగంలో పనిచేస్తున్న వివిధ పరిశ్రమల సంఘాలు, సంస్థలు, విద్యాసంస్థల నుంచి పరిశ్రమల నేతృత్వంలోని సవాళ్ల రూపకల్పన, నిర్వహణ కోసం ప్రతిపాదనలను మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. సీజన్ 2 కింద వచ్చే ప్రతిపాదనలను స్వీకరించడానికి, పారదర్శకమైన, ప్రతిభ ఆధారిత విధానంలో అర్హులైన సంస్థలను ఎంపిక చేయడానికి ప్రత్యేక ఏకీకృత వేదికను కూడా సిద్ధం చేశారు.
యువత కేంద్రంగా పరిశ్రమల ఆధ్వర్యంలో, ప్రభుత్వ మద్దతుతో నడిచే సవాళ్లను పరిష్కరించడమే సీఐసీ సీజన్ 2 లక్ష్యం. సృజనాత్మకత గల ప్రతిభావంతులను గుర్తించి వారిని ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధిని పెంచడం, సామర్థ్య నిర్మాణం, మార్గదర్శకత్వం ఇవ్వడం, సరికొత్త ఆవిష్కరణలకు ఊతమివ్వడం వంటి పనులను దీని ద్వారా చేపడతారు. కృత్రిమ మేధ, ఏవీజీసీ-ఎక్స్ఆర్, డిజిటల్ మీడియా వంటి సాంకేతిక ఆధారిత సృజనాత్మక రంగాల్లో ఉమ్మడి భాగస్వామ్యాలకు ఇది అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తుంది. ఈ సవాళ్లలో గెలిచిన విజేతలను, వారి ప్రతిభను వేవ్స్ 2027 సదస్సులో భాగంగా నిర్వహించే క్రియేటోస్ఫియర్ వేదికపై ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు.
మీడియా, వినోద రంగానికి చెందిన ఆసక్తి గల సంస్థలు తమ ప్రతిపాదనలను ఆన్‌లైన్ వేదిక ద్వారా సమర్పించవచ్చు. అర్హులైన వారు https://wavesbazaar.com/create-india-challenge/season2/ifp లింకు ద్వారా 2026 జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కృత్రిమ మేధ, డిజిటల్-సోషల్ మీడియా, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, ఆన్‌లైన్ సోషల్ గేమింగ్, ఈ-స్పోర్ట్స్, కామిక్స్, ఎక్స్ఆర్/ఏఆర్/వీఆర్, సినిమాలు, బ్రాడ్‌కాస్టింగ్, సంగీతం-నృత్యం వంటి ఏ విభాగం నుంచైనా సంస్థలు తమ సవాలు ప్రతిపాదనలను పంపవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ కింది క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి.

క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ (సీఐసీ) బ్యానర్ కింద సీజన్ 2 కోసం పరిశ్రమల నేతృత్వంలో 50 కంటే ఎక్కువ సవాళ్లను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈసారి ముఖ్యంగా కృత్రిమ మేధ, డిజిటల్-సోషల్ మీడియా, ఏవీజీసీ-ఎక్స్ఆర్ వంటి అత్యాధునిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఎంపిక చేసిన సవాళ్లను విజయవంతంగా అమలు చేయడానికి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఒక్కో సవాలుకు గరిష్టంగా రూ.1 కోటి వరకు ఆర్థిక సాయాన్ని ఒకేసారి అందించనుంది. అయితే ఈ నిధుల మంజూరు అనేది ప్రతిపాదనల నిర్దిష్ట విధానం, ఆశించిన ఫలితాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, క్షేత్రస్థాయి విస్తరణ, వివిధ సాంకేతిక, ఆర్థిక మూల్యాంకన ప్రమాణాలు, ఐఎఫ్‌పీ పత్రంలో పేర్కొన్న నిబంధనల, షరతులకు లోబడి ఉంటుంది

క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ (సీఐసీ) గురించి
మీడియా, వినోద రంగంలో సృజనాత్మకత గల సృష్టికర్తలను గుర్తించి, వారిని ప్రోత్సహించడం, నైపుణ్యాలను పెంపొందించడం, వారి ప్రతిభను ప్రపంచానికి ప్రదర్శించడమే లక్ష్యంగా వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 1 లో భాగంగా పరిశ్రమల నేతృత్వంలో 33 సవాళ్లను విజయవంతంగా నిర్వహించారు. ఈ విజయవంతమైన అనుభవంతో ముందుకు వస్తున్న సీజన్ 2.. ముఖ్యంగా యువత కేంద్రంగా సాగే సవాళ్లు, పరిశ్రమల భాగస్వామ్యాలు, క్షేత్రస్థాయి ప్రచారం, నిర్మాణాత్మక మార్గదర్శకత్వం, నైపుణ్యాభివృద్ధి, ఫలితాల ఆధారిత సవాళ్లపై దృష్టి పెట్టనుంది. దేశ సృజనాత్మక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ.. ప్రధానమంత్రి ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్’ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడమే దీని ముఖ్య ఉద్దేశం.
***
(रिलीज़ आईडी: 2284310)
आगंतुक पटल : 7